Tuesday, May 19, 2026

746. శ్రీకృష్ణోపదేశం - కలియుగాంతం

 

 శ్రీకృష్ణోపదేశం  - కలియుగాంతం


• ఒకసారి శ్రీకృష్ణుడు , పాండవుల కు సృష్టి మరియ యుగాల గురించి ఉపదేశిస్తూ కలియుగం ఆరంభం గురించి వివరించగా , పాండవులు కలియుగ అంతం గురించి తెలియ చేయమని అడగడం జరిగింది .

  వెంటనే , శ్రీ కృష్ణుడు కలియుగ అంత్య సమయం ఎలా ఉంటుందో వివరించడం కంటే ముందు , తన శక్తి తో  అది స్వయం గా   వారికి  చూపించాలని నిర్ణయించుకొని , పాండవులకు  ఒక  పరీక్ష పెడతాడు .  ఆ పరీక్ష లో   ధర్మరాజు ను మినహాయించి . . . తన వద్ద ఉన్న నాలుగు బాణాలు తీసి , నాలుగు దిక్కుల వైపుకు వేసి అవి తీసుకుని రమ్మని అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు కి  చెపుతాడు .


వారు నలుగురు  తలో దిక్కు కు వెళతారు . 


• అర్జునుడు తాను వెళ్లిన దిక్కు లో దొరికిన బాణం తీసుకుని వస్తుండగా , ఒకచోట ఒక విచిత్రం చూస్తాడు. అప్పుడే దూడకు జన్మనిచ్చిన ఆవు, అదే పనిగా దూడను విపరీతంగా నాకుతూ ఉంటుంది. ఆ దూడను ఎంతకూ వదిలి పెట్టదు . అక్కడ ఉన్న వారు, ఆవు ను బలవంతంగా దూరం గా ఉంచినా సరే పరిగెత్తుకుంటూ ఆవు , దూడ దగ్గర కు వెళ్లి నాకుతూ ఉంటుంది . ఇది అర్జునుడికి చాలా ఆశ్చర్యం గా అనిపిస్తుంది . అది చూసి అర్జునుడు బయలుదేరుతాడు.


• ఇక రెండవ దిక్కు నుండి భీముడు బాణం తీసుకుని వస్తూ ఉంటే , ఆ మార్గంలో ఒక కోకిల బ్రతికి ఉన్న కుందేలు ను పొడుచుకుని తింటూ ఉంటుంది . భీముడు ఆశ్చర్యపోతాడు కోకిల ఎంతో మృధువైనది. ఎంతో మృదువుగా రాగం ఆలపిస్తుంది . అటువంటిది , కుందేలు ను పొడుచుకుని ఆహారం గా తినడం ఏమిటి . ఏమిటి ఈ విపరీతం అని, సందేహం తో భీముడు అక్కడి నుంచి బయలుదేరుతాడు .


• ఇక మూడవ దిక్కు నుంచి నకులుడు బాణం తీసుకుని తిరిగి వస్తుండగా , ఒక చోట వింత చూస్తాడు . ఒక పెద్ద బావి , దాని సమీపంలో నాలుగు చిన్న బావులు ఉంటాయి . కేవలం పెద్ద బావి లో మాత్రమే నీళ్ళు ఉండడం వలన , అక్కడి ప్రజలు నీళ్ళు తోడి చుట్టూ ఉన్న నాలుగు చిన్న బావుల్లో సమానం గా నింపుతూ ఉంటారు . కొంత సమయానికి పెద్ద బావి లో నీళ్ళు పూర్తిగా నిండుకుంటాయి . వెంటనే అక్కడి ప్రజలు, అయ్యయ్యో పెద్ద బావి లో కొన్ని నీళ్ళు అయినా ఉండాలి కదా అని , చుట్టూ ఉన్న నాలుగు బావుల లో ఇది వరకు వేసిన కొన్ని నీళ్ళు కొంచెం కొంచెం తోడి పెద్ద బావి లో వెయ్యాలని ప్రయత్నిస్తే , ఆ నాలుగు చిన్న బావుల లోని నీళ్ళు తోడే సరికే , అవి ఆవిరి అయిపోతుంటాయి ‌. కానీ పెద్ద బావి కి ఒక్క నీటి చుక్క కూడా దొరకదు .

 అది చూసిన నకులుడు ఏంటి ఈ విచిత్రం కళ్ళ ముందే ఇలా జరుగుతుంది అని అనుకుని అక్కడి నుండి బయలుదేరుతాడు .

• ఇక నాల్గవ దిక్కు న ఉన్న బాణం సేకరించిన సహదేవుడు తనకు దొరికిన బాణం తీసుకుని శ్రీకృష్ణుని వద్దకు బయలుదేరుతుండగా , ఒక విచిత్రం చూస్తాడు . ఒక పెద్ద బండరాయి , మహా పర్వతం పై నుంచి, దొర్లుకుంటూ వస్తుంది. అది అలా దొర్లుకుంటూ వచ్చేటప్పుడూ ఎంతో ఏపుగా ఆ పర్వతం పై పెరిగిన మహ వృక్షాలను కూలదోస్తూ , దొర్లుకుంటూ దొర్లుకుంటూ వచ్చి ఆఖరికి ఒక చిన్న గడ్డిపోచను అడ్డుకొని పర్వతం మధ్యలో ఆగి పోతుంది . సహదేవుడు కి చాలా ఆశ్చర్యం కలుగుతుంది అంత పెద్ద బండరాయి చిన్న గడ్డిపోచను ఆనుకొని ఆగిపోవడం ఏమిటి . ఏమిటి ఈ విచిత్రం అని అనుకుంటూ అక్కడ నుంచి బయలు దేరుతాడు .


• ఆ నలుగురు శ్రీకృష్ణుని చేరి , తాము చూసిన వింత అనుభవాలు వివరిస్తారు . అందుకు సమాధానంగా శ్రీకృష్ణుడు ఇలా చెపుతాడు . కలియుగం చివరిలో అంతం అవుతుంది అనడానికి అవే సంకేతాలు . . వాటిలోని సూక్ష్మం మీకు అర్దం చేయిస్తాను అని , శ్రీకృష్ణుడు ఇలా చెప్పడం ఆరంభిస్తాడు .

• మొదటి వృత్తాంతం ఆవు , దూడను నాకుతూ ఉండడం. . . కలియుగం అంత్య కాల సమయం లో జన్మ నిచ్చన తల్లి తండ్రులు తమ పిల్లలకు అతి గా ప్రేమ ను పంచుతూ , సాకుతూ ఉంటారు . పిల్లలకు కష్టం తెలియకుండా సమస్తం సమకూరుస్తూ , మమకారం అనే మైకంలో పిల్లలకు , తల్లిదండ్రులు బానిసలు లా ప్రవర్తిస్తూ ఉంటారు . కష్టం తెలియని పిల్లలు సోమరులై , అపసవ్య దిశలో జీవనం సాగిస్తారు . అందుకు నిదర్శనం ఆ ఆవు దూడ వృత్తాంతం అని శ్రీకృష్ణుడు చెపుతాడు. వాస్తవానికి దూడ ఆవు గర్భం నుంచి భూమిపై పడిన కొన్ని క్షణాలలో తనకు తాను లేచి పరిగెట్టాలి , ఇది సృష్టి ధర్మం. కానీ సృష్టి ధర్మం తప్పి నపుడు జీవులకు అదే వినాశన కాలం అని చెపుతాడు .

• ఇక రెండవ అంశం అయిన కోయిల కుందేలు వృత్తాంతం గురించి చెపుతూ. . . సృష్టి లో కోయిల స్వరం భగవంతుని ఆశీర్వాదం . ఆ విధంగా కోయిల వలే , దైవానుగ్రహం తో సంపాదించిన జ్ఞానాన్ని కలిగి ఉన్న పండిత పుంగవులు తమ గొంతు, స్వరం , మాటలతో , కుందేలు వంటి అమాయకులను ధనం కోసం పీల్చి పిప్పి చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటారు . విద్య , వైద్య , దైవీ జ్ఞానం వంటివి అనుభవజ్ఞులు కు ,  పండితులకు , గురువులకు లోక కళ్యాణార్దం భగవంతుని అనుగ్రహం చేత లభిస్తుంది . కానీ , ధనం కోసం తమ జ్ఞానాన్ని భ్రష్టు పట్టించి అమాయకులను పీడిస్తారు. అందుకు ఉదంతమే కోయిల , కుందేలు పట్ల  ప్రవర్తన అని శ్రీకృష్ణుడు చెపుతాడు.


• ఇక ముడవ అంశం . . . అతి పెద్ద బావి వలే విశాల హృదయం ఉన్న తల్లి తండ్రులు ఉమ్మడి కుటుంబం లోని తమ పిల్లలందరికీ సమానంగా కావలసినంత ప్రేమ సహయ సహకారాలు అందిస్తారు . కలియుగ అంతం లో ఈ ఉమ్మడి కుటుంబాలు అంతరించిపోయి , వృద్ధాప్యం లో ఉన్న తల్లి తండ్రులకు తమ పిల్లలు కడివెడు ప్రేమను కూడా పంచరు సరికదా అనాధల వలే చూస్తారు. అందుకే చిన్న బావుల్లో నీరు పెద్ద బావి కి చేరలేదు .


ఇక నాల్గవ అంశం బండరాయి గడ్డిపోచ . . . కలియుగం లో భగవంతునికి కోసం  ఎన్నో  వ్యయ ప్రయాసలతో   ఆలయాలు నిర్మించి  , అంగరంగ వైభవంగా విగ్రహాలు తయారు చేయించి ఆలయాలకు  సమర్పించిన వారికి కూడా సర్వ శక్తివంతుడు అయిన భగవంతుడు , పరమాత్ముడు లభించడు .  కారణం  ఆడంబరాలు అలంకారాలు , మాయా ఆకర్షణల తో చేసే  భక్తి   భగవంతుని కి  అణువంత కూడా ప్రీతి పాత్రం  కాదు . ఆ విధమైన వాటన్నింటినీ   దాటుకుని  . . .   భగవంతుని పై సత్యమైన ప్రేమ , మనసు కలిగి ఉన్న  గడ్డిపోచ  వంటి  అమాయకుని చెంతకు స్వయం గా పరమాత్ముడే వెతుక్కుంటూ వెళతాడు.   నిరుపేద అయిన మనసు లోనే  భగవంతుడు ఆసీనుడు అవుతాడు . దాని ఉదంతమే బండరాయి వలే  శక్తి వంతమైన  పరమాత్మ  , గడ్డి పోచ ను ఆనుకొని ఉండడం అని శ్రీకృష్ణుడు పాండవుల కు చెపుతాడు.


సేకరణ :   గీతా జ్ఞానం - రాజయోగం .


• శ్రీకృష్ణుడు చెప్పిన ఈ సందర్భాలు నేడు జరుగుతున్నాయో లేదో , ఇది కలియుగ అంత్య సమయమో కాదో నేటి కాలంలో మనిషే గ్రహించాలి . . . లేదంటే ఇంకా కలియుగం ప్రధమ పాదే , జంబూ ద్వీపే , భరతఖండే , భరతవర్షే , అంటూ నామ గోత్రాలు జపిస్తూ , ఇంకా కలియుగం ప్రధమ పాదం లో ఉన్నాం అనుకుని అమాయకత్వం తో ఉండవలసి వస్తుంది.


• Written by the Energies Conjunction of KARMIC planet SATURN 🪐 and Past Lifes Spiritual Mastery experienced planet KETU .


ఓం శాంతి 🙏 

ఓం నమఃశివాయ 🙏 


ఆత్మ  ✍️ 19 May 2026 11:30 PM 

No comments:

Post a Comment

746. శ్రీకృష్ణోపదేశం - కలియుగాంతం

   శ్రీకృష్ణోపదేశం  - కలియుగాంతం • ఒకసారి శ్రీకృష్ణుడు , పాండవుల కు సృష్టి మరియ యుగాల గురించి ఉపదేశిస్తూ కలియుగం ఆరంభం గురించి వివరించ...