మెప్పు
పొందుట - ఆశించుట
• మెప్పు అనగా ప్రశంస . ఈ ప్రశంస అనేది స్వచ్చమైన మనసు, కల్లా కపటం లేని వాక్కు మరియు శ్రేష్ట కర్మ ల ద్వారా సహజ సిద్ధంగా లభిస్తుంది . కేవలం ఇతరుల తో మెప్పు పొందాలనే తపనతో, సంకుచితంగా చేసే కర్మ స్వార్దం అవుతుంది.
• శ్రేష్ట కర్మలు ప్రతి ఒక్కరి మెప్పు కు పాత్ర మవుతాయి. అందువలన మనం చేసే కర్మలు ఇతరులకు మేలు చేస్తూ ప్రశంసలు పొందేలా ఉండాలే కానీ దుఃఖం, బాధ, సమస్యలు కలిగించే లా ఉండకూడదు. అందుకోసం మనం ఎంత కష్టాన్నయినా సహించ వలసి వస్తే సహించాలే కానీ , వెనుకంజ వేయకూడదు. ఇతరులను నొప్పించక తాను బాధపడక యుక్తి తో నడిచే వాడు ధన్యుడు.
• కంటిలో నలక పడినా , కాలు లో ముల్లు గుచ్చుకున్న , చెప్పులో రాయి చొరబడిన , చెవి లో జోరీగ రొద పెడుతున్న , మానసిక సమస్యలు అల్లల్లాడిస్తున్నా , ఇంటిలోని గొడవలు బహిరంగంగా చెప్పుకో లేనటువంటి వి ఎన్నెన్నో మనిషి సహనాన్ని పరీక్షిస్తాయి . అలాగే జీవితంలో ఒక్కోసారి ఊహించని సమస్యల వలయంలో చిక్కుకుపోతాము . . . అయినా , నిరాశ చెందక ఎలాంటి సమస్యలైనా ధైర్యం గా ఎదుర్కొని ఇతరుల సమస్యలను కూడా పరిష్కరించడంలో సహయపడిననాడు అందరి మెప్పు పొందగలుగుతారు.
• కొందరు ఎల్లప్పుడూ తమను తాము గొప్ప వారిగా భావించుకొని ఇతరులు తమను పొగడాలని, తమను అందరూ స్తోత్రం చేయాలని , తమ చుట్టూ తిరుగుతూ జపం చేయాలని ఉవ్విళ్లూరుతుంటారు . తాము అందుకు తగిన వారమా , కాదా . . . తమ గుణగణాలు అందుకు అర్హత కలిగి ఉన్నాయా , లేదా అని కనీసం ఆలోచించరు .
మనుషులు తాము చేసే కర్మల అనుసార మే ఇతరుల మెప్పు పొందగలుగుతారు, అది దానంతట అదే లభిస్తుంది . అంతే కానీ, ఒకరిని అడిగితే లేదా కోరుకుంటే లభించేది కాదు మెప్పు .
• మనసా వాచా కర్మణా నిర్మల మనస్సుతో చేసే కర్మలు అతి సహజంగా ప్రశంసా పాత్రం అవుతాయి.
మనకోసం కాక సమాజ శ్రేయస్సు కోసం నిస్వార్థ భావన తో పని చేసిన నాడు ప్రశంసలు వాటంతట అవే లభిస్తాయి.
అంతే కానీ ఇతరుల మెప్పు కోసం , గుర్తింపు కోసం చేసే సేవ , సేవ అనిపించుకోదు సరికదా స్వార్దం మరియు పబ్లిసిటీ అనిపించుకుంటుంది. కాలానుగుణంగా ఇదే విషయం అందరూ గ్రహిస్తారు . చేసిన సేవ బూడిద లో పోసిన పన్నీరు అవుతుంది .
• పూర్వం ప్రతీ రాజు గారి ఆస్థానం లో "భట్రాజులు" ఉండేవారు. రాజుగారు సభకు విచ్చేసిన సమయం లో ఆయనను గౌరవ పూర్వకం గా “రాజాధిరాజా రాజ మార్తాండ “ అంటూ పొగడ్తల తో ముంచే వారు. ఆ సమయంలో సభ లోని వారందరూ లేచి నిలబడి రాజు గారికి గౌరవ మర్యాదలు ఇచ్చేవారు . నాటి ఈ ప్రశంసా విధాన్ని నేడు ఆశించడం , అవలంభించడం బలహీనుల లక్షణం .
• అలాగే . . . కొందరు అమాయకులు ఎలా ఉంటారంటే, ఇతరులు పొగడ్త లతో ముంచెత్తినపుడు ఆ పొగడ్తలకు పొంగి పోయి, ఎంతో ఆనందంతో వారు ఏ పని చెప్పినా , ఎంత కష్టమైన దైనా చేసి వారిని సంతోష పెడతారు కానీ తమ అవసరానికి వారు తనను ఉపయోగించుకుంటున్నారని , అవసరం తీరాక తన ముఖం కూడా చూడరని గ్రహించలేనంతటి అమాయకత్వం ఉంటుంది వారిలో. కానీ అమాయకులను మభ్య పెట్టడం వలన తగిన గుణపాఠం చవి చూడవలసి వస్తుంది .
• ఎవరో తమను మెచ్చుకోవాలని పువ్వులు తమ సహజ సౌందర్యాన్ని, పరిమళాలను వెదజల్లవు . అది వాటి సహజ లక్షణం.
ఉద్యాన వనాల లోనే కాకుండా అరణ్యాలలో, ఎడారులలో, పర్వతాల పై, నీటి పై పలు ప్రదేశాలలో పువ్వులు వికసిస్తూ ఉంటాయి.
అదే విధంగా గుణవంతులు ఎచటకు వెళ్లినా తమ గుణాలను , సౌరభాన్ని వెదజల్లుతూ నే ఉంటారు. ఎవరో ప్రశంసించాలని ఆశించరు .
• నిందలు మనసును కృంగదీసే ఆయుధాలు. నిందలు నిరూపణ కానంత వరకు నిజాలు కావు . అవి కేవలం అపనిందలు మాత్రమే . నిరూపణ చేయ లేకుండా నిందలు మోపడం అనేది, మనుషులలో దాగి ఉన్న ఈర్ష్య ద్వేషం అసూయ లనే బలమైన అసుర శక్తుల కు , రాక్షస గుణాలకు నిదర్శనాలు . ఇది శ్రీకృష్ణుని జన్మ వృత్తాంతం ద్వారా విదితమే .
• మన మనసు పై నిజాయితీ తో సత్ విమర్శ చేసే వారు, మన లోపాలను పారదర్శకం గా మనతో మాత్రమే చర్చించే వారే మనకు నిజమైన స్నేహితులు , ఆప్తులు . అటువంటి వారి కి మనం కృతజ్ఞతలు చెప్పి , ప్రశంసించాలే కానీ వారిపై శత్రుత్వం, కోపం ఉండరాదు.
వారు , మనలో ఎక్కడో దాగి ఉన్న లోపాలను సరిదిద్ధుకొవడానికి . . . ఇంకా , ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థాయి చేరుకోవడానికి అవకాశం కలిగించారు . కాబట్టే వారు మనకు సహాయం చేసిన వారిగా అవుతారు. వారే నిజమైన మార్గదర్శకులు. అటువంటి వారి ని మరువకూడదు . అదే నిజమైన మానవత్వం .
• మనుషుల నుంచి లభించే ప్రశంసలు, స్థిరమైనవి కావు . అవసరాలను బట్టి ఇవి మారుతూ ఉంటాయి. ప్రశంసలు చేసే వారి లో ఏదొక అంతరార్థం దాగి ఉంటుంది . ప్రశంసల ను మనసు అంగీకరించడం , స్వీకరించడం అంటే మాయను ఆహ్వానించడమే .
• కళ్లకు కనిపించని పరమశక్తి నుంచి మెప్పు పొందడం అనేది, సామాన్య విషయం కాదు. దానికి ఎంతో కృషి చేయవలసి ఉంటుంది. మనిషి తనలో నిక్షిప్తమై ఉన్న ఆధ్యాత్మిక శక్తి ని , అంతరంగిక శక్తి ని గుర్తించినచో , ఎలాంటి అనితర సాధ్యమైన పనినైనా ఎంతో సులభంగా చేయగలడు. అలాంటి వారు ధృఢత నిశ్చయం ఉన్నప్పుడు , ఎన్ని విఘ్నాలు వచ్చినా ముందుకు నడుస్తారే కానీ , వెనుతిరగరు .
ముఖ్యం గా ఆధ్యాత్మిక మార్గంలో నడిచే వారికి ఎలాంటి వ్యర్దమైన ప్రశంసల , దుస్సాంగత్యాల వలలో చిక్కుకుని తమ మార్గాన్ని కంటక ప్రాయం గా చేసుకో రాదు . సాధకుడు సర్వదా వీటన్నింటి కి అతీతమై నిరాడంబర నిర్మల జీవితం గడపాలి. ప్రశంసల పాఠశాల కు దూరంగా ఉన్నప్పుడు ఆత్మ ఉన్నతి సాధిస్తుంది.
🌹🌹🌹🌹🌹
• మిణుగురు పురుగులు చీకటి వేళ వెలుగును విరజిమ్ముతూ ప్రపంచానికి తామే వెలుగు నిస్తున్నామని ప్రశంసించుకుంటాయి . . . కానీ నక్షత్రాలు ఆకాశం లో ప్రకాశించ గానే మిణుగురుల గర్వం పటాపంచలు అవుతుంది . . .
మెరిసే నక్షత్రాలు తామే వెలుగు నింపుతున్నామని ఎగసి ఎగసి పడతాయి . . . కానీ చంద్రుడు ఉదయించినంతనే నక్షత్రాల వెలుగు మందగిస్తుంది .
చంద్రుడు తన వల్లనే ఈ ప్రపంచం అంతా సంతోషంగా ఉందని , భూమి కి తానే వెలుగు నింపుతున్నానని గర్విస్తాడు . . . కానీ సూర్యుని రాకతో చంద్రుడు ఉనికి తెలియకుండా పోతుంది.
• అదే విధంగా తమ గొప్పలు గురించి తామే పొగుడు కుంటూ కోటీశ్వరులు , మిలియనీర్లు వంటి వారు గొప్పతనం అనే పంజరం లో తమను తాము బంధించుకొని సామాన్య మానవులను హీనంగా చూస్తారు. చివరికి ఆ పంజరంలో , మనసుకి శ్వాస సరిగా సలపక దుర్భరం తో వేదన అనుభవిస్తూ ఉంటారు .
• బాహ్య ఆడంబరాలు తో కూడిన సంస్కారాలు చాలా భయంకరమైనవి . అందరూ నన్ను చూసి, నా మేధస్సు చూసి, నా పనితనాన్ని చూసి , నా ధనం ఆస్తి స్థాయి చూసి మెచ్చుకొని నాకు ప్రాముఖ్యత ఇవ్వాలి , నా మాటలకు విలువ ఇవ్వాలి అనుకోవడం సంపూర్ణ అజ్ఞానం . మరియు ఏదొక రోజు నా గొప్ప తనం అందరూ గ్రహిస్తారనే అహం పనికి రాదు.
మనలోని విశేషతలను , గుణాలను సందర్బం అనుసారం గా శ్రేష్ట కర్మల ద్వారా వ్యక్త పరచాలి కానీ , గొప్పలు చెప్పుకొంటే ప్రయోజనం ఉండదు .
మెప్పు పొందడం కోసం వృధా చేసుకునే సమయాన్ని , శక్తి ని లోక కళ్యాణానికై సవ్య దిశ లో వెచ్చిస్తే ప్రశంసా పాత్రులవుతారు . . . భగవంతుని ప్రశంసలు పొందాలన్న కోరిక గలవారు, విశాల హృదయం తో ఇతరుల లోని మంచి గుణాలను , ప్రత్యేకతలను సహజంగా , నిస్వార్థం గా ప్రశంసిస్తూ ఆత్మ విశ్వాసం పెంచే కర్మలు చేయాలే కానీ . . . . వారి బలహీనత లను ఎత్తి చూపరాదు . వీలైతే వారి లోని బలహీనతలు రూపుమాపేందుకు ప్రయత్నం చేయాలి, సాధ్యం కాకపోతే కర్మానుసారం వారి పాత్ర అంతే అని వదిలేయాలి.
• కావున మెప్పు కోసం గొప్ప లకు పోక, భగవంతుని సంతానం అయిన మనం , ఇతరుల పై శుభదృష్టి శుభ కామన లతో జీవించడం మేలు .
• మన అంతర్గత జీవిత ప్రయాణంలో మనం ఎంత పరిపక్వత సాధించాం, అనేది నిత్య విశ్లేషణ ఉండాలి . తప్పొప్పులను నిజాయితీగా అంతరంగం లో అంగీకరించ గలగడం , ఆత్మ ఉన్నతి సాధించడానికి అత్యంత అవసరం . దీనికి సద్గురువు అవసరం.
మౌనం శ్రేష్ట గుణం , వ్యర్ద సాంగత్యాలను వడకడుతుంది . వ్యర్ద ఆలోచనలను శుద్ధి చేస్తుంది.
ఓం నమఃశివాయ 🙏
ఓం శాంతి 🙏
యడ్ల శ్రీనివాసరావు 24 June 2025 10:00 PM.
No comments:
Post a Comment