Friday, February 13, 2026

721. దేవుడిని ఎందుకు నమ్మాలి ?

 

దేవుడిని ఎందుకు నమ్మాలి ?



• నేను దేవుడిని నమ్ముతాను . అవును దేవుడిని మాత్రమే నమ్ముతాను . నా దేవుడు నా కంటికి కనపడడు అయినా నేను నమ్ముతాను. నాకు నమ్మికయే  ప్రధానం.  నా శివుడు ఉన్నాడు నన్ను వింటున్నాడు , నాతో నే నడుస్తున్నాడు అనేది నా నమ్మకం . ఇది నాకే కాదు నాలాగ ఈ విశ్వం లో  కోటాను కోట్లమంది వారి మనసులలో ఇష్టపడి స్మరించే  దైవం అంటూ ఒకటుంది . అది ఎప్పుడూ తమను రక్షిస్తూ  ఉంటుంది  అనే  నమ్మకం  వారిని నడిపిస్తుంది .

• ఈ కలియుగంలో   దేవుడిని  కాకుండా  మానవమాత్రులను   గుడ్డిగా విపరీతంగా  ఆధారపడి  నమ్మినా చివరికి క్షోభే మిగులుతుంది.  ఇది సత్యం .  ఎందుకంటే మనం నమ్మిన ప్రతి ఒక్కరూ తిరిగి మనల్ని అదే విధంగా ముమ్మాటికీ  నమ్మరు . . . . ఎందుకంటే , ఒకరి  పట్ల   నమ్మకం  ఉంచుకోవడం, పెంచుకోవడం  అనేది  నీకు స్వభావ రీత్యా ఒక  అవసరం  అయితే  . . . .  వారికి మాత్రం  నీ పట్ల నమ్మకం  అనేది    లేకుండా  వేరే అవసరాలు ఉండొచ్చు .  కానీ భగవంతుడు అలా ఉండడు . నువ్వు ఎలా నమ్ముతావో , భగవంతుడు కూడా నిన్ను అలాగే  , లేదా అంతకు మించిన శ్రేయస్సు తో  నమ్ముతాడు . కారణం , మనుషుల మాదిరిగా భగవంతుని కి  స్వార్థపూరిత అవసరాలు ఉండవు . 

ఈ విషయాలను స్వయం గా నీకు దేవుడు మాత్రమే అర్దం చేయిస్తాడు , ఎందుకంటే నీవు ఎందరి పైనో   ఎన్నో విధాలుగా  నమ్మకం ఉంచుకొని మోసపోయావు కాబట్టి. నువ్వు భగవంతుడిని   ఏ నాడైతే   సత్యత తో  విశ్వసిస్తూ  నమ్ముతావో , అప్పుడు  మాత్రమే ,  ఇతరులకు  నీ పట్ల అంతులేని నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే ఇందులో భగవంతుడే నమ్మకం అనే పాత్రలో  ఇమిడి  ఉంటాడు  కాబట్టి .


• ఒక్క మాట చెప్పండి మనలోని రక్తం పైనుండి కిందకి లేదా కింద నుండి పైకి మన శరీరం లో ప్రవహిస్తుందా  లేదా?

• మన గుండె తనంతట తానుగా ఊపిరి లేదా ప్రాణవాయువు అందుతున్నంత  వరకు కొట్టు కుంటూ  ఉందా లేదా?

 ఇవన్నీ నీకు నాకు సహజ లక్షణాలు అయితే మన జననం మరణం మన చేతులలో ఎందుకని  లేదు ఇప్పటి కీ  ?

• నీ ఆకారం , నీ  పొడుగు  నీ పొట్టి   నీ రూపం నీ చేతులలో ఎందుకు లేదు ?

• నీ  ఆస్తి ,  నీ డబ్బు ,  నీ కుటుంబం ఎందుకు నిత్య సుఖసంతోషాలు  ఇవ్వట్లేదు ? 

• ఆరు బయట  అరుగుపై  పడుకున్న వాడు ఆనందహేళి  లో   ఎందుకు  ఉంటున్నాడు ?

• అంతెందుకు ఈ రోజు నువ్వు నేను ఇక్కడ , రేపు ఎక్కడో   ఏమిటో  మనకు  తెలుసా  ?


• దైవం మానవ కల్పితం అనుకుంటే ఆ ఆలోచన ఒక కల్పన మాత్రమే. ఈ సృష్టిని నడిపించే ఒక అతీంద్రియ శక్తి పరమాత్మ  . ఇది యదార్ధం ఇదే సత్యం. సత్యాన్ని ఒప్పుకోవటం అంటే భగవంతుని అంగీకరించడమే అదే శివం అదే సుందరం. నువ్వు సత్యాన్ని అంగీకరించిన నాడు  ఆ పరమేశ్వరుడు నిత్యమై నీకు నాకు సుందరమైన జీవితాన్ని జీవనాన్ని కలుగచేస్తాడు . భగవంతుడు నీ తో ఉన్నాడు అనడానికి నిదర్శనం,  మునుపెన్నడూ నీ లోని కానరాని నీ అద్వితీయ, అతీంద్రియ శక్తి ని అనుభవించడం .

• నీ  నోటి వెంట సత్యం పలకని నాడు , శివుడు నీ వెంట ఉండడు. మాయ మాత్రమే నీకు తోడు నీడ గా ఉంటుంది. అది నిన్ను అందలం ఎక్కించినట్లు ఎక్కించి  అమాంతం గా  కింద పడేస్తుంది. ఇదే నీకు కోలుకోలేని దుఃఖం . మాయ అంటే నీ లోని అసత్యం  మరియు బలహీనత . 

అందుకే అంటాను . . . నువ్వు నేను అందరూ శివపరమాత్ముని  నమ్మాలి .  భగవంతుడిని సత్యతో   నమ్మిన నాడు , నువ్వు  ప్రతీ వ్యక్తి పై చూపించే నమ్మకం లో  నీకు భగవంతుడు కనిపిస్తూనే ఉంటాడు .  జరిగిన , జరుగుతున్న సంఘటనలు ద్వారా  నీకు  మంచి చెడులు  అర్దం చేయిస్తూ ఉంటాడు .  ఎందుకంటే భగవంతుడు నిన్ను శుద్ధి  గా , ముక్తుడు గా  చేసేందుకే , నీకు సంబంధించిన అన్ని బంధనాలలో  అనేక  స్వభావ సంస్కారాలు కలిగిన  వ్యక్తులు నీ  చుట్టూ ఉన్నారు . స్వీయ పరివర్తన చెందడం , చెందక పోవడం అనేది  నీ బుద్ధి కి సంబంధించిన అంశం .


శివరాత్రి శుభాకాంక్షల తో 💐 . . .

ఓం శాంతి 🙏 

ఓం నమఃశివాయ 🙏 

Daimond Hall , Mount Abu ✍️ 

యడ్ల శ్రీనివాసరావు 13 Feb 2026 , 7:30 PM.


No comments:

Post a Comment

721. దేవుడిని ఎందుకు నమ్మాలి ?

  దేవుడిని ఎందుకు నమ్మాలి ? • నేను దేవుడిని నమ్ముతాను . అవును దేవుడిని మాత్రమే నమ్ముతాను . నా దేవుడు నా కంటికి కనపడడు అయినా నేను నమ్ముతాను. ...