శివుని పై సందేహమా ?
• ఈశ్వరుడు ఉన్నది నిజం , అది కూడా తన పిల్లల (భక్తుల) కోసం నిత్యం పరితపిస్తూ ఉంటాడు అన్నది మరింత నిజం .
ఈ సృష్టి లో మానవ నైజాలు మూడు రకాలు. ఒకడు భగవంతుడు ఉన్నాడు అని గట్టిగా నమ్మేవాడు. ఇంకొకడు అసలు భగవంతుడు అన్నవాడు లేడు అనేవాడు. మూడవవాడు భగవంతుడు ఉన్నాడా లేదా అని మిధ్య లో కొట్టుకునేవాడు . చిత్రం ఏమిటంటే ఈ ముగ్గురినీ సృష్టించినవాడు భగవంతుడే . కానీ వారి వారి కర్మానుసారం వారి పోకడలు ఉంటాయి. అలాగని వారిని ఎవ్వరినీ వదిలిపెట్టి ఉండడు విశ్వమూర్తి .
నీకు కనిపించినా కనిపించక పోయినా నీ చుట్టూ ప్రాణవాయువు నిన్ను ఎలాగ బ్రతికిస్తుందో అలాగే అమరేశ్వరుడు నిన్ను కాపాడుతూ ఉంటాడు.
• భగవంతుడు లేడు అనే వాడికి శివుడు తెలియదు అన్నది నిజం కానే కాదు. కానీ, వాడు మాయ లో మునిగి ఉండడం వలన తానే అంతా అనే అహం లో ఉంటూ , తన మనసుని చంపుకొని పైకి బింకంగా దేవుడు లేడు లేడు అని చెబుతూనే మనసులో ఏదో తెలియని సందిగ్ధంలో మదనం తో ఉంటాడు. ఇది సత్యం.
• ఇక మధ్యస్తంగా ఉండి దేవుడు ఉన్నాడా లేడా? ఉంటే , మరి ఎందుకు కనబడడు ? అసలు సత్యం (దేవుడు) అనేది నిజమా కాదా? అనే మీమాంస లో ఉంటూనే , కష్టం వస్తే మాత్రం కనపడని దేవుడు కి మొక్కుకోవడం , ఇతరత్రా సమయాలలో సందేహపడడం ఇవన్నీ ఈ కోవకు చెందిన మనుషులవి .
• నీ సమస్త సందేహాలకు నీకుగా సమాధానం దొరికేలా చేసేవాడే మేధో దక్షిణామూర్తి. నీకు ఆలోచన ఇచ్చి నీ మనసును సన్మార్గంలో ప్రేరేపించి నడవడిక నేర్పు మహా జ్ఞాన రూపం దక్షిణామూర్తి గా కనబడే ఈశ్వరుడి రూపం. ఈ రూపంలో శివుడు సద్గురువు .
• ఉన్నాడు అన్నవాడికి ఉండి మోక్ష మార్గాన్ని చూపడం , లేడు అన్న వాడికి లేనట్లు గా ఉండి నిరూపణ చేయడం , మధ్యస్తంగా ఉన్నవాడికి సందేహ నివృత్తి చేయడం ఇవన్నీ భగవంతునికి అవసరమా ? అంటే , ముమ్మాటికీ అవసరమే ఎందుకంటే తాను సృష్టించిన తన బిడ్డలే కదా ! వీరందరూ. ఆయనకు ఓర్పు నేర్పు కూర్పు అన్నీ సహజసిద్ధం . అవి శక్తి స్వరూపం లో పుష్కలంగా ఆయనలో పొంచి ఉన్నాయి.
• ఏనాడైతే , ఓ సద్గురువారం (గురువారం) రోజు దక్షిణామూర్తి స్తోత్ర పఠనం , చిత్ర రూపంతో నీ ఇంట ఆరాధన అన్నది మొదలు పెడతావో , ఆనాటి నుండి నీ బుద్ధి లోని అజ్ఞానం అనే చీకటి గది తలుపులు తెరవబడి క్రమేపీ ధ్యాన యోగాల దిశగా అడుగులు పడి ప్రకాశవంతమైన జ్ఞాన వెలుగు నీలో నిండుతుంది. నీ గత జన్మల నుంచి పెండింగ్ గా మిగిలి పోయి ఉన్న అవశేష కర్మలు ఆధార భరితంగా పూర్తి అవుతాయి. అదే నిన్ను ముక్తి జీవన్ముక్తి దిశగా తీసుకువెళుతుంది .
• ఇంతకంటే నీ ఈ జన్మకు ఏం కావాలి . తాపత్రయం గా సంపాదించిన స్థూలధనం , ఆస్తి సదుపాయాలు సౌకర్యాలు అనుభవించు, కానీ అవి నీతో పాటు పైసా కూడ మరుసటి జన్మ వరకు రావని తెలుసుకో . నీతో పాటు శాశ్వతంగా వచ్చేవి సుక్ష్మ సంపాదన అయిన జ్ఞానం , జీవిత పాఠాల ద్వారా రూపు దిద్దుకున్న నీ స్వభావం, అనుభవాల ద్వారా మార్పు చేసుకున్న నీ సంస్కారం , మనసు లో నింపుకున్న ప్రేమ , తెలుసుకొని ఆచరించే జ్ఞానం పవిత్రత , అనుభవం పొందుతున్న శాంతి , సుఖం , ఆనందం , శక్తి ఇవి మాత్రమే నీతో మరుసటి జన్మ కు వస్తాయని తెలుసుకో .
మంచి తనం , మంచి మార్గం అనేవి ఎవరికోసమో కాదు నీ కోసం , నీ ఉన్నతి కోసం మాత్రమే .
ఓం శాంతి 🙏
ఓం నమఃశివాయ 🙏
యడ్ల శ్రీనివాసరావు 22 Feb 2026 . 4:00 AM.


No comments:
Post a Comment