Tuesday, June 22, 2021

68. బాధల్ని భరించేవారే బలవంతులు

 

బాధల్ని భరించేవారే బలవంతులు

·        సృష్టిలో బాధల్ని భరించేవాడే అసలైన బలవంతుడు. సామాన్యంగా దుఃఖించే వారిని బలహీనులు అనుకుంటారు. కానీ దుఃఖాన్ని అనుభవిస్తూ, సమస్యలతో సతమతమవుతున్న వారే నిజమైన శక్తి వంతులు.  సృష్టి లో ఏ మనిషి దుఃఖాన్ని అనుభవించాలని కోరుకోడు, కానీ సంతోషం కావాలని వెంపర్లాడతూ ఉంటాడు.

·        సంతోషం యెక్క తీవ్రత కంటే దుఃఖం యెుక్క ప్రభావం మనిషి పై సమర్థవంతంగా పని చేస్తుంది.  విధంగా అంటే , ఈ ప్రపంచంలో ఏ ప్రముఖుడినైనా, ఎటువంటి కీర్తి వంతుడినైనా, లేదా మహనీయుడు నైనా, ఖ్యాతి వంతుడి మనసు నైనా, కదిలిస్తే వారి జీవితం లో అత్యంత బాధ, విషాదం, దుఃఖం ప్రస్పుటంగా అనుభవించడం కనిపిస్తుంది. ఇది సత్యం ..... విశ్వంలో ఖ్యాతిగాంచిన ప్రతి ఒక్కరి జీవితంలో బాధను అనుభవించడం  అనేది ఒక  అంతర్భాగం. .....ఎందుకంటే వ్యక్తి అయినా మహానుభావుడు గా తయారు కావాలంటే దుఃఖస్థితి అనుభవించి రావాల్సిందే  . అప్పుడే వ్యక్తికి తన జన్మ పట్ల, జీవితం పట్ల,  స్థితప్రజ్ఞత , పరిపక్వత, పూర్తి అవగాహన వస్తుంది. ఇది సృష్టిధర్మం.


·        ఇక్కడ విచిత్రమైన విషయం ఏమంటే చూసేవారికి ఒక వ్యక్తి యొక్క కీర్తి ప్రతిష్టలు, గొప్పదనం మాత్రమే బహిర్గతం గా కనిపిస్తాయి. కానీ మనసు లోని అంతరంగిక చేదు అనుభవాలు ఎవరికీ తెలియదు . ఇది ఈ భూమండలం మీద ఉన్న ప్రతీ రంగంలో,  ఉన్నత స్థితి లో ఉన్న ప్రతి మహనీయునికి అనుభవమే.  కానీ అటువంటి మహనీయుల అందరికీ,  తమ జీవితాల్లో సంతోషం  అనే అంశం ఒక చిన్నపాటి అనుభవం మాత్రమే అవుతుంది  . ఎందుకంటే వారు అపజయాలు, బాధలు, ఇబ్బందులు అనుభవించి,  చివరకు సాధించిన ప్రగతి ద్వారా ప్రజలలో , మరియు ఎదుటివారి ఆనందంలోనే తమ యెక్క సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటారు.

·        ఆటలకి తర్ఫీదు నిచ్చే గురువు, వజ్రం లాంటి ఆటగాళ్లను తయారు చేయగలడు  . కానీ తన సంతోషం అతను తయారుచేసిన శిష్యుల్లో వెతుక్కుంటాడు . ఇందులో అంతర్లీనంగా త్యాగం కనిపిస్తుంది. అదేవిధంగా భారతీయ కుటుంబ వ్యవస్థ లో చూస్తే ముఖ్యంగా తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు, బాధలు ఎదుర్కొని పిల్లలకు తెలియనివ్వకుండా పెంచుతారు. తల్లిదండ్రులు తమ సంతోషం పిల్లల్లో చూసుకుంటారు.   


·        అంటే విధంగా గమనిస్తే,   సంతోషం అనేది ఎప్పుడు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత అనుభవం కానేకాదు. సంతోషం అనేది సామూహికంగా కుటుంబంలో గాని,  సమాజంలో గాని,  ప్రకృతిలోని పశుపక్షాదులలో గాని ,  పంచభూతాలతో గానీ , ముడిపడి ఉన్న అంశం . ఇది స్పష్టం.  కానీ దుఃఖం మాత్రం పూర్తిగా మనిషి యొక్క వ్యక్తిగతం.  బాధను అంతర్లీనంగా అనుభవిస్తేనే అసలైన సంతోషం ఏమిటో తెలుస్తుంది .

 

·        కానీ నేటి కాలంలో అమాయక ప్రజలు జ్ఞానం తెలియక అనేక వ్యసనాలలో (తాగుడు, జూదం , అతిగా తినడం) ఇలా అనేకమైన వాటిలోనే అసలైన సంతోషంగా ఉందని గ్రహిస్తూ విచ్చలవిడి తనాన్ని పెంచుకుంటూ అర్ధాంతరంగా జీవితాన్ని ముగించేస్తుంటారు .

 

·        బాధని ప్రేమించండి ………బలవంతులు అవుతారు. నిరాశ లోనే ఆశ ఉంది …. నిస్పృహ లోనే స్పృహ ఉంది”.  మనిషి అంటే ఒక శక్తికి నిదర్శనం.  క్తి తేజోవంతం అవ్వాలంటే తప్పనిసరిగా ఎంతోకొంత అగ్నివలె మండవలసినదే. అదే దుఃఖము యొక్క  అసలు స్వరూపం.

 

·        భగవంతుడు మనిషికి కళ్ళు ప్రసాదించింది,  బయటకు మాత్రమే చూడమని కాదు ....బయట కనిపించే దాని కంటే ఎన్నో వందల రెట్లు నీలో, నీ దేహాంలో, నీ అంతరంగంలో, నీ అణువణులో దాగి ఉన్న దానిని చూడమని ....కానీ నువ్వేం చేస్తున్నావో ఆలోచించు.  సృష్టిలో నువ్వు దేని నుంచి అయినా తప్పించుకోవచ్చు...... అది చాలా సులభం..... కానీ నువ్వు నీ నుండి తప్పించుకోవడం అసాధ్యం. ఇదే నీ లో ని సంతోష దుఃఖాలకు మూలం.

 

యడ్ల శ్రీనివాసరావు. 3:30 am 22 Jun 2021.




 

No comments:

Post a Comment

499. నిశ్శబ్దం - చీకటి

  నిశ్శబ్దం - చీకటి • వెలుగు లో కూర్చుని వెలుగుని ఆనందించ గలగడం అనేది అమాయకత్వం అనిపిస్తుంది. ఎందుకంటే ఆ వెలుగు ఎవరికైనా కేవలం కొంత సమయం మ...