Sunday, May 31, 2026

750. తాడు ను తెంపకండి “సాగ” దీయండి

 

తాడు ను  తెంపకండి   “సాగ” దీయండి



• మానవ సంబంధాలలో అభిప్రాయ భేధాలు కలగడం సహజం , కలహాలు సంభవించిడం సర్వ సాధారణం. ఇవి ఒకోసారి తారాస్థాయికి చేరుకుంటాయి. ఒకరితో మరొకరు కలిసి ఉండలేనంతగా , ఒకరిని మరొకరు భరించలేనంత పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది .

 ఈ సమస్య ప్రతి మనిషి తన జీవితంలో ఏదో సమయం లో ఎవరో ఒకరితో ఏదో ఒక సందర్భంలో అనుభవించ వలసి వస్తుంది . ఆ సమయంలో వ్యక్తుల మధ్య కలహాలు , దూషణలు పెరుగుతాయి . ఓర్పు సన్నగిల్లి ఆ బంధాన్ని  తుంచి వేయాలి , కట్ చేసుకోవాలి  అనిపిస్తుంది .


• బంధాలు  ఎటువంటివి అయినా సరే బలవంతంగా తెంపకండి , కట్ చేయకండి . ఎందుకంటే ఆ బంధం వేసుకున్నది , కలుపుకున్నది మనమే కాబట్టి . ఆ బంధం లో సమస్య ఉంటే , అది సరియైన బంధం కాకపోతే , ఆ బంధాలలో వ్యక్తుల మధ్య పొంతన కుదరకపోతే కనుక ఆ బంధాన్ని  కొన  “సాగ” నివ్వండి .


• బంధం అంటే మనకు మనం గా , కోరుకొని పెన వేసుకున్న, లేదా ముడి పెట్టుకున్న తాడు. దానిని బలవంతంగా తెంపకూడదు, ఆ బంధం లోని వ్యక్తులతో సమస్యలు వచ్చి నప్పుడు మనకు మనం కట్ చేయకుండా , కాస్త ఓర్పు వహిస్తే . . . ఆ బంధం సాగి సాగి అనగా పలచబడి దానంతట అదే సహజం గా తెగిపోతుంది  , లేదంటే బంధం లోని సమస్య పరిష్కారం అవుతుంది. 

• అంతవరకు ఆ బంధాన్ని కాస్త భరించే గలిగితే ఏదో రూపంలో ఏదో విధంగా ఎవరో ఒకరి సహాయం వలన సహజంగా తెగిపోతుంది . అంతే కానీ బలవంతంగా మాటలతో చేతలతో ఆ బంధాన్ని తెంపకూడదు .


• బంధాలు అనేవి చేసిన కర్మల అనుసారం మనిషికి ఏర్పడతాయి . మనిషి  తనకు తాను కోరుకొని కలుపుకొని  ఏర్పరుచుకున్నవి . ఇందులో భగవంతుని ప్రమేయం ఉండదు . ఎందుకంటే ఏ మనిషి కూడా భగవంతుని ఆమోదం తీసుకొని బంధాన్ని కలుపుకోడు . మనిషి  తన అవసరం కోసమే బంధాలను సృష్టించుకుంటాడు .


• ఈ బంధాలు అనేవి కర్మ బుణాలు. ఒకవేళ మనకు ఒకరితో ఇబ్బంది ఉంది అని బంధాన్ని కట్ చేస్తే , అదే  ఇబ్బంది కర స్థితి తో  కూడిన కర్మ మరొకరితో తప్పకుండా  ఆరంభం అవుతుంది. ఇది పరమ సత్యం . 

బంధాలలో ఉన్న కర్మ బుణం అనేది  మనిషి కి ఎవరితో  ఏ విధంగా ఉన్నా  ఆ  వ్యక్తులతో తీరి పోవలసిందే . బంధాల లోని వ్యక్తులు ఇబ్బంది పెట్టే స్థితి ఉంటే ఓర్పు  వహించి  సహించి  కాలానికి  వదిలెయ్యండి , భగవంతుడుని  స్మరించండి . ఎందుకంటే కాలంలో కాలుడు (శివుడు) ఉంటాడు. ఆ సమస్యాత్మక బంధాలను ఎలా పలుచగా (dilute) చేయాలో కాలుడికి తెలుసు . అప్పుడు ఆ బంధం అనే తాడు సాగి సాగి  సన్నగిల్లి  సహజంగా తెగిపోతుంది లేదా పరిష్కారం అవుతుంది .


• బంధం అంటే ఏదైనా కావచ్చు . . . స్నేహబంధం , ప్రేమ బంధం, దాంపత్య బంధం, రక్త(సం)బంధం, అక్రమ(సం)బంధం , వ్యాపార బంధం . ఇలా ఎన్నో ఎన్నెన్నో  మానవుడికి దుఃఖం, అశాంతి కలిగించేవి ఈ బంధాల లోని పాత్ర లే .

కర్మ ఏ రూపంలో ఎవరితో ఎలా ఉన్నా అనుభవించ వలసినపుడు అనుభవించ వలసిందే. ఆ కర్మ ను బలవంతంగా తుంచకూడదు . శివుని స్మృతి లో ఆ కర్మ ఆచరించడం వలన తేలికగా తొలగిపోతుంది.


గమనించాలి . . .

 ఈ రచన యొక్క అర్దం ఎవరూ కూడా బంధాలను ఏర్పరచుకోవద్దు  అని కాదు , బంధాలకు  దూరంగా ఉండమని అసలే కాదు .   బంధాల ద్వారా వ్యక్తులను  భరించ లేని స్థితి కలిగినపుడు , సమస్యలు వచ్చినప్పుడు , కట్ చేయకండి . ఓర్పుతో ఉండండి. 

భార్య భర్తలు  విడాకులు వంటివి తీసుకోకండి . రక్త (సం)బంధీకులు ఆస్తుల కోసం హింసకు పాల్పడకండి .  స్నేహితులు  మాటలతో  ఈర్ష్య ద్వేషాలు తో  దూషించుకోకండి .  ప్రేమికులు  నమ్మించి  మోసం చేసేలా  జిత్తులమారి  నటన వేషాలు అవలంభించకండి . 

వీటన్నింటి బదులు భగవంతుని స్మృతి చేయండి . మీకు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే బంధాలలోని వ్యక్తులతో  శాశ్వత విముక్తి లభిస్తుంది లేదంటే కనీసం వారిలో మార్పు వస్తుంది . మీ సమస్య తీరి సంతోషంగా ఉంటారు . ఇది పరమ సత్యం .


ఓం శాంతి 🙏

ఓం నమఃశివాయ 🙏

యడ్ల శ్రీనివాసరావు 31 May 2026 , 10:00 AM.


No comments:

Post a Comment

750. తాడు ను తెంపకండి “సాగ” దీయండి

  తాడు ను  తెంపకండి   “సాగ” దీయండి • మానవ సంబంధాలలో అభిప్రాయ భేధాలు కలగడం సహజం , కలహాలు సంభవించిడం సర్వ సాధారణం. ఇవి ఒకోసారి తారాస్థాయిక...