పెరుగుట - వృద్ధి
ఒక వృక్షం బాగా పెరిగింది అంటే వృద్ధి చెందింది. శాఖోపశాఖలుగా కొమ్మలు విస్తరించి, పండ్లు , పూలు , సేద తీరేందుకు నీడ ఇస్తుంది . ఈ పెరగడం లేదా వృద్ధి చెందడం అనేది కొన్ని చెట్లు నెమ్మదిగా సంవత్సరాల తరబడి, మరి కొన్నింటికి అతి తక్కువ కాలంలో నే జరగడం గమనించ వలసిన విషయం.
కానీ ఇంత బలంగా వృద్ధి చెందిన వృక్షాలు కూడా కొన్ని సార్లు అకస్మాత్తుగా వచ్చిన తుఫానులకు ఊహించని విధంగా కూలిపోతుండడం మనం చూస్తుంటాం . మనకు ఆశ్చర్యం కలుగుతుంది, ఇంత పెద్ద ధృఢమైన వృక్షం ఇలా ఎలా కూలిపోయింది ? అని .
దాని అర్థం . . . ఆ చెట్టు బయట అందరికీ కంటికి కనిపించేంత ధృడంగా భూమి లోపల పాతు కొని లేదు . వేర్లు బలంగా లేవు .
ఇక్కడ గమనించవలసిన విషయం చెట్టు యొక్క బలం బయటకు విస్తరించిన కొమ్మలు కాండం లో కాదు , వేర్ల లోనే ఉంటుంది . వేర్లు బయటకు కనిపించవు. కానీ వేర్లు ఎంత దృఢం ఉంటే , చెట్టు అంత బలమైన తుఫానులకు ధీటుగా నిలబడగలదు .
ఇంకా గమనిస్తే . . . కొన్ని సార్లు చెట్టు నుంచి శాఖోపశాఖలుగా విస్తరించిన కొమ్మలు వీడి పోయినా (విరిగి పోయినా) సరే , ఆ చెట్టు దృఢం గా నే ఉంటుంది.
మనం చెట్టు యొక్క బయట ఆకారం మాత్రమే చూస్తాం కానీ , భూమి అడుగున దాగి ఉన్న వేర్లు గురించి ఆలోచించము , చూడము . మన రెండు కళ్ళకు కనిపించే ప్రతీదీ నిజం అని మనం తరచూ నిర్ధారించుకుంటూ ఉంటాం .
కానీ , మన కళ్లే మనల్ని అనేక సార్లు మోసం పోయేందుకు కారణం అవుతాయి అని ఏనాడూ గ్రహించలేక పోతుంటాం .
🌿🌿🌿🌿🌿
మనిషి జీవితం కూడా ఒక మహా వృక్షం .
మనిషి ఎదుగుదల లేక వృద్ధి అనేది చదువు, హోదా , ఉద్యోగం, అందం, ఆర్థిక స్తోమత , వేషధారణ , హోదా వంటివి చూసి నిర్ణయిస్తాం . అవన్నీ ఒక మనిషి లో చూసి ఊహించుకొని ఒక అభిప్రాయం మన మనసు లో ఏర్పరచుకుంటాం . ఇది సహజంగా జరిగే ప్రక్రియ.
ఈ సృష్టిలో ప్రతి రూపానికి జీవం ఉన్న వాటికి , లేని వాటికి కూడా రెండు స్థితులు ఉంటాయి.
ఒకటి బాహ్యం . . . బయట కు కనిపించేది .
రెండు అంతరం . . . లోపల ఉండి కనిపించనిది.
ఎవరైతే మన కంటికి బాహ్యంగా కనిపిస్తూ , చదువు ఉద్యోగం , ఆర్థికం, అందం, హోదా ఇలా ఎన్నో అంశాలలో ఉన్న వారంతా నిజానికి వృద్ధి చెందినట్లేనా ? వారు దృఢం గా , స్థిరంగా ఉంటున్నట్లు భావించవచ్చా ?
అంటే ముమ్మాటికీ కాదు . . .
బాహ్యం గా కనిపించే స్థితి తో మనిషి వృద్ధి చెందినట్లు అనిపించినా, కంటికి కనిపించినా సరే , అంతరంగం లో మనసు మరియు ఆలోచనలు స్థిరంగా ఉంటాన్నాయా లేదా అనేదే ముఖ్యం . అంతరంగం దృఢత్వం నిశ్చయం తో ఉండాలి . గుణాలు చపలత్వం లేకుండా ఉండాలి . కానీ ఇవేవీ బయటకు చూడడానికి కనపడవు. ఎందుకంటే మనం బయట ప్రపంచాన్ని మాటలతో , హుందాతనం తో , నటన తో భ్రమింప చేయగలుగుతాం .
బయట చాలా మంది ఇది చూసిన వారు ఉంటే వారిలా గొప్పగా ఉండాలి అనుకుంటారు. ఇక్కడి వరకు మంచిదే . ఎందుకంటే ఈ భౌతిక మాయా ప్రపంచం లో జీవించాలి అంటే ఇలా ఉండడం ఒక అవసరమే.
కానీ మనుషుల జీవితం లో అకస్మాత్తుగా ఊహించని సంఘటనలు , కుటుంబం , వృత్తి , ఆర్థిక అనారోగ్య సమస్యలు , విషాదాలు తలెత్తినప్పుడు నిలబడలేక కూలిపోతారు . ఇటీవల ఇటువంటి ఉదంతాలు ఎన్నో జరుగుతున్నాయి . కొందరు ఆత్మహత్యలు చేసుకుంటారు లేదా సమస్యలు పరిష్కరించుకోవడం తెలియక అల్లకల్లోలం అనుభవిస్తారు . వీటిని మనుషుల జీవితం లో సంభవించే తుఫానులు అంటారు .
వృక్షం యొక్క వేర్లు వలే మనిషి లోపల, అంతరంగ మానసిక దృఢత్వ లోపం వలన జరుగుతుంది .
మనిషి ఎప్పటికైనా ఆధారపడవలసింది పైన కనిపించే బాహ్య సౌందర్యం , వస్తు విలాసాలు , పై మెరుగులు పట్ల కాదు . . . అంతర్ముఖ స్థిరత్వం పైన . దీనిని ఆత్మ విశ్వాసం, ఆత్మ స్థితి అని అనవచ్చు.
ఎటువంటి పరిస్థితుల్లో నైనా నిలబడ గలిగే అంతరంగ సుస్థిరత కావాలి . ఈ రోజు ఆస్తులు ధనం భోగాలు అన్నీ ఉండవచ్చు . అకస్మాత్తుగా అవి అన్నీ పోయి రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితులు కూడా రాబోతున్నాయి. ఇప్పటికే వచ్చేసాయి . ప్రత్యక్షం గా మన కళ్ళతో మనము చూస్తూనే ఉన్నాం .
ఇటీవల నేపాల్ లో ప్రకృతి భీభత్సం , నిమిషాల లో జలమయం . . . రెండు సంవత్సరాల క్రితం ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం. పాలస్తీనా లో గాజా అనే నగరం నుంచి కట్టు బట్టలతో లక్షల మంది ఈజిప్టు వలస వెళ్లారు. గాజా అనే మహా నగరం మొత్తం ఖాళీ అయిపోయింది. ఇందులో ధనిక సామాన్య భేదం లేదు. సమస్తం తమకు ఉన్నవి వదిలి అందరూ కట్టుబట్టలతో వెళ్లి పోయారు.
మరోవైపు రష్యా ఉక్రెయిన్ యుద్దం లో అనేక లక్షల మంది నిరాశ్రయులయ్యారు . ఈ యుద్దం ఇంకా నేటికీ జరుగుతుంది .
అమెరికా , ఇరాన్ , ఖతార్ , సౌదీ , గల్ఫ్ దేశాల యుద్ధం లో ఎన్నో వేలకు వేలు మంది తాము కష్టపడి సంపాదించిన ఆస్తులు పోగొట్టుకుని నిరాశ్రయులయ్యారు . ఇది ఆరంభం మాత్రమే.
నేటి బాహ్య ప్రపంచంలో మనిషి పోగుచేసుకున్నది ఏదీ కూడా మనిషి కి శాశ్వతం కాదు, అని నిరూపించే కాలం ప్రత్యక్షం గా ఆరంభం అయింది. నేడు మనం జీవిస్తున్నది ఈ కాలం లోనే . ఇందులో ఏ మాత్రం సందేహం లేదు . ప్రపంచంలో ఏదో మూల ఏదో జరుగుతుందని మనకేం సంబంధం అనుకుంటే అది చాలా పొరపాటు . అది ఏదొక రూపం లో మనం ఉన్న చోటే కావచ్చు. ఎందుకంటే రాబోయే కాలం అంతా మనం ప్రత్యక్షం గా చూడవలసింది , ఎదుర్కొన వలసింది ఇదే . అందుకు మన అంతరంగ మానసిక స్థితి సిద్దంగా ఉందా లేదా అనే విషయం మన మనో స్థితి పైనే ఆధారపడి ఉంటుంది .
ఇప్పటికే మనం ఒక సేంపిల్ చూశాం. . . కరోనా. ఈ ప్రపంచం మొత్తం చీకటి లో నెలల తరబడి ఉండడం ప్రత్యక్షం గా చూశాం . కరోనా సోకిన వారికంటే , ఆ భయం వలన చనిపోయిన వారి సంఖ్య చాలా ఎక్కువ. అంతరంగం దృఢత్వం ధైర్యం స్థిరత్వం లేకపోవడం వలన ఆరోగ్యం పైకి కనిపిస్తున్న వారు కూడా టి.వి.లో వార్తలు చూసి చనిపోయిన వారు కోకొల్లలు.
వేర్లు దృఢం గా ఉంటే నే , చెట్టు ఎలాంటి తుఫానులనైనా ఎదుర్కొని నిలబడుతుంది.
మనిషి అంతరంగం, మనసు దృఢం గా ఉంటేనే ఎలాంటి పరిస్థితుల నైనా ఎదుర్కొన గలడు . అందుకు మనిషి కి కావలసింది దైవ బలం తో కూడిన మనోబలం , నిత్యం ఆధ్యాత్మికత, ధ్యాన యోగ సాధన.
పరిస్థితులు ఎప్పుడూ మనకు చెప్పి రావు. అకస్మాత్తుగా నే వస్తాయి. ఏం జరిగినా, సిద్దం అనే మనో స్థితి ప్రతి మనిషి కలిగి ఉండాలి.
మనిషి బాహ్యం మాత్రమే కాకుండా, అంతరం కూడా దృఢం గా ఉంటేనే వృద్ధి చెందినట్లు.
ఒక మహ వృక్షం ధృడంగా నిలబడింది అంటే అది ఆ బీజం (విత్తనం) , వేరు యొక్క బలం .
ప్రస్తుత కాలమాన పరిస్థితులను మనో దృష్టి తో చూసినపుడు , అనిపించింది మాత్రమే రాయడం జరిగింది. కానీ , ఆందోళనలు కలిగించాలని కాదు .
ఓం శాంతి
శివ బాబా ( శివుడు తండ్రి) 🙏 .
ఓం నమఃశివాయ
యడ్ల శ్రీనివాసరావు 25 sep 2026 9:00 pm.

No comments:
Post a Comment