Monday, June 6, 2022

139. కళాశాల 1980 ఎపిసోడ్ -9

 

కళాశాల 1980

ఎపిసోడ్ -9


సీన్ -38

రాము కి చదువు మీద శ్రద్ధ తగ్గి పోయింది. కాలేజీ కి వెళ్ళకుండా హాస్టల్ లో నే విమలను తలుచుకుంటూ ఒంటరిగా ఉండిపోతున్నాడు. తనకి జీవితం లో పూర్తిగా ఏకాకి అయిపోయినట్లు భావిస్తున్నాడు. అసలు విమల ఇలా ఎందుకు చేసిందో అర్థం కావడంలేదు. ఒకరోజు కాలేజీ మానేసి విమల కనిపిస్తుందేమో అని జగిత్యాల వెళ్లాడు. కానీ అడ్రస్ తెలియదు. అలా ఊరంతా తిరుగుతూ ఉన్నాడు. చేసేదేమీలేక మళ్లా హైదరాబాద్ వచ్చేశాడు. తన తోటి ఫ్రెండ్స్ చెపుతున్నా వినడం లేదు.

ఆ వారం రాజారాం వచ్చి , రాముని చూసి డబ్బులు ఇచ్చి జాగ్రత్తలు చెప్పి వెళ్ళాడు. రాము జుత్తు పెంచుకొని , కళావిహీనంగా కనిపించడం తో రాజారాం చాలా బాధ పడ్డాడు. చురుకుగా ఉండే రాము ను ఇలా చూస్తానని అనుకోలేదు.

రాము కి కాలేజీ ఇష్టం ఉంటే వెళుతున్నాడు. లేకపోతే హాస్టల్ రూం లో నే పడుకొని విమల ను ఆలోచించుకుంటూ ఉంటున్నాడు.

రోజులు గడుస్తున్నాయి. రాము అటెండెన్స్ సరిగా లేకపోవడం, కాలేజీ ఇంటర్నల్ మార్క్స్ తగ్గడం ప్రిన్సిపాల్ గారు గమనించి ఆఫీస్ కి పిలిచి మందలించారు. అదే రోజు లెక్చరర్ విశ్వం గారు కూడా పిలిచి రాము చాలా వెనుక పడుతున్నావు ఇలా అయితే చాలా కష్టం అన్నారు.

రాము కి వారు చెబుతున్నవి ఏమీ మైండ్ కు ఎక్కడం లేదు. ఎందుకో రాము ఆరోగ్యం క్షీణిస్తుంది. ఒక రోజు బాగా జ్వరం వచ్చింది. జ్వరం తో అలా ఉన్నాడు. ఫ్రెండ్స్ రాము దగ్గర ఫోన్ నెంబర్ తీసుకుని రాజారాం గారి ఆఫీస్ కి ఫోన్ చేసారు. రాజారాం వెంటనే ఆఫీస్ నుండి వచ్చి రాముని హాస్పిటల్ కి తీసుకెళ్ళి వైద్యం చేయించి, హాస్టల్ కు కాకుండా తన ఇంటికి తీసుకెళ్ళాడు.

ఆ రోజు రాత్రి పడుకునే సమయంలో రాజారాం, పావని తో రాముకు జరిగిన విషయం పూర్తిగా చెప్పాడు. పావని అయ్యే పాపం అని బాధపడింది కానీ రాము పై కోపం రాలేదు. అదే సమయంలో శైలజ నిద్రలో , తండ్రి తల్లి తో రాము , విమల ప్రేమ గురించి చెప్పింది అంతా పూర్తి గా విని, కంట నీరు పెట్టుకుంది.

రాము మూడు రోజులు వరకు కోలుకోలేదు. పావని దగ్గర ఉండి అన్ని అందించేది. ఒకసారి మాత్రం శైలజ రాము ని చూడడానికి మేడమీద గదిలో కి వెళ్లింది. రాము నిద్రపోతుందటే దూరం నుంచి చూసి వచ్చేసింది.

రాము జ్వరం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఆ రోజు రాజారాం ఆఫీస్ నుండి వచ్చాక , రాము గదిలోకి వెళ్ళాడు.

రాజారాం : హాయ్…రాము ఎలా ఉంది. తేలికగా ఉందా.

రాము : లేచి కూర్చుని…పరవాలేదు సార్. అని ఒక్కసారిగా రాజారాం కాళ్లమీద పడి ఏడుస్తూ, మీరు నన్ను మీ సొంత మనిషిలా చూస్తున్నారు. అసలు నేను బ్రతికి ఉండడం వృధా. నాకు బ్రతకాలని లేదు సార్….

రాము పరిస్థితి అర్థం అయింది.

రాజారాం : రాము ఊరుకో…లే…ఏంటి చిన్న పిల్లాడిలా…. నువ్వు ఇంకొక నాలుగు రోజుల ఇక్కడే ఉండి పూర్తిగా కోలుకున్నాక వెళుదువు…హాస్టల్ కు.

రాము : లేదు సార్… రేపు వెళ్ళిపోతాను…కాలేజీ పోతుంది.

రాజారాం : గత రెండు నెలలుగా నువ్వు కాలేజీ కి వెళ్లింది కేవలం పదిహేను రోజులు మాత్రమే. ఇప్పుడు ఏం నష్టం లేదు. నేను డాక్టర్ సర్టిఫికేట్ ఎరేంజ్ చేస్తాను….. ఇంకో విషయం ఈ రోజు నుంచి రాత్రుళ్లు నేను నీతో పాటే ఇక్కడే పడుకుంటాను.

రాము కి రాజారాం తండ్రి లా కనపడ్డాడు.

ఆ రోజు రాత్రి భోజనం చేసాక రాజారాం రాము తో కలిసి పడుకుని… మాట్లాడుకుంటున్నారు.

రాజారాం : రాము నీకు అభ్యంతరం లేకపోతే నీ గురించి, విమల గురించి చెపుతావా….

రాము : ఆశ్చర్యం గా….తన ఇంటర్ నుంచి విమలతో కలిసి జరిగిన ప్రయాణం వివరం గా చెప్పాడు.

రాజారాం : చూడు రాము…విమల నీ భవిష్యత్తు కోసం తన జీవితం త్యాగం చేసింది. తాను ఎంతో దూరం ఆలోచించి.....నీ చదువు పూర్తయి, ఇంకా విదేశాల్లో చదివి అంతా అయ్యేటప్పటికి ఇంకా అయిదు సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు వాళ్ల ఇంటిలో ఆగరు. తను నీ మేలు, ఎదుగుదల చూడాలనుకుంది. ఇప్పుడు నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకోమని అడిగితే నువ్వు ఎలాగైనా చేసుకుంటావు అని తనకు తెలుసు కానీ జీవితం ఇక్కడితో ఆగిపోతుంది అని గ్రహించి ఇంత నిర్ణయం తీసుకుంది.

నువ్వు ఈ రోజు ఇంత బాధ పడడం సహజం. కానీ ఆ బాధని నువ్వు కొనసాగిస్తే , నువ్వు విమల ను ప్రేమించిన దానికి అర్థం ఉండదు. ఏ రోజు అయితే నువ్వు ఒక మంచి స్థాయిలో ఉంటావో , ఆ రోజు ఆమె కల నెరవేరినట్లు, తన త్యాగానికి అర్దం ఉన్నట్లు. అయినా ప్రేమించడం అంటే కలిసి జీవించక పోయినా ఒకరిని ఒకరు గౌరవించుకోవడం. ఏ ప్రేమ కూడా మనిషి జీవితాన్ని అర్థాంతరంగా ముగించాలని అనుకోదు.

రాము కి రాజారాం మాటలు మొదటి సారి మనసు కి ఎక్కుతున్నాయి.

రాజారాం : చూడు రాము , నువ్వు ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చావు. అటువంటి నువ్వు రేపు విదేశాల్లో చదివి మంచి స్థాయిలో ఉంటే , ఆ ఘనత కి కారణం విమల అవుతుంది.

ఉన్న నాలుగు రోజులు రాజారాం రాము తోనే పడుకొని రాముని తన లక్ష్యం వైపు నడిచేలా ప్రేరేపించాడు.

చివరి రోజు రాజారాం పావని తో కలిసి చర్చించి రాము తిరిగి మామూలుగా అవ్వాలంటే తనని ఇంకా మీదట ఒంటరిగా ఉంచకూడదని ఒక నిర్ణయం తీసుకున్నాడు.

 ఆ రోజు రాత్రి రాము తో

రాజారాం : రాము రేపు కాలేజీ కి వెళ్ళి, వచ్చేటప్పుడు హాస్టల్ ఖాళీ చేసి లగేజీ తెచ్చుకో..ఇక నుంచి ప్రతీ రోజు బస్ మీద ఇంటి నుండి వెళుదువు. ఆంటీ శైలజ తో పాటు నీకు లంచ్ బాక్స్ ఇస్తుంది. ఇక మీదట మనం అందరం కలిసి ఇక్కడే ఉంటాం.

రాము కి నోట మాట రావడం లేదు.

రాము : సార్…ఏంటి…ఇప్పటికే మీకు నేను చాలా భారం.

రాజారాం : చెప్పినట్లు చెయ్యి.

రాము : సరే సార్…

ఆ మరుసటి రోజు రాజారాం ఆఫీస్ నుండి తన మిత్రుడు కి ఫోన్ చేసి రాము ని ఇక మీదట పూర్తిగా తనతో నే తన ఇంటిలో ఉంచుకుంటున్నట్ల చెప్పాడు.



సీన్ – 39


రోజులు గడుస్తున్నాయి… రాము మాములు మనిషి గా అయ్యాడు. కాలేజీ కి బస్ మీద వెళ్లి వస్తున్నాడు. ఇంతలో మూడవ సంవత్సరం పరీక్షలు రాసాడు. రాము పూర్తిగా రాజారాం ఇంటిలో మనిషి లా అయి , విమల బాధ నుండి కొంచెం కొంచెం బయటకు వచ్చాడు కానీ అప్పుడప్పుడు కాస్త ఒంటరిగా ఉన్నప్పుడు విమల తో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ …కంటనీరు పెట్టుకునే వాడు.

 శైలజ ఇది వరకు లా రాముని ఆట పట్టించడం లేదు. రాము విషయం తెలిసినా తన ఇష్టాన్ని చంపుకో లేదు కానీ , ఇది వరకు లా రాము తో చనువు గా ఉండటం లేదు. ఎందుకంటే తాను రాము ను బాధ పెట్టకూడదని నిర్ణయించుకుంది.

 నెలలు గడుస్తున్నాయి…రాము ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం లోకి వచ్చాడు. కానీ మూడవ సంవత్సరం లో అనుకున్న విధంగా మార్కులు సాధించలేదు.

రాజారాం కి విషయం తెలిసి ….

రాజారాం : చూశావా…రాము , ఇదే నిదర్శనం నువ్వు కొంచెం చతికిలబడితే కాలం నిన్ను ఓడిస్తుంది. ఇది నీ ఆఖరి సంవత్సరం , నువ్వు విదేశాల్లో స్కాలర్షిప్ తో ఉచితంగా పై చదువులు చదివాలన్న నువ్వు అన్నీ మరిచి పోయి పరుగు పెట్టాలి. కాలం నిన్ను చూసి తలదించాలి.

రాజారాం ఇస్తున్న ప్రేరణ రాము కి వజ్రాయుధం లా పనిచేసేది.

శైలజ ఆ సంవత్సరం డిగ్రీ సెకండ్ ఇయర్ లో కి వచ్చింది.

రాము ఒకసారి సిరిసిల్ల వెళతానని అడిగినా…రాజారాం పంపించలేదు. అక్కడికి వెళితే మరలా పాత రోజులు గుర్తుకు వస్తాయని. రాము గురించి ఎప్పటికప్పుడు తన మిత్రుడు కీ ఫోన్ లో సమాచారం ఇస్తున్నాడు రాజారాం.

రాము ఒకవైపు ఆఖరి సంవత్సరం చదువుకే కాక విదేశాల్లో చదువుకు సీటు కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అందుకు లెక్చరర్ విశ్వం గారు బాగా సహకారం ఇస్తున్నారు.

రాత్రుళ్లు చదువుతూ ఉంటే మధ్యలో పావని పాలు తెచ్చి ఇస్తుండేది. రాము అలాంటి సమయంలో అప్పుడప్పుడు, తానేంటి, తన తల్లి తండ్రి, విమల, ప్రిన్సిపాల్ గారు, రాజారాం గారి కుటుంబం అసలు ఇంత మంది కలిసి తనను ఎక్కడికి తీసుకువెళ్తున్నారో అని కృతజ్ఞతా భావం తో అనుకునే వాడు.


సీన్ – 40


విమల కి పెళ్లి అయి అప్పటికే ఏడు నెలలు దాటాయి. భర్త బాగానే చూసుకుంటున్నాడు కానీ తన కోసం తాను జీవించడం లేదు. పైగా గర్భవతి అయింది.

సిరిసిల్ల తన తల్లి ఇంటికి వచ్చింది. ఒకరోజు తల్లి తో చెప్పి, ప్రిన్సిపాల్ గారి ఇంటికి వెళ్లింది. వెళుతుంది కానీ దారిలో సన్నగా వణుకు ప్రారంభమయింది విమలకి. రాము ఎలా ఉన్నాడో, రాము గురించి ఏమి వినవలసి వస్తుందో అని.

ప్రిన్సిపాల్ గారు విమల ను చూసి, బాగున్నావా విమల అన్నారు.

విమల : పరవాలేదు…సార్…. మీరు

ప్రిన్సిపాల్ గారు : బాగున్నాను అమ్మ…ఏంటమ్మా ఏమైనా విశేషమా…

విమల : అవును నాలుగవ నెల.

ప్రిన్సిపాల్ గారు : అవునా….. కానీ మనస్పూర్తిగా నవ్వలేక పోతున్నారు…..ఇంకేంటమ్మ విశేషాలు…

విమల : మనసులో రైళ్లు పరిగెడుతున్నంత గాభార గా ఉంది. రాము గురించి అడగుదామా లేదా అని సంశయం తో మౌనంగా ఉంది.

ప్రిన్సిపాల్ గారు : రాము గురించి విమల అడిగితే చెబుదామని మౌనంగా ఉన్నారు.

కాసేపు గడిచాక, ఏమనుకుందో ఏమో విమల లేచి వెళ్లొస్తాను సార్ అని వెను తిరిగి …నడుచుకుంటూ వస్తుంది. ఆ దారిలో చింతచెట్టు దగ్గర కి వచ్చేటప్పుటకి దుఃఖం ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడ్చింది.


ప్రిన్సిపాల్ గారు  తన  దగ్గర నుండి వెళుతున్న విమల ను చూసి , రాము గురించి అడగాలని వచ్చినా,   అడగకుండా వెళుతున్న విమల ను చూసి మనసు లోనే విమల సంస్కారానికి నమస్కరించి….ఇంత చిన్న పిల్లలకి ఎంత పెద్ద మనసులో అని అనుకున్నాడు.

ఆ మరుసటి రోజు ప్రిన్సిపాల్ గారు ఫోన్ చేసి రాజారాం కి , విమల వచ్చిన విషయం , జరిగింది అంతా విపులంగా చెప్పాడు.


ఆ తర్వాత విమల కొన్ని రోజులు ఉండి అత్తారింటికి వెళ్లి పోయింది.



మిగిలినది ఎపిసోడ్ 10 లో

యడ్ల శ్రీనివాసరావు 6 June 2022 .





No comments:

Post a Comment

568. బాల్యం తీపి

  బాల్యం తీపి  • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు ‌  బాల్యం    తీపి   పసి బాల్యం   తీపి. • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు   ప్రాయం  ...