Sunday, February 22, 2026

724. వృషభం - శివం

 

వృషభం - శివం



• శివుని ధ్యానించడం లో అత్యంత ప్రీతికరమైన విషయం ఏమిటంటే   ప్రకృతి మరియు పశు పక్షాదుల సమజీవన సమతుల్యత నిండి ఉండటం. మనం శివుని గురించి తెలుసుకోగలిగితే  ఆయన ప్రకృతిలో ప్రతి జీవితో  తన అనుబంధం ఎంతగా ముడిపడి ఉంటుందో  అర్థం అవుతుంది .

• శివ గణములలో  ప్రప్రథమైనది  ప్రమథ గణము అయినటువంటిది  "నంది". నంది అంటే వృషభం . వృషభం అంటే ఎద్దు .  ఎద్దు పరమశివుడి వాహనంగా  అభివర్ణిస్తాం . 

ఒక్క సారి ఊహించుకోండి ఒంగోలు జాతి ఎద్దులను, పెద్ద పెద్ద శరీరాలతో పొడువాటి కొమ్ములతో బలమైన కాళ్ళతో నిండుగా ఉండే మోపురాలతో నెమ్మదిగా నడుస్తూ ఉంటే ఆ గిట్టలు  నుండి వచ్చే లయబద్దమైన శబ్దాలు , ప్రశాంతమైన చూపు ఇవన్నీ కలబోసి ఒక చిన్నపాటి కొండ కదులుతున్నట్టుగా  అనిపిస్తుంది కదూ ! . ఎంతో శక్తి ఉన్నప్పటికీ  ఓర్పు నేర్పు  సహనం   మౌనం లో   ధృడ శాలి  వృషభం .

 మహా దేవుడుకి  రక్షణ వలయం లాగ నందులు చుట్టూ కాపలాకాస్తూ  ఆయనకు వాహనమై  శివుని సేవలో తరించిపోతూ  ఉంటాయి.

  శివాలయములో  లింగ దర్శనానంతరం  నందిని ముట్టనిదే  మనసుకు ఆనందం ఎక్కడిది. చూసారో లేదో ఆయన శివుడి ముందే కూర్చొని నిత్యం శివుని చూస్తూ కాపలా కాస్తూ ఉంటాడు.


• ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే నంది శివుని చూడటం కాదు , శివుడే నందిని చూస్తూ తనను నమ్మిన  అమాయకమైన  ప్రాణిని  చూస్తూ పరవశించిపోతుంటాడు .

• నంది శివుని వాహనం అయితే , నంది మరియు శివుడు మనవైపు చూస్తున్నట్లుగా ఉండాలి కదా ! . మిగతా అందరు దేవుళ్ళకు అందరూ తాము ఆసీనలైన వాహకాల తో  మనల్ని చూస్తున్నట్లు దర్శనం ఇస్తుంటాయి .  కానీ నంది విషయంలో శివుడు , నంది పరస్పరం  ఎదురెదురు ముఖాముఖిగా  ఉండడం లోని ప్రత్యేకత ఏమిటి ? అని మనం ఏ రోజైనా ఆలోచించామా ?

ఒక గొప్ప భక్తుడు తాను పూజించే దైవానికి అనునిత్యం  కాపలాగా  ఉంటూ  కన్ను రెప్ప ఆర్పకుండా కాపాడుకుంటూ ఉండే సంకేతమే దీనికి అర్థం .

ఇక్కడ అర్థమయ్యే విషయం భగవంతునికి భక్తునికి మధ్య ఉన్న అనుబంధం  ఈ చూపుల కలియక . 

భక్తులు తమ కోరికలను నంది చెవులో చెబితే ఆయన శివునికి చేరవేస్తాడు  అనేది నానుడి. ఒకరకంగా చెప్పాలంటే నంది తన భక్తితో శివునిలో సగమైపోయాడా  అనిపిస్తుంది . ఆయనకు అంతటి విలువనిచ్చాడు  శివుడు .

వాస్తవానికి  ఇందులో  జ్ఞాన యుక్తు  సూక్ష్మం గ్రహిస్తే , శివుని ని పారవశ్యంతో  పూజించే  ప్రతి భక్తుడు  ఒక  నంది . ఇదే సత్యం. 

  

• ఇదంతా రాయించేది శివుడు అయినప్పటికీ రాస్తున్నది వృషభరాశి లోని చంద్ర కాంత రోహిణి లో జన్మించిన ఒక వృషభం.


ఓం శాంతి 

ఓం నమఃశివాయ 🙏 

యడ్ల శ్రీనివాసరావు 22 Feb 2026 9:00 PM.


No comments:

Post a Comment

724. వృషభం - శివం

  వృషభం - శివం • శివుని ధ్యానించడం లో అత్యంత ప్రీతికరమైన విషయం ఏమిటంటే   ప్రకృతి మరియు పశు పక్షాదుల సమజీవన సమతుల్యత నిండి ఉండటం. మనం శివుని ...