కళాశాల 1980
ఎపిసోడ్ -2
సీన్ – 16
ఆ రోజు రాము పుట్టినరోజు. తల్లి తలంటి… అన్నం తో పాటు, పాయసం చేసి బాక్స్ లో పెట్టి…
రాము తల్లి : రాము…ఈ చిన్న టిపినీ లో పాయసం సేసాను…..ఆనాక అన్నం తినేటప్పుడు తిను…ఈ రోజు నీ పుట్టిన రోజు కదా..
రాము : సరేమ్మా…అలాగే….ఒక క్షణం ఆగి, మరలా ఏదో గుర్తుకు వచ్చినట్టు….అమ్మ..అమ్మ…ఇంకా పాయసం ఉందా…
రాము తల్లి : అయ్యొ…పందార కొంతే ఉంటే…నీ వరకే సేసాను…. సాయింత్రం పోయి పందార తెచ్చి, సేత్తాను లే…కాలేజీ కి వెల్లి రా…
రాము : అయితే సరే అమ్మ.…ఒక పని చెయ్యి…ఈ టిపినీ లో కొంచెం పాయసం తీసి ఇంకో చిన్న బాక్స్ లో పెట్టు…నా ఫ్రెండ్ గిరి కి పాయసం అంటే ఇష్టం…ఇస్తాను.
రాము తల్లి: సరే…అని పాయసం రెండు చిన్న బాక్స్ ల్లో వేసి ఇచ్చింది.
రాము వేగం గా సైకిల్ తొక్కుతూ కాలేజీ కి వెళ్లే దారిలో..…ఎప్పుడూ ఆగే చోటే ఆగాడు.. విమల కోసం.
ఇంతలో విమల సైకిల్ మీద వస్తూ…రాము దగ్గర ఆగింది.
విమల : ఆయ్…కొత్త బట్టలు…ముఖం వెలిగిపోతోంది…ఏంటి బాబు విశేషం.. అని ఆనందంగా అంది.
రాము : మరేమో….ఈ రోజు నా పుట్టిన రోజు…అని కొంచెం సిగ్గుపడుతూ అని…ఇదిగో పాయసం…అమ్మ చేసింది..నీ కోసమే…ఎక్కువ లేదు కొంచెమే ఉంది…మధ్యాహ్నం తిను…సాయంత్రం వెళ్లేటప్పుడు బాక్స్ ఇచ్చెయ్…మళ్లీ అమ్మ బాక్స్ అడుగుతాది.
విమల : సరే…
ఇద్దరూ ఒక నిమిషం తరువాత అక్కడ నుంచి సైకిళ్ళు పై కాలేజీ కి కలిసి బయలు దేరారు.
విమల కి దారి లో వెళ్తున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది…వెంటనే..
విమల : రాము.. సాయింత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు .. గుడి వెనుక చింత చెట్టు దగ్గర రెండు నిమిషాలు ఆగి వెళ్దామా…
రాము : సరే..
సీన్ – 17
ఇద్దరూ కాలేజీ కి వచ్చారు…రాము క్లాస్ లో కి వచ్చాడు…చూస్తే విమల కనిపించలేదు, సరే పక్కకి వెళ్ళి ఉంటుంది లే…అనుకుని…పాఠం వింటున్నాడు. ఉదయం అంతా తనతో ఉన్న విమల కనిపించక పోయే సరికి కంగారు పడ్డాడు.
మధ్యాహ్నం లంచ్ బెల్ సమయానికి విమల క్లాసులో కి కంగారుగా వచ్చింది.
రాము , విమలను చూసి హమ్మయ్య అనుకున్నాడు.
లంచ్ లో… రాము, అమ్మ చేసిన పాయసం తింటూ , చాలా బాగుంది , విమలకి కూడా నచ్చుతుంది, అనుకున్నాడు.
సాయింత్రం కాలేజీ అయిపోయింది.
విమల, రాము ఇద్దరూ చింత చెట్టు దగ్గర కి చేరి కూర్చున్నారు.
విమల : రాము చేతిని తన చేతిలోకి తీసుకొని ముద్దు పెట్టుకొని…హేపీ బర్త్ డే రాము…ఇదిగో అని పుస్తకాల సంచి లో నుంచి , ఖరీదయిన పెన్ను , పెద్ద చాక్లెట్ లు మూడు ఇచ్చింది.
రాము సిగ్గు గా… విమల చేతి లో ఉన్న తన చేతిని వెనక్కి తీసుకొని, విమల ముద్దు పెట్టిన చోట తన చేతిని ముద్దు పెట్టుకున్నాడు….విమల ఇచ్చిన పెన్ను, చాక్లెట్ లు తీసుకున్నాడు.
రాము : ఉదయం అంతా కాలేజీ లో లేవు ఎక్కడికి వెళ్ళావు…
విమల మౌనం గా ఉంది.
రాము : నిన్నే విమలా…
విమల : ఇంటి కి వెళ్లాను…నేను పెట్టె లో దాచుకున్న డబ్బులు కోసం…
రాము : ఎందుకు…ఇయన్నీ కొనడానికా…అవసరమా….మీ అమ్మ అప్పుడే వచ్చావేం అని అడగలేదా….
విమల : అడిగింది…కొంచెం, కడుపు నొప్పి గా ఉంది, ఒక గంట పడుకుని వెళ్తాను అని చెప్పాను.
రాము : హు…నా పుట్టిన రోజు కోసం అబద్ధం ఆడావా….
విమల : సరే…అదంతా వదిలెయ్…ఇంకేంటి చెప్పు…
రాము : మధ్యాహ్నం పాయసం తిన్నావా…ఆ బాక్స్ ఇవ్వు…
విమల : బాక్స్ తీసి తెరిచింది. పాయసం అలాగే ఉంది.
రాము : అదేంటి…విమల…తినలేదు…నచ్చలేదా..
విమల : నాకు అప్పుడు తిన బుద్ధి కాలేదు…చిలిపి గా అంది….చెంచా తో పాయసం తీసి , పుట్టిన బాలుడు కి ఇదిగో నా స్వీటు అని రాము కి తినిపించి….ఆ చెంచా లో సగం తాను తింటూ…ఇదిగో నాకు ఇప్పుడు ఇలా తినాలనిపిస్తుంది…. తింటున్నాను…అంది.
రాము కి అదంతా కల లేక నిజమో అర్ధం కావడం లేదు. విమల ప్రేమ కి రాము కళ్లలో నీళ్లు వచ్చెస్తున్నాయి.
విమల : రాము…ఊరుకో పుట్టిన పిల్లోడు అమ్మ దగ్గర ఏడాలి…. కానీ అమ్మాయి దగ్గర కాదు…..లే.. చాలా టైం అయింది…పోదాం.
ఇద్దరూ పైకి లేచి నిలబడ్డారు….
రాము ఒక్కసారిగా విమల ను గట్టిగా కౌగలించుకుని , విమల చెవి కింద ముద్దు పెట్టుకొని, ఒక నిమిషం అలా గే ఉండి పోయాడు…. విమల కి ఏదో లోకం లో కి వెళ్ళి పోయింది. అభ్యంతరం కూడా చెప్పలేదు.
రాము ఇంటికి వెళ్ళి అద్దం లో తన ముఖాన్ని చూసుకుంటూ మురిసి పోతూ , గాలి లో తేలుతున్నాడు.
ఆ రోజు రాత్రి పడుకుంటూ…. విమల కి తన పై ఉన్న ప్రేమ పూర్తిగా అర్థం అయింది…ఇక తన జీవితం విమల తోనే చివరి వరకు అనుకున్నాడు.
సీన్ – 18
రోజులు గడుస్తున్నాయి…
ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షలు తేదీ వచ్చింది. రాము కష్టపడి పట్టుదలగా చదువుతున్నాడు. రాముని చూసి ఇంకా చాలా మంది పట్టుదలగా, పోటీ గా చదువు తున్నారు.
పరీక్షలు పూర్తి అయ్యాయి…చివరి రోజు పరీక్ష అయ్యాక …రాము, విమల చింత చెట్టు దగ్గరకు వెళ్ళి కూర్చుని…దిగులు గా ఉన్నారు.
రాము : కాలేజీ చదువు అయిపోయింది ….తరువాత ఏం చెయ్యాలో , తెలియడం లేదు విమల.
విమల : భయపడకు…ఇంకా రిజల్ట్స్ రానీ…అప్పుడు ఆలోచిద్దాం.
రాము : మనం ప్రతీ ఆదివారం ఉదయం ఇక్కడ కలుసుకుందామా…
విమల : సరే…
కొంచెం సేపు తరువాత ఇద్దరూ వెళ్లి పోయారు.
ఆ రోజు సాయంత్రం రాము ఇల్లు వెతుక్కుంటూ కాలేజీ ప్రిన్సిపాల్ గారు వచ్చారు. ప్రిన్సిపాల్ గారిని చూసి రాము కుర్చీ తెచ్చి, శుభ్రం గా తుడిచి కూర్చోమని నమస్కారం చేసాడు. రాము తండ్రి కూడా ఆ సమయంలో ఇంట్లో నే ఉన్నాడు.
ప్రిన్సిపాల్ : రాము…. పరీక్షలు అన్నీ బాగా రాసావా…ఈ సారి నీ వలన మన కాలేజీ కి స్టేట్ రాంక్ రావాలి….. మీ అమ్మ, నాన్నలను పిలు మాట్లాడాలి….
ఇంతలో రాము తల్లి తండ్రి వచ్చి…నమస్కారం చేసారు. రాము వెంటనే కొట్టు దగ్గర కి వెళ్లి డ్రింక్ తెచ్చి ఇచ్చాడు…ప్రిన్సిపాల్ గారికి.
ప్రిన్సిపాల్ గారు డ్రింక్ తాగుతూ…తను వచ్చిన విషయం రాము అమ్మ నాన్న లకు చెపుతున్నారు.
ప్రిన్సిపాల్ : చూడండి…రాము చాలా తెలివైన పట్టుదల కలిగిన వాడు. బాగా చదువు తాడు. రాము వలన పోయిన సంవత్సరం కాలేజీ కి గుర్తింపు వచ్చింది. ఈ సారి కూడా వస్తుంది అనే నమ్మకం ఉంది. రాము ని మంచి పై చదువు ఇంజనీరింగ్ చదివిస్తే చాలా ఉపయోగం ఉంటుంది. అది ఖర్చుతో కూడుకున్నది.….. నాకు తెలుసు మీ కుటుంబ పరిస్థితి…..ఇంటర్ అయిన వారికి ఇంజనీరింగ్ కాలేజీలో సీటు కోసం , గవర్నమెంట్ ఈ సంవత్సరం నుంచి ఎంసెట్ అనే పోటీ పరీక్ష పెడుతుంది. దీనికి హైదరాబాద్ లో కోచింగ్ ఇస్తారు. 45 రోజులు ఉంటుంది. దీనికి ఫీజు, ఇతర ఖర్చులు నేను ఇస్తాను…హైదరాబాద్ లో భోజనం, బస నా స్నేహితుడి ఇంట్లో ఏర్పాటు చేస్తాను. ఇది మీకు , రాము కి మంచి అవకాశం…. బాగా ఆలోచించి రేపు సాయంత్రం లోగా చెప్పండి…. అని వెళ్లి పోయారు.
అది విన్న రాము తల్లి తండ్రులు సంతోషించి, రాము తో అదృష్టవంతుడివి…నువ్వైనా బాగా చదువు కో , దేవుడు అవకాశం ఇచ్చాడు అంటుంటే…. రాము కి ఒక వైపు వెళ్ళి చదువు కోవాలి అని ఉన్నా…విమలని వదిలి వెళ్ళాలంటే ఎలా అని అనుకుంటున్నాడు.
మరుసటి రోజు ఉదయం విమల ఇంటి ముందు కి వెళ్లి అదే పనిగా సైకిల్ బెల్ మోగిస్తుంటే…. అది విన్న విమల బయటికి వచ్చింది. సైగ చేసాడు చింత చెట్టు దగ్గర కి రమ్మని.
విమల చింత చెట్టు దగ్గర కి వచ్చింది...
విమల : ఏంటి అబ్బాయ్ గారు…ఒక్క రోజు కూడా ఉండలేక పోతున్నారా….. పొద్దున్నే ఇంటికి వచ్చే సారు…ఇప్పుడే ఇలా అయితే చాలా కష్టమండీ…. అంది చిలిపిగా.
రాము మాత్రం …విమల మాట్లాడేది ఏమీ వినిపించు కోకుండా…. ముందు రోజు సాయంత్రం ప్రిన్సిపాల్ గారు ఇంటికి వచ్చి చెప్పింది అంతా వివరం గా చెప్పాడు.
విమల…ఒక్కసారి ఎగిరి గంతేసింది…
విమల : నిజమా…. ఆలోచించకు రాము…ఇది మంచి అవకాశం…వెంటనే వెళ్ళి ప్రిన్సిపాల్ గారికి చెప్పు…నువ్వు తప్పకుండా గొప్ప వాడివి అవుతావు.
రాము కి విమల మాటలు చాలా ధైర్యం గా అనిపించింది.
రాము : సరే విమల…నువ్వు చెప్పినట్లే చేస్తాను….ఈ రోజు ప్రిన్సిపాల్ గారిని కలుస్తాను…. విమల రేపు ఇదే టైం కి ఇక్కడ కలుసుకుందామా…
విమల : సరే…
రాము ఆ రోజు సాయంత్రం ప్రిన్సిపాల్ గారిని కలిసి…తన ఆమోదం చెప్పాడు. ప్రిన్సిపాల్ గారు వెంటనే ఫోన్ ట్రంకాల్ బుక్ చేసి, హైదరాబాద్ లో ఉన్న తన స్నేహితుడు రాజారాం తో అన్నీ వివరంగా చెప్పి, రాము కోసం ఏర్పాట్లు చేసి….. ఎల్లుండి ఉదయం మంచి రోజు…నిన్ను బస్ ఎక్కిస్తాను, నా స్నేహితుడు రాజారాం నిన్ను బస్టాండు కి వచ్చి తీసుకెళ్తాడు….. అన్నారు.
రాము ఇంటికి వెళ్ళి అమ్మానాన్న ల తో, ప్రిన్సిపాల్ సార్ ని కలిసాను…ఎల్లుండే ప్రయాణం అని చెప్పాడు.
సీన్ – 19
మరుసటి రోజు ఉదయం లేచి…బట్టలు, పుస్తకాలు అన్నీ రెండు సంచుల్లో , ప్రయాణానికి కావలసిన వన్నీ సర్థుకున్నాడు.
రాము కి ఒక వైపు దిగులు గా ఉన్నాడు …విమల ను చూడకుండా ఎలా ఉండాలో అని …
సమయం ఉదయం 11 గంటలకు రాము చింతచెట్టు దగ్గరకు వచ్చాడు…అప్పటికే విమల అక్కడ రాము కోసం ఎదురు చూస్తుంది.
రాము ని చూసి , విమల చిన్నగా నవ్వింది…కానీ ఆ నవ్వు లో జీవం లేదు. దగ్గరగా చూస్తున్న రాము కు విమల ముఖం కందినట్లు, కొంచెం కళ్లు ఉబ్బినట్లు గమనించాడు.
రాము : ఏమైంది విమల…. అలా ఉన్నావు.
విమల : ఏం లేదు…బాగానే ఉన్నా…
రాము : నిజం చెప్పు…రాత్రంతా , ఏడ్చావు కదా...
విమల దుఃఖం ఆపుకోలేక ఒక్కసారిగా కళ్లలో నీళ్లు తిరిగాయి. రాము చెయ్యి పట్టుకుని భుజం పై వాలి పోయి .. ఏడ్చేసింది…
రాము : పోనీ…నేను..ఊరెళ్ళడం..మానెయ్యనా…
విమల : వద్దు.. వద్దు…ఆ మాట అనకు…నువ్వు బాగా చదివి .. గొప్ప వాడివి అవ్వాలి. …ఇదంతా ఊరికే అని వోణి తో కళ్లు తుడుచుకుంది…. రేపు ఎన్నింటికి నీ బస్సు…
రాము : ఉదయం 10 గంటలకు….
విమల : నేను ఏదో పని ఉన్నట్లు…బస్టాండు దగ్గరకు వస్తాను…
రాము : సరే…విమల.
కొంచెం సమయం తర్వాత
రాము : సరే విమల…బయలు దేరుదాం…ఇంకా చిన్న పనులు ఉన్నాయి…
విమల : రాము….ఇదిగో…ఇది ఉంచు అని , తను అప్పటి వరకు దాచుకున్న డబ్బులు వంద రూపాయలు చేతి రుమాలు లోంచి తీసి రాము చేతిలో పెట్టింది.
రాము కి కళ్లలో నీళ్లు వచ్చాయి…
హే…ఊరుకో…అని విమల రాము కళ్లు తుడిచి…. బాగా చదివి…రాంక్ రావాలి.. అని నుదుటి పై ముద్దు పెట్టుకుంది.
ఇద్దరూ ఇళ్లకు వెళ్లి పోయారు.
రాము మరుసటి రోజు ఉదయం లేచి , తయారయ్యి....అమ్మనాన్నలతో కలిసి బస్టాండు కు బయలుదేరాడు. దారిలో…
రాము తల్లి : రాము …జాగర్త రా….కొత్త ఊరు…ఎవరితోనూ గొడవ పెట్టుకోకు…ఉత్తరం ముక్క రాయి…యేళకి తిను…
రాము : సరే నమ్మా….
ఇంతలో బస్టాండు కు చేరుకున్నారు…
బస్టాండు లో దూరంగా కిళ్లీ షాపు దగ్గర నిలబడి విమల సోడా తాగుతూ…రాము ను చూస్తూ…సైగ చేసింది.
రాము కూడా విమల వైపు చూసి…. సోడా తాగాలన్నట్లు, తల్లి కి చెప్పి …. విమల దగ్గర కి వచ్చాడు.
రాము సోడా తాగి…విమల తో .. వస్తాను విమల అని నెమ్మదిగా చెప్పి…వచ్చెసాడు…
ఇంతలో ప్రిన్సిపాల్ గారు వచ్చి…రాము కి కొంత డబ్బులు ఇచ్చి…. రాము నువ్వు బస్ దిగే సమయానికి, నా స్నేహితుడు రాజారాం వస్తాడు…అని చెప్పారు…
బస్ వచ్చింది…. రాము బస్ ఎక్కి కిటికీ పక్కన కూర్చుని.. దూరం గా ఉన్న విమలని, ప్రక్కనే ఉన్న తల్లి తండ్రి, ప్రిన్సిపాల్ గారిని చూస్తూ …చేయి ఊపాడు…బస్ సిరిసిల్ల నుంచి హైదరాబాద్ బయలు దేరింది.
మిగిలినది.... ఎపిసోడ్ 3 లో
యడ్ల శ్రీనివాసరావు, 5 మార్చి 2022
No comments:
Post a Comment