Wednesday, June 18, 2025

643. జీవుని గుణాలు

 

జీవుని గుణాలు 


  జీవుడు = ఆత్మ + శరీరం .

ప్రాణం తో ఉన్న మనిషి జీవుడు . జీవుడి లో ఆత్మ మరియు శరీరం కలిసి ఉంటాయి. 

  శరీరం నాశనం అవుతుంది.  ఆత్మ నాశనం లేనిది.  శరీరం విడిచిన (మరణించిన) తరువాత ఆత్మ మరోక శరీరం ధరిస్తుంది. అదే జన్మించడం, మరో జన్మ తిరిగి ఎత్తడం.

  ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకో వలసినది  జీవుని లో గుణాలు . . .  అవి 

1. ఆత్మ గుణాలు  

2. శరీర గుణాలు.

 ఈ గుణాల ద్వారా నే జీవుడు జన్మ జన్మల జీవన యానం  చేస్తుంటాడు. 


 ఆత్మ గుణాలు

  జ్ఞానం , పవిత్రత , శాంతి, సుఖం, ప్రేమ, ఆనందం, శక్తి

  జ్ఞానం : ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంత్య రహస్యాలు బుద్ధి లో కలిగి ఉండి, సర్వకాల సర్వావస్థల యందు వాడి పోని పుష్పం వలే బుద్ధి వికసించడం , నిర్ణయాలు తీసుకోవడం.

  పవిత్రత : పవిత్రత అనగా కేవలం బ్రహ్మచర్యం మాత్రమే కాదు. మనసా, వాచా, కర్మణా . . . ధర్మం , సత్యత , నిజాయితీ ని ఆచరించడం .

  శాంతి :  మనసు , అలజడుల ప్రకంపనలకు అతీతమై , నిశ్చలత కలిగిన అతీంద్రియ శూన్య స్థితి  శాంతి .

  సుఖం :  సదా హర్షితం తో మనసు పొందే అనుభూతి.

  ప్రేమ : త్యాగనిరతి తో మనసు చేసే లాలన , పాలన .

  ఆనందం : ప్రకృతి మరియు వాయు మండలం ద్వారా మనసు  తేలికగా అయి నిత్యం ఎగురుతూ ఉన్నట్లు  పొందే అనుభవం.

  శక్తి :  అనంతమైన చైతన్యం .


  ఒక  జీవుడి లోని  ఆత్మ  సంపూర్ణ జ్ఞానం పొందినప్పుడు , పవిత్రతను ఆచరిస్తుంది . పిదప ఆత్మకు శాంతి  అనుభవం అవుతుంది . ఆ క్షణం నుండి   పరమాత్మ   ద్వారా  ఆత్మ కు   సుఖం చేకూరుతుంది .

  ఆత్మ తన సుఖం తో  ప్రేమ ను పంచుతుంది. ఇదే అన్ని వేళలా ఆత్మ ఆనందం కలిగి ఉండే స్థితి . ఈ గుణాలు అన్నీ కలిసి చైతన్యవంతం తో ఉండడమే  శక్తి . ఇదే ఆత్మ  స్వరూపం .

  నేను ఒక ఆత్మ అనే భావన స్థితి మనసు లో పూర్తిగా స్థితం అయినపుడు, ఆత్మ తన గుణాలన్నింటిని సహజంగా పొందుతుంది . ఇది సుఖానికి కారణం మరియు ఇదే స్వర్గం.

  ఈ ఆత్మీక స్థితి అనేది జ్ఞాన ధ్యాన యోగ సాధన తో  సాధ్యం .


( మనిషి  చనిపోయిన తరువాత ఆత్మ కి శాంతి చేకూరాలని ఇతరులు ప్రార్థిస్తూ ఉండడం గమనిస్తూ ఉంటాం . వారికి మౌనం పాటీస్తూ ఉంటాం.  ఇది  అకాలమరణం మరియు  ఆకస్మిక మరణం  పొందిన వారి ఆత్మ లకు  సహయోగం  చేయడం  అంటారు.

అలాకాకుండా . . . 

 ఆత్మ , శరీరం ధరించి ఉన్నప్పుడే , అంటే మనిషి జీవించి ఉన్నప్పుడే శాంతి ని అనుభవం చేసుకునే సాధన ధ్యాన యోగం తో  స్వయం గా  చేయడం వలన ఆత్మ ఉన్నతి చెంది , సహజంగానే జీవుడికి  జీవించి ఉండగా నే  శాంతి అనుభవం అవుతుంది .

చనిపోయిన తరువాత ఆత్మ  , శాంతి ని అనుభవం చేసుకోవడం అనే ప్రక్రియ ఏమీ ఉండదు.  ఎందుకంటే ఆత్మ కి శరీరం ఉంటేనే ఏదైనా అనుభవం పొందగలదు.

అనగా  శాంతి ని అనుభవం చేసుకోవాలి అంటే  ఆత్మ  తప్పని సరిగా శరీరం ధరించి ఉండాలి, అనగా జీవించి ఉన్నప్పుడే అది సాధ్యం . ) 


  శరీర గుణాలు

  అహంకారం :  నేను అనే విపరీత దేహభిమాన భావం. ఇది శరీరంలోని ఇంద్రియ దృష్టి తో ఆరంభం అవుతుంది .

  కామం : ‌ శరీరం లోని ఉష్ణం , సమతుల్యత కోల్పోవడం వలన , ముఖ్యం గా  ఇంద్రియాలు శీతల స్థితి లో ఉండలేక ‌ పోవుట వలన కామం  ఉత్పన్నమవుతుంది .

  క్రోధం : ఆలోచనలు అదుపు కోల్పోయినప్పుడు శరీరం సృష్టించే అలజడి. దీనిని కోపం అని కూడా అంటారు.

  మోహం : ఈ సృష్టిలో ఏదీ తనకు శాశ్వతం కాదని తెలిసినా , శరీరం అమితంగా కలిగి ఉండే గుణాలైన   ఇష్టం , అపేక్ష , మమకారం , అభిమానాన్ని మోహం అంటారు .

  లోభం : శరీర పోషణకు అవసరమైన ఆహారం, ధనం సమృద్ధిగా ఉన్నప్పటికీ, లేమి తనం తో దీనత్వాన్ని అనుభవించే నికృష్ట స్థితి . దీనినే పిసినారితనం అంటారు.

  ఈర్ష్య : తమకు లేనిది ఇతరులు కలిగి ఉండడం వలన కలిగే అసంతృప్తి భావన .

  ద్వేషం : ఈర్ష్య మితిమీరినపుడు, మాటల తో , చేతలతో ప్రదర్శించే స్వభావం .

  స్వార్థం : నాది మాత్రమే అనే  విపరీత ఆలోచన ధోరణి .

  నేను ఒక శరీరం , దేహం అనే భావన స్థితి మనసు లో ఉన్నప్పుడు ఈ గుణాలు అన్నీ కూడా శరీరం అటుఇటుగా తప్పకుండా అనుభవిస్తుంది. అదే మనిషి దుఃఖానికి కారణం . ఇదే నరకం.

మనిషి జన్మాంతరాలుగా  తానొక ఆత్మ  అనే సత్యం  పూర్తిగా మర్చిపోయి , కేవలం దేహ భావ స్థితి తో మాత్రమే జీవిస్తున్నాడు. దీనికి కారణం మాయ . . . 

చనిపోయిన వారు మాత్రమే  ఆత్మలు గా  , అవుతారు  అని కొందరు  ,   ఆత్మ అంటే  దెయ్యం అని మరికొందరు  అనుకుంటారు.  ఇవి అపోహలు.  మనిషి జీవం తో ఉండగా నే మనిషి లో ఆత్మ ఉంటుంది, కానీ  మాయ వలన మనిషి  స్పృహ ఈ విషయం గ్రహించ లేదు.  


యడ్ల శ్రీనివాసరావు 14 June 2025 , 1:00 pm 


No comments:

Post a Comment

650. జాలి దయ కరుణ బలమా? బలహీనతా?

జాలి  దయ  కరుణ  • జాలి దయ అనేవి  దైవీ గుణాలు . జాలి దయ లేని   మనిషి ని  కర్కోటకుడు, క్రూరుడు , అసురుని గా పరిగణిస్తారు. నిజమే కదా . . . ...