Monday, May 20, 2024

500. కృతజ్ఞతలు

 

కృతజ్ఞతలు



• కృతజ్ఞతలు శివయ్యా 🙏. కేవలం నీ స్మరణ తో , ఈ ఆత్మ ఈ రోజు కి  చిన్నపాటి ఈ 500 రచనలు రాయగలగడం ఏనాటి సుకృతమో లేక మిగిలి ఉన్న కర్మో అనిపిస్తుంది. ఈ రచనల వలన ఎవరికి ఏ, ఉపయోగం ఉంటుందో లేదో తెలియదు కానీ నాకు మాత్రం ఆత్మ సంతృప్తి లభించింది.

• అసలు ఆలోచిస్తే ఇదంతా చాలా చాలా విచిత్రం. ఊహకు కూడా అందని విషయం. ఏ మాత్రం సాహిత్యం, రచనా శైలి, భాషా పరిజ్ఞానం తెలియని నేను ఇవి ఎలా రాయగలిగానో,  నాకే తెలియదు, అర్దం కాదు.

• చిన్నగా 2020 మే 1 వ తేదీ న ఆరంభించిన ఈ బ్లాగు, నేడు దేశంలో ,  అదే విధంగా 100 కు పైన వివిధ దేశాల్లో ఉన్న తెలుగు వారు ఈ రచనలను చదువుతూ , ఒక సాధారణ మైన ఈ బ్లాగు కి 40,000 పైన వీక్షణలు వచ్చాయంటే ఆశ్చర్యం అనిపిస్తుంది … నేను నమ్మేది ఒకటే … ఇదంతా శివుని ఆశీర్వాదం తో, సహాయం తో సాధ్యం అయింది అని. ఎందుకంటే, ఏదీ కూడా కావాలని, ఆశించి, ప్రయత్న పూర్వకంగా నేను మొదలు పెట్టలేదు.




• ముఖ్యంగా, ఈ సందర్భంలో ఒక స్నేహితుడు, మరియు ఒక స్నేహితురాలి కి నేను కృతజ్ఞతలు 🙏 తెలియ చేసుకుంటున్నాను. ఎందుకంటే దాదాపు 30 సంవత్సరాల తరువాత, స్కూల్ రీ యూనియన్ సందర్భంగా బాల్య మిత్రుల అందరి కోసం , స్కూల్ అనుభవాలను ఒక script గా రాసి present చేయడం జరిగింది. ఈ రీయూనియన్ ఫంక్షన్ కి పైన చెప్పిన స్నేహితుడు, మరియు ఆ స్నేహితురాలు కూడా వీలుకాక అటెండ్ కాలేదు….. కొద్ది రోజుల తర్వాత ఆ స్నేహితుడు, మరియు ఆ స్నేహితురాలు ఒకరికి తెలియకుండా మరొకరు విడి విడిగా నేను రాసిన script , వాట్సాప్ గ్రూప్ లో చదివి చాలా చాలా బాగుంది అని ప్రోత్సహించారు. నా రచనా శైలి ప్రత్యేకం గా ఉందని, కధలు ఆర్టికల్స్ రాయమని చాలా ప్రోత్సహించారు. నేను వారితో ఒకటే చెప్పాను… నాకు అసలు రాయడం రాదు, ఏదో స్కూల్ మీద ఉన్న ప్రేమ కొద్ది, బాల్య స్మృతులు గుర్తున్నవి , యదార్థాలు మాత్రమే రాసాను. కధలు రాయాలంటే ఊహించి రాయాలి, పాత్రలచేత రక్తి కట్టించాలి. ఆ డ్రామాలు నాకు సాధ్యం కాదు అని వారితో చెప్పాను. ఎందుకంటే నిజ జీవితంలో నేను చాలా Bad Actor ని, Drama Action చేతకాక మనుషుల తో ఎన్నోఇబ్బందులు పడుతూనే ఉంటాను. అయినా సరే, వారు ఇద్దరూ ఎందుకో పట్టు వదలకుండా ప్రోత్సాహం ఇచ్చారు. నువ్వు రాయగలవు , నీలో టాలెంట్, skill ఉంది అనేవారు.

• నాకు ఊహించి రాయడం చాతకాదు అని చెప్పి నా సరే, వారు చెప్పిన విషయం ఏమంటే యదార్ధం గా చూసినవి రాస్తే , అవే రచనలు గా అవుతాయి అని చెప్పారు. …. ఇదంతా నాకు చాలా విచిత్రం గా అనిపించేది. ఎందుకంటే నాకు సాహిత్యం రాదు, ఎలా రాయాలో తెలియదు, ఏ అంశం రాయాలో తెలియదు, ప్రాశ , యాస తెలియదు. ఏది ఎలా కనెక్ట్ చేయాలో అసలు తెలియదు. ఎందుకంటే నేను కధలు, నవలలు చదవడం వంటివి ఏనాడూ అలవాటు లేదు.

• ఇక్కడ గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, అసలు ఆ స్నేహితుడు, స్నేహితురాలు నాలో ఏం చూసారు 🤔, ఎందుకు ఇంతగా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు అని చాలా ఆలోచించే వాడిని…..

• కొద్ది రోజుల తరువాత తెలిసిన విషయం, సమాధానం ఏమంటే, నా స్నేహితుని కొడుకు వయసు 15 సంవత్సరాలు, అప్పటికే ఆ అబ్బాయి famous English poet , popular writer in English articles, dramas. ఆ అబ్బాయికి ఒక బ్లాగ్ కూడా ఉంది.

• అదే విధంగా నా స్నేహితురాలికి , ఇంజనీరింగ్ చదివిన అమ్మాయి ఉంది. ఈ అమ్మాయి కూడా మంచి English writer, writers forum లో సభ్యురాలు. ఇంగ్లీష్ లో మంచి novel రాసింది, అది Singapore publication వాళ్లు Amazon లో సేల్ కి ఉంచారు. (ఈ విషయాలు చాలా కాలం తర్వాత తెలిసాయి.)

• అప్పుడు అనిపించింది, బహుశా నా స్నేహితుడు, స్నేహితురాలు కి రచనలు, సాహిత్యం అంటే విపరీతమైన ఇష్టం.  రాయడం అనే  కళాతృష్ణ వారి  పిల్లల్లో  గమనించి ప్రొత్సాహం ఇచ్చారు.  వారికి ఉన్న  ఆ అనుభవ దృష్టితో నే   నన్ను  కూడా ప్రోత్సహించారు అని  తెలిసింది .   నిత్యం శివుని ఆరాధించే నాకు, తరువాత అసలు విషయం అర్దం అయింది,   ఇదంతా నా జీవితంలో  శివుడు రాసిన Drama  Script   అని.

• ఈ సందర్భంగా నా స్నేహితుడు కి, స్నేహితురాలు కి …. నా హృదయ పూర్వక కృతజ్ఞతలు 🙏 తెలియ చేసుకుంటున్నాను.  

 🌹🌹🌹🌹🌹🌹

• ప్రారంభించిన    మొదట్లో   మూడు, నాలుగు ఆర్టికల్స్ ఏదో సరదాగా నా స్పృహ తో రాసాను. కానీ ఆ తరువాత నుండి నేటివరకు రాస్తున్న తొంభై శాతం ఆర్టికల్స్   నా consciousness కి   చెందినవి ముమ్మాటికీ కావు.   ఎందుకంటే ఏది ఎందుకు ఎలా రాస్తున్నానో,  రాసానో నాకు తెలియదు,  అర్దం కాదు. ఎక్కువ గా అర్దరాత్రుళ్లు నిద్రలో మెలకువ వచ్చేది… అప్పటికప్పుడు కనిపించింది, అనుభవం అయినది , ఏదో ఆవహించినట్లు    అతి తక్కువ క్షణాల్లో రాసే వాడిని. రాస్తూ ఉన్న సమయంలో ఏదో శక్తి ఆవహించినట్లు ఉండేది. … చెప్పాలంటే నేడు ఈ శరీరంతో పొందని అనుభవాలను, నా  స్పృహ లో లేని  భావోద్వేగాలను రాయడం జరిగింది.  విచిత్రం ఏమిటంటే ఏ అంశానికి సంబంధించినది అయినా సరే ఏదో అనుభవం ఉన్నట్లు రాయడం జరిగింది. రాస్తూ ఉంటే ,  ఎత్తు నుంచి నీరు పల్లం వైపు జారుతున్న వేగం గా  అక్షరాలు  చేతినుండి  జారేవి. 

అప్పుడప్పుడు, రాసిన ఈ ఆర్టికల్స్ చదివి, ఎవరు రాసారో గాని చాలా బాగా రాశారు అని నాలో నేను అనుకునే వాడిని. నా consciousness కి అవన్నీ , నేను రాసినవి గా అనిపించేవి కావు. నేటికీ అనిపించవు. ఎందుకంటే నేను, కవి, రచయిత ని కాదు.  

• కాలక్రమేణా నాకు నా తండ్రి శివుడు ధ్యానం ద్వారా అన్ని విషయాలు అర్దం చేయించాడు, రాసిన రచనలు అన్నీ నా శరీరం కాదు, నాలోని ఆత్మ రాసింది అని తెలిసింది.

• గడిచిన అనేక జన్మల ద్వారా, నా ఆత్మ లో నిక్షిప్తం అయిన స్మృతులు మరియు ఆ యా జన్మలలో అర్ధాంతర మరణం వలన పరిపూర్ణం కాని , కర్మలు అని అనుభవం అయింది. పూర్తి కాని కర్మలు రాతలు గా వచ్చాయని, అదే ఈ జన్మలో నా తలరాతని అర్దం అయింది.

• దీనికి శివుడు ఒక ఆధారం కూడా చూపించాడు… ఏమంటే జన్మ జాతకం లో శని కేతు గ్రహాలు కలయిక వలన , ఆ సమయం వచ్చినప్పుడు ఆత్మ జాగృతం అవుతుందని, subconscious activate, జన్మ కుండలిలో  5th house activate అయి జన్మాంతర జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయని, పూర్వ జన్మల్లో మిగిలిన కర్మలు పూర్తి అవుతాయని, శని కేతువులు కలిసి ఉండడం వలన విశిష్ట మైన రచనా శైలి ఇస్తారని తెలిసింది. అంతే కాకుండా , కేతువు కి ఎదురుగా ఉన్న రాహువు విదేశీ కమ్యునికేషన్, పబ్లికేషన్ ఓవర్ మీడియా కి సహకరిస్తాడని, higher level of spiritual knowledge ఇస్తాడని astrology books లో చదివాను. 

• నేడు ఇదంతా పేరు కోసం, గుర్తింపు కోసం రాస్తున్నది కాదు. అదే విధంగా ఎవరిని ప్రభావితం చేయడానికి, నమ్మకం కలిగించడానికి కూడా కాదు. ఎందుకంటే ఆ అవసరం నాకు లేదు.    పేరు, కీర్తి,   high education,   superior job,  ధనం,  హోదా అన్నీ కూడా ఒక స్థాయి లో పూర్తిగా ఇది వరకే అనుభవించడం జరిగింది, వాటి experiences అన్నీ కూడా స్పష్టంగా నాలో నేటికీ నిలిచి ఉన్నాయి.  ఇక మిగిలింది, చేయవలసింది ఒకటే , ఆధ్యాత్మిక ప్రయాణం, మనసా వచసా  కుటుంబ మరియు సమాజానికి    సేవ చేయడం మరియు శత్రు సంహారం చేయడం.…  శత్రు సంహారం అంటే వికారాలైన ఈర్ష్య, ద్వేషం, అసూయ, స్వార్థం, వ్యంగ్యం, కామం, మాయ మాటలు చెప్పడం వంటి చెడు గుణాలు. అవి నాలో ఉన్నా సరే, నాతో కలిసి   నా చుట్టూ  ఉన్న వారిలో  ఉన్నా సరే … సంహరించడం నా కర్తవ్యం.  ఇదే నా శేష కర్మ.

• నేడు రాస్తున్న ఈ విషయం అంతా, నా ఆత్మ సాక్ష్యం కోసం. … రేపు ఈ శరీరం విడిచిన తరువాత ఈ సాక్ష్యం భూమి మీద ఉండడం కోసం. ఎందుకంటే మళ్లీ జన్మ లో ఏ బంధాలకు నోచుకోని నేను , జన్మతః యోగి సన్యాసి గా పుట్టే నేను,   ఈ భూమి పై విడిచిన ఆనవాలు ఏదో ఒక రోజు చూస్తాను.

• కష్టం బాధ లో ఉన్నప్పుడు ఎవరైనా ఆదుకుంటే, సహాయం చేస్తే బాగుండు అని దేవుని కోరుకుంటాం, తోటి మనుషుల నుంచి సాయం  ఆశిస్తూ ఎదురు చూస్తాం. ఆ సహాయం అనేది ఒక మాట కావచ్చు, మనసులో ప్రేమ కావచ్చు,  అవసరానికి ధనం కావచ్చు, శరీరం తో  కూడా ఉండి చేయవలసిన పని కావచ్చు,   ఇంకా ఆరోగ్యం నయం చేసే హీలింగ్  శక్తి   ఏదైనా కావచ్చు ….. 

కానీ మనలో ఉన్న వికారాలను దేవుడు గాని  లేదంటే గురువులు గాని, అనుభవం ఉన్న తోటి మనుషులు ఎవరైనా  సరి చేయాలని  ప్రయత్నిస్తే  మాత్రం అంగీకరించం,  సహించం.  సరికదా  తిరిగి  ప్రతిఘటిస్తూ ,  ఎదుటి వారిపై దాడి చేయడానికి ఎంతకైనా దిగజారి ప్రవర్తిస్తాం. ఎందుకంటే మనలో అహంకారం, బుద్ధి లో మాయ ఆవహించి ఉండడం వలన. అందుకే ఇది కలి మాయా కాలం అయింది.

• మానవ జన్మ కి ప్రతీ బంధం ఒక ప్రతిబంధకం. మరియు బుణం. జీవిస్తూ ఉండగానే, ఈ బుణం తీర్చుకునే మార్గం తెలుసు కొని, ఎవరికి ఏది బుణమో అది తిరిగి ఇచ్చేస్తే , బంధవిముక్తి లభిస్తుంది. బంధీలు గా మానసిక రోదనతో జీవించే యాతన తప్పుతుంది. ఇదే మనిషి కి మోక్షం.

వైరాగ్యం  అంటే  సత్యం, నిజం  అనుభవపూర్వకంగా తెలుసుకోవడం అంతే గాని  బాధ్యతలు వదిలి వేయడం కాదు .... ముందో , వెనకో  పుట్టిన ప్రతి మనిషి  జన్మాంతరాలలో వైరాగ్యం  అనుభవించి తీరవలసిందే.   ఎందుకంటే మాయతో కలిసి జీవించ గలిగేది  ఎవరైనా కొంత కాలం మాత్రమే. 


ప్రతి మనిషికి కంటికి  , బయటకు  కనిపించే తన జీవితం కేవలం యాభై శాతం మాత్రమే.  ఇది Already దేవుడు రాసి ఉన్న  డ్రామా అనుసారం  జరుగుతుంది. దీనిని ఎవరూ మార్చలేరు, ఆఖరికి  భగవంతుడు కూడా.

అదే విధంగా  కంటికి కనిపించని , లో లోపలి తన జీవితం మిగిలిన యాభై శాతం ఉంటుంది. దీనిని భగవంతుడు చెప్పిన విధంగా   విని , తనను తాను తెలుసుకొని,  ఆచరించడం వలన  తన జీవితాన్ని , తల రాతను  తానే  మార్చుకునే అవకాశం ఉంటుంది.


యడ్ల శ్రీనివాసరావు  20 May 2024, 11:00 pm.


No comments:

Post a Comment

567. బాల్యం తీపి

  బాల్యం తీపి  • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు ‌  బాల్యం    తీపి   పసి బాల్యం   తీపి. • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు   ప్రాయం  ...