Friday, September 30, 2022

248. మనిషి దుర్గంధం మాట

 

మనిషి దుర్గంధం మాట



• దుర్గంధం ఈ పదం పలకాలంటేనే  మనిషి కి ఏదో ఒక రోత. ఎందుకంటే ఆ పదం ఏ చోట నిలబడి పలికినా మనసు ద్వారా కంటికి కనిపించేది, అనిపించేది మురికి, మురికి వాసన, మలినం , చెడు, వ్యర్థం తో నిండిన చెత్త.


• చెత్త, దుర్గంధం అనేది వింటుంటే నే , ఏ మనిషి కైనా ఒక  అసహ్యం, కంపనం పుడుతుంది. అవునన్నా కాదన్నా ఇది నిజం. అసలు ఈ దుర్గంధం (చెడు వాసన) అనేది పాడైన వస్తువుల వలన,  కాయగూరల వ్యర్థాలు, తినుబండారాలు వంటివి రోజుల తరబడి నిల్వ ఉంచుకోవడం వలన  కుళ్లిపోయి  దుర్గంధం పుడుతుంది.  ఇటువంటి చెత్తను ఎవరు కూడా ఇంటి ఆవరణలో ఉంచుకోము,  ఎందుకంటే అనారోగ్యం పాలు అవుతాం అనే భయం , ఇంకా అందులో భయంకరమైన వైరస్ లు ఉంటాయి ,  ఆ వాసన కూడా భరించలేము. ఇదంతా మనకు పుస్తకాలు, నిత్యం  అనుభవాల నుంచి తెలుసుకున్న విజ్ఞానం.


• అంటే ఆరు బయట  ఉన్న చెత్త, వ్యర్థం చాలా హని చేస్తుందని తెలిసి  దూరం గా ఎక్కడో విడిచి పెట్టె స్తున్నాము. చెత్త విసిరేసాక కనీసం దాని వైపు చూడను కూడా చూడం. ఎందుకంటే అసహ్యం, వాసన భరించలేం కాబట్టి.


• ఇక అసలు విషయానికి వస్తే….


• మరి మనిషి అంతరంగం లో అంతర్గతంగా పుట్టుక నుంచి పేరుకుపోయిన చెత్త అయిన కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, ఈర్ష్య , ద్వేషం, పగ, అహంకారం అనేక సంవత్సరాల తరబడి శరీరం, మెదడు అనే containers లో నిక్షిప్తం చేస్తూనే  ఉన్నాడు , మరి అటువంటప్పుడు ఇంకెంత దుర్గంధం మనిషి లోపలి నుంచి నిత్యం వెలువడుతుందో ఆలోచించామా , ఆలోచిస్తున్నామా. అది మనిషి శరీరానికే కాదు బంధాల లో చుట్టూ ఉన్న సాటి వారి ఆరోగ్యానికి ఇంకెంత హానికరమో ఒకసారి ఆలోచించిస్తున్నామా.


• ఇంటి లోపల, ఇంటి చుట్టూ ఉన్న బహిరంగ మైన చెత్త వ్యర్థాలను తొలగించుకొని శుభ్రం గా ఉంచుకోవాలి అనే తెలివి తేటలు,   విజ్ఞానం తెలిసిన మనిషి కి , తన లోపల అనాది గా ఉన్న చెత్త గుణాల దుర్గంధాన్ని ఎందుకు మోస్తుంటాడు, ఎందుకు గుర్తించడు, ఎందుకు శుభ్రం చేసుకోలేడు….మరి ఎంతో విజ్ఞానం కలిగి ఉన్న మనిషి కి జ్ఞానం ఉన్నట్లా? లేక అజ్ఞానం ఉన్నట్లా?


• ఈ వికారి దుర్గుణాలే తన క్షోభ కి, దుఃఖానికి జన్మ జన్మలు గా కారణం అవుతూ తనలో దుర్గంధం పేరుకుపోతుంది అనే విషయం  తెలుసుకోలేక తన తోటి వారి పై ఎందుకు నిందలు, అభాండాలు వేస్తుంటాడు ?


• బాహ్య ప్రపంచంలో పేరుకుపోయిన చెత్త అంతా కలిసి చెడు వాసన రూపం లో బయటకు వ్వాపిస్తుంటే, మనిషి అంతర్గతం లో పేరుకుపోయిన వికారాల చెడు  “మాట”, “చూపు”, “ఆలోచనల” రూపం లో బయటకు వస్తుంది. 

ఇవి ఎలా ఉంటాయి అంటే   వంకర బుద్ది తో  చూసే చూపులు,  వికారం తో కూడిన ఆలోచనలు,  ద్వదర్థం తో కూడిన మాటలు.  వీటిలో అత్యంత ప్రమాదకరం ఆలోచనలు, మాటలు.


• మాట, శబ్దం  చాలా శక్తివంతమైనవి.  చరిత్ర లో మహాభారతం, రామాయణ యుద్ధాలు కేవలం ఒక మాటతో నే మొదలైనాయి. కొందరికి మనసు లో నిండిన  మలినం  మాట రూపం లో బయటకు పలుకుతూ చుట్టూ ఉన్న వారిని బాధ పెడుతూ వాతావరణం కలుషితం చేస్తుంటారు. మానసిక ఆనందం పొందుతూ ఉంటారు.  

ఇది చాలా బాధాకరమే  కాని ఈ స్థితి తాత్కాలికం.  

మనిషి నోరు  మంచి మాటలు  పలకక పోయినా నష్టం  లేదు. కానీ చెడు మాట్లాడితేనే ప్రమాదకరం. 

మనిషి కి  అనాదిగా తనలో పేరుకు పోయిన వికారి గుణాలను, లక్షణాలను, తుచ్ఛమైన కామంతో నిండిన ఆలోచనలను అణగార్చు కోలేక, తన ఆలోచనలను  సాటి  మనుషులకు ఆపాదిస్తూ ఆనందం పొందుతూ, అందరూ తమలాంటి వారే అని  పైశాచిక   సంతృప్తి తో  ఉంటారు కొందరు.  ఇది ఎంత ఘోరమైన వికర్మో వారికి తెలియదు.


• మనిషి తాను తినే ఆహారం శుభ్రం గా , ఏరి కోరి, శుద్ధి చేసుకొని నోటితో ఆహారం తింటూ మంచి శక్తి పొందుతూ ఉంటాడు. అంటే తినే నోరు కి రుచికరమైన, శుభ్రమైన మంచి ఆహారం కావాలి.  కాని అదే నోరును మంచి  మాట్లాడానికి,  సంతోషం పంచడానికి లేదా దుుఃఖం పంచకుండా ఉంచడానికి ఎంత వరకు ఉపయోగిస్తున్నాడు అంటే వెనక్కి తిరిగి ఆలోచించుకోవలసిందే.

నోటికి స్వార్థం,  దురద ఉంటే ఏనాటికైనా నష్టం జరిగేది శరీరానికే. 

మరి కొందరు సునాయాసంగా అబద్దాలాడడం, మాట అవలీలగా మార్చే నేర్పరితనం తో  ఊసరవెల్లి చందాన తీరును మారుస్తూ ఆనందం పొందుతూ ఉంటారు.  ఇటువంటి  తీరు ఎంత దుష్కర్మో  వారికి  తెలియదు.  

కొందరు తన బాధలను , వ్యక్తి గత సమస్యలను నమ్మకమైన వారికి చెపితే,  విన్నవారు ఆ విషయాలను  మరొకరి దగ్గర ప్రస్తావించడం  కొంత మంది లో చూస్తుంటాం. ఈ విషయం లో మొదట బాధలు చెప్పుకున్న వారి కర్మను రెండవ వారు తప్పక అనుభవించ వలసి ఉంటుంది.  

ఇవన్నీ నోటి తో జరిగే క్రియలు కాబట్టి  " ఆ ఏముంది లే" అని సునాయాసంగా తీసుకుంటారు. కాని అవే తిరిగి తిరిగి  పాపపు కర్మలు గా చుట్టుకుంటాయి.

ఎందుకంటే కలియుగంలో  ఎక్కువ శాతం  మనిషి పాపం చేసేది నోటి తోనే అని గరుడ పురాణములో కూడా చెప్పబడింది.

కొందరు మంచి భోదలు చేస్తుంటారు. కానీ ఆచరించరు.  ఇది ఒక నటనతో కూడిన విధానం. ఇటువంటి వారికి మనస్సాక్షి వేసే శిక్ష వర్ణించలేం. మనిషి నిజాయితీగా ఎప్పుడైతే ఆత్మవిమర్శ చేసుకోగలుగుతాడో  తనను తాను మార్చుకోగలుగుతాడు , దీనికి కావలసింది ఒకటే అంగీకరించే తత్వం. 


• ఏ మనిషి అయినా తన మనసు లో ఉన్న మాట ను స్పష్టం గా,  ధైర్యం గా, ఉన్నది ఉన్నట్లుగా చెపితే, తన వ్యక్తిత్వం  సంస్కరింప బడుతుంది.  ఎందుకంటే ధైర్యంగా బయటకు చెప్పే మాటకి , తప్పును సరిచేసుకునే ఉన్నతమైన లక్షణం కలిగి ఉంటుంది. తప్పు మాట్లాడటం, తప్పులు చేయడం తప్పు కాదు.  కాని వాటిని సరిదిద్దుకునే అవకాశం వచ్చినా కూడా ఆ తప్పుల  ఊబి లో నే  జీవితాంతం గడిపెయ్యడం ఒక దౌర్భాగ్యం, అవివేకం.  ఇదే మనిషి కి అతి పెద్ద ముప్పు.


• ఒక నోటి నుండి వచ్చే మంచి మాట ఎందరికో ఆదర్శం, శక్తి, భరోసా, ధైర్యం ఇవ్వగలదు. ప్రాణాలను సైతం కాపాడగలదు. ఉదాహరణకు ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారితో ఒక పూట మంచిగా మాట్లాడితే తెలుస్తుంది, ఆ స్థితి నుంచి వారు ఎలా బయటపడతారో.  ఒక మంచి మాటకి  మానసిక రోగాలను, భయాలను నయం (healing) చేయగలిగే గొప్ప శక్తి కలిగి ఉంటుంది. 


• నోటి నుండి దుర్గంధం తో కూడిన మాటలు రాకుండా ఉండాలంటే  శారీరక, మనో వికారాలకి బానిస గా కాకూడదు. ఒక మనిషి  తన లో లో  పేరుకుపోయిన చెత్తను గుర్తించి తొలగిస్తే నే, తనతో ముడిపడి న మనుషులు ఎటువంటి  వారు  అనే  స్పష్టత వస్తుంది. లేదంటే  తనలాగే అందరూ వికారులు గా కనిపిస్తారు.

మనసు లో వ్యర్థం, మలినం తొలగినపుడే  పరమాత్మ కు చేరువ అవుతూ  మనిషి   జ్యోతి లా స్వయం ప్రకాశం అవుతాడు.


• మనుషులలో ఎవరి కర్మలు వారివి. కర్మానుసారంగా ఎవరి జీవితాలు వారికి గడుస్తుంటాయి. అంతే కాని ఒకరి వికారాలను  మరొకరి కి ఎప్పుడూ ఆపాదించకూడదు.


• మనిషి కి   తన మనసు పై  నియంత్రణ   కలిగినపుడు  ఎటువంటి నెగెటివ్ శక్తి తన దరి   చేరదు. చేరలేదు.


• మంచి ఆలోచనలు  మంచి మాటలై,  చాలా శక్తివంతంగా  ఈ విశ్వం లో సుదూర ప్రయాణం చేస్తూ మనిషి కి సక్రమమైన దారి, గమ్యము చూపిస్తాయి.


ఓం నమఃశివాయ 🙏

యడ్ల శ్రీనివాసరావు 30 Sep 2022 1:00 pm.





No comments:

Post a Comment

481. పరిమళ భాష

  పరిమళ భాష • ఏమిటో     ఈ  భాష   ఎద కే    తెలియని   ఆశ.   అనుభవం  లేని   యాస   సృష్టి   మూలానికి    శ్వాస. • అక్షరాలు   ఉండవు  కానీ   భావం ...