పరిణయం
• పరిణయం పరిణయం
ప్రణయము కై పరితపించెను నా పరిణయం
• మధువనం మధువనం
మధుమాసం లో వికసించెను నా మధువనం
• పరిణయా న పరిమళం పరిణితి చెందిన వేళ
వికసించి న మనసు కి వసంతాలు నిండెను.
• వల్లీ రాగవల్లి అనురాగవల్లీ
నా హృదయానికి అల్లుకున్న ఓ తీగమల్లీ
• పరిణయం పరిణయం
ప్రణయము కై పరితపించెను నా పరిణయం
• మధువనం మధువనం
మధుమాసం లో విరపూసెను నా మధువనం
• మధుపర్కాల మిలమిల లో
నా మనువు ఎంతో మాధుర్యం.
• తలంబ్రాల జల్లుల లో
నా తనువు ఎంతో తమకం.
• సుఖదుఃఖాలు పసుపు కుంకుమలు గా
ముసిముసి నవ్వులు మేళతాళాలు గా
• అగ్ని సాక్షి తో మొదలైయ్యింది
నా నవజీవనవేదం … నా తొలి పొడుపు రాగం.
• పరిణయం పరిణయం
ప్రణయము కై పరితపించెను నా పరిణయం
• మధువనం మధువనం
మధుమాసం లో విరపూసెను నా మధువనం
• ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ
జీవనం ఏడడుగుల బంధం
• కుశలమెరగని కలియుగంలో
పరిణయం ఒక ఎడారి బంధం.
• భావం :
పెళ్లి అనేది ప్రేమ కోసం పరితపిస్తుంది.
పెళ్లి తో వసంత ఋతువు లో
వికసించే పువ్వుల వలె తేనేలొలికింది మనసు.
పెళ్లి అనే అనుభూతి సుగంధం లా
సంపూర్ణం మైతే మనసు వికసించి
వయసు నిండుతుంది.
రాగాల, అనురాగాల తీగ వంటి దాన
ఎదలో పెనవేసుకున్న మల్లి తీగ దాన
పెళ్లి వస్త్రాల మెరుపు లలో
పెళ్లి చాలా మధురం గా ఉంది
తలంబ్రాలు జల్లులవుతుంటే
శరీరం చాలా ఉత్కంఠ గా ఉంది.
కష్టం సుఖం పసుపు కుంకుమ లు వలె
ముసి ముసి నవ్వులు మంగళ వాయిద్యాలు గా
అగ్ని సాక్షి తో మొదలైయ్యింది
కొత్త జీవితం అదే జీవితానికి ఉదయ రాగం.
ధర్మం తో జీవిస్తూ అర్దం (ధనం) తో కోరికలు
సుఖాలు తీర్చుకుంటేనే మోక్షం ఇచ్చేది
ఏడడుగుల బంధం.
కాని కుశలం క్షేమం ఎరుగని నేటి
కలియుగంలో పెళ్లి ఒక ఎడారి
బంధం గా అయిపోతుంది.
ఇదంతా ఒక విధంగా మనుషుల స్వీయ, స్వయం ప్రభావం అనే కంటే కూడా కాలగమనంలో జరగాల్సిన జరుగుతున్న మార్పులు. లోక కల్యాణం భగవంతుడు తిరిగి చెయ్యాలంటే కలిపురుషుడు ప్రభావం వలన భూమి మీద ప్రతీ అంశం లో సకల జీవ రాశులు, మనుషులు విఫలమై , సంధికాలంలో సర్వకాల సర్వావ్యస్థలు నాశనం అవుతూ ఉంటాయి.
• కలియుగంలో ధర్మం నడిచేది ఒక పాదం మీద. అన్నీ యాంత్రికం , ఒకరిని మరొకరు అర్దం చేసుకోవడం అరుదు అయిపోతుంది, భౌతిక సుఖాల జీవనం, మనుషులు మనసులు కంటే వస్తువులను ప్రేమించే తత్వం, ఒకరు కోసం మరొకరు సమయం కేటాయించలేనంత హడావిడి జీవితాలు, సంపాదన కోసం పడే ఆరాటం , ఇలా ఎన్నో అంశాలలో ప్రతీ మనిషి ఏదొక విధంగా తనని తాను కోల్పోతున్నాడు. చివరికి ఇదంతా సహజం అనుకునే స్థితి లో జీవితాలు గడుస్తున్నాయి. వెను తిరిగి చూస్తే పూరించలేని శూన్యం.
• మనుషుల కు వివాహం చేసుకున్న సమయం లో ఉన్న శ్రద్ధ, ప్రేమాభిమానాలు అనంతరం కాలక్రమేణా ఉంటున్నాయా, లేదా , లేకపోతే ఎందుకు అనే ప్రశ్నలు వేసుకుంటే సమాధానం దొరుకుతుంది. దొరికిన కొందరికి కాలాతీతం అయిపోతుంది.
• ఏదైనా అర్దం చేసుకుంటే ఆనందం ఉంటుంది. కాని అర్దం అంటే ఏకత్వం తో కాదు బహుతత్వం తో ఉంటేనే సమతుల్యం ఉంటుంది.
యడ్ల శ్రీనివాసరావు 30 Sep 2022 6:00 PM.
No comments:
Post a Comment