Wednesday, June 18, 2025

642. అవశేష కర్మ

 

అవశేష కర్మ




• అది 1980 ల కాలం. ఒక చిన్న పట్టణం. ఆ ఊరిలో వీధులు అన్నీ కూడా మట్టి వీధులు . సమయం రాత్రి 10 గంటలు కావస్తోంది. చిన్న బల్బు కాంతితో వీధి దీపాలు వెలుగుతూ , ఆ వీధి అంతా నిర్మానుష్యంగా ఉంది. కొందరు ఇళ్ళలో నిద్ర పోతూ ఉన్నారు. మరి కొందరు మాత్రం తలుపులు వేసుకుంటూ నిద్రకు ఉపక్రమిస్తున్నారు . వీధి కుక్కలు అక్కడక్కడా పడుకొని ఉన్నాయి. అంతా నిశ్శబ్దంగా ఉంది.

• కానీ దూరంగా ఒక ఇంటి లో రేడియో నుంచి “ఇది మల్లెల వేళ యని”  అనే పాట వినిపిస్తుంది. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ వీధిలో ఒంటరిగా నడుస్తూ వస్తున్నాను. చల్లని గాలి తో , ఆ సమయంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. 

కానీ మనసు మాత్రం చాలా చాలా భారం గా అనిపిస్తుంది. అది ఎంత భారం అంటే , అది నాకు అర్ధం కావడం లేదు, నా కళ్లు చాలా ఆత్రుతగా దేని కోసమో వెతుకుతున్నాయి. ఒక వైపు మనసు లో ఏదో దిగులు బలం గా ఉంది.


• అలా ఆ వీధిలో నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి, ఒక పాత డాబా ఇల్లు వద్ధ ఆగాను. ఆ ఇంటి చుట్టూ తక్కువ ఎత్తులో ప్రహరీ గోడ ఉంది. ఆ ప్రహరీ లోపల చుట్టూ చాలా ఖాళీ స్థలం ,  విశాలమైన అరుగు ను ఆనుకొని సింహ ద్వార గుమ్మం  మరియు  ఒక గది ఉన్నాయి.   అక్కడ నుంచి ఎదురుగా వీధిలోకి చిన్న ఇనుప గేటు ప్రహరీ గోడ తో కలిపి ఉంది.



• ఒక నిమిషం అక్కడ ఆగి, ఇంటి వైపు తదేకంగా చూశాను.

• ఇంటి ప్రహరీ లోపల అరుగు మీద బల్బు వెలుగుతుంది. అరుగు ని ఆనుకొని పక్కనే ఉన్న గది లో నుంచి ట్యూబ్ లైట్ వెలుగుతూ , కిటికీ వెంటి లేటర్ లో నుంచి బయటకు కాంతి వస్తుంది .

• ఆగలేక . . . . నెమ్మదిగా శబ్దం రాకుండా చిన్న ఇనుప గేటు తీసి లోపలికి అడుగు వేశాను . రేడియో లో దూరం నుంచి ఆ పాట ఇంకా వినిపిస్తూ నే ఉంది.

• ప్రహరీ  గేటు  నుంచి  అరుగు కి  మధ్య ఉన్న ఖాళీ స్థలంలో , ఇంటి చుట్టూ రక రకాల పూల మొక్కలు ఉన్నాయి.  ఆ పూల మొక్కల మధ్య న  సన్నగా సిమెంట్ బాట వేసి ఉంది . పూల మొక్కల పరిమళం తగలగానే , నా గుండె మరింత వేగంగా కొట్టుకోవడం మొదలైంది.

• అది నా ఇల్లు కాదు. ఎవరి ఇల్లో కూడా తెలియదు,  అర్దం కావడం లేదు.  సమయం రాత్రి పది గంటలు దాటింది. ఆ సమయంలో ఆ ప్రదేశంలో అలా నిలబడి ఉన్నందుకు ఒకవైపు భయం,  మరోవైపు తెలియని బాధ విపరీతంగా లోపల నుంచి వస్తుంది . కానీ అక్కడ నుంచి కదలలేక నిలబడి పోయాను .


• ఒక నిమిషం తరువాత చూస్తే , అరుగు ని ఆనుకొని ట్యూబ్ లైట్ వెలుగుతున్న గది కి , పాత కాలం నాటి అలికిన (dazzle ) గాజు కిటికీ అద్దం నుంచి ఒక స్త్రీ , పురుషుడు కనిపించారు. కిటికీ వేసి ఉండడం వలన వారు స్పష్టంగా కనపడ లేదు . ఆ గది లో నుంచి వారి మాటలు అస్పష్టంగా వినిపిస్తున్నాయి. ఆ గదిలో ఉన్న స్త్రీ చేతి గాజుల శబ్దం, కాలి పట్టీల శబ్దం బయటకు వినిపిస్తోంది.

• కిటికీ బయట, పూల మొక్కల మధ్య లో నిలబడి ఉన్న నాలో దుఃఖం అమాంతంగా పెరిగింది . కళ్లల్లో నుంచి నీళ్లు వచ్చేస్తున్నాయి. శరీరం మనసు చాలా భారం గా అయిపోయాయి . ఆ స్థితి భరించ లేకుండా ఉంది.


• ఒక రెండు నిమిషాలు తరువాత, గది లో ట్యూబ్ లైట్ ఆఫ్ అయిపోయింది. అరుగు మీద  బల్బు లైట్ మాత్రం వెలుగుతోంది. బయట చంద్రుని వెన్నెల నిండుగా ఉంది. 

ఒక అర నిమిషం తరువాత, వీధి గుమ్మం తలుపులు తెరుస్తున్న శబ్దంతో పాటు, అంతకు ముందు విన్న గాజులు, పట్టీల శబ్దం వినిపించింది . . . లోపల ఉన్న , ఆ  స్త్రీ అరుగు మీద కి వచ్చారని  గమనించి నేను ఒక్కసారి గా  కంగారుగా, ఎవరైనా నన్ను చూస్తారని పూల మొక్కల మధ్య ఉన్న సిమెంట్ బాట లో నడుచుకుంటూ ఇంటి ప్రహరీ లోపలనే మరోదిశ   వైపు కి వేగం గా కదిలాను .


• వెనుక నుంచి, నా భుజం పై ‌ చిన్నగా గాజుల శబ్దం తో ఒక చేయి పడింది. తిరిగి చూశాను. ఆమె చాలా అందంగా ఉంది. తేజస్సు తో ఉంది. ఆమె నాకు బాగా తెలిసిన మనిషి లా అనిపిస్తుంది , కానీ  పేరు గుర్తుకు రావడం లేదు . ఆమె ఎవరో అర్దం కావడం లేదు.

 
  నేను కంగారు పడడం చూసి, నా చెయ్యి పట్టుకుంది . . . ఆమె ముందు గా మాట్లాడింది.

 ఆమె :  ఏ , నా కోసం వచ్చి ... ఎందుకు అంత కంగారుగా వెళ్లి పోతున్నావు.

  నేను : తల దించుకుని ముభావంగా ... ఏం లేదు . . . ఈ దారి వెంట వెళుతూ , పొరపాటు న ఇలా వచ్చేశాను ... నీళ్లు నములు తున్నాను.

  (నాకు ఆమె బాగా తెలుసు , కానీ పేరు గుర్తుకు రావడం లేదు. కానీ ఆమె ఎవరో తెలియడం లేదు. గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం లోపల విపరీతంగా చేస్తున్నాను)

  ఆమె :  పర్వాలేదు . . . కంగారు పడకు, ఆయన నిద్ర పోతున్నారు.

  నేను :  లేదు . . . నేను వెళ్లి పోవాలి. ఇక్కడికి ఎలా వచ్చానో తెలియదు.  

  (అంత చల్లదనం లో కూడా నా ఒళ్లంతా చెమటలు పట్టేసాయి).

  ఆమె : మరి , ఎందుకు నన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చావు. నాకు పెళ్లయి నెల రోజులు కూడా కాలేదు . . .  నువ్వు నాతో చెప్పకపోతే  నాకు ఏమీ  తెలియదు అనుకుంటున్నావా,  నువ్వు నన్ను ఎంత ప్రేమించావు ,  ఎంత ఇష్టపడ్డావు . . .  కానీ నన్ను ఇలా ఎందుకు వదిలేశావు . . . చెప్పు .
కొంత సేపటి క్రితం, నుంచి నాకు కావలసినది ఏదో బయట ఉండి పోయింది అని పదే పదే మనసు లో అనిపిస్తూ ఉంటే, చూద్దామని తలుపులు తెరిచి బయటికి వచ్చాను. లేకపోతే అసలు ఈ సమయంలో ఇలా బయటికి రాను . . . 



ఆమె నా చెయ్యి పట్టుకొని, పక్కనే ఉన్న గడ్డి లో కూర్చోపెట్టి, తన చీర కొంగు తో నా నుదిటి పైన చెమటను తుడుస్తూ ఉంది. మరో చెయ్యి , నా భుజం మీద ఉంచి మాట్లాడుతూ ఉంది.

 (అదంతా నాకు కావలసినది, దక్కాల్సిన ప్రేమ అని నాకు  లో  లోపల అనిపిస్తుంది.)

• అవును . . . ఆమె గుర్తు చేస్తూ చెపుతుంటే , అప్పుడు నాకు గుర్తుకు వచ్చింది, నేను ఆమెను చాలా ఇష్ట పడ్డాను, ప్రేమించాను, కానీ ఎప్పుడూ చెప్పలేదు . . .  ఆమె నాకు బాగా తెలుసు, కానీ ఆమె పేరు గుర్తుకు రావడం లేదు.  ఆమె ఎవరో అర్దం కావడం లేదు.

ఆమె తన నుదుటి ని,  నా నుదిటి పై ఆన్చి,   “నా పెళ్లి అయిన తరువాత నేను ఎలా ఉన్నానో అని,  నా మీద ఉన్న  ప్రేమను చంపుకో లేక నన్ను చూడాలని వచ్చావా “ అని గట్టిగా ఏడుస్తుంది. ఆమె కన్నీళ్లు, నా ముఖం పై నుంచి  నెమ్మదిగా జారుతున్నాయి.


• నా ఒళ్లంతా చెమటలు, శరీరం చాలా భారం గా ఉంది.  నేను విపరీతమైన దుఃఖం తో  బయటకు ఏడుస్తున్నాను. ముఖం , మెడ అంతా తడిసిపోయింది. నన్ను ఇంటిలో వాళ్ళు తట్టి తట్టి లేపారు . శరీరం ఆధీనంలో కి రావడానికి రెండు మూడు నిముషాలు పట్టింది. 

అప్పుడు  సమయం  తెల్లవారుజామున సుమారు 2 గంటలు ,  5 జూన్ 2025.
 
నేను ఎవరు ? ఇక్కడ ఎందుకు ఉన్నాను, అని వారితో అంటున్నాను. నా చుట్టూ ఉన్న ఇంటిలో వారిని గుర్తు పట్టడానికి రెండు నిమిషాలు వరకు సమయం పట్టింది. 

ఆ తర్వాత ఏదో కల వచ్చింది అని వారితో చెప్పాను.

• కానీ, అది నాకు కలలా కనీసం అనిపించడం లేదు, ఎందుకంటే అదంతా నేను పూర్తిగా ఆ సమయంలో అనుభవించాను.

అనుభవం అనేది , సంతోషం అయినా లేక దుఃఖం అయినా  సరే  ఒక భావోద్వేగం గా  ,  శరీరం తద్వారా మనసు ని  ప్రభావితం చేస్తుంది . 

ఇది ప్రస్తుత కాలం , స్థితి కి  సంబంధించినది కాక పోయినా సరే , స్వయానా  నాకు ఏదో కాలం లో సంబందించినది  అని  అనిపించింది . 

సహజం గా  కల అయితే   కొన్ని నిమిషాల తరువాత  పూర్తిగా చెదిరిపోతుంది . అస్పష్టం అయిపోతుంది.  కానీ, ఇది అలా అనిపించ లేదు.


* * * * * * 

• అసలు ఏంటి ఇదంతా,  దైవ చింతన లో ఉన్న సమయంలో,    అకస్మాత్తుగా ఎందుకు ఇలాంటి  అనుభవం కలలో  ఎదురైంది అని మదన  పడుతున్న సమయంలో,   సాయంత్రం ధ్యానం లో వచ్చిన సమాధానం ఏమంటే . . . 


మొదటిది  . . . 
మాయ.  ఆధ్యాత్మిక చింతనలో ,  పరమాత్మ  వైపు ప్రయాణం  చేస్తున్న వారికి , మాయ చాలా బలం గా  ఊహించని విధంగా స్వప్నం లో గాని ,  డైరెక్ట్ గా కానీ  దైవ చింతన న నుంచి  మరల్చడానికి   ఏదొక రూపం లో దాడి  చేస్తుంది .  దీనికి ఆధారం మరుసటి రోజు  భగవంతుని వాక్యంలో లభించింది 



రెండవది  . . .  
జన్మ  అంతరాలలో ఎప్పడో ఎక్కడో  మిగిలి పోయి ఉన్న  పెండింగ్ కర్మ .
పరమాత్మ వైపు పయనం చేస్తున్న మార్గం లో  తప్పని సరిగా  జన్మాంతరాలుగా  మనిషి ఆత్మ  లో   అవశేషాలు గా  అనగా  పూర్తి  కాకుండా  మిగిలి ఉన్న  కోరికలు,  వికర్మలు (పాప కర్మలు) , బంధాల బుణాలు  తప్పని సరిగా తొలగి పోవాలి  లేదా తీరి పోవాలి  లేదా కరిగి పోవాలి.  
అప్పుడు మాత్రమే  ఆత్మ లో శుద్ధి జరిగి   ఏ కోరిక, ఏ వికర్మ  , ఏ  బుణానుబంధం  బుద్ధి లో   లేకుండా పరమాత్మ వైపు పయనం సుగమం అవుతుంది .  ఇది  యోగ శక్తి తో సాధ్యం  అవుతుంది . 

ఇక్కడ  యోగ శక్తి  యెక్క మహ విశేషం ఏమిటంటే,  ఏ కర్మ  భౌతికంగా జరగకుండా  తీరిపోవడం , తొలగి పోవడం. 

 దీనిని  పెండింగ్  కర్మల ఖాతా సమాప్తం జరగడం అంటారు.


జ్యోతిష్య శాస్త్రం ప్రకారం  . . . 


• ఇది   (Saturn)  శని,  (Ketu) శ్రీ కేతువు ల  విశిష్టత తో కూడిన  కలయిక (conjunction scenario) .  


శని అనగా  చేసిన , చేస్తున్న  కర్మల అనుసారం గా  ఫలితం ఇస్తాడు . 

శ్రీ కేతువు   ఆధ్యాత్మికత  జ్ఞానం , భగవంతుని యొక్క వాస్తవ రూపం ప్రత్యక్షం  చేయిస్తాడు .  అప్పటి వరకు  ఉన్న స్థితి నుంచి మోక్షం అనగా విముక్తి ఇస్తాడు. ఇంకా . . . 

శ్రీ కేతువు  గత జన్మల లో  బాగా అనుభవం పొందిన  టాలెంట్స్  (Mastery  Talents )  యొక్క శక్తి  అతి సహజంగా ఇస్తాడు.  మరియు   అనేక జన్మల లో   మిగిలి ఉన్న  పెండింగ్ కర్మల ఖాతా ను    తెలియచేస్తూ తొలగిస్తాడు .  

శని  భౌతికం.  శ్రీ కేతువు  ఆధ్యాత్మికం . వీటి కలయిక  జన్మ జాతక కుండలి లో  ఆశీర్వాద స్థానం లో  ఉన్నప్పుడు మాత్రమే . . .  జీవుని ప్రయాణం భౌతికం లోకం నుంచి  ఆధ్యాత్మిక లోకం వైపు  క్రమేపీ  పూర్తిగా మారుతుంది.  

ఇది ఒక  మార్పు  Transformation ను సూచిస్తుంది  .  ఇది  కర్మ  యోగి  స్థితి  .  అనగా  కర్మ ల పట్ల  యోగి వలే  ఉండడం .  అనగా  ప్రతి కర్మ ఆచరిస్తూనే , వాటితో  మనసు  అనుసంధానం అవకుండా  నిశ్చలంగా  అవడం . 


 ఒక ఆత్మ పరమాత్మ వైపు పయనం అవుతున్న సందర్భంలో Saturn Ketu యొక్క విధి నిర్వహణ అద్బుతం, అత్యద్భుతం. ఇది విశ్వం లోని గుప్త శాస్త్రాలలో రాసి ఉన్న రహస్యం, అదే నేడు ఆధార భూతం.


యడ్ల శ్రీనివాసరావు 6  June 2025, 11:00 PM .


🌹🌹🌹🌹🌹


ఈ అనుభవం రాయడం జరిగింది.  జ్యోతిష శాస్త్రం లో  ఆధారం లభించింది.  కానీ  శివుని  నుంచి ఇంకా  ఏదో  ఆధారం , సమాధానం  అనుభవ పూర్వకం కావాలి అని నా మనసు చాలా  బలం గా కోరుకుంటుంది .

 ఒక  నాలుగు రోజులు తర్వాత,  ఒక తెలిసిన పెద్దాయన (70 సం )  ఫోన్ చేసి,  ద్రాక్షారామంలో   ఆధ్యాత్మిక జ్ఞాన కార్యక్రమం ఉన్నది , వెళ్లాలి అన్నారు .  ఆయనకు  కాలు  ఆపరేషన్ జరిగి ఉండడం చేత  ఆయన కారు  నడపలేక , నా సహాయం కోరారు .  సరే అని జూన్ 9 న వెళ్లాము. 

ఆరోజు  జ్ఞాన కార్యక్రమం లో , అక్కడ  ఒక గురువు గారు వినిపిస్తున్న అంశం తాలుకా  పేరు  ఏంటంటే 

 " పాత కర్మల ఖాతా సమాప్తికి గుర్తు "



 (తరువాత ఆ గురువు గారిని అడిగి పొందిన సారాంశం )


శివ స్మృతి  వలన ఆత్మ లో  వికర్మల ఖాతా తొలగుతుంది .  ఇందుకు మనిషి యొక్క బుద్ధి సహాయకారి గా ,  శివుని తో అనుసంధానించ బడాలి.  

శివుని  స్మృతి  చేస్తూ  విశ్వ మూలాల లోకి వెళితే ప్రతీది చాలా స్పష్టం . . . సుస్పష్టం.  దీనికి ఎవరూ అతీతం కాదు. ఇది చదివే వారితో సహా. 

ఇది అర్దం అయితే  యధార్థం . . . కాకపోతే  కధ.

ప్రేమ  యొక్క లక్షణం త్యాగం .  కానీ  మానవ ప్రేమ లో  ఒక్క తల్లి ప్రేమ మినహా , మిగిలిన అన్ని ప్రేమలలో  ఏదొక  స్వార్దం , వాంఛ , అవసరం  ఉంటుంది.  అందుకే ఆ ప్రేమ ల వలన చివరికి దుఃఖం మిగులుతుంది.  .  . 
(సత్యం , యధార్థం తెలియజేయడానికి మాత్రమే ఈ మాట)

కానీ  శివుని ప్రేమ అద్బుతం,  శివుని ప్రేమ త్యాగం, నిస్వార్థం.  శివుడు కనపడడు  కానీ  ప్రేమిస్తూ ఉంటాడు. కానీ ఆ ప్రేమ ను  మనిషి అందుకోవాలి అంటే శివుని యొక్క యధార్థాన్ని   గుర్తించాలి . అందుకు తప్పని సరిగా మనసును పవిత్రంగా చేసుకోవాలి . 

శివుడి ని   మనం చూసినప్పుడు కంటే , శివుడు  మనల్ని  చూస్తున్నప్పుడు  మనం పొందే అనుభూతి, అనుభవం  అనేది  జన్మ జన్మల అదృష్టం , భాగ్యం ఎందుకంటే  శివుడే  మనకు  తల్లి మరియు తండ్రి . . . ఇదే ముక్తి.


మనిషి  జీవితం నమ్మకంతో నడుస్తుంది. ప్రేమ పొందాలి అన్నా , ప్రేమ ఇవ్వాలి అన్నా  సరే నమ్మకం కలిగి ఉండాలి అప్పుడు  త్యాగ  సఫలత సిద్ధిస్తుంది . మనుషుల కు తమ పై తమ కే నమ్మకం కోల్పోతున్న రోజులు ఇవి. ఇక తోటి వారి కి , సాటి వారికి ప్రేమను ఎలా పంచగలరు, ఎలా తిరిగి పొందగలరు. 
కానీ . . . శివుని పై నమ్మకం ఉంచినా, ఉంచక పోయినా ప్రతీ ఒక్కరినీ ప్రేమిస్తూనే ఉంటాడు .  ఎందుకంటే శివుడు అమాయకుడు, అందుకే భోళానాధుడు అంటారు . 


ఓం నమఃశివాయ 🙏.

యడ్ల శ్రీనివాసరావు 11 June 2025 10:00 pm. . . 



No comments:

Post a Comment

650. జాలి దయ కరుణ బలమా? బలహీనతా?

జాలి  దయ  కరుణ  • జాలి దయ అనేవి  దైవీ గుణాలు . జాలి దయ లేని   మనిషి ని  కర్కోటకుడు, క్రూరుడు , అసురుని గా పరిగణిస్తారు. నిజమే కదా . . . ...