• 😎గుర్తింపు (Recognition) - మనిషికి వరమా - శాపమా - యోగమా - రోగమా.🤔
• అంతర్ముఖ ప్రయాణం లో స్పష్టం గా కనిపించిన ఒక అంశం.
• Recognition గుర్తింపు మనిషి జీవితంలో పుట్టిన దగ్గర నుండి పోయేవరకు చాలా ప్రాముఖ్యత తో కూడిన అంశం . అదే విధంగా మనిషి మానసిక స్థితిని, జీవితాన్ని నిర్ణయించి శాసించే అంశం .
• బాల్యంలో ఊహ తెలిసిన నాటి నుండి గుర్తింపు కోసం తపన ప్రారంభమవుతుంది . అది ఇంట్లో , బంధుమిత్రులలో , బడిలో ఇలా ప్రతి చోటా చదువులో ఆటల్లో, గురువులతో , మాట తీరుతో , ప్రవర్తనతో, పోటీ వాతావరణంలో, వేషధారణతో ఇలా ఎన్నో రకాల మార్గాలలో, తనను తాను బహిర్గతం చేసుకుని ఒక చిన్న గుర్తింపు కోసం మనిషి మనసు ఆరాటపడుతుంది . జీవిత గమనంలో ప్రతి ఒక్కరికి ఇది చాలా సహజమైన ప్రక్రియ . ఈ "గుర్తింపు" అనే అంశం ద్వారా మనిషి మానసిక సంతోషం పొందుతూ ఆత్మవిశ్వాసం పెంపొందించుకుంటాడు. అదేవిధంగా అభివృద్ధి చెందాలని ఆశిస్తాడు.
🌿🌿🌿🌿🌿
• బాల్యం నుండి కౌమరం లోకి వచ్చినపుడు "గుర్తింపు" తన దిశను మార్చుకుంటూ , అందంగా ఆకర్షణీయంగా కనబడాలని, వ్యతిరేక లింగ జాతి పట్ల పరస్పర "గుర్తింపు" కోసం పరి విధాల ఆలోచనలు చేస్తూ , బహిరంగంగా చెప్పకపోయినా అంతర్గతంగా మనసు నిరంతరం ఏదోఒక ఆలోచన చేస్తూనే ఉంటుంది .
• యవ్వనంలో జీవిత స్థిరత్వం పొందిన తర్వాత మనిషి తన బాధ్యతలు సక్రమంగా నెరవేర్చాలని, ధనం బాగా సంపాదించాలని, కుటుంబ అవసరాలను తీర్చుకోవాలని, అనేక కోరికలతో కూడిన ప్రయాణం అలసి సొలసి ఉంటుంది. మధ్య వయసుకు వచ్చిన మనిషికి జీవితంలో చాలా త్యాగాలు కూడా ఉంటాయి. అయినా మనిషి మనసు నిరంతరం కోరుకునేది "గుర్తింపు" ద్వారా మానసిక వికాసం. మధ్య యవ్వనంలో , స్థిరపడిన తర్వాత పేరుప్రఖ్యాతులు సంపాదించాలి, సమాజం కోసం ఏదైనా చెయ్యాలి, తోటి వారికి సహాయ పడాలి, నాయకుడిగా ఎదగాలి , నేనేంటో అందరికీ తెలియాలి ఇలా, మనిషి తన సహజమైన అవసరాలకు, తన సాధారణ జీవితానికి భిన్నంగా ఆలోచిస్తూ "గుర్తింపు" కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. కాస్త నిశితంగా ఆలోచిస్తే ఈ "గుర్తింపు" అనేది మానవ జీవితంలో ఒక భాగం మాత్రమే. కొందరికి తాము కోరుకున్న గుర్తింపు లభించినందుకు దానిని సఫలీకృతం చేసుకొంటారు. అంతవరకు బానే ఉంటుంది . మరికొందరికీ ఈ "గుర్తింపు" అనేది ఒక వ్యసనంగా చేసుకొని దానికి బానిసలు గా తయారవుతారు. అందుకోసం తమ వ్యక్తిత్వాన్ని వదులుకొని, అడ్డదారులు తొక్కుతూ, ఒక మానసిక రోగి లా తయారై, చివరికి తమ ఉనికిని కోల్పోతారు. ఉదాహరణకు అప్పటివరకు ఎంతో విలాసవంతమైన లేదా ప్రాముఖ్యత తో కూడిన జీవితం గడిపిన రాజకీయ నాయకులు, ప్రముఖులు, తమకున్న అధికారం, హోదా, సదుపాయాలు అన్నీ కోల్పోయాక , సర్వం కోల్పోయినట్లు అవమానభారంతో ఆత్మన్యూనతతో జీవితాన్ని వదిలేసుకుంటారు.
🌿🌿🌿🌿🌿
• మరికొంతమంది పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది జీవితంలో ఏనాడు ఎంత ప్రయత్నించినా ఏ గుర్తింపు దొరకక అడ్డదారులు తొక్కుతూ , సంతోషంగా ఉన్న సాటి వారిని హింసిస్తూ , వారికి లభించని ప్రాముఖ్యత ఇతరులకు లభిస్తుందని అసూయతో దిగజారుతూ , లేనిపోని అభాండాలు, నిందలు వేస్తూ మానసిక రోగుల (psycho) వలే ప్రవర్తిస్తూ ఉంటారు . వీరి జీవితం అంతా నీతిమాలిన తనం తోనే ఉంటుంది. ఇదే రకమైన విధానంలో అంటే వ్యక్తిగత గుర్తింపు లభించని కొంతమంది తమ సాటి బంధుమిత్రులలో, తమ పొరుగు వారి లో తమను తాము చూసుకుంటూ సంతృప్తి పొందుతూ ఒక మంచి ఆకర్షణ శక్తితో సంతోషంతో ఉంటూ ఉంటారు .
💦💦💦💦💦
• ఒక్క మాట చెప్పాలంటే ఈ "గుర్తింపు" అనేది ఒక "మాయ".
• మనిషి చేసే కర్మలో భాగంగా ప్రకృతి మరియు భగవంతుడు సహజసిద్ధమైన గుర్తింపు ఇస్తూ ఉంటాడు. ఆ గుర్తింపు మంచి అయినా లేక చెడు అయినా కావచ్చు . "గుర్తింపు" లభించడం అనేది కర్మ ఫలితం లో భాగమే కానీ...."గుర్తింపు" కోసమే కర్మలు చేయడం అనేది దౌర్భాగ్యం, అమానుషం. గుర్తింపు కోసమే మనిషి జీవించడం అనేది ఒక మానసిక చపలత్వం.
☀️☀️☀️☀️☀️
• నీటి బుడగ లాంటి మనిషి జీవితానికి, ఎన్ని అలంకారాలు చేసినా, ఎన్ని మెరుగులు దిద్దినా, ఎన్ని రంగులు వేసినా అది తాత్కాలికమే.
• మనిషికి నిజమైన గుర్తింపు అనేది "ఆ మనిషి జీవించి లేక పోయిన తరువాత కూడా ఎంతోమంది మనసుల్లో నివసిస్తూంటారు" . అది అసలు సిసలైన శాశ్వతమైన " గుర్తింపు ". ఇది ప్రయత్నిస్తే దొరికేది కాదు . భగవంతుడు నిన్ను కారణభూతుడు గా నిర్ణయించినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. ఎందుకంటే ఏదైనా ఇచ్చేది , తిరిగి తీసుకునేది భగవంతుడే.
• మనిషి ఔనన్నా, కాదన్నా అంతర్మథనం లో ప్రతీ దశలో గుర్తింపు కోసం సకలవిధాల యత్నాలు చేస్తునే ఉంటాడు. ఎందుకంటే అది మానసికమైన లక్షణం. ఏనాడైతే ఈ లక్షణానికి అతీతవుతాడో , వారే చరిత్రలో చిరకాలం నిలిచి పోతారు. ఉదాహరణకు శ్రీ శ్రీ గారు, శ్రీ పొట్టిశ్రీరాములు గారు, శ్రీ కందుకూరి గారు ఇలా ఎంతోమంది మేధావులు నేటికి ఎంతో మంది మనసుల్లో బ్రతికే ఉన్నారు. వీరు చేసిన కర్మలు(కార్యక్రమాలు) ఫలితం ఆశిస్తూ చేసినవి కావు.
• అందుకే ఓ మనిషి నీ గురించి నువ్వు తెలుసుకో, ఈ సృష్టిలో నీ స్థానం, బాధ్యత ఏమిటో గుర్తించుకో, అదే నీకు భగవంతుడు ఇచ్చిన చెదరని చెరగని "గుర్తింపు".
YSR 3 May 2021 11:30 am.
No comments:
Post a Comment