Wednesday, July 15, 2026

767. ఇది మనం గమనిస్తున్నామా ?

 

  ఇది మనం గమనిస్తున్నామా ?




• మనకు గుర్తు ఉందా ? 2000 సంవత్సరం కంటే ముందు పుట్టిన మనం మన చిన్న తనం , ఇంట్లో పెరుగుతూ ఉన్న సమయంలో తల్లి తండ్రులు, పాఠశాల లో ఉపాధ్యాయులు తరచూ మనకు నీతి ని బోధించే వారు . వారికి మనసు లో మన పట్ల  ప్రేమ మమకారం ఉన్నా సరే బయటకు పెద్ద గా వ్యక్త పరచకుండా , కేవలం వారి దృష్టి మన నడవడిక మీద పెట్టి గమనిస్తూ ఉండేవారు .

 ఎందుకంటే నడవడిక సరి లేక పోతే, వీడు భవిష్యత్తులో ఎందుకు పనికి రాకుండా పోతాడు అనేవారు .   అంటే దాని అర్థం ఏ పని (వృత్తి) చేయలేడు అని కాదు . ఏ పని ని బాధ్యతాయుతంగా చేయలేడు అని అర్థం . అంటే ఒక మనిషి నడవడిక, ప్రవర్తన సరిగా లేకపోతే అత్యంత ప్రమాదకరమైన స్థితి , ఆ మనిషి కే కాదు భవిష్యత్తులో తన కుటుంబానికి , చుట్టూ ఉన్న సమాజానికి కూడా చేటు జరుగుతుంది అని , మన తల్లి తండ్రులు, ఉపాధ్యాయులు ఆలోచించే వారు . వారి ఆలోచన సరళి కొంత వయసు వరకు , కాస్తంత కఠినం గా అనిపించినా . . . అందులో సూక్ష్మం మాత్రం ఆ వ్యక్తి శ్రేయస్సు , సమాజ శ్రేయస్సు దాగి ఉండేది ‌. 

 ఒక తప్పు చేస్తే చాలు దండించే వారు . శిక్షించే వారు .  తప్పు చేస్తే శిక్ష పడుతుంది అనే భయం , భావన మన బాల్యం నుంచే ప్రతి ఒక్కరికీ ఆ రోజుల్లో అనుభవం అయ్యేది , ముఖ్యం గా మనసుల్లో ముద్రించుకు పోయేది.

• ఒకవేళ తప్పులు  చేసి కప్పి పుచ్చుకొనో  లేక శిక్షలకు దొరకకుండా పెరిగిన వారు , ఆ తప్పుడు పనుల స్వభావం తోనే  నేటికీ జీవిస్తూ ఉంటారు అనడం లో సందేహం లేదు .  అది వారికి బాల్యం నుంచి ఒక అలవాటు తో కూడిన ఆనందం అవుతుంది ‌. ఎందుకంటే వారికి తమ స్వభావం పట్ల పరిపక్వత ఉండదు . “మొక్కై వంగనిది మానై వంగునా “ అని అందుకే అంటారు.


• ఈ రోజుల్లో కుటుంబ వ్యవస్థల్లో , సమాజం లో , ప్రజలకు సేవ చేస్తాం అని చెప్పే రాజకీయ పార్టీ ల్లో ,  ప్రతీ చోట బహిరంగంగా వికృత వికార చేష్టలతో, హింస తో అనేక మంది  ప్రత్యక్షం గా పార్కుల్లో , వేదిక ల పైన , యూట్యూబ్ వీడియోల లో విచ్చలవిడి వికారీ  చేష్టలతో ప్రవర్తిస్తూ ఉండడం మనం గమనిస్తున్నాం . ఇటువంటి వారు ముమ్మాటికీ తల్లి తండ్రుల , ఉపాధ్యాయులు చెప్పిన నీతి ని చిన్న తనం నుంచి ఆచరించని వారే. ఇటువంటి వీరే సంఘవిద్రోహ శక్తులు గా తయారవుతూ సమాజం లో స్వేచ్చ ను హరిస్తూ , సామాన్య పౌరులకు శాంతి భద్రతలు లేకుండా చేస్తున్నారు. 

ఇది ప్రత్యక్షంగా   మన సమాజంలో ప్రతి రోజూ నేడు నిత్యం అనుక్షణం చూస్తున్నాం . ఇది ఇంతింతై అన్నట్టుగా పెరుగుతూ ఉంది కానీ , … నీతి , విలువలు , అభ్యుదయ భావాలు లాంటి విషయాలు, మాటలు జీర్ణించుకోలేని దుస్థితి కి నేడు అధిక శాతం యువత తయారవుతుంది అనడం లో సందేహం లేదు. ఇందులో గంజాయి, మాదకద్రవ్యాలు, మద్యం వంటివి వీరికి ప్రోత్సాహకాలు గా అందించే రాజకీయ వ్యవస్థలు తయారు అయ్యాయి . 

 వారిలో ఉన్న ఆలోచన మంచి ని ప్రేరేపిస్తుందా  లేదా చెడు ని ప్రేరేపిస్తుందా అనే కనీస మానసిక అవగాహన లేకుండా, సరియైన పునాది లేని వ్యక్తిత్వం తో , హద్దులు లేని స్వేచ్చ తో , తమో గుణ ప్రవర్తన ను ఆచరించడానికి పూర్తిగా అలవాటు పడి పోయారు . దీనికి ప్రధాన కారణం నేడు కాలం లో విస్తృతం గా వ్యాపించిన ఇంటర్నెట్ మాయా కమ్యూనికేషన్. 


• ఇదంతా చివరికి …. దేనికి చేరువ అవుతుంది అంటే  వినాశనానికి . జన జీవన వినాశనానికి . కుటుంబ  వ్యవస్థ ల  వినాశనానికి . ఇప్పటికే ఈ వినాశనం  బీజం పడి  మొలకెత్తి వృక్షం అయి , అంట్లు గా సమాజం లో అల్లుకుపోయింది . దీనిని నివారించడం అసాధ్యం అనేంతగా తయారయ్యింది .  

• గమనించండి ….. 2000 సంవత్సరం కంటే ముందు కాలం లో సమాజం, జన జీవనం , ప్రకృతి ఇంత అలజడుల తో ఉండేదా . నేడు 50 సంవత్సరాల వయస్సు ఉన్న ప్రతీ ఒక్కరికీ తమ జీవితాల ద్వారా ఇదంతా ప్రత్యక్ష అనుభవం కావడం లేదా?


• మనిషి కి బాల్యం నుంచి పెరుగుతూ ఉన్న సమయంలో నీతి కధలు, నీతి , విలువలు, కష్టం సుఖం , మంచి చెడు , పరులకు సహాయం , దైవం వంటివి తెలియక పోతే మొదట నాశనం అయ్యేది ఆ మనిషే , తరువాత తన కుటుంబం లోని భార్య , భర్త , పిల్లలు …… ఆ తరువాతే సమాజం . వాడు ఎంత ధనవంతుడైన , పేదవాడు అయినా జరిగేది ఇదే . 

• నేడు మనం అవసరాలకు మించిన ధనం సంపాదిస్తూ , సౌకర్యాలు అనుభవిస్తూ అభివృద్ధి చెందుతున్నాం,  నాకేంటి!  అనే మాయా ముసుగు లో  పైకి  జీవిస్తున్నాం , మంచిదే . . .  కానీ అంతకంటే అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిత్వాలు కలిగిన మనుషుల తో , వైట్ కాలర్ సైకో లతో ( పైకి సాధారణంగా కనిపించే ఉన్మాదులు), ప్రమాదకరమైన మానసిక రోగులతో కలిసి ఇటు కుటుంబ వ్యవస్థ లలో , అటు సమాజం లో కలిసి సహ జీవనం చేస్తూ ఉన్నాం . అందువలనే క్రైమ్ రేటు ఇంతగా పెరుగుతుంది . ఇందులో ప్రధాన మొదటిది అక్రమ శారీరక సంబంధాలు, రెండవది అక్రమ ధన సంపాదన .  

• ఇటీవల పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా గత 15 ఏళ్ళలో సమాజంలోని ప్రజలు , మానవ జీవితాల పట్ల చేసిన దురాగతాలు బయట పడుతుంటే , డబ్బు కోసం ఆమె ప్రవర్తించిన తీరు చూసినప్పుడు ఆలోచిస్తే …… ప్రాథమికంగా ఒకటే లోపం అనిపిస్తుంది . . . ఆమె పెరిగిన తీరు , పెంపకం లో లోపం , స్వభావం లోని లోపం . ఆమె కి ఎంతో ధనం సహజంగా ఉండి ఉన్నా సరే అత్యాశతో చేసిన దురాగతాలు . ఇటువంటి కొందరు నాయకులు దేశం నిండా అనేకులు వ్యాపించి ఉన్నారు .  ఇది కేవలం రాజకీయ నాయకులకే కాదు , సర్వ మానవాళిలో ఈ స్వభావం ఎంతో కొంత అటుఇటుగా వ్యాపించుకు పోయి ఉన్నాది .


• ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లో ఉన్న ప్రతి మనిషి కి రక్షణ , ఉన్నంతలో జీవన సంతృప్తి ఉండేది . మనుషుల మధ్య ఎన్ని అంతర్యుద్ధాలు వచ్చిన తెల్లారే సరికి సమసిపోయి, అందరూ కలిసి ఉండేవారు. విలువలు ఉండేవి . పిల్లలు పెంపకం జీవన విధానం విలువలతో బాగుండేది . ఏదైనా సమస్యను అనుభవం తో  యుక్తిగా , ఎలా  పెద్ద వారు పరిష్కారించు కుంటున్నారో ప్రత్యక్షంగా పిల్లలు గమనించే వారు , సమాజం లో నలుగురితో ఎలా మెలగాలో , ఇంటి వాతావరణం నుంచే అలవడేది . కానీ నేటి కాలంలో మన ఇంటి వాతావరణం ఎలా ఉంటుందో మనకు మనమే ప్రశ్నించుకోవాలి, ఆలోచించు కోవాలి .  

భర్త మంచి చెపితే భార్య కి నచ్చదు, భార్య మంచి చెపితే భర్తకు నచ్చదు. అహంకారాలతో  కూడిన ఈ  విభిన్న వ్యక్తిత్వాలు , మనస్తత్వాలు కలిసి తమ శారీరక సుఖం మరియు సామాజిక అవసరాల కోసం కలిసి జీవిస్తున్నాం అన్నట్లు ఉంటుంది . కానీ  ... వారి  తీరు , ప్రభావం  వారి  పిల్లల  పై  ఏ విధంగా  ప్రభావితం అవుతుందో  అని గమనించే స్థితిలో లేము , అనేది వాస్తవం . ఇక పిల్లల వ్యక్తిత్వాన్ని  ఇటువంటి తల్లిదండ్రులు ఎలా తీర్చి దిద్దగలరు ?


నేటి స్వతంత్ర కుటుంబాలలో మనిషి కి అవసరానికి మించిన  ధనం , స్వేచ్ఛ , తద్వారా విచ్చలవిడితనం లభిస్తుంది . . . అంతకు మించి వీటి ద్వారా మనిషి  ఏమి కోల్పోతున్నాడో తాను తెలుసుకో లేక పోతున్నాడు  . 


• మన ఇంటి పెరట్లో పెరిగిన మొక్క కి చీడ పడితే , ఇంటిలో మిగిలిన మొక్కల కి విస్తరిస్తుందని తెలిసి తీసి బయట పడెస్తాము , వెంటనే వీధి లో మొక్క లకు కూడా ఆ చీడ సోకుతుంది . అలా కాకుండా ఆది లోనే నివారించడానికి మంచి ఘాటైన మందు ఇంటి పెరట్లో నే పిచికారి చేస్తే , ఆ చీడ బయట మొక్కలకు వ్యాపించదు . ఒకవేళ ఆ మొక్క శ్రేష్టమైనది అయితే పట్టిన చీడ నుంచి బయటపడి వృద్ధి అవుతుంది . శ్రేష్టమైనది కాకపోతే పిచికారి చేసిన మందుకి చీడ తో పాటు కలిసి చస్తుంది . 

అదే విధంగా, మనలో  మొలకెత్తిన రాచపుండు ను ప్రాధమిక స్థాయిలో నిర్మూలించక పోతే, అదే కాన్సర్ అయి మనల్ని నిర్మూలిస్తుంది. . .  ఇక్కడ రాచపుండు అంటే అవగుణాలు , వికారాలు పైత్యాలు.


• మంచికి , మార్పుకి  పునాది  మన మనసు ,  మన చేతులు , మన చేతలే అవుతాయి  కానీ , మన చుట్టూ ఉన్న సమాజం కాదు . 

అంతర్ముఖం  ‌శుద్ధి గా  లేకపోతే  బాహ్య ముఖం అష్ట వంకరలతో  (వికారాల తో)  కనిపిస్తుంది . 




నిశితంగా గమనించాలి 🙏 . . .   
మనిషి చైతన్యం , వర్తమాన కాలంలో వాస్తవాల కోసమే  ఈ రచన. . .  అంతకు మించి ,  ఏ మనిషి ని  విమర్శించడానికి  , లోపాలను ఎత్తి చూపడానికి  కాదు .  ఒకరి లోపాలను మరొకరు ఎత్తి చూపుడం వలన ఎవరికీ ఏ ప్రయోజనం ఉండదు. ఎవరిని వారే శుద్ది చేసుకోవాలి .


  ఓం శాంతి 

  ఓం నమఃశివాయ 🙏 

యడ్ల శ్రీనివాసరావు 15 July 2026 11:30 AM 


No comments:

Post a Comment

767. ఇది మనం గమనిస్తున్నామా ?

    ఇది మనం గమనిస్తున్నామా ? • మనకు గుర్తు ఉందా ? 2000 సంవత్సరం కంటే ముందు పుట్టిన మనం మన చిన్న తనం , ఇంట్లో పెరుగుతూ ఉన్న సమయంలో తల్లి తండ...