బాల్య మిత్రుడు సుంకరణం వెంకట నారాయణ రావు (శ్రీ హరి) పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలతో…..
మనసు లో ని మాట.
మిత్రమా శ్రీహరి ....
• నా మనసు చూసిన, నీ బాల్యం బడి, గుడి, అమ్మా నాన్న కుటుంబం.
• మేని పర్వతం లాంటి, నీ ఉంగరాల జుట్టు కు అమ్మ రాసిన కొబ్బరినూనెతో వెలుగొందుతూ ఉండేది......నీ ముఖారవిందం.
• పుస్తకాల సంచి లేక, పరీక్ష అట్ట మీద పుస్తకాలు పేర్చి, ఒక వైపు చేతితో నిలువుగా శరీరానికి అదిమి పుస్తకాలతో తరగతి గదిలో అడుగిడిన నీ రూపం.......నా అంతరంగం లో చెరగని కావ్యం .
• రబ్బరు చెప్పుల కాళ్లతో, మన్నును తాకుతూ , చిన్నిరాళ్లను తన్నుతూ , జిల్లేడు మొక్కలను పలకరిస్తూ , బడికి నడుస్తూ వచ్చే, నీ ఆ దృశ్యం ......నేటికీ ఒక మధురమైన అపురూపం.
• మన మసకబారిన( *సౌకర్యాలు, సిరిసంపదలు లేని కాలం) బాల్యంలో మకరందాన్ని ఆస్వాదించిన ....ఔన్నత్యం తోనే మట్టిలోని మాణిక్యమయ్యావు.
• ఆకలి లో ఆనందాన్ని…..బాధల్లో బలాన్ని…...కష్టాల్లో కరుణ తో , నీ మనసు కి స్నేహం చేయించి…....ఆ స్నేహం తోనే జీవిత పునాది ని నిర్మించావు.
• తల్లిదండ్రులే ఆస్తి అంటావు.....ఎదగడం అంటే ఒదగడం అని.....సంస్కారం అంటే శాంతం అంటావు.
• నాన్నను చూస్తూ, నాన్నతో ఉంటూ , నాన్నను నీలో నింపుకుని, నాన్న బాటలో నడుస్తూ, నాన్న వంశానికి నాన్నయై......చివరికి శాశ్వతంగా నాన్నను నీలో జీవించేలా చేశావు.....ఏ జన్మ పుణ్యఫలమో.
• మాట తో కాకుండా మనసు తో స్పందించే నీ వ్యక్తిత్వం…. ప్రకృతి వరం.
• ముక్కలవుతున్న నేటి కాల ఉమ్మడి కుటుంబ బంధాల విభేదాలకు ముకుతాడు వేసి, ఐకమత్యం తో ముచ్చటగా ముడివేసి చేసే నీ వైనం….అద్భుతం.
• "దేహం తో కంటే కూడా , ఆత్మశుద్ధి తో చేసే కార్యక్రమాలే చిరస్మరణీయం"…..అని చాటి చెప్పే నీ అంతర్ముఖం….ఆదర్శప్రాయం.
• ప్రశంసలు తాకలేని నీ కర్ణభేరి .....కీర్తి ప్రతిష్టలకు మైనం(wax) కాని నీ మనసు.....సహాయానికి అర్థం హృదయస్పందన అనే నీ సంస్కారం….పరమాత్ముని అనుగ్రహం.
• సమస్యలను సృష్టించడం కాదు….. సమస్యలను పరిష్కరించడమే రాజనీతి అనే నీ విధానం…. వయసు పెరిగినా , పెరుగుతూ ఉన్నా మానసిక పరిపక్వత లేని ఎందరికో కనువిప్పు.
• స్వఛ్చత, పారదర్శకత, నిష్కళంకం , నిర్మలత్వం మాత్రమే గిరి దాటి , నీ దరి చేరగలవు….. స్వీయ శోధన.
• తామరాకుపై నీటి బిందువు లాంటి నీ జీవితం, విలువలకు అద్దం లాంటి నీ వ్యక్తిత్వం…..ఎంతో మందికి ఆదర్శం.🙏
( ఇది ఈశ్వరుని అనుగ్రహంతో సాధ్యమైన, అంతరంగం లోని భావం.)
నీ బాల్య మిత్రుడు,
యడ్ల శ్రీనివాసరావు. 27 July 21.
No comments:
Post a Comment