చిత్రగుప్తుడు ఎవరు ?
• మనం కొన్ని విషయాలు, కధలు గా వినినప్పుడు, చిత్రాల ద్వారా చూసినప్పుడు , సినిమాల లో సన్నివేశాలు గా చూసినప్పుడు మనలో ఎంతగా ముద్రించబడతాయి అంటే, వాటి ప్రభావం మనలో చాలా బలంగా కనిపిస్తుంది . అందులో భయమో లేక ఇష్టమో ఏదైనా కావచ్చు . కారణం కనిపించక పోయినా మనం వాటిని దృఢం గా నమ్ముతాం , ఆ నమ్మకం లోనే జీవిస్తూ ఉంటాం. ఈ నమ్మకం లో ముమ్మాటికీ కొన్ని సార్లు మంచి దాగి ఉండవచ్చు. కానీ అది సత్యమా, అసత్యమా అని కూడా ఆలోచించే జ్ఞానం మన స్పృహ ఈనాడు కోల్పోయింది . ఎందుకంటే ఎన్నో జన్మలు గా నమ్మకాల పైనే ఆధారపడి మన జీవితం గడుస్తుంది. ఈ నమ్మకాలను ఏనాడూ తర్కించి , అందులో వాస్తవాన్ని , మూలాన్ని తెలుసుకోవాలి అనే జిజ్ఞాస లేకపోవడం వలన వాటిని గుడ్డిగా నమ్ముతాం, ఆచరిస్తూ ఉంటాం .
• మనం ఈ రచన లో చిత్రగుప్తుడు ఎవరు అనే విషయం గురించి విశ్లేషణాత్మకంగా తెలుసుకుందాం.
• మనిషి చేసే పాపపుణ్యాలు , కర్మలు అన్నీ యమధర్మరాజు వద్ద ఉండే చిత్రగుప్తుడు ప్రతి క్షణం భవిష్యవాణి అనే పుస్తకం లో రాస్తూనే ఉంటాడని మనుషులు నమ్ముతూ ఉంటారు . ఈ విషయం శాస్త్రాల కధలలో , సినిమాలలో , చిత్రాల ద్వారా చూపిస్తారు.
అసలు ఇది వాస్తవమేనా ? ఈ చిత్రగుప్తుడు ఏ లోకం లో నివసిస్తాడు ? ప్రతీ సెకను , ప్రతీ నిమిషం ఈ విశ్వం లోని అందరి పాపపుణ్యాల ను చిత్ర గుప్తుడు ఎలా రాస్తుంటాడు ? ఇది ఎలా సాధ్యం ? ఈ చిత్రగుప్తుడు మానవ రూపంలో నే ఉంటాడా ? యమధర్మరాజు ఎవరు ? అని ఆలోచిస్తే , సందేహాలు ఎన్నో? . . . వెంటాడుతుంటాయి ,
కానీ వీటికి ఆధార భరితమైన అనుభవం తో కూడిన వాస్తవిక నిదర్శనాలు ఎక్కడ లభిస్తాయి ?
• చిత్ర అనగా సంస్కృతం లో నక్షత్రము , ప్రకాశం , ఆత్మ అని అర్దం. ఆత్మ ఒక నక్షత్ర ప్రకాశం.
గుప్త అంటే కంటికి కనిపించనిది , రహస్యమైనది , దాగి ఉన్నది అని అర్థం .
• మనిషి శరీరంలో , ఆత్మ యొక్క స్థానం మన భృకుటి (బొట్టు పెట్టుకునే ప్రదేశం) . అనగా ఆత్మ మన రెండు కను బొమ్మల మధ్య ఉన్న Pineal gland నుంచి మెదడు కి అనుసంధానం అయి (Attach) అయి సూక్ష్మంగా నక్షత్రం వలే గుప్తంగా ఉంటుంది. ప్రకాశవంతమైన ఈ ఆత్మే మన శక్తి కి ఆధారం . ఈ శక్తి తో మనం చేసే ప్రతి పని (కర్మ), మరియు ఆలోచనలు మెదడు ద్వారా నిరంతరం ఆత్మ లో శాశ్వతంగా రికార్డు అవుతూనే ఉంటాయి. ఆత్మ నాశనం లేనిది. శరీరం నాశనం అవుతుంది.
• ఇది గమనిస్తే , మనము శరీరం తో చేసే ప్రతీ చర్య మనకు మనమే మన ఆత్మ లో రికార్డ్ చేసుకుంటాం (రాసుకుంటాం) . మనకు మనమే చిత్రగుప్తులం. ప్రత్యేకించి చిత్రగుప్తుడు అంటూ ఎవరూ లేరు .
• మనల్ని సృష్టించిన సృష్టికర్త , విశ్వ శక్తి అయినటువంటి భగవంతుడే ఈ విధి విధానాన్ని రూప కల్పన చేసింది .
ఇక్కడ ఒక సందేహం రావచ్చు . . . అసలు భగవంతుడు కనిపించకుండా, ఇదంతా ఎలా చేస్తాడు , అని. అందుకు మంచి ఉదాహరణ, ఒక సెల్ ఫోన్ ను ఎవరో ఒక మనిషి ద్వారా ఎక్కడో ఒక దేశం లో తయారై ఆ ఫోన్ ప్రపంచ వ్యాప్తంగా చలామణి అవుతుంది. అది మాట్లాడానికి , వినడానికి , వినోదానికి , ఫోటోలు తీయడానికి, మెమోరీ లో రికార్డు చేయడానికి ఉపయోగపడుతుంది . అదే విధంగా పరమాత్మ, ఆత్మ ను ఎన్నో విశేషాలతో సృష్టించాడు. అవే నేడు మన ఆత్మ చేస్తుంది.
• మన శక్తి తో చేసిన కర్మలను బట్టి ఫలితాలను , కాలగమనంలో కాస్త ముందు వెనుకగా విశ్వశక్తి మనకు తిరిగి ఫలం ఇవ్వడం జరుగుతుంది. కొన్ని సార్లు జన్మల అనంతరం కూడా తిరిగి కర్మ ఫలితాలు పొందుతాం. అవి పాపం చేస్తే దుఃఖం, పుణ్యం చేస్తే సుఖం .
• ఈ విషయాన్ని గమనిస్తే మనం శరీరం తో చేసే ప్రతీ పని, మనసుతో చేసే ప్రతి సూక్ష్మమైన ఆలోచన , ఆత్మ లో రికార్డు అవుతాయి. మన తలరాతను మనమే రాసుకుంటున్నాం . మనకు మనమే చిత్రగుప్తులం . . . చిత్ర విచిత్ర గుప్తులం .
“చిత్రగుప్తుడు” అనే పదంలో ఇమిడి ఉన్న అర్దం ఆత్మ గుప్తం . ఇదే సత్యమైన చిత్రమైన చిత్రగుప్తుని జ్ఞాన యుక్త రహస్యం.
• ఎవరూ మనల్ని చూడడం లేదు కదా అని ధర్మ విరుద్ధమైన కర్మలు చేయడం, అసత్యాలు అలవోకగా ఆడడం, ఇతరుల గురించి వ్యర్థ విషయాలు చర్చించడం, రహస్యం గా కామవికారాలతో చెలరేగి పోవడం వంటి దుశ్చర్యలకు పాల్పడితే , ప్రతి ఫలంగా శిక్షలు మనకు మనమే వేసుకుంటాం. ఎందుకంటే త్రి నేత్రం అనే నిఘా కెమెరా లో మనం ఊపిరి తీసుకున్నప్పటి నుంచి ఉన్నాం .
ఓం శాంతి 🙏
ఓం నమఃశివాయ 🙏
Mount Abu ✍️
యడ్ల శ్రీనివాసరావు 11 Feb 2026 , 9:00 PM.


No comments:
Post a Comment