Saturday, May 18, 2024

499. నిశ్శబ్దం - చీకటి

 

నిశ్శబ్దం - చీకటి



• వెలుగు లో కూర్చుని వెలుగుని ఆనందించ గలగడం అనేది అమాయకత్వం అనిపిస్తుంది. ఎందుకంటే ఆ వెలుగు ఎవరికైనా కేవలం కొంత సమయం మాత్రమే భరించగలిగే ఆనందం ఇస్తుంది. ఆ తర్వాత ఆ వెలుగు లో ఉన్న కాంతి శక్తిని, మనిషి మనసు గ్రహించలేదు .

• చీకటి లో ఉండి వెలుగు ను ఆస్వాదించ గలగడం చాలా అద్బుతం గా ఉంటుంది. ఎంత సమయం చీకటి లో ఉన్నా సరే వెలుగును చూస్తూ ఆస్వాదించవచ్చు. ఇది మనసుకి ఆహ్లాదం మరియు అనంతమైన సంతోషం. ఉదాహరణకు రాత్రి పూట ఆరుబయట చీకటిలో కూర్చుని ఆకాశం వైపు చూస్తుంటే చందమామ, నక్షత్రాలు , వాటి నుంచి వచ్చే కాంతి ప్రతి మనిషి మనసును రంజింప చేస్తుంది. అనేక మానసిక ఆందోళనల నుంచి విముక్తి కలిగిస్తుంది. ఇది చీకటి యెక్క శక్తి, గొప్ప తనం.


• ఈ చీకటి లో నే అసలు సిసలైన సృష్టి నడుస్తుంది అనడం లో ఏ మాత్రం సందేహం లేదు. ఈ విశ్వం లో ప్రకృతి మొత్తం చీకటి లో నే జాగృతం అవుతుంది. అంటే మేల్కొంటుంది. అసలు సిసలైన మార్పు transformation ఈ సమయంలో నే జరుగుతుంది. ఉదాహరణకు మొక్కలు, పువ్వులు , పంటలు వంటివి రాత్రి చీకటి లోనే పరిణామం చెంది ఎదుగుతాయి.  అదే విధంగా   మానవ సృష్టికి   బీజ ఫలదీకరణం కూడా చీకటి లోనే, రాత్రి సమయంలో నే జరుగుతుంది. ఇంకా రాత్రి, చీకటి సమయం లోనే జీవుల కణజాలం అభివృద్ధి చెంది పెరుగుదల సంభవిస్తుంది. ఈ చీకటి సమయంలో నే ప్రకృతి తన పనిని తాను సమర్థవంతంగా చేస్తుంది.

• మనిషి కి మాత్రం ఎందుకో  చీకటి అంటే భయం. ఈ భయం అనేది మానసిక ఆందోళన. చీకటిని త్వరగా అంగీకరించలేడు.

• చీకటి లో దాగి ఉన్న అద్భుతమైన శక్తి నిశ్శబ్దం. ఈ నిశ్శబ్దం లోనే సృష్టి ఆవిర్భావం జరుగుతుంది. ఈ నిశ్శబ్దం ఎంతో మేధస్సుని, విశ్వ శక్తి ని, ఆరోగ్యాన్ని తరంగాల రూపంలో ఇస్తుంది.

• మనిషి మౌనం గా ఉండడం వలన క్రమేపీ ఆలోచనలు తగ్గి మనసుకి చీకటి ఆవరిస్తుంది. ఈ చీకటి లో నుంచే నిశ్శబ్దం అనుభవం అవుతుంది. ఈ నిశ్శబ్దం లో ఉండే శక్తి గ్రహించడం ద్వారా దైవం దిశగా దారి కనపడుతుంది. అందుకే యోగులు, మునులు, ధ్యానులు మౌనం గా, ఏకాంతం గా ఉండడానికి ఇష్టపడతారు.


• అకస్మాత్తుగా  ఎవరైనా చీకటి లోకి వెళితే కళ్లు కనిపించవు. అంతా అంధకారం, అయోమయం, భయం పుడుతుంది, గందరగోళం గా ఉంటుంది. కానీ కొంత సమయం తర్వాత కొంచెం చిన్నగా  కళ్లు చీకటిని ఛేదించడం ప్రారంభిస్తాయి.  క్రమేపీ కొంత సమయం తర్వాత చీకటిలో కూడా కళ్లు  కొంత మేరకు స్పష్టం గా చూడడం ఆరంభిస్తాయి. వెలుగు లో ఉంటూ వెలుగు చూసే కళ్లకంటే , చీకటి లో ఉంటూ చీకటిని చూసే కళ్లు చాలా గొప్పవి. వెలుగు లో ఉండి చీకటి ని చూడలేం, కానీ చీకటి లో ఉంటూ చీకటిని, వెలుగు ను కూడా చూడగలం.

• కాసేపు , మనకు తెలిసిన ఈ చీకటిని మనిషి జీవితంతో సరిపోల్చి చూస్తే చాలా వాస్తవాలు అర్ధం అవుతాయి.

• చీకటి అనేది మనిషి యొక్క దుఃఖం.  నిందలు, అవమానాలు, సమస్యలుగా భావిస్తే …. ఎంత ఎక్కువ గా వీటిని మనిషి అనుభవించగలడో అంతగా శక్తి వంతుడై, ఓర్పుతో వీటిని అధిగమించి అసలైన సంతోషం పొందగలడు.  భాదలు, నిందలు, అవమానాలు మనిషి ని కృంగదీస్తాయి, అంధకారంలో కి నెట్టెస్తాయి. …. కానీ మనిషి కి అసలు సిసలైన మార్పు వీటిలో నుంచే ఆరంభం అవుతుంది. ఇటువంటి వారి మనసు పునాది చాలా బలంగా ఉండి, ఎటువంటి ప్రతికూల స్థితులైనా ఒంటరిగా, ధైర్యం గా, నిజాయితీగా ఎదుర్కోగలరు.


• చీకటి అనేది బాహ్య ప్రపంచం లోనే కాదు, మనిషి అంతరంగం లో కూడా అలుముకొని ఉంటుంది. దీనిని ప్రేమించడం, అర్దం చేసుకోవడం చేస్తే అనంతమైన వెలుగుకి  దారి కనిపిస్తుంది. ఉదాహరణకు అందరికీ మంచి చేసే ఒక మనిషి,  చేయని  పనులకు అవమానాలు పడి,   తన అనుకున్న వారి చేసిన నమ్మకద్రోహనికి   బలై ,   ఈర్ష్య  అసూయ పరుల  మాటలకు  నిందలు పడి    సమాజానికి,  అన్ని బంధాలకు దూరం  అయితే    అది ముమ్మాటికీ ఆ మనిషి యొక్క అదృష్టంగా భావించాలి.   అటువంటి మనిషి ఏనాడూ,  బంధువులకు , స్నేహితులకు, సమాజానికి  దూరమయి  పోయానని బాధ పడనవసరం లేదు.  ఆ సమయంలో ఆ మనిషి కి ఆవహించిన చీకటి అందరినుంచి దూరం గా తీసుకెళ్ళి,   ఎవరో గాని చేరలేని  చూడలేని వెలుగుని చూపిస్తుంది.  బహుశా ఆ వెలుగు దైవం అయి ఉండవచ్చు,  లేదా మరేదయినా కావచ్చు.  అంటే ఇక్కడ గమనిస్తే చీకటి అనేది ఒక మనిషి కి ఎంత మేలు చేసిందో తెలుస్తుంది.


• ఇటువంటి సమయంలో ఆ మనిషి మొదట కృతజ్ఞతలు తెలియ చేయవలసింది, తనను దూరం చేసుకున్న బంధువులకు, స్నేహితులకు, సమాజానికి. వీరే కనుక   ప్రతి కూలతలు,  ప్రతి బంధనాలు సృష్టించక పోతే   ఆ మనిషి గుంపులో  గోవింద లాగ అలాగే ఉండిపోతాడు …… అంటే , మనిషి ఒక ఆలోచన సమర్థవంతంగా చేయగలిగితే  తనకు కలిగిన  ప్రతికూల  పరిస్థితులలో  దాగి ఉన్న లాభం గ్రహించవచ్చు.  మేలు పొందవచ్చు.  

ఎప్పుడైనా సరే ఒకటి కోల్పోయాం, కోల్పోతున్నాం అంటే మరొకటి లభిస్తుంది అని అర్థం. కాకపోతే  కోల్పోయిన దాంట్లో గాని లేదా లభించిన దాంట్లో గాని మనకు లాభం జరిగిందా, నష్టం జరిగిందా అనేది సూక్ష్మం గా, సమర్థవంతంగా తెలుసుకో గలగాలి.


• ఈ ప్రపంచంలో ప్రతి మేధావి, ఏకాంతాన్ని, చీకటి నే ఇష్టపడతారు. ఎందుకంటే ఏకాంతం లో నెగెటివ్ ఎనర్జీస్ తో   సహచర్యం  చేయ వలసిన  అవసరం  ఉండదు . అదే విధంగా   చీకటిలో   అంటే రాత్రి సమయంలో  తమ మేధస్సుని ఉపయోగించుకోవచ్చు.  దీనికి ఆధ్యాత్మిక కారణం కూడా ఉంది. రాత్రికి అధిపతి చంద్రుడు. చంద్రుడు అంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనసు. రాత్రి చేసే పనిలో చంద్రుని నుంచి వెలువడే శక్తి, మనసును చైతన్యం చేస్తుంది.


• చీకటి లో రాత్రి చేయ వలసినవి  మంచి పనులు. రాత్రి పదిగంటలు దాటిన తరువాత అమ్మవారి కి పూజ చేసి చూడండి, మంచి ఫలితాలు శక్తి వస్తుంది. అదే విధంగా రాత్రి రెండు గంటల సమయం నుండి ధ్యానం చేసి చూడండి, డైరెక్టుగా విశ్వానికి, విశ్వశక్తి కి కనెక్ట్ అవుతారు. అదే విధంగా రాత్రి చదువుకున్నది త్వరగా గుర్తు ఉంటుంది. ఎక్కువ శాతం శుభ ముహూర్తాలు రాత్రుళ్లు ఉంటాయి. ఎందుకంటే రాత్రి లో చీకటి ఉంటుంది. చీకటి లో నిశ్శబ్దం రాజ్యం ఏలుతుంది. ఈ నిశ్శబ్దం నుంచే నారాయణుడు మరియు నరుడు స్వదర్శన చక్రం తిప్పుతారు.

• మనిషి తనలో, తన చుట్టూ ఉన్న విజ్ఞానాన్ని గ్రహిస్తే, మనసు లో వాటికి కొంచెం చోటు ఇస్తే ఏనాడూ మనిషి స్వతహాగా ఆందోళన పడే అవసరం రాదు.

వ్యర్థం ఆలోచించే కంటే, మనిషి తన మానసిక శక్తి ని ధ్యానం ద్వారా పెంచుకుంటే సమస్తం వశం అవుతుంది, పరవశం పొందుతాడు.


యడ్ల శ్రీనివాసరావు 18 May 2024 , 1:00 AM.


No comments:

Post a Comment

567. బాల్యం తీపి

  బాల్యం తీపి  • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు ‌  బాల్యం    తీపి   పసి బాల్యం   తీపి. • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు   ప్రాయం  ...