Thursday, September 1, 2022

139. కళాశాల 1980 ఎపిసోడ్ - 13

 

కళాశాల 1980

ఎపిసోడ్ - 13




సీన్ – 51


  అది 2001 వ సంవత్సరం. సాంకేతిక రంగంలో ప్రపంచంలో చాలా మార్పులు వస్తున్నాయి. రాము ఇండియా లో హైదరాబాద్ లో చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ మొదలు పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. రాము తన పిల్లలు ఇద్దరు హైస్కూల్ చదువు తున్నారు. వారిని అమెరికాలో నే ఉంచి చదివించాలనుకున్నారు, రాము శైలజ.


కొన్ని రోజుల తరువాత రాము అమెరికా లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఇండియా వచ్చి, తన కొత్త కంపెనీ ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాడు.   తన కంపెనీ పేరు Victory soft solutions అని పేరు పెట్టాడు “ V soft “ గా అభివృద్ధి చెందుతుంది. మొదట చిన్నగా 30 మంది తో మొదలైంది.  తనకు అమెరికా లో ఉన్న అనుభవం, పరిచయాల తో ప్రాజెక్టులు సంపాదించి అతి తక్కువ కే చెయ్యడం మొదలు పెట్టాడు.

మరిన్ని ప్రాజెక్టులు రావడం వలన స్టాఫ్ ను 150 వరకు పెంచి అభివృద్ధి చెందుతున్నాడు.

రాము కి ఇదంతా అంత కష్టం గా అనిపించడం లేదు. రాము కి మూడు సంవత్సరాల కాలంలో నే సాఫ్ట్వేర్ మార్కెట్ లో మంచి పేరు వచ్చింది.

V soft లో నెమ్మదిగా 500 మంది స్టాఫ్ అయ్యారు. పెద్ద కంపెనీల తో సమానం గా నడుస్తుంది. డబ్బు తో పాటు సమాజం లో రాము పేరు, గౌరవం బాగా పెరిగింది.

రాము తన జీవితం ఎంత బిజీగా ఉన్నా, కుటుంబం, శైలజ పిల్లలు తో క్రమం తప్పకుండా గడుపుతున్నాడు. అదే తనకు కొంచెం విశ్రాంతి గా ఉండేది. 

రాము కి  తన జీవితం లో ఎంత ఎదుగుతున్నా ఒక వెలితి ప్రతీ క్షణం వెంటాడుతూనే ఉంది, అది విమల గురించి.  విమల ఎక్కడ ఉందో..., ఎలా ఉందో... అని ప్రతీ రోజు ఆలోచిస్తూ నే ఉంటాడు.  విమల కోసం కొన్న డైమండ్ రింగ్ ఎప్పటి కైనా  ఇవ్వాలని అప్పుడప్పుడు ఆ ఉంగరం బీరువా నుంచి తీసి చూసుకుంటూ ఉండేవాడు.

రాము జీవితం శైలజ, రాజారాం దంపతులతోను సాఫీగా సాగిపోతుంది. ప్రిన్సిపాల్ గారు కూడా అప్పుడప్పుడు వచ్చి కలిసి వెళుతున్నారు. రాము ఇద్దరు పిల్లలు అమెరికా లో నే చదువుతూ సంవత్సరానికి ఒకసారి ఇండియా వచ్చి వెళుతున్నారు.



సీన్ – 52



విమల భర్త శేఖర్,  హైదరాబాద్  నాచారం లో  మెదలు పెట్టిన కోళ్ల ఫారం బాగా కలిసి వచ్చింది. శేఖర్ కి వ్యాపారం బాగా కలిసి డబ్బు రావడం తో పరిచయాలు, కొత్త స్నేహితులు పెరిగారు. విమల కి భర్త విషయం లో  స్నేహితులతో ఎక్కువ గడపడం  నచ్చేది కాదు. విమల పిల్లలు ఇద్దరు హైదరాబాద్ లో నే కాలేజీ చదువులు చదువు తున్నారు.


ఒకరోజు రాత్రి శేఖర్ బాగా తాగి కారు నడుపుతూ రాత్రి ఇంటికొచ్చి కాలింగ్ బెల్ నొక్కాడు.

విమల :  ఆ…వస్తున్నా అని తలుపు తీసింది

శేఖర్   :    ఏం…ఎంతసేపు, అడ్డం గా తిని పడుకున్నావా…అని నోటికొచ్చినట్టు తాగిన మైకం లో అరుస్తున్నాడు.


(విమల కి భర్త తాగుడు అలవాటు ఉందని తెలుసు కానీ ఈ మధ్య స్నేహల వలన విపరీతం అవుతుందని అర్దం అయింది. అందుకే తరచూ హెచ్చరించేది.)


విమల :  శేఖర్ మాటలు సహించలేక పోయింది వెంటనే,  సీరియస్ గా  ఆ…. తిని పడుకున్నాను...అంది

శేఖర్ :   ఎవరితో 

విమల : నిర్ఘాంత పోయింది….ఆ.. నాకు నచ్చిన వాడితో….

(విమల కి దుఃఖం వస్తుంది కానీ అదుపు చేసుకోలేక పోతుంది.)

శేఖర్ :  ఆ సమాధానం విని….విమల ను చెంప మీద కొట్టాడు.

వారిద్దరి గొడవకి పిల్లలు నిద్ర లేచి బయటకు వచ్చి జరిగింది అంతా చూస్తున్నారు. శేఖర్ ప్రవర్తన పిల్లలకి నచ్చులేదు.


విమల కి ఆ రాత్రి అంతా కాళరాత్రి లా గడిచింది. శేఖర్ అన్న మాటలకు దుఃఖం ఆపుకోలేక ఏడుస్తూనే ఉంది. 

సరిగ్గా అదే సమయంలో చాలా రోజుల తర్వాత రాము గుర్తు కి వచ్చాడు విమలకి. బోర్లా పడుకుని దిండు లో తలపెట్టుకుని రాము…రాము…రాము…అని వెక్కి వెక్కి ఏడ్చింది.

మరుసటి రోజు ఉదయం పిల్లలు లేచి, విమల ఇంకా పడుకొని ఉండడం చూసి తల్లి ని లేపకుండా నే కాలేజీ కి వెళ్ళి పోయారు.

ఉదయం పది గంటలకు విమల, శేఖర్ లేచారు.

శేఖర్ కి పశ్చాత్తాపం కంటే అహం తోనే ఉన్నాడు. విమలకి కూడా శేఖర్ మీద భర్త అనే గౌరవం ఆ రోజు నుంచి సన్నగిల్లింది.


విమల కుటుంబం లో తెలియని పగుళ్లు వచ్చాయి. పిల్లలు విమలతో తప్ప, శేఖర్ తో ఆనందంగా ఉండలేక పోతున్నారు. దీనికి తోడు శేఖర్ ప్రవర్తన తాగుడు, విలాసాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.

శేఖర్ కి ఒక ధీమా కూడా వచ్చేసింది. తన వ్యాపారం పనివాళ్ల మీద సజావుగా జరిగిపోతుంది కదా…నాకేంటి అనుకున్నాడు.

రోజులు గడుస్తున్నాయి. మిత్రుడి సలహా మీద శేఖర్ సినిమా ఇండస్ట్రీ లో పెట్టుబడి పెట్టే వారికి ఎక్కువ వడ్డీ కి అప్పులు ఇవ్వడం మెదలు పెట్టాడు. మొదట్లో రిటర్న్ బాగా వచ్చేసేవి.

అది చూసి ఆశపడి తన దగ్గర ఉన్నదే కాక బయట తాను స్వయంగా తక్కువ వడ్డీకి అప్పు తెచ్చి , ఎక్కువ వడ్డీ కి ఇచ్చేవాడు.

విమలకి ఇదంతా నచ్చేది కాదు. శేఖర్ తాను స్వయంగా ఏదీ విమలకి చెప్పక పోయినా, శేఖర్ ఫోన్ లో మాట్లాడేటప్పుడు వినేది.

సరిగ్గా కొన్ని నెలలు తరువాత శేఖర్ నెత్తిన పిడుగు పడింది. తాను దాదాపు 10 కోట్లు అప్పు ఇచ్చిన ప్రొడ్యూసర్ గుండె పోటు తో చనిపోయాడు. ఆ డబ్బు లో ఒక్క రూపాయి కూడా తిరిగి వచ్చే అవకాశం కూడా లేదని తెలిసింది.

సరిగ్గా శేఖర్ తిరోగమనం మొదలైంది. తనకు అప్పులు ఇచ్చిన వారికి తీర్చడం కోసం తన దగ్గర ఉన్న స్థలం, చిన్న చిన్న ఆస్తులు అమ్మడం మొదలెట్టాడు. ఈ ఒత్తిడి లో రోజంతా తాగడం అలవాటు అయింది. 

కోళ్ల ఫారం మూతపడింది. అద్దె కట్టడం లేదని స్థలం యజమాని కొంత డబ్బు శేఖర్ కి ఎదురు ఇచ్చి కోళ్ల ఫారం స్వాధీనం చేసుకున్నాడు.

విమలకి జరుగుతున్న దంతా అర్దం అవుతున్నా, శేఖర్ కి ఎంత చెప్పినా వినే వాడు కాదు.

విమల కుటుంబ పరిస్థితులు పూర్తిగా దిగ జారాయి. ఉన్న కొద్ది బంగారం, హైదరాబాద్ లో ఉన్న ఇల్లు కూడా అప్పులు తీర్చడానికి అయిపోయాయి.

విమల మనసు లో ఒకటే అనుకుంది…తాను జీవితం లో తొలి నాళ్లలో ఎలా ఉండేదో, తిరిగి ఆ పరిస్థితి వచ్చింది.

తాము సొంత ఇల్లు అమ్మేసాక, ఒక చిన్న అద్దె ఇంట్లో కి మారారు. పిల్లలు ఇద్దరు ఇంటర్ చదవి మానేసారు. హైదరాబాద్ శివార్లలోని నాచారం అంతా ఇండస్ట్రీయల్ ఏరియా అవడం వలన చిన్న చిన్న పరిశ్రమలు చాలా ఉండేవి. ఇంటికి దగ్గరగా ఉండడం వలన ఒక ఫ్యాక్టరీ లో రోజు కూలీ పనికి విమల ఇద్దరూ పిల్లలు రామలక్ష్మి, రాంబాబు వెళ్తున్నారు.

శేఖర్ తాగి తాగి ఆరోగ్యం పాడుచేసుకుని తక్కువ వయస్సు లో నే మంచానికి పరిమితం అయ్యాడు.

విమలకి రోజులు భారం గా గడుస్తున్నాయి. శేఖర్ కి విమల పై జాలి కలిగేది. విమల ఎంత చెప్పినా, తన అహం వలన విమల మాట వినక ఈ స్థితి కలిగింది అని బాధపడుతూ ఉండేవాడు. మూడు నెలల తర్వాత ఒక ఆదివారం రోజు పిల్లలు , విమల బజారులో సరుకుల కోసం వెళ్లారు. ఆ సమయంలో తిరిగి వచ్చేసరికి శేఖర్ మరణించాడు.

విమల దుఃఖం ఆపుకోలేక ఏడుస్తూనే ఉంది…కానీ అది తన మనసు లోతుల్లో నుంచి రావడం లేదు. అంతా యాదృచ్చికంగా జరుగుతుంది. ఊరినుంచి విమల తల్లి తండ్రులు, శేఖర్ బంధువులు వచ్చి అన్ని కార్యక్రమాలు జరిపించి వెళ్లారు.

విమల తల్లి తండ్రులు విమలతో, పిల్లలు ను తీసుకుని సిరిసిల్ల వచ్చేయ్యమన్నారు. కానీ విమల అందుకు ఒప్పుకోలేదు.

ఆ రోజు రాత్రి విమల , తన జీవితం గురించి ఆలోచిస్తూ తన మనసు లో రాము జ్ఞాపకాలు, పిల్లలు తప్ప తనకంటూ ఇక ఏమీ లేవని అనుకుంటూ కన్నీళ్లు తుడుచుకుంది.

కొన్ని రోజుల తర్వాత విమల కూడా పిల్లలు ఇద్దరు పనిచేసే ఫ్యాక్టరీ లో, క్యాంటీన్ లో వంట మనిషి గా ఉద్యోగం లో చేరింది. ప్రతీరోజూ ఉదయం 9 గంటలకు ముగ్గురు కలిసి పనిలో కి వెళ్లి సాయంత్రం 6 గంటలకు వచ్చేవారు. ఆ చిన్న రెండు గదులు ఇంటిలో ఉంటూ కాలక్షేపం చేసే వారు.

విమల కి తరచూ తన జీవితం బాల్యం లో ఎలా ఉండేది…ఎలా మారిందో అనుకుంటూనే …రాము ఎక్కడ ఉన్నాడో, ఎలా ఉన్నాడో…. అని ఆలోచిస్తూ ఉండేది.


మిగిలినది ఎపిసోడ్ -14 లో

యడ్ల శ్రీనివాసరావు 2 Sep 2022.




















No comments:

Post a Comment

568. బాల్యం తీపి

  బాల్యం తీపి  • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు ‌  బాల్యం    తీపి   పసి బాల్యం   తీపి. • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు   ప్రాయం  ...