వైరాగ్యం జన్మకు సూర్యోదయం
• మనం అనేక సార్లు వైరాగ్యం గురించి ఇలా అనుకుంటాం . వైరాగ్యం అంటే విరక్తి , నిరాశ వాదం సర్వస్వం కోల్పోయినట్లు ఉండడం .
అసలు వైరాగ్యం అనే పదం జ్ఞానం యొక్క పరిపక్వత తో ఆవిర్భవించిన అనుభవం . “జ్ఞానం” అంటే ఏది సత్యమో , ఏది అసత్యమో ఆధార భరితంగా, అనుభవ పూర్వకంగా మనకు అర్దం కావించేది .
• మనుషులం అయిన మనం ఈ మాయా ప్రపంచం లో , మాయ తో కలిసి జీవిస్తున్నాం అనే విషయం తెలియకుండా నే జీవిస్తున్నాం . అదే మాయ యొక్క మహిమా శక్తి . అందుకు ఉదాహరణ నీతి , నిజాయితీ , సత్యం అంటూ ఎన్నో విషయాలు మాట్లాడుతాం , చెపుతాం కానీ ఆచరణలో మాత్రం ఉండవు . అదే మాయ , మాయా ప్రపంచపు ప్రభావం .
ఇక్కడ ఉన్నది అంతా నిజం అని పరిగెడుతూ, వెంపర్లాడుతూ మనల్ని మనం మరచి పోయి, మనలో మనకు ఉన్నది మనకు మేలు చేసేది ఏదో తెలియక , లేని దాని కోసం అర్రులు చాచి , చివరికి పుణ్యకాలం అంతా గడిపెస్తాం . దీనినే అజ్ఞానం అంటారు . దుఃఖానికి , సమస్యలకు , చెడు కర్మలకు ఇదే బీజం.
• జ్ఞానం సత్యాన్ని , నిజాన్ని తెలియచేస్తుంది , చూపిస్తుంది . భక్తి లో ఇది సాధ్యం కాదు . జ్ఞానం ఏనాడైతే ఆకళింపు అవుతుందో , అది వైరాగ్యాన్ని కలుగ చేస్తుంది. వైరాగ్యం అంటే అన్నీ వదలి వేయడం కాదు . సూక్ష్మ స్థితి తో మనకు ఏది అవసరమో దానితో ఉండడం వైరాగ్యం . శరీరం తో అన్నింటా ఉంటూ మనసు ను అన్నింటికీ అతీతంగా చేసుకోవడం వైరాగ్యం . ఎప్పుడైతే మనసు అన్నింటికీ అతీతంగా అవుతుందో , ఆ మనసు ప్రత్యక్షం గా ముడిపడేది భగవంతుని తో నే .
• వైరాగ్యం వలన పొందే ఆనందం, సంతోషం వర్ణించలేనివి . మానవుడు ఈ ఆనందం , సంతోషం కోసమే ఎన్నో మార్గాలు వెతుక్కుంటూ , నేడు వికారాలతో కుప్పిగంతులు వేస్తూ , విలాసాల మైకం లో అనారోగ్యం పాలై చివరికి వికారిగా , బికారి గా మరణిస్తున్నాడు . ఇదంతా మాయా ప్రభావం.
దురదృష్టం ఏమిటంటే సంతోషం ఆనందం అనేవి మనిషి మనసు లో నే అనాది గా కప్పబడి ఉండిపోయాయి అనే విషయం తెలియకపోవడం .
• గమనిస్తే . . . బ్రహ్మ సరస్వతి , విష్ణువు లక్ష్మి దేవి లను బురదలో ఉన్న కమలపుష్పం లో చూపిస్తారు . దీనికి అర్దం , కలియుగ ప్రపంచం అంతా మాయ అనే బురద తో నిండి ఉంటుంది అని . మాయా అనే బురదలో కూరుకు పోకుండా మనిషి తన లో దాగి ఉన్న దివ్యత్వాన్ని తిరిగి ఎలా పొందాలో తెలియ చేసేది శివ పరమాత్ముని జ్ఞానం . దీనినే గీతా జ్ఞానం అంటారు . భక్తి మార్గం లో ఇదే విషయాన్ని శివుడు దక్షిణామూర్తి రూపంలో చెపుతున్న విధంగా శాస్త్రాలలో చూపిస్తారు .
• జ్ఞానం ప్రతి మనిషి కి అవసరం . బుద్ధి, ఆలోచన సవ్యం గా , స్థిరంగా , ఏకాగ్రం గా ఉన్న నాడు జ్ఞానం యొక్క అసలు స్వరూపం తెలుసుకొని అర్దం చేసుకొని అనుభవించ గలం . మనిషి యొక్క అన్ని సమస్యలకూ జ్ఞానం లేకపోవడం కారణం . మాయ ఆడించే ఆటకు మనిషి ఏనాడో దాసోహం అయిపోయాడు . మాయ కూడా , భగవంతుని వలే చాలా శక్తి వంతమైనది . అందుకే మనిషి , అంత త్వరగా తన లో గాని, తన చుట్టూ ఉన్న మాయను గ్రహించలేడు జయించలేడు .
• శివుని గీతా జ్ఞానం లభించిన నాడు త్రికాల దర్శనం , త్రికరణ సిద్ధి లభిస్తుంది. అప్పుడే మన చుట్టూ ఉన్న శత్రువులతో పాటు మనలో ఉన్న శత్రువులు స్పష్టం గా కనిపిస్తారు .
విచిత్రమైన విషయం ఏమిటంటే, ఏనాడైతే మనిషి జ్ఞానం తెలుసు కోవడం ఆరంభిస్తాడో , ఆనాడే మాయ మరింత ఫోర్స్ గా ఏదొక రూపం లో అనగా , వ్యక్తి ఆకర్షణ లేదా వస్తు , ధనం , వ్యామోహం రూపంలో లేదా బంధన రూపం లో వెంట పడుతుంది .
ఈ విషయాన్ని మనకు ధృవీకరణ చేసేందుకు , విశ్వామిత్రుడిని భంగపరిచేందుకు లో రంభ ఊర్వశి మేనకలు మాయ రూపం లో వచ్చారు అని పురాణాల లో చెప్పారు .
అదే విధంగా సీతాదేవి అకస్మాత్తుగా మాయా లేడి పట్ల ఆకర్షితమై , దాని వెంట పడి రావణాసురుడికి దొరికిపోయింది. అని రామాయణం లో చెప్పారు .
ఇది పరమ సత్యం .
• జ్ఞాన మార్గం లేదా సంపూర్ణ దైవిక ప్రయాణం ఆచరించే వారి పై మాయ ఎనలేని ప్రేమను చూపిస్తూ తవ వైపు ఆకర్షిస్తూ పాతాళానికి పడేయాలి అని చూస్తుంది . కానీ , జ్ఞానులు మాయా జీవులను కూడా భగవంతుని జ్ఞానం తో జయించ గలరు .
మాయ మనిషి లోని బలహీనతల రూపం లో కూడా ఉంటుంది . మాయ చాలా సూక్ష్మంగా ఉంటుంది. అదే మనిషి పతనానికి కారణం అని మనిషి కూడా తెలియకుండా ఎన్నో జన్మలు గడిచిపోతాయి . మాయ అంటే అసత్యం. నిజం కానిది .
• ఏదైతే మనం రెండు చేతులు ఎత్తి భగవంతుని కి మొక్కుతూ ఉంటామో, భగవంతుని కోసం దిక్కు లేని వారిగా కొండలు కోనలు ఎక్కుతూ తిప్పలు పడుతూ ఉంటామో , అదంతా మాయ వలన మనిషి కి కలిగిన దుస్థితి . ఎందుకంటే , మనం శివుని సంతానం అనే విషయాన్ని , మరచి పోయేలా మాయ చేసింది . అందుకే అనాధల వలే భగవంతుడు అయిన తండ్రి కోసం ఆర్తి తో వెతుకుతూ ఉంటాం .
• జ్ఞానం ద్వారా తెలియవచ్చిన సత్యం ఆచరించినపుడు ప్రకృతి, సృష్టి, విశ్వం మనకు కావలసిన శక్తి ని ఇవ్వడం ఆరంభిస్తాయి . జ్ఞాని ఎన్నడూ ఆడంబరంగా జీవించడు . ఎందుకంటే జ్ఞానికి వైరాగ్యమే ఊపిరి .
అందుకే నేను అంటాను , వైరాగ్యం జన్మ కి సూర్యోదయం అని . వైరాగ్యం ఎన్నో జన్మల పుణ్యఫలం . అన్నింటా ఉంటూనే , వాటిని మనసు కి అంటక అతీతమైన స్థితితో జీవించడమే వైరాగ్యం .
ఆధ్యాత్మిక చింతన , స్పృహ కలిగిన వారికి మాత్రమే ఈ రచన .
ఓం శాంతి 🙏
ఓం నమః శివాయ 🙏
యడ్ల శ్రీనివాసరావు 5 May 2026 1:00 PM
.jpg)
No comments:
Post a Comment