Wednesday, August 5, 2026

771. మనిషి కూడా ఒంటరివాడే


మనిషి కూడా ఒంటరివాడే 


• మనిషి ఎందుకని ఏకాంతం గా జీవించలేడు ?   ఎందుకని  ఒంటరితనం అంటే భయపడుతూ   ఉంటాడు ? 

ఒంటరి గానే పుట్టాడు. ఒంటరిగా నే చనిపోతాడు . మరి నడి మధ్య నడిచే జీవితం నాటకం, తాత్కాలికం అని తెలిసినా ఒంటరిగా ఏకాంతంగా జీవించ లేక కొత్త బంధాలు ఏర్పరచుకొని కర్మల ఖాతా, బుణాలు తయారు చేసుకుంటాడు .  


• మనిషి మనసు తరచూ అనేక అలజడులు గురి అవుతూ ఉంటుంది . దుఃఖం కొని తెచ్చుకుంటుంది. ముఖ్యంగా బంధాలలో బంధుత్వాల  లో,  స్నేహల లో  ఇలా ప్రతీ రిలేషన్ షిప్ లో కూడా ఆనందం గా ఉన్నట్లు పైకి నలుగురితోనూ కనిపిస్తూనే , లోపల మాత్రం ఆ యా వ్యక్తుల పట్ల ఏదో అసహనానికి గురి అవుతూ, అలజడులు సృష్టించుకుంటూ , వారు మాట్లాడే సూటి పోటి మాటలకు , వారి స్వభావ సంస్కారాల హీనతకు కొందరి మనసు బాధపడుతూ ఉంటుంది. నేటి కలియుగం లో ఈ స్థితిని అటుఇటుగా ప్రతి ఒక్కరూ అనుభవిస్తూనే  ఉంటారు .

• అసలు, మనిషి బంధాలలో  అందరిలో ఉంటూ తన మనసు ను ఒంటరిగా , ఏకాంతం గా ఉంచుకో లేడా ? . . . ఈ విషయాన్ని ఉద్దేశించే ఒక ప్రముఖ సినీ కవి “ జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది “ అనే అధ్బుతమైన విషయాన్ని పాట గా రాశాడు . 


• ముఖ్యంగా ఈ విషయం ఎందుకంటే . . . మనం భగవంతుడిని తల్లి తండ్రి గా భావిస్తూ భక్తి చేస్తూ పూజిస్తాం , ఆరాధిస్తాం . కానీ ఆ భగవంతుడు ఎక్కడో మన కంటికి కనిపించని ముల్లోకం లో (1. స్థూల లోకం, 2. సూక్ష్మ లోకం, 3. మూల వతనం) ఒంటరిగా ఏకాంతంగా ఏకాకి గా శక్తి స్వరూపుడై సూక్ష్మ జ్యోతిర్బిందువై ఉంటాడు . 

భగవంతుని కి తెలుసు మనమందరం ఆయన పిల్లలం అని . ఆయన మనతో భౌతికంగా కలిసి లేకపోయినా, మనం స్మృతి చేస్తూ ఉంటే చాలు మన ఆలన పాలన తాను ఎక్కడో ఏకాంతం గా ఉంటూనే మనల్ని చూస్తాడు . ఇదంతా శక్తి ప్రసార రూపేణా జరుగుతుంది.  భగవంతుడు ఒంటరిగా ఉంటూనే సమస్త సృష్టి ని నడిపిస్తాడు. మనం తెలిసి తెలియక చేసే పాప కర్మలను సరి దిద్దుకునే శక్తిని ఇస్తూ ఉంటాడు. కానీ ఆయన భౌతికంగా మన పక్కన కనిపించడు. 

ఒంటరి తనం లో ఉన్న శక్తి , ఏకాంతం లో ఉన్న మౌనం తోనే ఆయన ఈ సమస్త సృష్టి ని నడిపిస్తాడు . సర్వ జీవుల అవసరాలు తీరుస్తాడు . 

• మరి అటువంటి సర్వ శక్తి వంతుడు అయిన భగవంతుని సంతానం, పిల్లలం , వారసులం అని చెప్పుకునే మనం ఆయనలోని ఏకాంతం , ఆయనలోని ఒంటరితనం అనే లక్షణాలను ఎందుకు పుణికి పుచ్చుకోలేక పోతున్నాము ? ఆయన శక్తి ని ఎందుకు వారసత్వంగా స్వీకరించలేక  మన మనసును దుఃఖానికి, వ్యర్థ విషయ వికారాలకు దాసోహం అయ్యేలా చేసుకుంటున్నాము ? ఆయన కనిపించనంత దూరం లో ఉంటూనే తన శక్తి తో మన అందరినీ చూస్తుంటాడు . మన అవసరాలు తీరుస్తాడు .

• మరి మనం అదే విధంగా అన్ని బంధాలలో, సంబంధాలలో , అందరితోనూ ఉంటునే ఏకాంతం గా ఒంటరితనం గా మన మనసు ను ఎందుకు ఉంచుకోలేక పోతున్నాం ? 

మన మనసు లో వ్యర్థ విషయాల ను  నింపుతూ  , బుద్ధి  హీనత తో మనసు ను  బానిసగా తయారు చేసుకుంటూ , మనలోని   పాజిటివ్ శక్తి ని కోల్పోయి  దుఃఖితులు గా అవుతున్నాం .


• మనసు మాయకు వశం అయినపుడు తన శక్తిని కోల్పోయి , మోహం , కామం, క్రోధం , ఈర్ష్య ద్వేషం , భయం , ఆందోళన , వికారాలకు అలవాటు పడుతుంది . ఇవన్నీ నేటి మన మానవ సంబంధాల లో సహజం అనుకునే విధంగా దిగజారిపోయాం . అందువలనే మనిషి మనసు కోతి వంటిది , స్థిరత్వం ఉండదు అని అంటారు . 

• సర్వ శక్తిమంతుడు అయిన పరమాత్మ శివుని కి మన బుద్ధి లో , ఆలోచన లో , మనసు లో చోటు ఇస్తే మన మనసు మన అధీనంలో ఉంటుంది . . . మనం అందరిలో అందరితో ఉంటూనే ఏకాంతం లోని ఆనందం అనుభవిస్తూ , ఒంటరితనం లోని అధ్బుతమైన భగవంతుని శక్తి ని స్వీకరించవచ్చు . 


• సూక్ష్మం  గమనించాలి …. దీని అర్థం, మనుషులకు బంధాలకు బాధ్యతలను విడిచి దూరంగా ఉండమని కాదు . వారితో ఉంటూనే మనసు ఎందులోనూ చిక్కుకు పోకుండా , దుఃఖానికి బానిసగా కాకుండా,  ఏ విషయం లోనూ బలహీన పడకుండా  స్వయాన్ని  ఆధీనంలో ఉంచుకోవాలని . 

భగవంతుని వలే మనిషి కూడా ఒంటరి వాడే , కానీ ఆ విషయం మరచి  బంధాలను కోరుకొని , అందులో బంధీ గా  చిక్కుకొని కర్మల యాతన అనుభవిస్తున్నాడు . అయినప్పటికీ కూడా ప్రతీ రోజు తెల్లవారు జామున లేచి ఏకాంతం గా కూర్చొని ధ్యానం,  శివుని తో యోగం చేసే అభ్యాసం నిరంతరం చేయడం వలన అందరితో ఉంటూనే మనసును అధీనంలో ఉంచుకునే యోగశక్తి లభిస్తుంది. 

మనిషి ప్రతీ కర్మ చేయాలి , కానీ అందులో మునిగి పోకుండా  మనసును అతీతంగా చేసి యోగి గా  . . . తామరాకు పై నీటి బొట్టు వలే  జీవించాలి. అప్పుడే కర్మ యోగి గా మారగలడు.  నిత్యానందం పరమానందం అనుభవించగలడు.



ఓం శాంతి 

ఓం నమఃశివాయ 🙏 

యడ్ల శ్రీనివాసరావు 6  Aug 2026 , 7:00 AM.


No comments:

Post a Comment

771. మనిషి కూడా ఒంటరివాడే

మనిషి కూడా ఒంటరివాడే  • మనిషి ఎందుకని ఏకాంతం గా జీవించలేడు ?   ఎందుకని  ఒంటరితనం అంటే భయపడుతూ   ఉంటాడు ?  ఒంటరి గానే పుట్టాడు. ఒంటరిగా నే ...