నేను ఒంటరిని కాను
• నేను “ఒంటరిని” కాను అని ఈ సమాజానికి ఎలా చెప్పాలి అని నేను “ఒంటరిగా” కూర్చొని ఆలోచిస్తున్నాను . బాల్యం లో ఒంటరితనం అనే బీజం బాధించేందుకే అనిపించినా, అది బ్రతుకు బంగారు బాట కోసం అని శివుని తత్వం తో అనుభవం అయింది . భగవంతుని రచన (script) అమోఘం . ఆ మూలాన్ని అర్దం చేసుకోవడం అసాధారణం . స్వయం భగవంతుడే వచ్చి అర్దం చేయించినపుడే అది తెలుస్తుంది .
• నేను ఒంటరిని కాను . అనేక జన్మల కొరకు నాకంటూ ఒక శాశ్వతమైన తోడు నీడ కలిగి ఉన్నాను . ఆ తోడు తోనే జీవిస్తున్నాను , ఆ నీడలోనే నడుస్తున్నాను . . . ఒకోసారి , నువ్వు భగవంతుడు అనే భ్రమ లో (లోకం భాష లో పిచ్చి) ఉన్నావు , నా చుట్టూ ఉన్న మాయ నాకు గుర్తు చేసిన క్షణం లోనే , ఏదో అసాధారణమైన శక్తి తో అద్భుతాలను నాకు అందిస్తూ , ఆ మాయా భ్రమ లకు తెర దించుతూ, చీకటిని మరింత తొలగించి స్పష్టం గా చూపిస్తూ , వాటిని చవిచూసేలా చేస్తూ , నేను నీతో ఉన్నాను అంటాడు శివుడు . ఇంతకు మించి ఏం కావాలి.
• కాలం లో కలం ఒకోసారి కలకలం సృష్టిస్తోందా అనిపిస్తుంది. జీవితం లో ముగింపు లేని కథలకు , వాటి పాత్రలతో నాకు పని ఏంటి ? అలాగని నన్ను నేను తీరం చేరని కెరటం అనుకోలేను కదా? నా ప్రయాణం సంద్రమైనా తీరం చేరడం నాకు ముఖ్యం కదా!
• నేను మనసుతో నవ్వితే సమాజం నన్ను వెర్రి అనుకుంటుంది , మౌనం గా ఉంటే బ్రతకడం చాత కాదు అంటుంది , కానీ నా ఆనందం నాలోనే నాతోనే .
నేను నలుగురిలో ఉంటే ఇబ్బంది పడుతున్నాను అని సమాజం ఈ మధ్య అంటుంది . అవును , ఇబ్బంది పెడితే ఎవరైనా ఇబ్బంది పడతారు కదా ! ఆ మాత్రం కనీస ఇంగిత జ్ఞానం లేకుండా , ఆ నలుగురి తో ఉన్న ఈ సమాజం ఎలా ఎదిగింది ? అజ్ఞానం కాకపోతే . అందుకే ఒకోసారి సమాజాన్ని చూసి జాలేస్తుంది , పాపం సత్యాన్ని ఎదుర్కొ లేక మాయ తో కలిసి వంకర గా నడుస్తుంది అని.
ఇది నిజం , ఇదే నా నైజం . . .
• నాకు కనబడదని గాలిని , నేను చూడలేదని అదృష్టాన్ని నమ్మను అంటే కుదురుతుందా ? కలానికి కాలానికీ తలవంచని మనిషి లేడు కదా ! ఒక్కోసారి ఆలస్యం అమృతంగా మారుగాక. . అయినా గరళాన్ని మింగేవాడికి రంగు రుచి వాసనలతో పని ఏంటి ?
• అప్పుడప్పుడు పదాలకు దూరమయ్యేనేమో గానీ , నా శివుని పాదాలకు మాత్రం కాదు.
ఒక్కోసారి వాంఛితములు వంచనలకు గురికావలసిందే. నాకు వద్దూ అంటే చెవిలో దూరిన జోరీగ నిశ్శబ్దంగా ఉంటుందా ? అదే విధంగా కొన్ని మాయా సాంగత్యాలను కర్మ బుణానుసారం భరించవలసి వచ్చేది . బుణాలు తీరాయి . శాశ్వత విముక్తి లభించింది .
• నాలోని ప్రతి భావము పదరూపము పొందాలంటే అది శివానుగ్రహానికి నోచుకోవాలి కదా ! . . . . . . లేదు లేదు, నాకు ఆ అధికారం ఉంది కదా అని , అడిగిన వారి కోసం విర్రవీగితే పద సోపానాలు తుల్యమై చివరకు శల్యమై పోవుగా .
• “నా” అన్న భావన “నమః శివాయః” లోని “న” నుండి వచ్చినదైతే నా లోని “న” నన్ను ఎప్పుడూ ఉచ్చ స్థితిలో నిలబెడుతుంది. కారణం అది నిర్వికారి నిగర్వి నిరాకార నిర్గుణ తత్వాలని కలిగి ఉంటుంది కాబట్టి . లేదంటే , “ నా “ నాలోని సర్వ గుణముల కలయికయై నన్ను అహంకార భూషితుడను చేస్తుంది.
ప్రణవ నాదమైన ఓంకార శబ్దం శరీరం లో అణువణువునా ప్రతిధ్వనిస్తే ఆ తరంగ “అంతరంగ” మధురానుభూతులు వెల్లువలా పొంగి పద ప్రాసలుగా మారి పరవళ్ళు తొక్కు ప్రవాహాలుగా పొర్లుతాయి. ఇదే శివలీల. శివ కణములు లేని శివ గణములు ఉండునా ?
• నేను ఇంతకు ముందు విన్నవించినట్లు , మండినా మారనది , తుదకు మిగిలేది వెలకట్టలేనిది “విభూది” అదే ఐశ్వర్యం . నువ్వు విభూదిగా మారక మునుపే దాని విలువ తెలుసుకో తరువాత తెలుసుకోవడానికి ఏమీ మిగలదు , మరల విభూది తప్ప.
విరక్తి లోని రక్తి అద్బుతం . వైరాగ్యం లోని రాగం సమ్మోహనం .
• చివరిగా ! శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా , ఆ “చీమ” నన్ను ఎప్పుడు కుడుతుందా అని శూన్యం లోకి ఎదురు చూస్తూ ...
ఓం శాంతి 🙏
ఓం నమఃశివాయ 🙏
యడ్ల శ్రీనివాసరావు 30 May 2026 5:00 AM.

No comments:
Post a Comment