Sunday, November 8, 2026

802. దీపం

 

 దీపం 


దీపం చీకటి ని పారద్రోలుతుంది . వెలుగు నింపుతుంది . ఆ వెలుగు ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఇల్లు చీకటిగా ఉన్నప్పుడు అంతా అంధకారం అనిపిస్తుంది . కానీ అదే ఇంటిలో దీపం వెలిగితే ఎంతో  వెలుగుతో స్పష్టంగా అన్నీ కనిపిస్తాయి .  

ఇంటిలో ఎదురుగా కనిపిస్తున్న మట్టి ప్రమిద దీపం నిత్యం వెలిగిస్తూ నే ఉంటాం . వాస్తవం అర్దం చేసుకో గలిగితే  మట్టి లో  నుంచి  తయారయిన  మానవుని  దేహం కూడా ఒక ఇల్లే .    మరి  నేడు మనిషి   తన  దేహం లో   ఉన్న  దీపం  ప్రతి రోజూ వెలిగిస్తున్నాడా ? ఇప్పటికే మనిషి శరీరంలో దీపం ఉంది.  అందుకే నొసట ఉన్న ఆ దీపానికి రోజు బొట్టు పెడుతూ ఉంటాడు  కానీ వెలిగించడు. అందుకే ఆ దీపం శరీరం లోపలి ఉండి నిద్రాణమైన స్థితి లో ఉంది. అందుకే మనిషి అజ్ఞాన అంధకారంలో  నేడు ఉన్నాడు. చీకటి వంటి దుఃఖం మనసు లో అనుభవిస్తూ ఉన్నాడు. పాపపుణ్యాల భేదం ఎరుగక జీవిస్తున్నాడు.  జ్ఞానమే సిరిసంపదలు అని  మాయ వలన  తెలియక , కరెన్సీ ధనమే అసలు సిసలైన ధనం అనుకొని  జీవిస్తున్నాడు. అవసరానికి మించిన ధనం పెరిగి పెరిగి చివరికి  మనిషి ని దుఃఖం లోకి నెడుతుంది అనే విషయం జీవితపు ఆఖరి క్షణం వరకు తెలియక నరకం తో జీవిస్తున్నాడు.  


మనిషి లో ఉన్న దీపం ఆత్మ. కానీ ఈ ఆత్మ అనేక జన్మలు గా శరీరాలు ధరిస్తూ జనన మరణాలు పొందుతూ ఉండడం వలన తన శక్తిని క్రమేపీ కోల్పోతూ చైతన్యం లేక నేటి మాయా కాలం లో పూర్తి నిద్రావస్థలో ఉంది. మనిషి లో ఉన్న దీపం (ఆత్మ) వెలిగిన నాడు జ్ఞాన ప్రకాశం నిండుతుంది . మనిషి లో ఉన్న అజ్ఞానం మూర్ఖత్వం అంధకారం దుఃఖం సమూలంగా పోయి ప్రకాశవంతమైన వెలుగుతో శాంతి , సుఖం , ఆనందం , ప్రేమ , జ్ఞానం, శక్తి పుష్కలంగా నిండుతుంది . మనిషి ఇవి సంపాదించు కున్న నాడు దేవత గా మారుతాడు . అందుకే "నరుడే నారాయణుడు గా"  అవుతాడు అన్నారు . 


నరకాసురుడు అనే రాక్షసుడిని సత్య భామ సంహరించింది అని , అందుకు చిహ్నం గా దీపావళి చేసుకోవడం జరుగుతుంది. ఇది కధ గా చదువుకున్నాం. 

 నరకాసురుడు “ నరక + అసురుడు “ .

 మానవుడు నరకం అనుభవించడానికి కారణమైన అసుర గుణాలు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు , ఈర్ష్య , అసూయలు. 

ఈ అసుర గుణాలను 

“సత్య భామ” సత్య(జ్ఞానము)+ భామ(శక్తి) 

అనగా జ్ఞానము అనే శక్తి తో రాక్షస గుణాలను నిర్మూలించుకోవడం వలన చైతన్యం వెలుగు ఆత్మలో నిండుతుంది . నిత్యానందం లభిస్తుంది. ఇదే దీపావళి పండుగ అర్దం.


దీపావళి ఒక్క రోజున ఇంటిలో దీపాలు వెలిగిస్తే ఎంతో కళకళలాడుతూ ఉంటుంది. అదే విధంగా మనిషి తన లోని ఆత్మ జ్యోతి ని , పరమాత్మ శివుని జ్ఞానము మరియు ధ్యానము ద్వారా నిత్యం వెలిగించు కోవడం వలన మనిషి ఆత్మ , మనసు అఖండ జ్యోతి వలే నిత్యం ఆనందం తో నిండి పోతుంది. ఎంతటి సమస్య అయినా గడ్డి పోచ వలే తొలగిపోతుంది. 

దీపావళి తర్వాత రోజు  కార్తీక మాసం ఆరంభం అవుతుంది. కార్తీక మాసం  శివుని కి ఇష్టం అని అంటారు. భక్తి శ్రద్ధలతో తెల్లవారుజామున 4 గంటల నుంచి పూజలు చేస్తారు, రోజూ దీపాలు వెలిగిస్తారు. దీని వలన పొందగలిగే ఫలితం అల్ప కాలికం మాత్రమే. 

ప్రతీరోజూ తెల్లవారుజామున 4 గంటల కు , మానవుడు నిద్ర లేచి తన లోని ఆత్మ జ్యోతి ని మౌనం తో ధ్యానం ద్వారా వెలిగించిన నాడు ,  పరమాత్మ తో పాటు కలిసి సమానంగా అడుగులు వేసే అవకాశం  లభిస్తుంది. చేసిన పూజలకు , భక్తి శ్రద్ధలకు ఫలితం గా శివుడు తన జ్ఞానాన్ని సద్గురువై నింపుతాడు. తనతో సమానంగా చేయి పట్టి నడిపిస్తాడు.

శివుడు జ్యోతిర్లింగ బిందువు . జ్ఞాన స్వరూపం .

 🪔దీపావళి శుభాకాంక్షలు 🪔


ఓం శాంతి 🙏 

శివ బాబా (శివుడే తల్లి తండ్రి)

యడ్ల శ్రీనివాసరావు 8 Nov 2026 9:30 PM.

No comments:

Post a Comment

802. దీపం

   దీపం  దీపం చీకటి ని పారద్రోలుతుంది . వెలుగు నింపుతుంది . ఆ వెలుగు ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఇల్లు చీకటిగా ఉన్నప్పుడు అంతా అంధకారం ...