Tuesday, May 14, 2024

497. ప్రేమ భాష్యం

 

ప్రేమ భాష్యం 



• ప్రేమ అనేది ఒక మానసిక శక్తి  లోనుంచి  వెలువడే అత్యద్భుతమైన ఔషధం. కొందరు ఈ ప్రేమను మనుషుల పై చూపిస్తారు. మరికొందరు జంతు, మూగ జీవులపై చూపిస్తారు.  ఇంకొందరు ప్రకృతి పై చూపిస్తారు, మరికొందరు భగవంతుని పై చూపిస్తారు.

• ప్రేమ అంటే ఒక ఇష్టం.  కొన్ని సార్లు ఈ  ప్రేమ,  మోహం గాను తదుపరి కామం గాను మారుతుంది. ఇటువంటి ప్రేమ కాలక్రమేణా పరిమితం(limited) అయిపోయి స్వార్థం గాను  మారుతుంది. కొన్ని సార్లు అదే ప్రేమ త్యాగం గా మారి దశ దిశలా అనంతం గా (endless) వ్యాపిస్తుంది.    ప్రేమ ను వర్ణించడం అంటే గాలి ని బంధించడం వంటిది.


• ప్రేమ స్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. ప్రేమంటే ఇంతే, ఇలాగే ఉంటుంది అని కూడా చెప్పలేరు.   ఉదాహరణకు ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య విడదీయరాని ప్రేమ ఉంది అనుకుంటే …. ఆ స్త్రీ , తల్లి గా మారే సమయంలో తన మనసు లో ప్రేమ యొక్క అనుభూతి, భావం మారిపోతుంది. భర్తకు సర్వస్వం అర్పించిన ఆమెకు తన ప్రేమ లో చీలిక వస్తుంది.   ఎలా అంటే బిడ్డ స్వయం గా తల్లి గర్భంలో, ప్రతి అవయవం తో 9 నెలలు ముడిపడి, ఆ తల్లి శ్వాస నే బిడ్డ కూడా గర్భంలో పంచుకుంటుంది . ఇది ఆ తల్లి  బయటకు వర్ణించలేేేేదు   , కానీ ఆ బిడ్డ స్పర్శకు తల్లి అప్పటి వరకు భర్త నుండి ఏదైతే బాహ్య పరమైన ప్రేమ పొందిందో, అదంతా క్షీణిస్తుంది....    ఎందుకంటే భర్త అనే జీవి బయట తయారై వచ్చిన వాడు. కానీ బిడ్డ మాత్రం స్వయం గా , తన లో లో భాగమై తయారైన జీవి. ఈ విషయం గమనిస్తే ప్రేమ అనేది ఎలా మారుతుందో అర్దం అవుతుంది.

• భర్త తన ప్రేమ లో అంతర్భాగం గా భార్యని స్పృశిస్తాడు, పసిబిడ్డ కూడా తన ప్రాణం కోసం, జీవ మనుగడ కోసం తల్లి శరీరం స్పృశిస్తుంది. ఇదంతా సృష్టి ప్రతిసృష్టి లో అంతర్భాగం.  

• ఈ విషయం సూక్ష్మం గా ఆలోచిస్తే సృష్టి లో ప్రేమ అనేది ఎన్ని విధాలుగా రూపాంతరం చెందుతూ ఉంటుందో అర్థం అవుతుంది. అందుకే అంటారు ప్రేమను అభివర్ణించలేం అని. కొందరు ప్రేమ ను శారీరక అంశం గా భావిస్తారు. మరికొందరు అదే ప్రేమ ను మానసికంగా భావిస్తారు.   ప్రేమ కోరిక కలిగిస్తుంది, కోరిక తీరుస్తుంది,   కోరిక నుంచి విముక్తి నిస్తుంది. 

• ప్రేమను సరిగా అర్థం చేసుకుంటే … ప్రేమ లభించినపుడు సంతోషం, ఆనందం ఉంటుంది. అదే ప్రేమ దొరకనపుడు కలిగే బాధ లో మానసిక పరిపక్వత ఉంటుంది. ఈ పరిపక్వత అనేది మనసు ఉన్నత స్థితి పొందేందుకు దోహదం అవుతుంది. …. ప్రేమ, ఆత్మలో ఉన్న మనసు కి సంబంధించినది.  మనిషి ఒకే ఆత్మ తో జన్మ జన్మలుగా శరీరాలు, రూపాలు, ఆకృతులు  మారుస్తూ  ఉంటాడు.   కానీ ప్రేమ అనే ఔషధం పొందినప్పుడు కలిగే అనుభూతి, అనుభవం, మాధుర్యం సృష్టిలో ప్రతి జీవాత్మ కి ఒకే విధంగా ఉంటుంది.

• నిస్వార్థంగా ప్రేమించండి …. జీవించండి …. కల్మషాలు, మానసిక రుగ్మతలు తొలగుతాయి. మనిషి జన్మించడానికి మరణించడానికి మధ్య వారధి ప్రేమ. ప్రేమలో భాగం గా ఇవ్వవలసింది ఇస్తుంటే పొందవలసింది పొందుతూనే ఉంటారు. ప్రేమలో  త్యాగం ఉండొచ్చు అలాగే ఉండకపోవచ్చు. ప్రేమ పంచక పోయినా, పొందక పోయినా జీవికి విముక్తి కలగదు.


యడ్ల శ్రీనివాసరావు 14 May 2024 , 11:00 pm.







No comments:

Post a Comment

522. అమావాస్య ఆమని

  అమావాస్య  కోకిల. • అమావాస్య లో   …   ఆదమరచి   పాడింది    ఓ ఆమని. • ఆ రాగం   విని   చూసింది    జాబిలి. • నిశి    లోని    నింగి   అంతా   నిగ...