స్థితి గతులు
• జీవితం లో జరిగే ప్రతీ అంశానికి ఒక కారణం తప్పక ఉంటుంది. కానీ, ఆ కారణాలు అందరూ తమకు ఉన్న సహజ సిద్ధ స్వభావం తో తెలుసుకోలేరు. ప్రతీ మనిషికి తన జీవితంలో జరుగుతున్న మంచి చెడు, సుఖం దుఃఖం , బంధాలు వివాదాలు ఇలా ఎన్నో రకాలైన అంశాల తో ముడిపడి ఉంటుంది. దీని యొక్క స్పష్టత మనిషి కి తెలియాలంటే కొంత సాధన తప్పని సరిగా చేయాలి.
• మనుషుల కు కొన్ని సార్లు ఊహించని సంఘటనలు జీవితం లో జరుగుతాయి. అదే విధంగా కొన్ని సార్లు ఊహించినవి కూడా జరుగుతాయి. సాధారణంగా ఊహించి న సంఘటన లేదా అంశం జరిగినపుడు కొంత ఉద్వేగం మాత్రమే ఉంటుంది. అదే ఊహించని సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు చాలా ఎక్కువ ఉద్వేగం ఉంటుంది. అలా తరచుగా ఊహించని సంఘటనలు తరచూ జరుగుతుంటే ఏదో ఒక రోజుకు ఉద్వేగం కాస్త పూర్తిగా పోయి,. అసలు ఎందుకు ఇలా నాకు జరుగుతుంది అనే ఆలోచన మొదలవుతుంది. అక్కడ నుండే కారణం తెలుసు కునే స్థితి సాధ్యం అవుతుంది. ఇక్కడ ఉద్వేగం అంటే ఆనందం లేదా బాధ అనేది సంఘటన బట్టి ఉంటుంది.
• ఒక మనిషి ఉన్నత స్థితికి చేరడం అనేది కొందరికి తమ జీవితం లో ఆకస్మికంగా జరగవచ్చు లేదా స్వయం కృషి వలన కావచ్చు. ఉన్నత స్థితి అంటే ఈ లోకంలో చాలా మంది అనుకునే విధంగా ధనం సంపాదించడం, వృత్తి ఉద్యోగాలలో శిఖర స్థాయికి ఎదగడం, విలాసవంతమైన జీవనం గడపడం కాదు. ఎందుకంటే ఇవి మనిషి కి ఒకరోజు ఉండొచ్చు, మరొక రోజు ఉండక పోవచ్చు, పైగా ఇవన్నీ ఉన్నా సరే మనిషి లో లోపల చాలా అధమ స్థితి (దుఃఖం, అశాంతి) అనుభవిస్తూ ఉండొచ్చు. చెప్పాలంటే నేటి కాలంలో ఇటువంటి వారే తొంభై తొమ్మిది శాతం ఉన్నారు. ఎందుకంటే ఎంత ధనవంతుడిని పలకరించినా నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పలేని పరిస్థితులు వ్యక్తులలో నెలకొన్నాయి.
• కానీ వీటన్నింటికీ అతీతంగా, అతి సాధారణమైన మనిషి కూడా(ధనవంతులు కాని వారు ) తన జీవితంలో అత్యున్నత స్థితి పొందవచ్చు. అదే మానసిక పరిపక్వ స్థితి. అంటే మనసు కి చపలత్వం లేని స్థితి.
• ఎలాంటి మనిషి అయినా ఉన్నత స్థితి అనుభవాన్ని పొందాలంటే ఆర్థిక, సామాజిక అంశాల ప్రభావం అవసరం లేదు. శ్రేష్టమైన కర్మ లు, ఆలోచనలు, సంకల్పాలు, సహాయగుణం చాలు. ఇవి ఏనాడైతే మనిషి లో ఉత్పన్నమవుతాయో , ఆనాటి నుండి ఆధ్యాత్మికత, దైవం యొక్క అనుభవాలు మరియు సాక్షాత్కారాలు అవడం మొదలవుతాయి.
• కోరికల కోసం భక్తి తో ఎన్నో సంవత్సరాలుగా పూజలు, జపాలు చేసిన కూడా లభించని ఫలితాలు కేవలం పైన పేర్కొన్న అంశాలతో అనుభవం అవుతుంది. అప్పుడు మనిషి కి తన జీవితంలో జరిగే ప్రతీ సంఘటన యొక్క విశేషత అర్దం అవుతుంది. కాకపోతే ఈ స్థితి పొందడానికి కొందరికి కొన్ని నెలలు, సంవత్సరాలు, అవసరమైతే కొన్ని జన్మలు కూడా పట్టవచ్చు. ఎందుకంటే మారావలసింది, మార్పు రావలసింది మనిషి అంతరంగం లో నుంచే గాని , మనిషి చుట్టూ ఉన్న ప్రపంచం లేదా చుట్టూ ఉన్న ఇతర మనుషుల నుంచి కాదు.
• మనిషి యొక్క ఉన్నత మైన స్థితి కి పెట్టుబడి మంచి ఆలోచన మాత్రమే. మనిషి కి తన అంతరంగపు లేదా లోపలి చీకటి ద్వారాలు ఏనాడైతే తెరుచుకోవడం మొదలెడతాయో ఆనాటి నుండి దేని కోసం, ఎవరి కోసం ఈ బాహ్య ప్రపంచంలో శోధించ వలసిన అవసరం ఉండదు, శోధించడు కూడా. ఎందుకంటే మానవుని యెక్క అంతరంగం ఈ విశ్వానికి, సృష్టి కి అనుసంధానం చేయబడి ఉంటుంది. అప్పుడు మనిషి చేసే కర్మలు సజావుగా, శ్రేష్టం గా సహజంగా జరిగిపోతూ ఉంటాయి. ఆ సమయంలో నే దైవ నిదర్శనం, పరమాత్ముని అనుభవాలు స్వయంగా తెలుస్తూ ఉంటాయి. భూత, వర్తమాన, భవిష్యత్తు సంబంధించిన అంశాలు చిన్న గా కొన్ని తెలియడం జరుగుతుంది.
• అదే విధంగా ఒక మనిషి అదమ స్థితి లో ఉండడం వలన పైకి కనిపించక పోయినా నిరంతరం బాధ, దుఃఖం, ఈర్ష్య, అసూయ , మాయ, అనవసరమైన కోరికలు, మోహం, అహంకారం తో కొట్టు మిట్టాడుతూ నిద్రలేని సమయం తో కాలం గడుపుతాడు . ఈ స్థితి కి కూడా పెట్టుబడి మనిషి ఆలోచనే. కానీ ఈ స్థితిలో ఉన్న మనిషి తనలో ని మార్పు ఆశించకుండా, తన చుట్టూ ఉన్న పరిస్థితులు, వ్యక్తులలో మార్పు ఆశిస్తాడు.
• ఈ సృష్టిలో ప్రతీ మనిషి ఏకైకం ( unique ). ఒకరిలా మరొకరు ఉండరు, ఉండలేరు. కానీ మనిషి మంచి మార్పు కోరుకుంటే లేదా ఆశిస్తే , తెలియనిది తెలుసు కోవాలి అనుకుంటే మొదట చిత్తశుద్ధి ఉండాలి, తరువాత తన లోని నెగెటివ్ అంశాలను గుర్తించాలి, అంగీకరించాలి. ఇవన్నీ రాత్రి కి రాత్రి జరిగిపోయే అంశాలు కాదు. అలాగని అసాధ్యం కాదు. కావాల్సిందల్లా ఒకటే మనిషి తనకు తాను నిత్యం, శాశ్వతం గా సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచించడం.
• చివరి గా ఒక మాట …. మనిషి ఉన్నత స్థితి కి చేరకపోయినా పరవాలేదు కానీ అధమ స్థితి లో మాత్రం ఉండకూడదు. ఎందుకంటే అధమ స్థితి వలన జరిగే నష్టం తనకే కాకుండా తనతో తను చుట్టూ ఉన్న వారికి కూడా ఎంతో కొంత ఉంటుంది. ఇకపోతే ఉన్నత స్థితి అనుభవం పోందక పోయినా పరవాలేదు కానీ అతి సాధారణ మైన స్థితి తో ఉంటే, తనకు గాని, తన కుటుంబం, చుట్టూ ఉన్న సమాజం లోని వారికి ఏ ప్రమాదం ఉండదు.
• స్థితి ని బట్టే గతి ఉంటుంది .
• ఓం నమఃశివాయ 🙏
యడ్ల శ్రీనివాసరావు 4 Apr 2023 , 2:00 pm
No comments:
Post a Comment