Thursday, April 11, 2024

486. అనుభవం – అనుభూతి

 

అనుభవం – అనుభూతి


• ఒక బంధం    విడిచింది

  ఒక నయనం  తొలగింది.


• జత  లోని  తోడు

  నీడ గా  మిగిలింది.

• మది   లోని  గోడు

  కధ గా   నిలిచింది.


• ఒక బంధం   విడిచింది

  ఒక నయనం  తొలగింది.


• జీవం  లేని  దేహం

  మౌనమై   చెబుతుంది

  "నీతో    ఉన్నానని".

• ప్రాణం   లేని  కాయం

  కనులు తెరిచి   పిలుస్తోంది

  "నాతో  వస్తావా"   అని.


• గడిపిన   క్షణాలు

  నడిచిన   నడకలు

  రూపు  చెరగని   ఆనవాళ్లు.

• కలిగిన    ప్రేమలు

  విడవని  మనసులు

  ఆత్మ బంధాల   సంకెళ్లు.


• ఒక బంధం     విడిచింది

  ఒక నయనం   తొలగింది.


• హృదయం   ...

  ప్రేమ  కోసమని

  చేతులు   వదలకున్నాయి.

• మరణం   ...

  ప్రేమ కు    లేదని

  చూపులు    వీడకున్నాయి.


• ఒక బంధం      విడిచింది

  ఒక నయనం   తొలగింది.


• చిటికెన వేలి    బంధం

  చిగురు లో   రాలింది.

• జ్ఞాపకాల    నిశ్శబ్దం  

  నిర్వేద మై    నిలిచింది.

• ఒక బంధం       విడిచింది

  ఒక నయనం    తొలగింది.


❤️ 🌹

స్త్రీ పురుషులు మధ్య ఉన్న ప్రేమ బంధం ,  ప్రేమ కలిగి ఉన్నవారికి   భాగ్యమైన స్థితి.  ఈ బంధం అనేది పలు రూపాల్లో ఉంటుంది.   ప్రేమ బంధం వలన అనేక విధాలుగా ఒకరి పై మరొకరు ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. 

మానవ జన్మ కి మరణం సహజం. ఇరువురి లో ఎవరైనా ఒకరు లోకం విడిచినపుడు ఉన్న తోడు కాస్త నీడ లా మారిపోతుంది. ఆ నీడలో ఎన్నో స్మృతులు కనపడుతూ, వినపడుతూ ఉంటాయి. జీవితం కొందరికి తలక్రిందులుగా కనిపిస్తుంది. ప్రేమలో ఉన్న నిజం ఏంటి అనేది,  ఇద్దరిలో  ఒకరు శాశ్వతం గా దూరం అయినప్పుడు  మరింత తెలుస్తుంది.

మనుషులకి , ఈ లోకంలో ఏదీ,  ఎవరు శాశ్వతం కాదనే నిజం తెలిసినా, అంగీకరించ లేరు.  దానికి అతీతం గా జీవించలేరు. ఎందుకంటే ప్రేమ, మమకారం అటువంటివి. 


 ప్రేరణ :

కొన్ని సార్లు  భౌతిక  శరీరానికి  ఎటువంటి  అనుభవం లేకున్నా ,   మనసు  అనుభూతి   ధరించినపుడు  ప్రతీ  స్థితి  సూక్ష్మం లో  తరించబడి ,  మానసికంగా  ఒక అనుభవాన్ని ఆపాదన  చేసుకుంటుంది .  ఇవి  కాలచక్రం లో  జరిగిపోయినవి  లేదా  జరగబోయేవి కావచ్చు.   లేదా ఎక్కడైనా చూసినటు వంటివి  మస్తిష్కం లో  ఉండిపోయినవి  కావచ్చు. ఇవి కేవలం  దృష్టి  భావనలు.  అవే అనుభవం లేని అనుభూతులు. 


యడ్ల శ్రీనివాసరావు  6 Apr 2024 ,  1:00 AM.







No comments:

Post a Comment

493. స్థితి - గతి

స్థితి - గతి • అలలై    పొంగెను   అంతరంగం   కలలై     సాగెను    జీవన రాగం. • ఆశల     హరివిల్లు    ఆకాశం లో   ఊహల  పొదరిల్లు   కీకారణ్యం లో • ...