సత్యం
• భగవంతుని వైపు అడుగులు వేస్తూ పయనం సాగిస్తూ ఉంటే సత్యమే స్పష్టం గా కనపడుతుంది. సత్యమే తెలుస్తుంది. సత్యమే మాట్లాడడం జరుగుతుంది . ఎందుకంటే భగవంతుడు అంటే నే సత్యం కాబట్టి.
అదే “సత్యం శివం సుందరం”.
ఈ సత్యం తెలుస్తూ , అనుభవం అవుతూ , ఆచరిస్తూ ఉన్నప్పుడు , తొలి దశలో మన లో లోపల అనాది గా దాగి ఉన్న అసత్యాలు మనకు తెలియడం ప్రారంభం అవుతుంది , ఆ తరువాత వాటిని నిర్మూలించడం ఆరంభిస్తుంది . దీనినే పరివర్తన దశ అంటారు. అనగా మనలో మార్పు సంభవించే కాలం అని అర్థం. ఈ సమయంలో మన మనసు ఎన్నో ఆటుపోట్లకు గురి అవుతూ , ఇటు అంతరంగం లోను అటు బాహ్య ప్రపంచంతోను ఘర్షణ పరిస్థితులు ఎదుర్కొనవలసి వస్తుంది.
• ఎందుకంటే ఎన్నో జన్మలు గా మన బుద్ధి అనేక అసత్యాలు కు నెలవు గా అయిపోయింది . మన ఆత్మ లో పేరుకు పోయి ఉన్న అసత్యాలు , వాటితో కూడిన నమ్మకాలు మార్పు చెందుతూ ఉన్న దశలో మనసు లో అంతర్గతం గా ఒక కురుక్షేత్రం జరుగుతుంది. ఈ దశలో అంతర్గతంగా నే కాకుండా బాహ్య ప్రపంచం లో ముడిపడి ఉన్న వారితో కూడా తప్పని సరిగా అలజడులు తో కూడిన ఒక యుద్దం మనసు చేస్తుంది . ఎందుకంటే , బుద్ధి లో అలవాటు అయిపోయి ఉన్న అసత్యం బయటకు వెళ్లి , అందులో సత్యం ఆచరణ కోసం నిండాలి అంటే పోరాటం, ఘర్షణ అనేది మనసు కి సహజంగా ఎదుర్కొంటుంది .
• మనం ఎప్పుడైతే సత్యం తో మెలగడం ఆరంభిస్తామో , అప్పటి వరకూ మనతో కలిసి మెలిసి ఉన్న ప్రతీ ఒక్కరూ ఇంటా బయటా మనల్ని ఒక శత్రువు గా భావించడం మొదలు పెడతారు . చెప్పాలంటే ఇది వారి యొక్క తప్పు కూడా కాదు. వారికి లేని అవగాహన, అతీతమైన మార్పు నీ లో సంభవిస్తుంది అంటే అది చూసిన వారు మొదట నిన్ను అర్దం చేసుకోలేరు , గ్రహించ లేరు . అలా అని వారి వలే ప్రవర్తించడం నీకు సాధ్యం కాదు .
• దీనికి కారణం, ఏనాడైతే నీవు భగవంతుడి ధ్యాస లో ఉంటూ సత్యం మాట్లాడుతూ ఉంటావో , అది నీ చుట్టూ దగ్గర గా ఉన్న వారికి కొన్ని సందర్భాల్లో తమను కించ పరస్తున్నట్లు భావిస్తారు. దానికి కారణం వారిలో కొలువై ఉన్న అసత్యం .
కానీ కాలక్రమేణా , నీ లోని సత్యతను , సత్యం యొక్క శక్తిని అందరికీ అర్దం అవుతుంది . ఎందుకంటే సత్యం ఒక నిప్పు , నీ లో మలిన గుణాలను దహిస్తూ భగవంతుని వైపు తీసుకెళ్తూనే, ఆ నిప్పు జ్యోతి వలే ప్రకాశిస్తూ నీ చుట్టూ ఉన్న అందరికీ వెలుగు అవుతుంది .
సత్యాన్ని చెప్పడం , రాయడం కంటే, ఆచరించడం లోనే అద్భుతమైన అనుభవం జరుగుతుంది .
అదే " సత్యమేవ జయతే " .
• వాస్తవానికి సత్యం , సత్యమైన విషయాలు , నిజాలు అనేవి ప్రతి మనిషి కి తెలిసినవే . బాల్యం లో పాఠశాల విద్యాభ్యాసం లో ఎన్నో సత్య వాక్యాలు కాపీ రైటింగ్ పుస్తకాల లో నిత్యం పలుమార్లు రాయడం , చదవడం జరిగేది . ఉదాహరణకు . . . తల్లి తండ్రులను ప్రేమించవలెను , గురువులను గౌరవించవలెను, ఈర్ష్య ద్వేషాలు ఉండరాదు , కామ క్రోధాలు మహా శత్రువులు , అబద్ధం మాట్లాడ రాదు , ఐకమత్యమే మహా బలం , అందరితో సఖ్యతగా ఉండుము , కలిసి ఉంటే కలదు సుఖం , భగవంతుని యందు భక్తి కలిగి ఉండుము , శత్రువులను ప్రేమించుము , సొంత లాభం కొంత మానుకో , ఆరోగ్యమే మహా భాగ్యం , పొరుగు వారికి సహాయం చేయుము , మంచి అలవాట్లు పాటించుము ….. ఇలా ఎన్నో, ఎన్నెన్నో లెక్కలేనన్ని నేర్చుకోవడం జరిగింది. కానీ , నేడు అవి గుర్తు ఉన్నాయా ? అంటే అవును గుర్తు ఉన్నాయి . కానీ , వాటిని ఆచరిస్తున్నామా ? అనేది ఒక ప్రశ్నార్ధకం .
ఎందుకంటే నేడు మనం బాల్యం లో లేము కదా అనేది సమాధానం కావచ్చు . లేదా ఇవి వ్రాయడానికి చదవడానికి మాత్రమే బాగుంటాయి కాని జీవితం లో ఆచరించడం కష్టం అనిపించవచ్చు .
• కానీ , ఆనాటి బాల్యం లో నేర్చుకున్న పాఠాలు మనసు లో దృఢం గా ఉంటేనే , వాటిని సజావుగా అంగీకరిస్తూ ఆచరిస్తే నే కౌమారం , యవనం , వృద్ధాప్యం ఉన్నతంగా ఆనందం గా , ఏ సమస్యలు కొని తెచ్చు కోకుండా నడుస్తాయి అనే విషయం బహుశా మన బుద్ధి ఏనాడో మరచి పోయింది .
• ఎందుకంటే నేటి మాయా ప్రపంచం లో మనం చాలా బిజీ . . . గజిబిజి . మనకు మనం మన ఆధీనంలోనే (కంట్రోల్) లేని విచిత్రమైన స్థితులతో జీవితం జీవనం సాగిస్తున్నాము . భౌతిక పరిస్థితులు మనపైనే ఆధిపత్యం (డామినేట్) చేస్తున్నాయి . అందుకే అన్నీ సమృద్ధిగా ఉన్నా కూడా , తెలియని ఆందోళనలతో , సమస్యలను నెమరు వేసుకుంటూ జీవించ వలసి వస్తుంది.
ఇది మన అభివృద్ధా ? లేక పతనమా ? అని ఆత్మ విమర్శ చేసుకునే సమయం కూడా నేడు లేదు .
• మనం పుట్టినప్పుడు భగవంతుని తోడు తో నే పుట్టాం , అందుకే పసి వయసులో నిద్రలో నవ్వుతూ ఆయనతో ఆడుకుంటూ ఉంటాం . ఊహా వస్తూ ఎదుగుతూ , మనలో మాయ ప్రవేశిస్తూ ఉండడం తోనే ఆయన్ను ఒక రాతి విగ్రహం గానే చూడడం ఆరంభించాం . మన మనసు లో నుంచి ఆయన్ను బయటకు పంపించి, మాయకు పెద్ద సింహాసనం వేశాం . అందుకే , మన లో లో ఉండవలసిన భగవంతుడు నేడు ఎక్కడో కొండలపైన ఉన్నాడు . అదే విధంగా మన, లో లో ఉండవలసిన సత్యం మనల్ని విడిచి ఎక్కడికో పోయింది .
నిజానంద స్వరూపం శివోహం శివోహం
ఓం శాంతి 🙏
ఓం నమఃశివాయ 🙏
యడ్ల శ్రీనివాసరావు 28 Feb 2026 , 11:00 PM .

No comments:
Post a Comment