Sunday, May 12, 2024

496. మార్పు శాశ్వతమా ?

 

మార్పు   శాశ్వతమా ?


• పుట్టిన ప్రతి మనిషిలో కాలంతో పాటు అనేక మార్పులు సంభవిస్తాయి. ఈ మార్పులే జీవితాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తాయి.

• ప్రతి ఒక్కరికి ప్రత్యక్షం గా కంటికి కనిపించేది వయసు, తద్వారా శరీర రూపం లో జరిగే మార్పు. బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం. ఈ శరీర రూపాంతరాలు ప్రతి దశలో బయటకు కనిపిస్తూనే ఉంటాయి.  కానీ ప్రతి దశలో మనిషి శరీరాన్ని నడిపించేది కంటికి కనపడని మనసు. మనసు అంటే హృదయం లో నుంచి పుట్టే  ఆలోచన.

• మరి ఈ ఆలోచనలు అనేవి మార్పు చెందుతూ ఉంటాయా ? అంటే తప్పని సరిగా మారుతూ ఉంటాయా ? అంటే అవును మారుతాయి. మనసు లో మార్పులు బయటకు కనిపించేవి కావు. కానీ ఇవి చాలా శక్తివంతమైనవి గాను అలాగే బలహీనం గాను కూడా ఉంటాయి.

• ఒక మనిషి ని   చూడడానికి అందంగా లేదా విహీనంగా ఇతరులకు కనిపించవచ్చు. కానీ ఆ మనిషి మనసులో సముద్ర గర్భం అంత లోతైన బాధ ఉండొచ్చు లేదా ఆకాశం అంత , పరిధి లేని ఆనందం దాగి ఉండొచ్చు. ఈ విషయం స్వయం గా ఆ మనిషే తన మనసు ని పూర్తిగా అర్దం చేసుకోలేడు.  ఎందుకంటే పరిస్థితుల ప్రభావం వలన మనసులోని ఆలోచనలలో కలిగే మార్పులు ముందుగా ఊహించలేడు.  కాలం, పరిస్థితులతో పాటు సహజం గా అలా మార్పులు సంభవిస్తున్నాయి అనుకుంటాడు తప్పితే తనకంటూ ఒక మనసు ఉందనే స్పృహ తో కూడిన సూక్ష్మ విషయాన్ని గ్రహించలేడు.

• ఒక పరిపక్వత వచ్చే వరకు తనకంటూ ఒక మనసు ఉందనే విషయాన్ని అంతర్గతం గా ఫీల్ అవలేడు. అంటే తనకు అంటూ ఒక మనసు ఉందనే విషయం చాలా మందికి స్పృహ తెలియకుండానే జీవితం చాలా వరకు యాంత్రికంగా గడిచిపోతుంది.

• ఆహారం శరీరాన్ని పోషిస్తుంది. ఇది సహజమైన యాంత్రిక చర్య. మరి మనసు ని  ఏం  పోషిస్తాయి అంటే ప్రేమ. ఈ ప్రేమ లో కోరికలు, ఇష్టాలు, ఆశలు, నమ్మకాలు  ఉంటాయి. ఇవి ప్రతి మనిషి కి ఉంటాయి. కానీ వీటిని గుర్తించగలిగే వివేకం అందరికీ ఉంటుందా అంటే సమాధానం చెప్పలేం. ఎందుకంటే కొన్ని తరాల మనుషులు తమ కోరికలు, ఆశలు, ఇష్టాలు, ప్రేమ అనేవి సమాజం, కుటుంబ పరిస్థితుల ప్రభావం వలన అనాది నుంచి అణగదొక్కబడి, తమకు మనసు అనేది ఒకటి ఉంది అనే విషయం వారి స్పృహ లో లేక, గ్రహించలేక , ఇతరులు చెప్పిన విధంగా  ప్రభావితం అయి  జీవితం గడిపిన వారు ఎందరో ఉన్నారు. ఇటువంటి వారికి తమకు అంటూ హృదయం, ఇష్టాలు ఉన్నాయని జీవిత చరమాంకంలో తెలుస్తుంది. మరి ఈ చరమాంక దశలో మనసు లో మార్పులు సంభవిస్తే ? , ఈ జీవితం ఒకసారే, అనుకున్నది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని అనిపిస్తే ? ఇప్పటి వరకు నా మనసును  నేను గుర్తించ  లేేేదు  అనిపిస్తే?   ఇకనైనా నా మనసు కి  కావల్సింది  నేను ఇవ్వాలి అనిపిస్తే ?  మనసు స్వేచ్ఛ కోరుకుంటే ?…… ఒక అంతర్యుద్ధం, తిరుగుబాటు మొదలవుతుంది. ఎందుకంటే ఇక్కడ మార్పు అనేది సంభవించబోతుంది కాబట్టి.

• ఇదంతా ఎందుకు అంటే మనసు అనేది మార్పు చెందడం ప్రారంభిస్తే, తనకు నచ్చిన విధంగా మారుతుంది. ఇది బయటకు కనపడదు. ఒక మనిషి యొక్క మనసు ని దేవుడు కూడా ముందుగా ఊహించలేడు.

• ఈ సృష్టిలో ఏదీ శాశ్వతం, స్థిరం కాదు. మార్పు అనేది సహజం. అది శరీరానికైనా, మనసుకైనా. శరీరం అయితే మార్పు చెందుతూ ఏదోఒక రోజు శాశ్వతం గా నశించి పోతుంది. ఒక సారి పుట్టిన  మనిషి ఆకారం, రూపం తో  తిరిగి అదే విధంగా ఈ భూమి మీద పుట్టదు.  కానీ మనసు మాత్రం ఎన్నటికీ నశించదు, అది ఆత్మ లో నిక్షిప్తం అయి, ఎప్పుడూ శరీరాలు మారుతూనే ఉంటుంది. మనసు కొన్ని సార్లు కింద పడుతుంది, లేస్తుంది, నవ్వుతుంది, ఏడుస్తుంది, తేలికగా ఉంటుంది మరలా అంత లోనే బరువెక్కుతుంది .…. కాకపోతే ఒకటే , ఎవరి మనసు ని వారు మాత్రమే అర్దం చేసుకోవాలి, సముదాయించు కోవాలి , ఎందుకంటే ఒకరి మనసు మరొకరికి ఎన్నటికీ అర్దం కాదు కనుక.

• మనసు తన శరీర భారాన్ని ఎంతైనా మోయగలదు. కానీ శరీరం మాత్రం మనసు భారాన్ని కొంత పరిధి వరకే మోయగలదు. మనసు యొక్క భారం ఎక్కువైతే శరీరం నిర్వీర్యం అయిపోతుంది. అందుకే మనసు ని ఎప్పుడూ తేలికగా ఉంచుకోవాలి. ఎవరి మనసుని వారు ప్రేమించుకో గలగాలి.

• మనసు పూర్తిగా లొంగేది కేవలం ప్రేమ కు మాత్రమే. ఈ సృష్టిలో ప్రేమ కోరుకోని జీవి ఉండదు. ఆ ప్రేమ ఎటువంటిది అయినా సరే.

• ఆలోచనలు అనేవి మనిషి లో రెండు భాగాలలో జనియిస్తాయి. ఒకటి మెదడు, రెండవది మనసు , హృదయం. మెదడు లో పుట్టే ఆలోచనలు ఎంత సేపు లాభ నస్టాలు బేరీజు వేస్తాయి. ఈ మెదడు ఆలోచనల వలన మనిషి కి ఎప్పుడూ సుఖం, శాంతి, సంతోషం అనేవి ఉండవు సరికదా ఏ నాడైనా అవి లభిస్తే కేవలం కొన్ని నిమిషాలు లేదా గంటలు మాత్రమే.

• కానీ హృదయం లో అంటే మనసు లో నుంచి పుట్టిన ఆలోచనలు మెదడు ద్వారా అమలు పరిచినపుడు లాభమైనా నష్టమైనా కలిగే సంతోషం అద్బుతం గా ఉంటుంది. ఎందుకంటే హృదయం ఎప్పుడూ కోరుకునేది, ఇచ్చేది ప్రేమ మాత్రమే.

• మార్పు అనేది నిరంతరం మనిషి అంతరంగం లో జరిగే అద్భుతమైన ప్రక్రియ. ఏదీ శాశ్వతం కాదు అనేది నిజం.  మనసును వదిలేస్తే తేలుతుంది, ఎగురుతుంది ,  కింద పడుతుంది,   లేస్తుంది, ….. కానీ బలవంతంగా కట్టి పడేస్తే కకలావికలం అయి ప్రమాదానికి గురి అవుతుంది.

• ఆలోచనలు ఎలా మారినా, ఎవరి మనసు వారి చేతిలోనే ….  

మానసిక మైన  మార్పు  అనేది  ఒకరి వలన  తమ  చుట్టూ ఉన్నవారిలో  కలగడం  అసంభవం.  ఒకవేళ అలా అనిపిస్తే  అది   భ్రమ మాత్రమే.

ఎప్పటికైనా   మార్పు  సంభవించేది,   సంభవించ  వలసింది  కేవలం నీ లోనే  .... నీ లో లోనే.  అప్పుడే  నీ చుట్టూ  ఉన్న వారిలో  మార్పు జరిగినట్లు  నీకు  అనిపిస్తుంది.   

ఎవరికీ  వారే  స్వయం  పరివర్తన  చెందుతారు ... చెందాలి కూడా. 


యడ్ల శ్రీనివాసరావు 12 May 2024. 6:00 pm.


No comments:

Post a Comment

567. బాల్యం తీపి

  బాల్యం తీపి  • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు ‌  బాల్యం    తీపి   పసి బాల్యం   తీపి. • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు   ప్రాయం  ...