Saturday, March 23, 2024

479. లక్ష్యం ( Goal) - కోరిక (Desire)

 

లక్ష్యం ( Goal) - కోరిక (Desire)


 మనిషి తల్లి గర్భంలో నుంచి పసికందు గా భూమి పైకి వస్తూనే అరచేతి గుప్పెడు బిగించి ✊ చూపిస్తూ       “ నేను  ఏదో  సాధించడానికి భూమి పైకి వచ్చాను “ అనే సంకేతం చూపిస్తాడు.

 

అందుకోసం పుట్టిన క్షణం నుండి చేసే ప్రయత్నాలు, చెప్పాలంటే పడే పాట్లు ఇన్ని అన్నీ కావు. చదువు లో, చేసే వృత్తి లో,   సమాజం లో,  వైవాహిక జీవితం లో, కుటుంబ జీవనం లో   ఇలా ఒకటేమిటి  అన్నింటిలో అత్యుత్తమంగా కావాలని అలుపెరుగని పరుగు పెడుతూనే ఉంటాడు.  ఈ పరుగు లో  అన్నీ లక్ష్యాలు , కోరికలు  సాధనలు  కనపడుతుంటాయి.    ఒక లక్ష్యం లేదా కోరిక   పూర్తి అయితే మరొకటి.  కానీ ఒక లక్ష్యం చేరిన తరువాత సంతృప్తి చెందుతున్నాడా, అంటే అది మనసు కే తెలియాలి. ఇక్కడ గమనిస్తే లక్ష్యం, కోరిక ఒకేలా అనిపించినా, తేడా ఉంటుంది.


 లక్ష్యాలకు ,  ఆరంభం మరియు అంతం అనేది ఉంటుంది.    కానీ మనిషి ఒక లక్ష్యం సాధించిన తరువాత సంతృప్తి పడి ఆగిపోతే,   అదే తన ఓటమి గా భావించే స్థితి గా భావిస్తాడు.

 ఈ లక్ష్యాలు అనేవి మనిషి , తాను ఎదగడం కోసం అంటుంటాడు .  అందులో డబ్బు సంపాదించడం, ఉద్యోగ స్థాయి పెంచుకోవడం, నాయకుడు గా ఎదగడం,   కుటుంబం తన ఆధీనంలో ఉండాలనుకోవడం,   సమాజం లో గుర్తింపు స్థానం కోసం, పారిశ్రామిక వేత్త గా ఎదగాలనుకోవడం,  ఇలా లక్ష్యం అనేది   ఎప్పుడూ చాలా చాలా  ఉన్నతంగా కనిపిస్తూనే ఉంటుంది.  దాని వెనుక పరుగు పెడుతూనే ఉంటాడు. విచిత్రం ఏమిటంటే ఇదే ఈనాడు మనిషి కి అసలు సిసలైన జీవితం అనే భావన కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఇందులో నే తొంభై శాతం మనిషి జీవిత కాలం గడుస్తుంది.


 లక్ష్యం సాధించాలి అంటే అహర్నిశలు కష్టపడాలి. నిజమే కష్టపడాలి. లేదంటే లక్ష్యం సాధించలేం. ఒక లక్ష్యం సాధించే దిశలో పరిస్థితి నా బట్టి ఎన్నో వదులు కోవలసినవి ఉంటాయి. అందులో , సమయం, విలువలు, ప్రేమ, ధనం ఆహారం, నిద్ర, మనుషులు , జీవితం , సుఖం, ఇలా ఎన్నో ఎన్నెన్నో వదులు కోవాలి.

 ఇలా ప్రతీ వయసు లో జీవితాంతం గడిపితే , అంటే మనిషి తన మనసు ను ఈ లక్ష్యాల పరుగు పందెంలో తాకట్టు పెడితే తన జన్మ సార్థకం అయినట్లే నా. అసలు ఈ లక్ష్య సాధన కి ఒక అంతం అనేది ఉంటుందా?.

 నిజానికి మనిషి తాను అనుకుంటున్నవి లక్ష్యాలా? లేక లక్ష్యం రూపం లో ఉండే కోరికలా?   ఎందుకంటే లక్ష్యం లో ఉన్నతి ఉంటుంది,  అది స్వయం గా తనతో పాటు కుటుంబం, నలుగురి, లేదా సమాజ శ్రేయస్సు ఉంటుంది.   కానీ కోరిక లో స్వలాభపేక్ష,  స్వార్థం ఉంటుంది.  కోరికలకు ఆరంభం మాత్రమే ఉంటుంది, అంతం ఉండదు.


 ఒక లక్ష్యం చిన్న దైనా, పెద్ద దైనా తీరినప్పడు మనిషి కి పూర్ణ మైన సంతృప్తి లభిస్తుంది.    కానీ కోరికలు తీరినప్పడు ముమ్మాటికీ  సంతృప్తి  ఉండదు. ఎందుకంటే ఆక్షణమే మరో కోరిక  అంతకు మించి మొదలవుతుంది.  కానీ నేటి కాలపు మనిషి ఈ తేడా గమనించే స్థితిలో ఉన్నాడా? అనేది ప్రశ్న.

 ఎందుకంటే లక్ష్యానికి కోరికకు తేడా తెలియని జీవిత పరుగు నేడు యువత కనపడుతుంది.

 లక్ష్యానికి ఒక పుల్స్ స్టాప్ ఉంటుంది. కానీ కోరికకు కామా మాత్రమే ఉంటుంది.

 లక్ష్యం అనేది ఆత్మ సంతృప్తి కోసం , కోరిక అనేది దేహ సంతృప్తి కోసం. దేహం లో కోరికలు అనేవి పుడుతూనే ఉంటాయి. కానీ లక్ష్యం చేరుకుంటే ఆత్మ పొందే సంతృప్తి ,  అనుకున్నది సాధించాను చాలు అనుకుంటుంది.   ఈ స్థితి పొందడం ఒక అదృష్ట యోగం గానే చెప్పాలి.   ఎందుకంటే నేడు యువత తన ఆలోచనలను నిజం చేసుకునే దిశలో పయనిస్తూ ఉంటారు,  కానీ ఆ ఆలోచనలు   సమన్వయం చేసుకునే స్థితిలో లేరు.  సమన్వయం అంటే, తమ లక్ష్య లేదా కోరికల సాధనలో తమను తాము సవ్య మైన దిశలో మరల్చు కోవడం. అలా కాకుండా ఎలాంటి అడ్డదారుల్లో నైనా లక్ష్య, కోరికల సాధన చేస్తే ఫలితం తిరిగి మనసు పై దుర్భరం గా ఉంటుంది.


 ఇదివరకటి కాలంలో లో మనుషుల మనసు ఒక స్థిరత్వమైన స్థితి తో ఉండేది. కానీ నేడు మనిషి, యువత జీవన విధానం లో మనసు ఒక అస్థిరత్వం తో ఉండడం అధిక శాతం గమనిస్తూనే ఉన్నాం. బహుశా అందుకే నేటి తరం శారీరకంగా బలం గా కనపడుతున్నా, మానసికంగా బలహీనం గా ఉంటూ, లక్ష్య సాధనలో వైఫల్యాలను అంగీకరించ లేకపోతున్నారు. ఇది రోజు రోజుకు పెరుగుతోంది.


 ఏది ఏమైనా , మనిషి ఏది సాధించినా తాను ఏకాంతం గా ఉన్నప్పుడు, నేను సంతోషం గా ఉన్నాను అని తనకు తాను అనుకో గలుగుతున్నాడా అనేది ముఖ్యం. ఎందుకంటే జీవితం లో ఏదొక దశలో తప్పని సరిగా ఒంటరి తనం, ఏకాంతం మనిషి అనుభవిస్తాడు. అది వరం అవ్వాలి కానీ శాపం కాకూడదు.


 మనిషి గా పుట్టిన ప్రతీ ఒక్కడూ తన జీవిత కాలం లో ఈ భౌతిక ప్రపంచంలో , తన కోసం ఏదో ఒకటి సాధిస్తూనే ఉంటాడు. కానీ వాస్తవం ఏమిటంటే మనిషి తన ప్రాణం విడిచిన తరువాత లేదా ప్రాణం విడవ బోయే ముందు తన గుప్పెడు తెరిచి 🫴 ”నేను ఇక్కడ ఏమీ సాధించలేదు, అని ఖాళీ గా చేతులు పైకి తెరిచి, నా కర్మ ను అనుభవించ డానికి మాత్రమే వచ్చాను “ అనే సత్యం తప్పకుండా గ్రహిస్తాడు.


 మనిషి కి బాధ్యతలు తీర్చు కోవడం లో పరిధి ఉండాలి. ఆ పరిధి పెంచుకుంటే భారం పెరుగుతుంది. అంటే శక్తి కి మించిన బాధ్యత లను పెంచుకోకూడదు. బాధ్యత లనేవి తప్పని సరి కర్మ స్థితి తో ముడి పడి ఉంటాయి.

 లక్ష్యం అనేది ఆత్మ సంతృప్తి సాధన కోసం ఉంటుంది.

 కోరిక అనేది దేహ సంతృప్తి కోసం ఉంటుంది.

 మూడింటిని గమనిస్తే ఒకేలా అనిపించినా, చాలా వ్యత్యాసం ఉంటుంది.


 యడ్ల శ్రీనివాసరావు 23 March 2024 11:00 pm.


No comments:

Post a Comment

567. బాల్యం తీపి

  బాల్యం తీపి  • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు ‌  బాల్యం    తీపి   పసి బాల్యం   తీపి. • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు   ప్రాయం  ...