Friday, November 13, 2026

806. మౌనంగా అందరినీ వదిలేయండి-4

 

మౌనంగా అందరినీ వదిలేయండి

(నాల్గవ భాగం)


దయచేసి . . .  మొదటి మూడు భాగాలు     (803 ,804 ,805 ) చదివిన తరువాత మాత్రమే ఈ రచన చదువగలగరు 🙏


 

ఇప్పుడు దీన్ని లోతుగా అర్థం చేసుకోండి. 

వదిలేయడం అంటే ఎప్పుడూ కేవలం జనాలను వదిలేయడం కాదు . కొన్నిసార్లు సోమరితనాన్ని వదిలి పెట్టాల్సి వస్తుంది. కొన్నిసార్లు పనులను వాయిదా వేయడాన్ని వదిలి పెట్టాల్సి వస్తుంది. ఎల్లప్పుడూ మొబైల్ లో మునిగిపోవడాన్ని , ఎల్లప్పుడూ దుఃఖిస్తూ ఉండడాన్ని మరియు మీ పాత గుర్తింపును వదిలి పెట్టాల్సి వస్తుంది.

అందువల్ల మౌనంగా అందరిని వెనక్కి వదిలేయి అనే ఈ వాక్యాన్ని అర్థం చేసుకోండి.


ఈ అందరిలోనూ మిమ్మల్ని కిందికి లాగే ఆ చెడ్డ అలవాట్లన్నీ కలిసి ఉంటాయి. మీకు ఒక విషయం తెలుసా , మీ అత్యంత మూల్యమైన ఆస్తి డబ్బు కాదు మీ సమయం .

నేటి నుండి మీ సమయాన్ని పవిత్రమైనదిగా పరిగణించండి. మీరు దాన్ని ఎవరికి ఇస్తున్నారు అనే దానిపై అప్రమత్తంగా ఉండండి. ప్రతి ఒక్కరితో  సంభాషణ మీకు అవసరం అవదు . ప్రతి ఒక్క వాదన విలువైనది కాదు , అలాగే ప్రతి బంధాన్ని కాపాడుకోవాలనే నియమం కూడా లేదు. మీ కలలకు కేటాయించాల్సిన సమయాన్ని మీరు , పనికి రాని జనాల కోసం గడుపుతుంటే , మీరు మీ భవిష్యత్తునే తాకట్టు పెడుతున్నారని అర్థం.


ఎప్పుడూ అందరితోనూ ఉండాలనుకునే వాడు తనను తాను ఎలా కనుగొనగలడు ? జనాల గందరగోళం , అల్లరి మరియు నకిలీ సంబంధాల నుండి మీరు కొద్దిగా దూరం జరిగినప్పుడు మాత్రమే మీరు మొదటిసారి మీ నిజమైన శక్తిని అనుభవిస్తారు.


కానీ జాగ్రత్త ,  మీరు ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక కష్టమైన దశ ఎదురవుతుంది. ప్రారంభంలో మీకు కొద్దిగా నొప్పి   బాధ , మీలో మీకు పెనుగులాట అనిపించవచ్చు. మీరు వదిలి వచ్చిన కొందరు వ్యక్తులు గుర్తుకు రావచ్చు. కొన్ని రాత్రులు భారంగా అనిపించవచ్చు. కొన్ని రోజులు ఖాళీ గా శూన్యం గా కనిపించవచ్చు. కానీ దయచేసి ఓపిక పట్టండి . ఇది ,  పాత చెడ్డ అలవాటును వదిలేటప్పుడు వచ్చే తపనే తప్ప మీ ఓటమి కాదు. శరీరంలో నుండి విషం బయటకు వెళ్లేటప్పుడు ఎలాగైతే అస్వస్థత  కలుగుతుందో ,  అలాగే మనం ఎంచుకున్న తప్పుడు వ్యక్తుల సంబంధాలు విరిగిపోయేటప్పుడు మనసు చంచలం అవుతుంది.


కానీ  , ఆ అశాంతి తర్వాతే అద్భుతమైన శాంతి దొరుకుతుంది.  ఆ దూరం తర్వాత నిజమైన శక్తి వస్తుంది. నియమబద్ధంగా మీ మనసు తేలిక అవుతుందని మీరే గమనిస్తారు. నిద్ర మెరుగవుతుంది. మీ లక్ష్యాలు మళ్ళీ గుర్తుకొస్తాయి. ఎందుకంటే చాలాసార్లు మానసిక  అనారోగ్యానికి కారణం మన జీవితం కాదు మనం చేరిన తప్పుడు సాంగత్యాలే .


మీరు ఎవరికీ శిక్ష వేయాల్సిన అవసరం లేదు. కేవలం మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. ఎవరికీ చెడు కోరకండి , కేవలం వారి నుండి దూరం పాటించండి . అపరిపక్వమైన వ్యక్తి ప్రతీకారం తీర్చుకుంటాడు. కానీ పరిపక్వమైన వ్యక్తి నిశ్చలంగా ముందుకు సాగుతాడు.

ఒకరోజు అదే జనాలు వచ్చి నువ్వు ఇంతగా ఎలా మారావు అని అడుగుతారు. అప్పుడు మీరు కేవలం మౌనం తో   ఒక చిరునవ్వు  నవ్వండి చాలు , పొడవాటి సమాధానం ఇవ్వకండి. మార్పు యొక్క చరిత్ర మాటలలో ఉండకూడదు ,  మీ వ్యక్తిత్వంలో కనిపించాలి . మీ కంటి చూపులోని శాంతే దానికి సమాధానం అవుతుంది. మీ విజయమే మీ అతి పెద్ద సమాధానం అవుతుంది. 


అందువల్ల ఎవరైతే మిమ్మల్ని వదిలి వెళ్ళారో అని దుఃఖించకండి. బదులుగా మీ జీవితంలో ఎవరెవరు స్పష్టమయ్యారో అని సంతోషించండి.

ఎవరైతే మిమ్మల్ని అర్థం చేసుకోలేదో అని బాధపడకండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి సమయం దొరికిందని సంబరపడండి.


ఇప్పుడు నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ఇప్పటి నుండి మీ కొత్త కథను , ఆత్మ కధను రాయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఈనాడే ఈ దృఢమైన నిర్ణయాన్ని తీసుకోండి. నేను ఎవరికీ అతుక్కుని బ్రతకను నా నెమ్మదిని అమ్మి ఎవరి సాంగత్యాన్ని కొనుగోలు చేయను. నా ఆత్మగౌరవాన్ని కోల్పోయి ఏ బంధాన్ని కాపాడుకోను. భయంతో ఎవరిని పట్టుకొని ఉంచను. నేను ఒంటరిగా నడవడానికి నేర్చుకుంటాను. నేను నన్ను నేను ఎంచుకుంటాను. 

మీరు మిమ్మల్ని మీరు ఎంచుకోవడం ప్రారంభించినప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. జీవితం మిమ్మల్ని ఎంచుకోవడం ప్రారంభిస్తుంది. అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. సరైన జనాలు మీ వైపు ఆకర్షితులు అవుతారు. మీరు అడగకుండానే గౌరవం దొరుకుతుంది. మరియు అత్యంత అందమైన విషయం ఏమిటంటే మీరు ఇకపై ఎవరి వెనక పరిగెత్తాల్సిన అవసరమే ఉండదు. 


ఎందుకంటే మిమ్మల్ని మీరు కనుగొన్నవాడు సగం ప్రపంచాన్ని గెలిచినట్టే మిగిలిన సగం ప్రపంచం సమయం వచ్చినప్పుడు వాటంతటా అదే మీ దగ్గరకు వస్తుంది. 

మనిషి తనతో తాను అనుసంధానం (కనెక్ట్) అయినప్పుడు జీవితం అతనికి వ్యతిరేకంగా ఉండదు. బదులుగా అతని పక్షాన ప్రవహించడం ప్రారంభిస్తుంది.

కానీ ఇక్కడ జాగ్రత్తగా ఉండండి . . .

దూరం వెళ్ళిన తర్వాత కూడా చాలామంది జనాలు ఒక పెద్ద తప్పు చేస్తారు. అదేమిటో తెలుసా , వారు జనాల నుండి దూరమవుతారు కానీ బాధకి , నొప్పి కి అతుక్కుపోయి ఉంటారు. వారు సంబంధాన్ని ముగిస్తారు కానీ మనసులో పాత కథ నడుస్తూనే ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి ఇటువంటిది కేవలం సగం సగం వదిలివేయడం మాత్రమే . . . 

పూర్తిగా వదిలివేయడం అంటే మీరు ఆ వ్యక్తి నుండి మాత్రమే కాదు ఆ వ్యక్తి ఇచ్చిన నొప్పి నుండి కూడా ముక్తులు కావడం . మీకు నొప్పి ఇచ్చిన వారికి ప్రతిరోజు మీ మనసులో చోటు ఇవ్వడం ఆపేయండి.

మీ విలువ తెలియని వారిని మీ ఆలోచనలలో కేంద్రంగా చేయకండి. జనాలు బయటి నుండి ఎంత హాని చేస్తారో , అంతకంటే ఎక్కువ హాని మనం వారికి మన మనసు లో చోటు ఇవ్వడం ద్వారా చేసుకుంటాము. కాబట్టి కేవలం బయటి దూరమే కాదు లోపల నుండి కూడా వారిని తుడిచివేయడం అత్యంత అవసరం.


ప్రపంచంలోనే అతి పెద్ద జైలు ఏదో తెలుసా. అది ఇనుప ఊసలతో చేసింది కాదు , బదులుగా మీ సొంత ఆలోచనలతో చేయబడినది. ఇప్పుడు మీ మనసును శుభ్రపరచడం ప్రారంభించండి. పాత విషయాలను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడం ఆపేయండి.

ప్రతిరాత్రి అదే దృశ్యాన్ని గుర్తు చేసుకోవడం ప్రతి ఉదయం అదే వ్యక్తి గురించి ఆలోచిస్తూ లేవడం దయచేసి ఆపేయండి. ఈ అలవాటు మిమ్మల్ని మీ గతానికి ఖైదీగా మారుస్తుంది. మీరు నిజమైన జైలులో లేరు కానీ మీ మనసు బంధీ అయింది.

గుర్తుంచుకోండి . . . 

జైలు తలుపు తెరచే ఉంది. మీరు కేవలం బయటకు అడుగు పెట్టడమే ఆలస్యం. 

మీరు తీర్చుకున్న అతి పెద్ద ప్రతీకారం ఏమిటో తెలుసా? అది మీ శాంతి. 

అతి పెద్ద గెలుపు ఏమిటి?   మీ అభివృద్ధి. 

మరియు 

అత్యంత అందమైన సమాధానం ఏమిటి? మీ ముఖంపై ఉండే చిరునవ్వు. 

ఎవరైనా మిమ్మల్ని పడగొట్టడానికి  ప్రయత్నం  చేసినపుడు , మీరు ఇంకా ఎత్తుకు ఎదిగితే అదే వారికి అతి పెద్ద సమాధానం.

ఎవరైనా మిమ్మల్ని విచ్చిన్నం చేయాలనుకుంటే , మీరు మరింత గట్టిగా మారితే అదే అతి పెద్ద గెలుపు , ఎవరైనా మిమ్మల్ని ఏడిపిస్తే మీరు జీవితానికి కృతజ్ఞతలు చెప్పడం నేర్చుకుంటే. అదే వారికి ఇచ్చే సరైన సమాధానం . 


ఇప్పుడు మీ రోజుకు ఒక కొత్త దిశను ఇవ్వండి. ఉదయం లేచి మీ శరీరం మనసు మరియు ఆత్మను మేల్కొల్పండి. కొద్దిగా నడవండి , కొద్దిగా చదవండి , కొద్దిగా ధ్యానం చేయండి , కొద్దిగా మీ ఆలోచనల ను పుస్తకం లో రాయండి. ప్రతిరోజు మిమ్మల్ని మీరు శాతంలో ఒక శాతం మెరుగుపరుచుకోండి.


జనాలు రాత్రికి రాత్రే అద్భుతాలను ఆశిస్తారు. కానీ అద్భుతాలు ప్రతిరోజు చేసే , చిన్న క్రమశిక్షణ ద్వారా సృష్టించబడతాయి. కొండలు ఒక్కసారిగా లేవవు. భూమి నిదానంగా పైకి లేస్తుంది.


ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీ మొత్తం జీవిత దృక్పదాన్నే మార్చివేయవచ్చు.


మౌనంగా అందరినీ వెనక్కి వదిలేయి అనేదానికి , మరో అర్థం ఏమిటంటే ఇతరులతో మిమ్మల్ని మీరు పోల్చుకోవడం మానేయండి. వేరే వాళ్ళ హోదా చూసి దుఃఖ పడకండి. వేరేవాళ్ళ విజయం చూసి విరిగిపోకండి. ఎవరి పెళ్లి , ఎవరి ఉద్యోగం , ఇంకెవరి కీర్తిని చూసి మిమ్మల్ని మీరు చులకనగా అంచనా వేసుకోకండి. 

మీరు వేరే వాళ్ళ కథలోని పేజీలలో బ్రతకడం లేదు. మీ పుస్తకమే వేరు , మీ అధ్యాయమే వేరు మరియు మీ సమయమే వేరు . పోలిక అనేది ఎలాంటి శబ్దం లేకుండా మనుషుల ఆత్మవిశ్వాసాన్ని చంపేసే ఒక భయంకరమైన విషం.


గుర్తుంచుకోండి . . . 

ఈరోజు ఎవరైతే అందరికంటే వెనక ఉన్నారో వారే రేపు అందరికంటే ముందుకు రావచ్చు. జీవితం అనేది ఒక నేలసారమైన రేఖ కాదు ప్రతి మలుపులోనూ ఒక కొత్త అవకాశాన్ని దాచుకున్న ఒక అద్భుతమైన ప్రయాణం .


అనుభవాల  రాతలు 

తలరాతను  తిరిగి  రాస్తాయి.


ఒంటరిగా  ఉండడం  అంటే ఏకాకితనం కాదు . . మనతో మనం గడపడానికి  దొరికిన  అరుదైన అవకాశం.


సమాప్తం 🙏


ఓం శాంతి .

ఓం నమఃశివాయ 🙏 

యడ్ల శ్రీనివాసరావు. 10 Nov 2026 10:00 AM. 

No comments:

Post a Comment

806. మౌనంగా అందరినీ వదిలేయండి-4

  మౌనంగా అందరినీ వదిలేయండి (నాల్గవ భాగం) దయచేసి . . .  మొదటి మూడు భాగాలు     (803 ,804 ,805 ) చదివిన తరువాత మాత్రమే ఈ రచన చదువగలగరు 🙏   ఇ...