Monday, June 27, 2022

204. ఆట

 

ఆట



• జీవితం చాలా విచిత్రంగా ఉంటుంది. చెప్పాలంటే ఒక పెద్ద ఆట,  ఆడే అవకాశం ఒక మనిషి  అనే జీవికి మాత్రమే దొరికింది. సంతోషం దుఃఖం, ధనం పేదరికం, ఆశ నిరాశ, ప్రేమలు, స్నేహాలు, కోరికలు, ఇలా చెప్పుకుంటూ ఉంటే ఎన్నో…... జీవితం మనిషి తో ఆడే లేదా మనిషి జీవితం తో ఆడే విభిన్న రకాల ఆటలు.


• ఈ ఆటలే ఒక జీవితానికి అర్థం, పరమార్థం అవుతాయి. ఈ జీవితపు ఆటలు మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దుతాయి. ఒకో వయసు లో ఒక్కోలా మనిషి ఆలోచన ఉంటుంది. చెప్పాలంటే చాలా సార్లు అవసరాలే ఆలోచనలు గా మారుతుంటాయి.


• జీవితం ఒక పోరాటం అంటారు. కానీ నాకు పోరాటం అనే పదం సరికాదు అనిపిస్తుంది. పోరాటం లో ఎప్పుడూ ఆతృత, ఆరాటమే గాని ఆనందం ఉండదు. నిత్యం యుద్దం చేస్తూ అలసిపోతే ఇక ఆనందం ఎప్పుడు ఉంటుంది. జీవితం ఒక ఆట. ఆటగాడు ఆట ఆడేటప్పుడు ఒక మానసిక ఆనందం తో ఎంజాయ్ చేస్తూ గెలవాలని ఆడుతాడు. ఆటలో ఓడినా, గెలిచినా ఆటగాడికి ఎంజాయ్ చేసాను అనే సంతృప్తి ఉంటుంది.


• జీవితం కూడా ఒక ఆటే. మనతో మనం చుట్టూ కలిసి మెలసి ఉన్న మిత్రులు, బంధువులు, ఆత్మీయులు, శత్రువులు ఎవరి ఆట వారు ఆడుతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే రిలేషన్స్ లో ఉండే ఎమోషన్స్ కూడా ఆటలు లాంటివే. అంటే ప్రేమ, కోపం, బాధలు, వాత్సల్యాలు, కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఆధిపత్యాలు లాంటివి, ఇవన్నీ ఆటలో అప్పటికప్పుడు ఆటగాళ్లు తీసుకునే నిర్ణయాలు, గెలుపు కోసం చేసే ఆలోచనలు. వీటినే మనిషి కొన్ని సార్లు తెలివి తేటలు అని అనుకుంటూ ఉంటాడు.


• ఆట అన్నాక కొన్ని సార్లు ఓటమి , కొన్ని సార్లు విజయం అనేది సహజం. ప్రతీ ఆట ఆడడానికి ఒక విధానం, పద్దతి, రూల్స్ స్థిరం గా ఉంటాయి. ఆట ఆడేది కూడా మైదానం లో, ఇది కూడా ఎప్పుడు స్థిరం గానే ఉంటుంది.


• అలాగే జీవితం అనేది ఒక స్థిరమైన మైదానం అనుకుంటే, ఈ మైదానాన్ని మనిషి పుట్టుక నుండి చావు వరకు జీవించడం అనుకోవచ్చు.


• ఆటలు పలురకాలు అనుకుంటే , మనిషి కూడా ఒకోదశలో ఒకో ఆట ఆడుతుంటాడు, ఉదాహరణకు బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్దాప్యం లో జరిగే మార్పులు, సంఘటనలు, అనుభవాలు, చదువు, వృత్తి, వివాహం, ఆటలు అనుకుంటే…..


• వీటన్నింటినీ ఒక పద్దతి, విధానం తో అవలంభించినపుడు జీవితం అనే ఆటలో ఎత్తు పల్లాలు ఉన్నా ఎంజాయ్ చెయ్యవచ్చు.


• ఇక ఆటగాళ్లు అంటే జీవితంలో చుట్టూ అల్లుకుని ఉన్న మనుషులు అందరూ, అన్ని బంధాలలో ముడిపడి ఉన్నవారు .

• ఒక ఆటలో

1. మైదానం స్థిరం.

2. ఆటలు స్థిరం.

3. ఆటలు ఆడే విధానం, పద్దతి (రూల్స్) స్థిరం

4. ఆటగాళ్లు స్థిరం కాదు.

5. గెలుపు ఓటములు స్థిరం కాదు.


• మనిషి కి

1. జీవితం స్థిరం.

2. వయసు దశలు స్థిరం.

3. జీవిత విధానం పద్దతి స్థిరం.

4. జీవితం లో పాత్రధారులు స్థిరం కాదు, (అంటే నా ఉద్దేశ్యం ఒకటి ప్రతీ ఒక్కరి జీవితం లో మనుషులు కలుస్తారు, విడిపోతారు…వివాహ బంధం లో కూడా కొందరిలో జరుగుతుంది. రెండవది ఎప్పటి కైనా మనిషి కి మరణం తప్పదు),

5. సుఖదుఃఖాలు స్థిరం కాదు.


• జీవితం అంటే ఒక ఆట. ఆ ఆటను స్పోర్టీవ్ గా తీసుకుంటే ఒత్తిడి లేకుండా ఎంజాయ్ చేస్తూ జీవించవచ్చు. నువ్వే ఒక శాశ్వతం కాదు అనే నిజం తెలిసినపుడు , నీతో ఉన్న వారెవరూ శాశ్వతం కాదు కదా. అంటే ఈ విషయం పాజిటివ్ గా ఆలోచిస్తే, సాటి మను మనుషుల వలన బాధలు, సమస్యలు పడుతూ బయటకు చెప్పుకోలేక డిప్రెషన్ లో కి వెళ్ళి సంవత్సరాల తరబడి దుఃఖం లో ఉండి జీవితాన్ని ఆనందంగా గడపలేక పోతున్నారు నేటి కాలంలో చాలా మంది. అటువంటి వారు ఒకసారి ఆలోచించండి. పుట్టినందుకు ప్రతీ క్షణం మీదే. మీరు మీలా జీవించడానికే గాని మరొకరి లా బ్రతకడానికి కాదు. మీ ఇష్టాలను వదులుకోకండి, సాధ్యాసాధ్యాలను గమనించండి. కానీ ఎవరినీ హింసించకండి.


• నీ పుట్టుక నీది….నీ ఆకలి నీది…నీ ఊపిరి నీది…నీ బ్రతుకు నీది….నీ చావు నీది….. చేతనైతే నీవు నీవుగా ఉండి ఒకరికి చేయూత నివ్వు. నీ లోని శక్తి ని నువ్వు గ్రహించనంత కాలం పిరికితనం రాజ్యం ఏలుతుంది.


• జీవితం అనే మైదానం లో ఎన్ని ఆటలు ఆడినా గెలుపు ఓటములు కి అతీతంగా ఎంజాయ్ చెయ్యడం నేర్చుకో…..నీ కంటే గొప్ప జీవితం ఎవరికీ ఉండదు. నిన్ను నువ్వు ప్రేమించడం నేర్చుకో, నీలో ఆత్మవిశ్వాసం అన్నీ నీకు నేర్పిస్తుంది.


యడ్ల శ్రీనివాసరావు 27 June 2022 6:00 pm.







No comments:

Post a Comment

488. నా ప్రపంచం

నా ప్రపంచం • నా దొక   ప్రపంచం   అది   సోయగాల   సౌందర్యం. • నా  మనసెరిగిన   ప్రపంచం   మధువొలికిన     అనందం. • అందాల   ఆరబోతలు   ఆదమరచి   ...