Wednesday, September 16, 2026

786. ఉత్తమ శిల

 

ఉత్తమ శిల 



ఒక ఊరిలో ఒక శిల్పి ఉండేవాడు . అతడు ఒక రోజు పక్క ఊరికి పని మీద వెళ్ళి తిరిగి వస్తుంటే , ఊరి పొలిమేర లో ఒక నిర్మానుష్య ప్రదేశం లో అద్భుతంగా మెరుస్తున్న అరుదైన శిల దొరికింది . 

శిల్పి ముఖం లో అమితమైన ఆనందం వికసించింది , మనసులో అనుకుంటున్నాడు …. ఆహా నా అదృష్టం ఇంత ధృఢమైన మేలిమి జాతి రాయిని నా జన్మ లో ఇప్పటి వరకూ చూడలేదు . దీనిని అధ్బుతమైన కళాఖండం గా తీర్చిదిద్దాలి అనుకుని ఆ శిలను ఇంటికి తీసుకు వెళ్ళాడు . 

మంచి రోజు చూసుకుని పని ప్రారంభించాడు . ఆ శిలను పగలు రాత్రి శ్రమ పడుతూ అందమైన శిల్పం గా చెక్కడం ఆరంభించాడు . కొన్ని రోజుల తర్వాత , శిల్పి చెక్కడం లో వేస్తున్న ఉలి దెబ్బలు తట్టుకోలేక , ఆ రాయి లబో దిబో మంటూ మనసు లో ఏడ్చేది . ఇదంతా ఏమీ తెలియని శిల్పి , తన శైలిలో చెక్కుతూ రూపు దిద్దేవాడు . 

ఆఖరికి ఒకరోజు , ఉలి దెబ్బలు తట్టుకోలేని ఆ శిల రెండు ముక్కలు గా పగిలిపోయింది . అప్పటి వరకు పడిన శ్రమ వృధా అయింది అని శిల్పి నిరాశ చెందాడు , చేసేది ఏమి లేక , ఆ రాయి ని ఊరి చివర పారేశాడు . 


శిల్పి అక్కడి నుంచి తిరిగి వస్తుంటే ఒక సాధారణ మైన నల్లరాయి కనిపించింది. తన జీవన భృతి కోసం, ఏదో ఒక శిల్పం చెక్కి తీరాలి కదా అని మనసు లో అనుకొని ఆ రాయి ని ఇంటికి తీసుకు వెళ్ళాడు. 

మరుసటిరోజు నుంచే , ఆ రాయి ని ఒక శిల్పం గా చెక్కడం ఆరంభించాడు . శిల్పి చెక్కే సమయం లో కొడుతున్న ఉలి దెబ్బలను , ఆ రాయి ఆనందం గా భరించేది. కొన్ని రోజుల కి అది ఒక దేవతా శిల్పం గా తయారైంది . 

పొరుగూరు నుంచి ఒక ఆసామి వచ్చి ఆ శిల్పం నచ్చి , శిల్పికి  ధనం ఇచ్చి తన ఊరికి తీసుకెళ్ళి అందం గా ఉంటుందని ,  ఊరి మధ్యలో ఉన్న రావి చెట్టు కింద పెట్టాడు . 

ఊరిలోని వారు , ఆ దారిలో పోతూ ఉన్నప్పుడు , ఆ శిల్పం వైపు తదేకంగా చూసి వెళుతూ ఉండేవారు . వారికి శిల్పంలో ఏదో ఆకర్షణ కనిపించేది. వారు వెళ్ళిన ప్రతి పని సఫలం అయ్యేది. అది క్రమేపీ అందరికీ ఒక నమ్మకం గా ఏర్పడి , ఆ శిల్పాన్ని పూజించడం ఆరంభించారు . ఇది. చుట్టుపక్కల గ్రామాలకు కూడా పాకి జనం తండోపతండాలుగా వచ్చేవారు . వారు తెచ్చిన కొబ్బరికాయలు కొట్టడానికి శిల్పం ముందు ఎవరో ఒక రాయిని తెచ్చి పెట్టారు .  

ఇంతకీ ఆ రాయి ఉలి దెబ్బలను తట్టుకోలేక శిల్పి చేతిలో పగలిపోయిన  మొదటి శిల . ఆ రాయి దెబ్బలు తప్పించు కుందాము అనుకున్నా సరే, తిరిగి కొబ్బరి చెక్కల దెబ్బలు తప్పడం లేదు . 

శిల్పి చేతిలో ఆనందం గా ఉలి దెబ్బలను తట్టుకుని నిలబడిన రెండవ రాయి అద్భుతమైన కళాఖండం అయి  , నేడు నిత్యం పూజలందుకుంటుంది .


మనిషి జీవితం కూడా ఇంతే . . . 


ఒక మనిషి ఉత్తముడు గా , మేలిమి గా తీర్చిదిద్దబడాలి  అంటే , ఎన్నో ఆటుపోట్లు, కష్టాలు కన్నీళ్లు , నిందలు , అవమానాలు , ఆకలి పస్తులు చిత్ర హింసలు అన్నీ భరించవలసిందే . వాటికి భయపడి దాక్కుందాం తప్పించుకుందాం  అనుకుంటే  ఒకటి అసంపూర్ణంగా మిగిలి పోవల్సివస్తుంది  . . .  రెండవది ఎప్పటికైనా సరే , ఎన్ని జన్మల తర్వాత అయినా సరే అనుభవించ వలసిన కర్మ ఏదొక రూపం లో అనుభవించ తప్పదు . అపటి వరకు కర్మ వెంటాడుతూనే ఉంటుంది . 

అదే విధంగా  భగవంతుని స్మృతి లో ఉంటూ ఆ బాధలను  ఆనందం గా భరిస్తే , వికర్మలు  తీరిపోయి . భవిష్యత్ ఊహించని ఉత్తమ స్థితి కి చేరుకుంటుంది . 


నిన్ను నన్ను శిల్పం వలే  చెక్కేది . . .  తీర్చిదిద్దే   ఆ శిల్పి   పరమాత్మ  శివుడే .


ఓం శాంతి  (నేను ఆత్మను, నా స్వధర్మం శాంతి)

ఓం నమఃశివాయ (ఆత్మ నైన నేను పరమాత్మ శివుని నమస్కరించుచున్నాను)

శివబాబా  (శివుడు తండ్రి).


యడ్ల శ్రీనివాసరావు 16 Sep 2026 8:00 PM .

No comments:

Post a Comment

786. ఉత్తమ శిల

  ఉత్తమ శిల  ఒక ఊరిలో ఒక శిల్పి ఉండేవాడు . అతడు ఒక రోజు పక్క ఊరికి పని మీద వెళ్ళి తిరిగి వస్తుంటే , ఊరి పొలిమేర లో ఒక నిర్మానుష్య ప్రదేశం...