Saturday, September 12, 2026

783. శంకరుడు సంసార తపస్వి

 

శంకరుడు సంసార తపస్వి 


శంకరుడు సంసార తపస్వి . భార్య సతీదేవి పై అపారమైన ప్రేమ కలవాడు . సతీదేవి తండ్రి అయిన దక్షుడు చేసిన అవమానం భరించలేక సతీదేవి మరణిస్తుంది. కోపోద్రిక్తుడైన శంకరుడు తలపెట్టిన వినాశనాన్ని శాంతింప చేయడానికి విష్ణువు, దేవతలు ఎంతో ప్రయత్నిస్తారు .  ఇది మనందరికీ తెలిసిన శాస్త్ర విషయం .


సహజంగా నే తపస్వి , వైరాగి అయిన శంకరుడు ఆ తర్వాత సంపూర్ణ బైరాగి గా మారుతాడు . సర్వం త్యజిస్తాడు . ఒక కమండలం, పీతాంబరంతో శివ ధ్యానం లోనే లీనం అయి ఉంటాడు . తన శక్తి తో సృష్టి ని భూత ప్రేత పిశాచాల నుంచి సంరక్షణ చేస్తూ ఉంటాడు. దుష్టశిక్షణ (వినాశనం) చేస్తాడు . ప్రేమను పంచుతాడు. సర్వుల లో ఉన్న వికారాలను దానం గా స్వీకరిస్తూ గరళం గా తన గొంతు లోనే దాచుకొని ఉంటాడు .

ఇందులో మనం గ్రహించవలసిన సూక్ష్మం చాలా ఉంది . 


శంకరుడు సంసారి అయినా కూడా  , ఆది నుంచి శివుని తపస్సు చేస్తూనే ఉండేవాడు . (ఈ విషయం  శంకరుని ఫోటో లో గమనించవచ్చు  ఎదుట శివ లింగం ఉండడం) . గృహస్థుడు , సంసారి అయిన శంకరుడు గృహస్థాశ్రమం లో ఉంటూనే తపస్సు చేసేవాడు . తన ధర్మం ఆచరించే వాడు . 


వాస్తవానికి బ్రహ్మ విష్ణు శంకరుడు ముగ్గురు శివుని యొక్క సృష్టి స్థితి లయం కోసం రూపొందించిన రూపాలు . 

ఇందులో ….. బ్రహ్మ , విష్ణువు యొక్క కర్తవ్యాలు బ్రహ్మ శివుని జ్ఞానాన్ని విస్తరించడానికి ఆధారమవుతాడు , విష్ణు సృష్టి పాలన చేయడానికి నియమితుడవుతాడు . కానీ శంకరుడు మాత్రం శివుని లక్షణాలను (నిరాడంబరం , వైరాగ్యం, ధ్యానం , ప్రేమ , కరుణ , సృష్టి సంరక్షణ) వంటి వాటిని ప్రతిబంబిస్తాడు.  అందుకే  శాస్త్రాలలో శివుడు శంకరుడు ఒకరే అని రాసేశారు. కానీ వాస్తవానికి శివుడు వేరు , శంకరుడు వేరు .


నేడు ఈ విషయానికి ఆధారం గమనిస్తే … భూమి పై భక్తి ప్రారంభం అయిన ద్వాపర యుగం నుంచి కూడా శివాలయాలు (శివలింగం) ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా శంకరుడికి ఆలయం లేదు . అనగా శంకరుడి విగ్రహం తో ఆలయం లేదు . కొన్ని చోట్ల మాత్రం ఆలయం పైన శంకరుడి రూపం పెడతారు కానీ గర్బగుడి లో మాత్రం శివుడు (శివలింగమే) ఉంటుంది . 

శంకరుడు దేవత , సూక్ష్మ దేహము ధరించి ఉన్న వాడు. 

శివుడు భగవంతుడు , దేహము లేని జ్యోతి శక్తి స్వరూపం.  శివుడు పరమాత్ముడు ( శాస్త్రాలలో ఈ స్పష్టత ఇవ్వక పోవడంతో , తెలియని తనంతో శివుడు శంకరుడు ఒకటే అని కలిపి కధలలో చెప్పడం వలన అదే ఒరవడి నడుస్తుంది .)


మనం గమనిస్తే ... మనకు విశేషంగా  భరత భూమి పై ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి . ఇవి ఎంతో విశేషత కలిగి ఉంటాయి. కానీ ఏ ఆలయం లోనూ కూడా శంకరుడి విగ్రహం కానీ , రూపం కానీ ఉండదు .  శివ లింగం మాత్రమే ఉంటుంది.


శంకరుడు గురించి ఇంత వివరణ ఎందుకు అంటే …. గృహస్థ ధర్మము ఆచరించి  , సంసారం లో యోగి గా అయి  ,  మనసున అతీతమైన వైరాగ్యం తో నెలవు అయినాడు  శంకరుడు . 

ఈ విధంగా నేడు గృహస్థ ధర్మం లో , సంసారం లో ఉన్న మానవ స్త్రీ పురుషులు కూడా భగవంతుని పై(శివ పరమాత్మ పై) భక్తి , జ్ఞానం , ధ్యానం వైరాగ్యం  , త్యాగం  స్థితులతో   ధ్యాని గా యోగి గా , లోక సంరక్షకునిగా , దుష్ట వికారాలను శిక్షిస్తూ  ,  శంకరుని లక్షణాలతో జీవించాలి అనేందుకు శంకరుడే ఆదర్శం .


భగవంతుని కోసం , దుఖ విముక్తి కోసం సంసారం విడిచి పెట్టి అడవులకు, ఆశ్రమాలకు , వెళ్ళి తపస్సు చేయనవసరం  లేదు.  సంసారం లో ఉంటూనే మనసు ను పవిత్రంగా చేసుకునే విధానమే భగవంతుని సహజ రాజయోగం  అనే విద్య ద్వారా తెలుస్తుంది . ఈ విషయం శివుడు రచించిన భగవద్గీత జ్ఞానం లో కూడ రచించబడి  ఉన్నది.


శంకరుడు వైరాగ్యానికి ప్రతీక . వైరాగ్యం అంటే అందరినీ విడిచి పెట్టడం కాదు. అందరిలో అన్నింటా ఉంటూనే మనసు ను ఎవరి పట్ల , ఏ వస్తు వైభవాల పైన మోహం లేకుండా అతీతంగా ఉంచుకోవడం.

అసలు సిసలైన వైరాగి శంకరుడు . 

శివుని యొక్క గీతా జ్ఞాన రచన ద్వారా  అర్దం చేసుకోవలసింది ఒకటే ,  శివుని ని చేరుకునేందుకు శంకరుడి జీవించిన విధానం మార్గదర్శకం అవుతుంది . అందుకే శివుడిని శంకరుడిని ఒకటే అని భావించిన కొందరు అనాది కాలంలో  శివుడు శంకరుడు ఒకటే అనేశారు .


మూలాలను  స్పృశిస్తే నే  సత్యం తెలుసుకోవచ్చు.

 

ఓం శాంతి ( నేను ఆత్మను. నా స్వధర్మం శాంతి)

శివ బాబా (శివుడే తండ్రి)

ఓం నమఃశివాయ ( ఆత్మ నైన నేను పరమాత్మ శివుని కి నమస్కరిస్తున్నాను)


యడ్ల శ్రీనివాసరావు 13 Sep 2026 , 9:30 AM.

No comments:

Post a Comment

783. శంకరుడు సంసార తపస్వి

  శంకరుడు సంసార తపస్వి  శంకరుడు సంసార తపస్వి . భార్య సతీదేవి పై అపారమైన ప్రేమ కలవాడు . సతీదేవి తండ్రి అయిన దక్షుడు చేసిన అవమానం భరించలేక...