మన ప్రభావం ఇతరుల పై ఎలా ఉంది?
• మన జీవిత ప్రయాణంలో నిత్యం ఎంతో మంది తో సహగమనం చేస్తూ ఉంటాం. ఇందులో కుటుంబీకులు, రక్త సంబంధీకులు, మిత్రులు, వృత్తి లో సహచరులు, సమాజం లో అపరిచుతులు ఇలా అనేకుల తో మన కర్మ (పని) ఏదో రూపంలో ముడిపడి ఉంటుంది. దీని వలన నిత్యం మన యొక్క ఆలోచన , మాట , ప్రవర్తన తీరుల తో వారితో నడుస్తూ ఉంటాం . ఇటువంటి సమయంలో తప్పకుండా ఇతరుల ప్రభావం మనపై , మన ప్రభావం ఇతరుల పై తప్పకుండా ఎంతో కొంత ఉంటుంది అనేది వాస్తవం .
• ఇతరుల తీరును మనం చక్కగా గమనిస్తూ ఉంటాం , తెలియకుండానే గ్రహిస్తూ ఉంటాం. దీనినే ప్రభావం అంటారు. ఇదే చర్య మన నుంచి కూడా జరుగుతుంది. అంటే మన ప్రభావం కూడా ఇతరుల పడుతుంది . ఈ ప్రభావం లో మంచి చెడు ఏదైనా ఉండొచ్చు , అది బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది.
• అయితే మన ప్రభావం ఇతరుల పై ఏ విధంగా ఉంటుంది అనే విషయం ఏ నాడైనా స్వయం పరిశీలించు కుంటున్నామా ? అందులో భాగంగా మనం ఇతరులకు ఇచ్చేది సంతోషమా ? దుఃఖమా ? రంజనమా ? . . . లేక , నా ధోరణి నాదే అన్నట్లు ఉంటున్నామా ? ఎందుకంటే మానవ సంబంధాలలో నిత్యం మనల్ని మనం పరిశీలించుకోవడం సవ్యమైన తీరును అవలంభించడం అనేది చాలా ముఖ్యమైన అంశం.
• ఇతరుల తో మన ప్రవర్తన ఆకర్షణ లతో నిండి ఉంటే , ఆ బంధం లో సఖ్యత అనేది కేవలం తాత్కాలికం మాత్రమే . మన ప్రవర్తన తీరు తెన్నులలో కల్మషం లేని నాడే సహజసిద్ధంగా సఖ్యత దృఢం అవుతుంది. ప్రవర్తన లో సహజ సిద్ధమైన అమాయకత్వం , తెలియని తనం అనేవి సఖ్యత కు ఆధారంగా ఉంటాయి .
• మనకు ఉన్న అన్ని రకాల బంధాలలోని వ్యక్తుల వలన మన బుద్ధి కి నిత్యం ఎన్నో పరీక్షలు ఉంటాయి. ఇందులో మనకు ఆశలు , నిరాశలు , మభ్య పడడం , నిందలు , పొగడ్తలు , వ్యంగ్యాస్త్రాలు ఇలా ఎన్నో అంశాలు ఉంటాయి . ఈ పరిక్షలలో ఉత్తీర్ణత సాధించాలి అంటే బుద్ధి కి సూక్ష్మమైన పరిశీలన కావాలి . బుద్ధి బలోపేతం కావాలంటే అవగాహన తో కూడిన జ్ఞాన విషయాలు బుద్ధి లో నిరంతరం ధారణ జరగాలి. లేదంటే మన బుద్ధి విఫలమై , విషయ వికారాల ప్రభావాలకు లోనై మనసు అతలాకుతలమై చివరికి నైతికంగా పతనం ఆరంభం అవుతుంది .
• అందుకే మన ప్రవర్తన ను తప్పనిసరిగా నిరంతరం పరిశీలిన (check) చేసుకుంటూ ఉండాలి .
• మనం చేసే కర్మల గతి (direction) చాలా సూక్ష్మం మరియు అతి రహస్యం (hidden). కొన్ని సార్లు కర్మలు చేసేటప్పుడు ఆనందం గా చేస్తుంటాం . కానీ అనతి కాలంలోనే శిక్షలు అనుభవించే సమయంలో కూడా మనం చేసిన పాప కర్మలు మనకు గుర్తుకు రావు . దీనికి కారణం మన బుద్ధి , సూక్ష్మం ఎరుగక పోవడం .
అందుకనే మన ఆలోచనలకు పదును పెడదాం , సూక్ష్మతను బుద్ధి కి అలవాటు చేద్దాం.
• మనం జన్మతః ఉన్నతులం కాదు. కానీ జీవిస్తూ ఎదుగుతూ ఉన్నతి సాధించడం కోసం జన్మ తీసుకున్నాం . ఈ విషయాన్నే మన పుట్టడం కంటే ముందు ఆత్మ రూపులు మైన మనం పరమాత్మ కి వాగ్దానం చేసి ఆ తరువాతే జన్మ తీసుకున్నాం. కానీ జన్మించిన అనంతరం మాయా ప్రభావం వలన ఈ విషయం పూర్తిగా మరచి పోయాం. ఇదే సత్యం. అందుకు నిదర్శనం , నేడు ఇదంతా చదివి అర్దం చేసుకోవడం .
ఓం శాంతి .
ఓం నమఃశివాయ 🙏
యడ్ల శ్రీనివాసరావు 21 Feb 2026 , 10:00 AM.

No comments:
Post a Comment