Saturday, May 4, 2024

494. Failures Are Accurate Winners

 

Failures Are Accurate Winners


• అపజయం అనే పదం వినగానే ప్రతి మనిషి లో కలిగేది ఒక భయం, మానసిక ఆందోళన. మనిషి ఏదైతే కోరుకుంటాడో అది పొందక పోవడం, దేని కోసం అయితే ప్రయత్నించి విఫలం అవుతాడో అదే అపజయం, ఫెయిల్యూర్.

• ఏదైనా ఒక విషయం లో అనగా, ఒక వ్యాపారి తనకు జరిగిన నష్టం లో,    ఒక విద్యార్థి పరీక్షలలో , ఒక వ్యక్తి ఉద్యోగ ప్రయత్నం లో,   ఒక ప్రేమికుడు ప్రేమ లో ఇలా  ఎన్నో జీవిత అంశాలలో    మనిషి కి అపజయం కలిగినపుడు లేదా ఫెయిల్యూర్ గా మిగిలినపుడు మనిషి మనసు పడే బాధ వర్ణనాతీతం. ఆ సమయంలో  ప్రపంచం అంతా ఒకవైపు, తానొక్కడే మరో వైపు అన్నట్లు అయిపోతుంది.   ఒంటరి తనం ఆవహిస్తుంది. ధైర్యం నశిస్తుంది. ఆత్మన్యూనత  ( inferiority complex) భావం వేధిస్తుంది. అంతా చీకటి కమ్మేసినట్లు ఉంటుంది. ఈ  ప్రపంచం మనల్ని చూసి వెక్కిరిస్తూ న్నట్లు అనిపిస్తుంది. సొంత మనుషులు పైకి మాములుగా ఉన్నా లోలోపల మాత్రం అసమర్థుడు గా ముద్ర వేస్తారు.


• ఇదంతా  అతి సహజంగా చాలా మందికి తమ జీవితాలలో ఏదొక వయసు లో, ఏదొక సమయం లో తప్పకుండా ఎదురయ్యే పరిస్థితి .  కాస్త ధృడమైన మనస్తత్వం కలిగిన వారు తమ జీవితం లో వచ్చిన ఫెయిల్యూర్స్ ని    మౌనం గా ఎదుర్కొంటారు. కాస్త సున్నిత మనస్తత్వం కలిగిన వారు మాత్రం డిప్రెషన్ లోకి వెళ్లి మానసికంగా అనారోగ్యంతో ఇబ్బంది పడతారు. ఈ స్థితి మితిమీరిన  కొందరు ఆత్మహత్యలు  కూడా   చేసుకుంటారు.


• చాలా మంది మనుషులు,  జీవితం పట్ల అవగాహన లేని వారు, సంకుచిత స్వభావం కలవారు పైన చెప్పిన విధంగా అపజయాల వలన సర్వస్వం కోల్పోయిన వారిగా క్రుంగి మిగిలి ఉంటారు. కానీ ఇలా ఉండడం ముమ్మాటికీ తప్పు.


• మనం ఎంత కష్టపడినా విజయం దక్కడం లేదు  సరికదా అపజయం అనేది ఒకసారి కాదు, రెండు మూడు నాలుగు సార్లు వస్తుంది అంటే అంత అదృష్టం ఆ మనిషి కి ఇంకొకటి లేదు. అవును ఇది నిజం.

• ఎందుకంటే ఒక మనిషి తీక్షణంగా ఒక విజయం కోసం ప్రయత్నం చేసే సమయంలో తనలో ఉన్న సర్వ శక్తులను అది సాధించు కోవడం లో రాత్రింబవళ్ళు వినియోగిస్తాడు.    ఈ స్థితిలో విజయం దక్కలేదు అంటే తన యెక్క శక్తి తో, తన జీవితంలో అంతకు మించి ఏదో గొప్ప విజయం వరించ బోతుంది అని అర్దం. ఆ సమయం తనకు ఇంకా ఆసన్నం కాలేదు అని అర్థం. తన శక్తి భవిష్యత్తులో మరింత రెట్టింపు అవబోతుంది అని అర్దం.

• ఉదాహరణకు ఒక విద్యార్థి ఎన్ని సార్లు అయినా ఉత్తీర్ణుడు కాలేక పోతున్నాడు అంటే, భవిష్యత్తు లో పెద్ద వ్యాపార వేత్త అయి పదిమంది కి ఉపాధి కల్పిస్తాడు. ఒక వ్యక్తి తాను అనుకున్న ఉద్యోగం సాధించ లేకపోతున్నాడు అంటే అంతకు మించి మరో స్థాయి ఉన్న ఉద్యోగం దేవుడు తన కోసం సిద్దం చేసి ఉంటాడని అర్దం. ఒక మనిషి తన ప్రేమ లో విఫలం అయ్యాడు అంటే ఆ ప్రేమ వలన పొందే, ఏదో ఆపద తప్పింది అని అర్దం. ఒక నటుడు అవమానాలు, ఎదుర్కొంటున్నాడు అంటే గొప్ప నటుడు గా మారబోతున్నాడు అని అర్దం.


• ప్రతి మనిషి కి తన జీవితంలో భాధ కలిగించే అంశానికి ప్రక్కనే ఒక ఉపశమనం దాగి ఉంటుంది. కానీ మనిషి ఈ ఉపశమనం గ్రహించలేక దుఖిస్తాడు. చీకటి అనుభవించే వాడు ఎన్నటికి చీకటి లో ఉండిపోకూడదు.   ఆ చీకటి ని చీల్చే శక్తి పొందే ఆలోచన చేయాలి.   అప్పుడే వెలుగు లో ఉన్న నిజమైన ఆనందం ఆస్వాదిస్తాడు.


• ఈనాడు జీవితం లో విజయం సాధించాం అని చెప్పే వారిని ఒకసారి తట్టి చూడండి, వారు ఎన్ని ఫెయిల్యూర్స్ తరువాత ఒక గొప్ప విజయం సాధించ గలిగారో వారి మాటల్లో చెపుతారు. అపజయం ఎరగకుండా విజయం సాధిస్తే , ఆ విజయం లో పొందే ఆనందం , ఆత్మ సంతృప్తి అనేది మనసు కి అనుభవం కాదు. చెప్పాలంటే ఆ విజయం లోని సంతోషం పూర్తిగా ఆస్వాదించ లేరు. మనిషి కి విజయం అనేది ఎలా ఉండాలంటే, ఎడారిలో చెప్పులు లేకుండా, దాహం తో నడిచి నడిచిన తరువాత ఒకచోట చల్లని నీరు దొరికితే కడుపు నిండా తాగితే, ఎలా ఉంటుందో అలా ఉండాలి. నూటికి 98 శాతం విజయం సాధించిన వారి పరిస్థితి ఇదే.


• అపజయాలు అనేవి మనిషిని మరింత పటిష్టంగా చేయడానికి , కష్టం విలువ తెలియ చేయడానికి మాత్రమే వస్తాయి. ఎందుకంటే అపజయం, కష్టం తెలిసిన వాడే సాటి మనిషిని, అర్దం చేసుకొని సహాయం చేయగలడు.


• జీవితంలో గాని, మరే ఇతర అంశాలలో గాని ప్రయత్నం చేసి ఓడిన వారు ఎప్పుడూ దురదృష్టవంతులు కారు. వీరు తమ జీవితం లో ఏదొక దశలో తప్పని సరిగా విజయం సాధిస్తారు. ఇటువంటి వారే తమ అనుభవాల ద్వారా ఎంతో మందిని తీర్చి దిద్దితారు. మరెందరికో ఆదర్శం అవుతారు. దీనిని మించిన విజయం ఏముంటుంది. మంచి ఆటగాడిని తయారు చేసే గురువు బహుశా ఏనాడూ బహుమతులు నోచుకోక పోవచ్చు. కానీ గెలిచిన ఆటగాడు మరియు కోచ్ ఇద్దరూ విజయం సాధించినట్లే. నిజమైన ఆధ్యాత్మిక గురువు సన్యాసి వలే ఏకాంతం గా జీవిస్తాడు. కానీ తన జ్ఞానం తో ఎంతో మంది లో పరివర్తన కలిగిస్తాడు, సన్మార్గం లో పెడతాడు. ఇది కాదా విజయం.


• విజయం అనేది, ఎప్పుడూ నీ ఒక్కడి లో కాదు ఉండాల్సింది …. పదిమంది లో నీ విజయం ప్రతిబింబం గా ఉంటేనే అది చిరస్థాయిగా చరిత్ర లో నిలిచిపోతుంది.


• అపజయాలు, అవమానాలు, నిందలు అనేవి మనిషి వ్యక్తిత్వాన్ని మరింత అందంగా, ధృడంగా, గొప్ప గా తీర్చి దిద్దే అంశాలు. ఇవి నీ చుట్టూ ఉన్న వారికి కాకుండా నీకు మాత్రమే కలుగుతున్నాయి అంటే వారందరి కంటే ఉన్నతమైన స్థితి కి , గొప్ప విజయానికి అతి చేరువలో నువ్వు ఉన్నావని అర్దం. కానీ కావాల్సింది ఒక్కటే. ఓర్పు, సహనం, మనోధైర్యం.


• ఈ రచన  మోటివేషన్ కోసం  కాదు. ఇవి  నిజాలు. ఈ నిజాలను తెలుసు కోవడం వలన ఎంతోమంది, ఎన్నో విషయాలు తెలుసుకో గలుగుతారు, తమ మనోధైర్యం తో ముందుకు సాగుతారు అనే సదుద్దేశంతో మాత్రమే.


చీకట్లో నే  నక్షత్రాలు కనపడతాయి. 

వైఫల్యాల్లో, అపజయాల్లో , కష్టాల్లో నే  సత్యం తెలుస్తుంది.



యడ్ల శ్రీనివాసరావు, 4 May 2024, 9:00 PM.


No comments:

Post a Comment

567. బాల్యం తీపి

  బాల్యం తీపి  • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు ‌  బాల్యం    తీపి   పసి బాల్యం   తీపి. • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు   ప్రాయం  ...