మనిషికి దుఃఖం యోగమా.... శాపమా
• పదిలం పదిలం
మనసు పదిలం ... మాట పదిలం.
• మెండైన మనుషులకి
నిండైన మనసు కలిగిన వారెందరో.
• మనసు మదన పడితే
మనిషివి కాలేవు.
• మనిషివి కాలేనపుడు
నిశి తోనే , నిశి లోనే (చీకటి) జీవన పయనం.
• నిశిలో నీ .. వు ...
ఎంత అందంగా ఉంటావో తెలుసా ...
• నిశి లో కనిపించేవి
నీ ... లో ... చీకటి కోణాలు.
☀️☀️☀️☀️☀️
• ఏ ... ఏం ... పాపం చేసిందని
దుఃఖాన్ని అసహ్యించుకుంటావు.
• బాహ్య సమాజానికి
నిన్ను పరిచయం చేసింది నీ జన్మము అయితే ...
• నిన్ను నీకు పరిచయం చేసేది
నీ లోని దుఃఖమే .
అది ఏనాడైనా గమనించావా.
• నీ లోని సంతోషం
నిన్ను ఊర్ధ్వం లోని స్థాయి స్థానాన్ని
(external higher status, position)
సమాజంలోని నలుగురికీ చూపిస్తే ...
• నీ లోని దుఃఖం
నీ అంతర్ముఖ పాతాళంలోని
(Internal in depth personality)
కేంద్ర బిందు స్థానం నీకు చూపిస్తుంది.
☀️☀️☀️☀️☀️
• రెండు నేత్రాలతో చూడడమే
బ్రతుకు కాదు ,
జీవితం అంతకన్నా కాదు .
నీ పుట్టుకతో మూసుకుపోయిన
మనోనేత్రం తో (త్రినేత్రం) సాధన చేసి చూడు.
నువ్వు ఏమిటో ...
నీ చుట్టూ ఉన్న వలయాలు ,
ఏమిటో స్పష్టంగా కనిపిస్తాయి.
• అనుభవించు , అనుభవించు ,
తనివితీరా అనుభవించు ,
నీ లోని దుఃఖాన్ని .
దుఃఖం లోని ధ్రృడత్వాన్ని స్పృశిస్తే ,
నీ అంత ధీరుడు ,
వీరుడు ఉండడు , ఈ విశ్వంలో.
• కలవర పడినంత మాత్రాన
నీ కంటిలోని వెలుగు ఏమీ కనుమరుగై పోదు.
• నీ ఆలోచనలే అలలైనపుడు ,
కలలే నీ జీవితం మైనపుడు ,
చొరబడే కడలి లా ...
నీ కంటూ ఒక పౌర్ణమి ,
అమావాస్య చీకట్లను చీల్చుకుంటూ
దివ్యమైన వెన్నెలతో వస్తుంది.
☀️☀️☀️☀️☀️
• చెయ్ దుఃఖంతో స్నేహం చెయ్ ,
దుఃఖాన్ని ప్రేమించు ,
నీ లో జ్ఞాన జ్యోతిని వెలిగిస్తుంది.
కానీ, దుఃఖానికి మాత్రం బానిసవి కావద్దు.
• దుఃఖం నీ లోని శక్తిని హరించడానికి రాలేదు.
అది నీ లో శక్తిని సమన్వయం చేయడానికి
వచ్చింది, నిశితంగా గమనించి చూడు.
• సంతోషం , దుఃఖం రెండు ఒకటే .
కానీ అది గమనించ లేకపోవడమే
నీ లోని "మాయ".
• ఆ నీలకంఠు డే
గరళాన్ని కంఠంలో దాచుకుని ,
దుఃఖాన్ని దిగమింగి,
మౌన ముద్ర తో లయ కారకుడయ్యాడు.
ఏ ఇది నీకు ఆదర్శం కాదా .
యడ్ల శ్రీనివాసరావు 15 May 2021.
No comments:
Post a Comment