Friday, May 8, 2026

742 .భగవంతుడు మనిషి తో మాట్లాడితే ?

 

భగవంతుడు మనిషి తో మాట్లాడితే ?





• భగవంతుడు మనుషులతో మాట్లాడితే ? . . . 

• అవును భగవంతుడి కోసం ఎన్నో ప్రార్థనలు, పూజలు, వ్రతాలు , ఉపవాసాలు, మొక్కులు ఎన్నో ఎన్నెన్నో మనిషి చేస్తుంటాడు . ఎందుకంటే భగవంతుడితో మనిషి కి అనేక అవసరాలు ఉన్నాయి . కానీ ఎంత భక్తి చేసినా, ఆ విగ్రహాంలో ఉన్న మూర్తి ఎందుకని మాట్లాడడం లేదు . కాలం గడుస్తుంది కానీ మనిషి సమస్యలకు, దుఃఖాలకు పరిష్కారం లభించడం లేదు సరికదా నానాటికీ ఎందుకు పెరుగుతున్నాయి . మరి మనిషి ఆంత ప్రాధేయపడి , బోలెడు ధనం వెచ్చించి భగవంతుడు కోసం ఎన్నో చేస్తున్నప్పుడు, కనీసం భగవంతుడు మాట్లాడాలి  కదా  ?


• కానీ  . . .  భగవంతుడు మనిషి తో మాట్లాడడు ,  ఎందుకంటే  ఆయన కి  భయం , ఆయన  మనిషి తో మాట్లాడితే ,  మనిషి  చాలా  బాధపడతాడు  అనే  భయం. అసలే  దుఃఖాల లో ఉన్న మనిషి మరింత దుఖితుడు గా అయిపోతాడు అనే జాలి . అందుకే  భగవంతుడు మౌనం గా ఉండి పోతాడు.

అయినా ,  భగవంతుడు మాట్లాడితే మనిషి ఎందుకు  బాధపడతాడు ,  ఇంకా సంతోష పడతాడు కదా  ?


• కలియుగంలో మనుషులందరూ అమాయకులు . ఎంత అమాయకులు అంటే  . . . 

మేడిపండు చూడ నోరూర 

పొట్ట విప్పి చూడ పురుగులుండ 

అనే చందాన ఉండడం . . . . నీతి , ధర్మం , నిజాయితీ , నిస్వార్థం అంటూ  వేదాలు వల్లిస్తారు . కానీ ఆచరించే వారు అరుదు . సత్యమే మాట్లాడాలి అంటారు . కానీ నిజం మాట్లాడే వారు అరుదు . మంచి ఆలోచనల తో జీవించాలి అంటారు , కానీ మనసు లోతుల్లో కి  వెళితే   చీకటి కోణాలు, వ్యవహారాల తో   ఎన్నో ఆలోచనలు నిండి పోయి ఉంటాయి .

• మానవ సంబంధాలు , బంధుత్వాలు , స్నేహ సాంగత్యాలలో  భ్రష్టు పుష్కలంగా పేరుకు పోయి ఉందని , ఎన్నో అనుభవాలతో మనిషి స్పృహ కి ఒక వైపు స్పష్టం గా  అర్దం అవుతుంది , మరో వైపు ఆ మత్తు నే  కోరుకుంటాడు . ఎందుకంటే అదొక మానసిక దుర్బలత . అందులో నే  కావలసిన ఎన్నో ఆనందాలు కాలక్షేపాలు , psychic  emotions లాంటివి  వెతుక్కుంటాడు . మనిషికి  మనిషికి మధ్య  మనసు లో ఆత్మీయత ఉండదు, కానీ ఆలింగనాలూ, కరచాలనాలు , విషపు నవ్వులు మెండుగా  ఉంటాయి .  అన్ని విధాలా మానసికంగా పతనం అయిపోయిన మనిషి నైతికంగా స్టేటస్ , వస్తృ వేషధారణ , హావభావాల హుందా తనం ప్రదర్శిస్తాడు . ఇదంతా కలిపి కలియగపు మనిషి అమాయకత్వం .  

• ఆలుమగలు గృహస్థ ధర్మం ఆచరిస్తాం అని పెళ్లి నాడు ,  అగ్ని సాక్షిగా ప్రమాణాలు చేస్తారు . అక్రమ సంబంధాలే  నేడు అధికంగా సక్రమ సంబంధాలు గా  మారుతున్న మనిషి పరిస్థితి ఒక దుస్థితి .  మానసిక వ్యభిచారానికి మనిషి దాసోహం అయిన , వేళ , ఏదీ తప్పు కాదు అంతా సహజం అనుకునే ఆలోచనలతో సర్దుకుంటున్నాడు . ఎందుకంటే మనిషి కి కావలసినంత స్వేచ్చ  లభిస్తుంది కాబట్టి.

• వ్యాపార ధర్మం ఆచరిస్తాను  , అని ఆరంభంలో భగవంతుడి సాక్షి గా పూజ చేస్తాడు. కల్తీ లలో తన మునక లేస్తుంటాడు .

• వృత్తి ధర్మం పాటిస్తాను అని సంతకాలు చేసి అపాయింట్మెంట్ లెటర్ తీసుకుంటాడు . లంచగొండి వ్యవహారాలు, కమీషన్లు సర్వ సాధారణం గా భావిస్తాడు .

• ఒకటేమిటి విద్య, వైద్యం అన్నింటా ఎటు చూసినా దోపిడీ, దురాగతాలు. ఇవన్నీ మనిషే అలవోకగా గుట్టు చప్పుడు కాకుండా, మూడో కంటికి తెలియకుండా తన మనసు లోని ఆలోచనల తో భద్రం గా  జాగ్రత్తగా  ఒక క్రమశిక్షణా పద్దతి లో చేస్తుంటాడు . అందులో మనిషి ఆరితేరిపోయాడు. అయినా ఇందులో తప్పేముంది, ఇదంతా మోడ్రన్ , ఆధునిక సమాజం లో ఇవి  సహజం అని అమాయకత్వం గా అనుకునే తత్వాన్ని బాగా వృద్ధి చేసుకున్నాడు మనిషి . దీనికి కారణం అవసరానికి మించిన ధనం కలిగి ఉండడం . 


• నేడు మనిషి చాలా అమాయకుడు. ఎంత అమాయకుడు అంటే , తాను చేసిన తప్పులు , పొరపాట్లను  బయట పడిన సందర్భాలలో  , ఒకవేళ ఎవరైనా సహచరులు గాని , కుటుంబీకులు గానీ , శ్రేయోభిలాషులు గాని , మిత్రులు గాని సరిచేయాలని చూస్తే అటువంటి వారి ని నిందించడం , దూషించడం అవసరమైతే హత్య చేయడానికి కూడా వెనుకాడని స్థితి లో మనిషి ఉన్నాడు . ఎందుకంటే అది  తన పరువు , అహంకారానికి సంబంధించిన అంశం కాబట్టి .


• ఇక్కడ గమనిస్తే ప్రతీ అంశం లో కూడా మనిషి అమాయకుడే . ఎందుకంటే ఇతరులను నమ్మించడం లో  ఆరితేరి పోయి , మాటలను మార్చడం లో తన నాలుక చేసే నాట్యానికి ముగ్ధుడై . . .  పాపం తన అమాయకత్వానికి తానే ఆనందపడుతూ  ,  రోజూ గుడికి  వెళ్ళి  భగవంతుడికి  వాటాలు ఇస్తూ తాను  అమాయకుడిగా   భావిస్తాడు.


•  మనిషి ని   సృష్టించిన  భగవంతుడికి ,  ప్రతి మనిషి యొక్క బుద్ధి  ఆలోచన  వ్యక్తిత్వం  సంస్కారం ఇలాంటివి ఏమీ తెలియదా ? . . . అంటే తెలుసు.

తెలుసు, కనుకనే  ఆయన ఎవరితోనూ మాట్లాడడు. ఒకవేళ భగవంతుడు  మాట్లాడితే సత్యమే మాట్లాడుతాడు . సత్యం తప్ప మరొకటి భగవంతుడికి తెలియదు . మనిషి బుద్ధి లో ని లోపాలను , చేసే పాపాలను కళ్ళు కు కట్టి నట్టు వివరించి  చూపించి కర్మలు లెక్కలు సూక్ష్మంగా వేసి చెపుతాడు .  మరి  , భగవంతుడు చెప్పే , ఆ సత్యం  మనిషికి  రుచిస్తుందా ? జీర్ణించుకోగలడా ?.


భగవంతుడు  నేటి కాలంలో మనిషి గురించి సత్యం మాట్లాడితే , వెంటనే మనిషి తిరిగి తనను దూషిస్తాడని , తనపై కత్తి దూస్తాడని  భయపడి మాట్లాడకుండా , రాయి లో మౌనం గా ఉండిపోయి మనిషి నటనను చూస్తూ ఉంటాడు భగవంతుడు . ఎందుకంటే , లోపాలు సరి చేయాలనుకున్న  తోటి మనిషి  పైనే  విధ్వంసం సృష్టించే మనిషికి . . . అదే మనిషి గురించి నిజాలు చెబితే తనను ఇంకేమి చేస్తాడో  అని భగవంతుడికి విపరీతమైన భయం ఉంటుంది .


• కానీ , అదేంటో విచిత్రం, గుట్టు చప్పుడు కాకుండా చీకటి ఆలోచనల  వ్యవహారాల తో , ధర్మ బద్ధం కాని ధనంతో, బుద్ధి హీనత తో ఎన్నో రకాలు గా మనిషి జీవిస్తూ , భగవంతుడికి వాటాలు సమర్పిస్తూ , భగవంతుని  కార్యాలు చేసెస్తూ  , . . . సమాజ సేవ అంటాడు. ఆ ముసుగులో  పబ్లిసిటీ ,  పేరు , కీర్తి , గుర్తింపు కోసం తహతహలాడుతాడు  మనిషి .


• భగవంతుడు  అనే పేరు తో  ఎన్ని  సేవా కార్యక్రమాలు చేసినా . . . ధర్మబద్ధం కాని పైసాను , మనో శుద్ది లేకుండా  చేసే  భగవత్ కార్యాలను భగవంతుడు అణువంత కూడా స్వీకరించడు . ఇది పరమ సత్యం . భగవద్గీతలో చెప్పబడింది . ఆ కార్యక్రమాల భాగ్యం మనిషి పుణ్య ఖాతాలో జమ కానే కాదు . ఎందుకంటే భగవంతుని కి , మనిషి నుంచి కావలసింది  పవిత్రత , మనో శుద్ది , శుద్ద మైన ప్రేమ ,  కల్మషం ఎరుగని అమాయకత్వం .  


• మనిషి గురించి సర్వస్వం సమస్తం తెలిసిన భగవంతుడు , నేడు మనిషి మానసిక పరిస్థితిని చూసి జాలిపడే స్థితి లో ఉన్నాడు . ఎందుకంటే మనిషి చాలా అమాయకుడు. ఎంతగా అంటే, తనను తాను అనుక్షణం మోసం చేసుకుంటున్నాను అనే విషయం మరచి ఇతరులను మోసం చేస్తూ , ఈ మాయా ప్రపంచం లో ఏది తప్పు ఏది ఒప్పు , ఏది సత్యం ఏది అసత్యమో తెలియక , మితి మీరిన ధనం వలన సమస్తం నాకే తెలుసు అనే అహంకారం లో చిక్కుకు పోయాడు .


భగవంతుడికి , నేటి కలి కాలపు మనిషి యొక్క మానసిక స్థితి , పరిస్థితి,  కొన్ని యుగాల క్రితమే తెలిసి  . . . త్రేతా, ద్వాపర యుగాలలో  బుషులు, మునులు జ్ఞానుల ద్వారా  రామాయణం , భారతం , పురాణాలు , ఇతిహాసాలలో   పాత్రల ద్వారా ఎలా జీవించాలో రచించాడు . నేడు ఆ గ్రంధాలను పూజించడం మినహ అందులో ఉన్న ప్రతి పాత్ర తనదే అని మనిషి గ్రహించే పరీశీలనా శక్తి కూడా నేటి మనిషి కి లేదు. ఎందుకంటే నేటి మనిషి  చాలా అమాయకుడు .


• ఈ ప్రపంచంలో  ఏ మనిషి  మరో  మనిషి కోసం జీవించడు . ప్రతి మనిషి తన అవసరాల కోసమే ఒక అమాకుడిలా  నటిస్తూ జీవిస్తాడు . ఎందుకంటే మనిషి లోని అపారమైన తెలివి తేటలు అన్నీ కూడా నటన లో ఆరితేరడానికే  సరిపోతుంటాయి … అందుకే మనిషి ఒకే మాటను మార్చి మార్చి నలుగురికి నాలుగు విధాలు గా మాట్లాడుతుంటాడు . ఇందులో సిద్ధహస్తుడు , ఏ ఎండకు ఆ గొడుగు పడుతుంటాడు . నేడు బ్రతకాడానికి ఇంతకంటే గత్యంతరం లేదు .


• ఎన్నో అమ్ముకోవడానికి  అలవాటు పడిన మనిషి మనస్సాక్షి ని కూడా అలవోకగా అమ్ముకోవడానికి ,  తాకట్టు పెట్టుకోవటానికి తనకు తెలియకుండానే అలవాటు పడిపోయాడు. ఎందుకంటే మనిషి అమాయకుడు .

• ఎన్నో కొనడానికి అలవాటు పడిన మనిషి , తనకు అవసరమైన,  తన స్వ ధర్మాలైన  శాంతి , సుఖం , ప్రేమ , జ్ఞానం , పవిత్రత , ఆనందం   ఎక్కడా  కొనలేక పోతున్నాడు . ఎందుకంటే  మనిషి చాలా అమాయకుడు కాబట్టి వాటి గురించి తెలియదు .

అందుకే భగవంతుడు తిరిగి మనిషి తో మాట్లాడడానికి భయపడుతున్నాడు . . . 


• భగవంతుడి కి తెలుసు . . . మనిషి , పూర్తిగా మాయకు వశం అయి పోయి జీవిస్తున్నాడని . అందుకే భగవంతుడు కలియుగాంతం లో , ధర్మం పూర్తిగా నశించి నపుడు భూమి పై అవతరిస్తాను అని భగవద్గీతలో చెప్పిన విధంగా అవతరించి నేటికీ 90 సంవత్సరాలు అయింది . కలియుగం అంతం కూడా ఆరంభం అయింది . అందులో భాగంగానే కరోనా లాంటి వైరస్ లు , ప్రపంచం నలువైపులా యుద్ధాలు. ఇది ఆరంభం మాత్రమే. పూర్తి స్థాయి వినాశనానికి ఇక మిగిలింది 10 సంవత్సరాలు లోపు కాలం మాత్రమే.


తనను తాను తెలుసు కోవడం లో ,  లోపాలను సరిచేసుకోవడం లోనే  మనిషి  ఉన్నతి   కాగలడు. ఎందుకంటే, మరణం తరువాత తిరిగి శ్రేష్టమైన జన్మ ఎత్తాలి అంటే  తప్పని సరిగా స్వీయ ఉన్నతి అవసరం . 


Written by the Energies Conjunction of KARMIC planet SATURN 🪐 and Past Lifes Spiritual Mastery experienced planet  KETU .

 

ఓం శాంతి 🙏

ఓం నమః శివాయ 🙏.

• ఆత్మ ✍️ , 7 May 2026 11:30 PM .



No comments:

Post a Comment

742 .భగవంతుడు మనిషి తో మాట్లాడితే ?

  భగవంతుడు మనిషి తో మాట్లాడితే ? • భగవంతుడు మనుషులతో మాట్లాడితే ? . . .  • అవును భగవంతుడి కోసం ఎన్నో ప్రార్థనలు, పూజలు, వ్రతాలు , ఉపవాసాలు, ...