Friday, August 27, 2021

83. జీవన అంతర్ముఖం

 

                       జీవన అంతర్ముఖం


• మనిషికి కొన్నిసార్లు కష్టాలు కన్నీళ్లతో జీవితం ఆగిపోయినట్లు అనిపిస్తుంది, కానీ అవి జీవితాన్ని సరిచేసి కొత్త మలుపు తిప్పడానికే అని అర్థం చేసుకోలేడు. ఊపిరి ఉన్నంత వరకు జీవితం ఆగిపోదు, కాకపోతే జీవితం ఎప్పటికప్పుడు మారుతూ పునరుజ్జీవనం పొందుతుంది.

• మనిషి సహజంగా తనకు తోచిన విధంగా ప్రవర్తిస్తూ, నిర్ణయాలు తీసుకుంటాడు. కానీ వాటి ఫలితాలు అనుభవించినపుడే అవి సరైనవా, కాదా అనేది తెలుస్తుంది. అవే సంతోషం, దుఃఖం . ఆలోచనా శక్తి అందరికీ ఒకే విధంగా ఉండదు . కానీ పరిసరాలను “గమనించడం, నేర్చుకోవడం , అవలంభించడం” అనేది మనిషి జీవితంలో నిరంతర ప్రక్రియ లా ఉండాలి . ఎందుకంటే కొన్ని సార్లు మనిషి తీసుకునే నిర్ణయాలు సరైనవి కాకపోతే జీవితకాలం శాపం లా అనిపించవచ్చు . అందుకే పరిస్థితుల దృష్ట్యా, వయసురీత్యా, అవసరాలరీత్యా , అనుభవాలు రీత్యా, తత్వ విధానాన్ని మార్చుకుంటూ ఉండాలి . “ ఆలోచనల లోని మెరుగు జీవితానికి వెలుగు “.

• జీవితంలో మనిషి కి  ఎంత సాధించిన, ఏమి సాధించిన, సంపాదించినా, సంపాదించకపోయినా ఏదో ఒక వెలితి, తెలియని అసంతృప్తి, ఇంకా ఏదో కావాలనే ఆరాటం నిరంతరం  వెంటాడుతూనే ఉంటుంది.... తీరా ఆ అసంతృప్తి   ఏమిటా అని చూస్తే, చాలా సార్లు స్పష్టత ఉండదు. దీనినే, ఉన్న దానిని సంతోషంగా అనుభవించలేని స్థితి, లేదా లేనిదాని కోసం ఆతృత,   ఉన్న దానిని  ఆస్వాదించ లేకపోవటం అని అంటారు.

• నిన్న జరిగిపోయింది, రేపు ఎలా ఉంటుందో తెలియదు. నేడు ని ఎందుకు అర్థవంతంగా ఉంచుకో లేక పోతున్నామో మన మనసుకే తెలియాలి. నేేేటి కాలం లో  ఇందుకు ముఖ్యం గా డబ్బు యెుక్క  ప్రభావం కూడానేమో అని కొన్ని సార్లు అనిపిస్తుంది. ఎందుకంటే  జీవితం లో మనిషి చాలా సందర్భాల్లో ప్రతి విషయానికి డబ్బుతోనే కొలమానం గా భావిస్తూ  ఉంటాడు. ఎందుకంటే డబ్బు మనిషి జీవితానికి ఒక అవసరమైన వనరు. కానీ చేతి నిండా తరతరాలకూ కావాల్సినంత డబ్బు ఉన్న వారు నిజంగా సంతోషంగా ఆనందంగా ఉన్నారా... అంటే ముమ్మాటికీ లేరు అనేదే సమాధానం, కాకపోతే వారు సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటారు. ధనం అన్నింటికీ పరిష్కారం కాదు. ధనమును మించిన  జీవన సోపానాలు మనిషి మనుగడ లో చాలా ఉన్నాయి. వాటినే  వ్యక్తిత్వ  విలువలు అనుకోవచ్చు.

• ఈ బాహ్య ప్రపంచంలో మనిషి తన చుట్టూ ఏర్పరుచుకున్న ప్రతీది తన మనుగడ రీత్యా , తన  అవసరాల కోసమే.   కానీ,  మనిషికి ఏది ఎంత అవసరమో అంతే ప్రకృతి కేటాయిస్తుంది. అంతకుమించి ఆశతో అర్రులు చాచిన ప్రకృతి ఇచ్చినట్టే ఇచ్చి ఏదో ఒక రూపంలో (నష్టం కలిగించి) తిరిగి తీసేసుకుంటుంది. అవసరానికి మించి తీసుకున్న ఆహారం ఎంత అజీర్ణమో , అలాగే అవసరానికి మించినది ఏదైనా మనతో శాశ్వతంగా ఉండదు. ఇది ప్రకృతి సిద్ధాంతం.

• వందల కోట్లు సంపాదించిన చాలా మంది మహానుభావుల మానసిక స్థితి చాలా సాదాసీదాగా నిజతత్వంతో నిండి ఉంటుంది . ఎందుకంటే వారికి సాధారణమైన మనుషుల కంటే , ప్రకృతి సిద్ధాంతం గురించి ఎక్కువగా తెలుస్తుంది. ఏదో ఒక శక్తి సహాయంతోనే వారు ఆ స్థితి,  స్థాయి,  భగవంతుని మరియు ప్రకృతి అనుగ్ర్రహంతో  పొందగలిగారు అని , కాలచక్రం లో   ఆ శక్తి ఏదో ఒక రోజు  మరల బలహీనం అవుతుందని కూడా గమనిస్తారు. అందుకే ఆ శక్తిని స్థిరత్వం చేసుకోడానికి ధర్మ పరమైన కార్యక్రమాలు, సేవా , ధార్మికత వంటి మంచి పనులు నిరంతరం చేస్తూ ఉంటారు. ఇది చాలా మంచి పరిణామం , సంకేతం , అవసరం. అంటే ఒక మనిషి మంచి శక్తి ని (positive energy) నిత్యం కలిగి ఉండాలి అంటే , దానం, దయ, సేవా    వంటి సహృదయంతో కూడిన గుణాలు కలిగి ఉండాలి.

• మనిషి కంటికి కనిపించని సూక్ష్మజీవులు, విశ్వం నుండి మనిషిని తాకే ఎన్నో రకములైన శక్తి కిరణాలు, ఇలా ఎన్నో ఎన్నో కంటికి కనిపించనివి మనిషి చుట్టూ ఉన్నాయి.   మనిషి తన చుట్టూ ఉన్న  ప్రకృతి సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలంటే చాలా సాధన అవసరం . ప్రతీ ఒక్కటి కంటికి కనిపిస్తేనే నిజం అనుకునే మనిషికి ,  సాధన ద్వారా ఆ స్పష్టత అవగతం అవుతుంది.  మనిషి మహాజ్ఞాని , అదేవిధంగా పరమ అజ్ఞాని కూడా. మనిషిలోని మనసుకు ఉన్న  అధ్బుతమైన  శక్తి , అదేవిధంగా వెసలుబాటు ఈ విశ్వంలో ఏ జీవికి లేదు. కానీ దానిని మనిషి పూర్తిగా చాలా సందర్భాల్లో గుర్తించలేడు. ఎందుకంటే కళ్ళతో నిత్యం చూస్తూ ఉండే బాహ్య ప్రపంచంలో మాయ సర్వం కమ్మెస్తూ ఉంటుంది.అదే ఒక విధంగా దుఃఖానికి కారణం అవుతుంది.

• మనిషి తన చుట్టూ ఉన్న సాటి మనిషి మనస్తత్వాన్ని నిరంతరం పరిశీలన చేస్తూ, విశ్లేషిస్తూ ఉంటాడు. కానీ తన గురించి, తన వ్యక్తిత్వం గురించి, తన మనస్తత్వం గురించి సమయం కేటాయించడు. ఎందుకంటే ఒప్పుకోలేని తనం. మనిషి ఒకసారి తన గురించి తాను ఆలోచించినప్పుడు తనలోని లోపాలు స్పష్టంగా కనబడుతున్నప్పుడు అంగీకరించలేడు. ఎందుకంటే ఏదో తెలియని అహం కనిపిస్తుంది, దీనినే తనను తాను మోసం చేసుకోవడం అంటారు. మనిషి తన లోపాలను తాను ఎప్పటికి అర్థం చేసుకుని అంగీకరిస్తాడో,  అప్పుడు  ఆ లోపాలు ఇతరులకు చేరే అవకాశం ముమ్మాటికీ ఉండదు. ఈ ప్రక్రియ వల్ల మనిషి కి గౌరవం, మర్యాద,  ఆనందమే దొరుకుతాయి  గానీ దుఖం ఉండదు.

• నిశితంగా గమనిస్తే ప్రకృతి మంచి ఆలోచనలతో కూడిన  సంకేతాలు మనిషికి నిరంతరం పంపిస్తూనే ఉంటుంది,  జీవితం ఎలా ఉంచుకోవాలి ,  ఎలా ఉండాలి, ఏమి చేయాలి, ఎలా బ్రతకాలి అని. వాటిని జాగ్రత్తగా గమనించి కార్యాచరణ చేయడమే  మనిషి విధి . అది కుటుంబమా, సమాజమా, సేవా , ఉద్యోగమా, వ్యాపారం  అనే పలు విధాలైన అంశాలతో ముడిపడి ఉంటుంది.

• When you feel nothing …. You will be come something……...When you feel something….You will be know that you are Whole Thing…….Here the Thing should be the "SUNYAM" .....This is the transformation and evaluation of life destiny by nature. నీవు ఒక శూన్యం అనే స్థితికి చేరినపుడు ప్రకృతి నీకు ప్రసాదించే అరుదైన గౌరవం ఇది.

• క్షమించాలి.....ఇదంతా బాధ్యతలను  విస్మరించమని   కాదు. ఒక  నిర్దిష్టమైన  ఆలోచనాశక్తి మనిషి పొందగలిగినపుడే విధిని సునాయాసంగా సులభంగా నిర్వర్తించగలడు.  ప్రతి సమస్య స్వయంగా పరిష్కరించుకోవచ్చు. ఆధ్యాత్మికత, దైవం, వేదాంతం అనేది మనిషిలోని అజ్ఞానాన్ని పారద్రోలే మార్గదర్శకాలు. కాకపోతే అవి సాధారణ స్థాయిలో ఉన్న మానవునికి అర్థం అయ్యే విధంగా చేరడం లేదు, అని నా ఉద్దేశం. పరమాాత్మ నాకు అప్పగించిన కర్తవ్యంగా భావించి రాస్తున్నాను .

YSR 20 Aug 21 6:00 am.


No comments:

Post a Comment

494. Failures Are Accurate Winners

  Failures Are Accurate Winners • అపజయం అనే పదం వినగానే ప్రతి మనిషి లో కలిగేది ఒక భయం, మానసిక ఆందోళన. మనిషి ఏదైతే కోరుకుంటాడో అది పొందక పో...