Friday, September 2, 2022

139. కళాశాల 1980 ఎపిసోడ్ - 14

 

కళాశాల 1980

ఎపిసోడ్ - 14



సీన్ – 53


అది 2012 లో సంవత్సరం. రాము ఆఫీస్ పెట్టి సుమారు 10 సంవత్సరాలు కావస్తోంది. రాము పిల్లలు చదువులు పూర్తి చేసి అమెరికా లో నే ఉద్యోగం లో చేస్తున్నారు. రాము కి  48 సంవత్సరాలు.  

ప్రిన్సిపాల్ గారు, రాజారాం గారు కూడా రిటైర్ అయిపోయారు. దాదాపు వారు 70 సంవత్సరాల వలన అనారోగ్య సమస్యలు ప్రారంభమయ్యాయి.

శైలజ తల్లి పావని ఆరోగ్యం చాలా పాడైయింది. వాళ్లందరికీ రాము ఒక దైవం లా అనిపిస్తుంటాడు.

రాజారాం, పావని, రాము, శైలజ, ప్రిన్సిపాల్ గారు వీలు కుదిరినపుడు కుటుంబ సమేతంగా కూర్చుని పాత జ్ఞాపకాలు గుర్తుకు చేసుకుంటూ రాము జీవిత ప్రయాణం గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటారు.

అటువంటి సమయంలో రాము కి  తన తల్లి తండ్రులు, విమల, ఇంకా తన బాల్యం గుర్తు వస్తుంది. వాళ్లు లేని  తనకు లోటుగా అనిపిస్తుంది.  కానీ బయటకు మాట్లాడక అందరితో నవ్వుతూ గడిపెస్తూ,  లోపల ఆ ఒంటరితనం అనుభవిస్తుంటాడు.  తనకు ఇదంతా ఒక యాంత్రికంగా అనిపిస్తుంది.

ఒకసారి ఇదే విధంగా అందరూ కలిసి మాట్లాడుకున్న తరువాత ,

రాము ఒంటరిగా ప్రిన్సిపాల్ గారిని గదిలో కలిసి…

రాము :  సార్…. నేను మీతో ఒక విషయం మాట్లాడాలి నెమ్మదిగా అన్నాడు.

ప్రిన్సిపాల్ గారు : చెప్పు రాము…

రాము :   అదే సార్…. విమల గురించి, తాను ఎక్కడ ఉందో మీకు తెలుసా…లేదంటే సిరిసిల్ల లో విమల తల్లి ని అడిగితే తెలుస్తుంది కదా..

ప్రిన్సిపాల్ గారు : ఒక్కసారి ఆశ్చర్యంగా…ఏంటి రాము…నువ్వు ఇంకా విమలని మరచి పోలేదా

రాము :  ష్‌‌…ష్…సార్…నెమ్మదిగా…. అంటే నా ఉద్దేశ్యం నేను ఇంత ఉన్నత స్థితికి రావడానికి మెదటి బీజం విమల, తరువాత మీరందరూ కలిసి నన్ను ఈ స్థితి కి తీసుకు వచ్చారు. అటువంటిది,  మీరందరూ నా ఎదుగుదల చూసారు.  కానీ విమల కి నేను ఎలా ఉన్నానో తెలియదు కదా…తనను ఒకసారి చూసి బుణం కొంతైనా తీర్చుకోవాలని….

ప్రిన్సిపాల్ గారు : రాము…నిజం చెప్పు, నువ్వు ఇంకా విమలను ప్రేమిస్తున్నావా….

రాము : తల దించుకుని…. లేదు సార్…అని తనకు ప్రిన్సిపాల్ గారు పై ఉన్న గౌరవం చూపించాడు.

ప్రిన్సిపాల్ గారు : చూడు రాము……మీ ప్రేమ విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు నువ్వు విమలని కలిసి తరువాత , నీకు శైలజ తో ఏమైనా ఇబ్బంది వస్తుందేమో ఆలోచించు. (అని మనసులో రాము గురించి ఆందోళన చెందుతున్నారు)

రాము : సార్…. నేను ఈ రోజు వరకు మీ మాటకు ఎప్పుడూ ఎదురు చెప్పలేదు…సరే మీ ఇష్టం సార్ అన్నాడు దిగులు గా…


ప్రిన్సిపాల్ గారికి  రాము మాటలకు జాలి వేసింది. ఎందుకంటే ఆయనకి తెలుసు ప్రేమ ఎంత బలమైనదో,  ప్రేమికులు తమ ప్రేమ కోసం మాత్రమే జీవిస్తారని,  అందు కోసం ఏదైనా చేస్తారని.


రాము మాత్రం తన ప్రయత్నం ఆపలేదు. ఒకసారి రాము తనకున్న పలుకుబడితో విమల గురించి జగిత్యాల లో అడ్రస్ కనుక్కునేందుకు ప్రయత్నించాడు. కానీ విమల కుటుంబం జగిత్యాల లో లేరని తెలిసి నిరాశ చెందాడు.


సీన్ -54


రాము సంపాదన కోట్ల లో ఉంటుంది. ఎన్నో ఛారిటీలకు లక్షల్లో విరాళాలు ఇస్తున్నాడు. ఎంతో మంది పేద పిల్లలకు చదువులు చదివిస్తున్నాడు.

ఒకరోజు రాత్రి పడుకునే ముందు రాము శైలజ తో అంటున్నాడు.

రాము :  శైలు…నా కొక ఆలోచన వచ్చింది. మనకి పిల్లలు కి కావలసినంత ఆస్తి సంపాదించుకున్నాము. కానీ ఈ డబ్బు ఇంకా పెరుగుతూ నే ఉంది. 

అందుకే నేను ఇకనుంచి సామాజిక సేవా కార్యక్రమాలు విస్తృతంగా చెయ్యాలని,  అది కూడా మన కంపెనీ ఉద్యోగుల ద్వారా కొన్ని మురికి వాడలు, ఊరు శివార్లలోని ప్రాంతాల్లో నెలకు ఒకసారి ఉద్యోగులు అందరినీ తీసుకు వెళ్లి వారి చేత సర్వీస్ కేంప్ లు పెడితే , వ్యక్తిగతం గా ఉద్యోగులు అందరికీ సేవా భావం అలవాటు అవుతుంది. 

మానసిక ఒత్తిడి దూరం అవుతుంది. సాటి మనుషులను ప్రేమిస్తారు…. పైగా వారి సొంత ఖర్చు ఏం ఉండదు. అంతా కంపెనీ ఫండ్…. ఏమంటావు…. అన్నాడు.

రాము చెపుతుంటే…. అలా వింటూ మనసు లో అనుకొంటుంది. మట్టిలో మాణిక్యాలు అంటే ఇలానే ఉంటారనుకుంటా…. రాము తన గతాన్ని, మూలాల్ని ఎప్పుడూ మరచి పోడు…. అని  తేరుకుని...


శైలజ :  మీది చాలా గొప్ప ఆలోచనండి. మీలా ఎవరు ఆలోచించగలరు. మనకి ఏ లోటూ లేదు. 

మీ ఇష్టమే నా ఇష్టం…. ఎప్పుడైనా, అది ఎలాంటి విషయం లో నైనా….

(అని అనేసి శైలజ మనసులో అనుకుంటుంది. రాము తన ప్రేమను , ప్రేమించిన అమ్మాయి ని  కోల్పోయాడు,  అయినా సరే తన ప్రేమను సాధ్యమైనంత వరకు ఎలాగైనా అందరికీ పంచుతూనే ఉంటాడు.)

రాము :  ధాంక్స్…శైలు..


రాము వెంటనే మరుసటి రోజు ఒక టీం ఏర్పాటు చేసి తన కార్యాచరణను మొదలు పెట్టాడు. నెలకు ఒకరోజు ఆఖరి శనివారం తప్పనిసరిగా ఒకొక్క ప్రాంతంలో సేవా కార్యక్రమాలు , పుస్తకాలు పంపిణీ, బట్టలు, ఆహారం, మందులు, వికలాంగులకు అవసరమైన సాధనాలు, రక్త దానం, ఇలా అనేక రకాలైన సేవలతో ప్రారంభించాడు. అందుకోసం చాలా ధనం ఖర్చు పెట్టే వాడు. ఉద్యోగులతో పాటు తాను తప్పని సరిగా ఆ యా ప్రాంతాలకు వెళుతూ ఉండేవాడు.

రాము ఇవన్నీ ఎంత చేసినా, మనసు లో మాత్రం ఒక బలమైన కోరిక ఉండేది…. ఎలాగైనా ఎప్పటికైనా విమలను చూడాలి, కలవాలి అని…. ఎందుకంటే తనకు తెలుసు తాను ఈ రోజు ఏం చేస్తున్నా , అది విమల సంకల్పం అని.


సీన్ – 55


కొన్ని నెలల తరువాత…

ఒక రోజు శైలజ తల్లి పావని తీవ్ర అనారోగ్యంతో మరణించింది. రాజారాం కి తీరని లోటు. మానసికంగా చాలా బలహీనం పడ్డాడు . రాము పిల్లలు అమెరికా నుంచి వచ్చి వెళ్లారు. శైలజ కి తల్లి చూపించిన ప్రేమ పదే పదే గుర్తు చేసుకుంటూ బాధపడేది.

రాము కి మాత్రం తాను 17 సంవత్సరాల వయసు లో ఎంసెట్ కోచింగ్ కోసం వచ్చినప్పుడు , తనను సొంత పిల్లాడి లా పావని చూసిన రోజులు గుర్తు చేసుకుంటూ తనకు మరో తల్లి దూరం అయిందని బాధపడే వాడు.

రాము తల్లి తండ్రులు తన చిన్నతనం లో నే , పెద్ద గా ఊహ , లోకజ్ఞానం తెలియని వయసు లో చనిపోవడం వలన మరణం అంటే ఏంటో అంతగా తెలియలేదు. 

కానీ ఇప్పుడు ఒక మనిషి చావు అంటే ... ఇక శాశ్వతం గా వారు మనతో ఉండరూ అని తెలిసి, కాళ్లు వణికే భయంతో బాధగా అనిపిస్తుంది రాము కి…. ఎందుకంటే ఆ భయం, బాధలో తన ప్రేమ కి ప్రతిరూపం ఎక్కడైనా   ఉందేమో  అనే ఆలోచన.

నెమ్మదిగా పావని మరణ విషాదం లో నుంచి అందరూ కోలుకుంటున్నారు.


ఒకరోజు ప్రిన్సిపాల్ గారు రాజారాం కి ఫోన్ చేసి..


ప్రిన్సిపాల్ గారు : రాజారాం…ఏరా ఎలా ఉన్నావు.

రాజారాం : పరవాలేదు రా…

ప్రిన్సిపాల్ గారు : నేనొక మాట అంటాను కాదనవు కదా…

రాజారాం : లేదు…చెప్పు.

ప్రిన్సిపాల్ గారు : నువ్వు కొన్ని రోజులు సిరిసిల్ల వచ్చేయి…. నాతో కలిసి ఉందువు…కొంచెం వాతావరణం మార్పు వస్తుంది. నువ్వు ఒక్కడివే ఉంటే…పావని జ్ఞాపకాలతో ఇంకా ఎక్కువ బాధపడతావు…. అసలే నీ ఆరోగ్యం కూడా అంతంత గా ఉంది.

రాజారాం : లేదు రా…. నేను రాలేను.

ప్రిన్సిపాల్ గారు : నువ్వు అలా అనకు…నా కోసం…. నేను రాము కి, శైలజా కి కూడా ఫోన్ చేసి చెపుతాను…వారు ఏర్పాట్లు చేస్తారు.

రాజారాం : సరే …రా…నీ ఇష్టం.

రాజారాం , పావని చాలా అన్యోన్యంగా ఉండే వారు…రాజారాం తన జీవిత కాలంలో ఎప్పుడు ఏం చెప్పినా పావని నో చెప్పేది కాదు...

రాజారాం కి పావని పై ప్రేమ బ్రతికి ఉన్నప్పుడు కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ అయింది…బహుశా మనిషి లేని లోటు వల్లనేమో...


ప్రిన్సిపాల్ గారు రాము, శైలజా కి ఫోన్ చేసి రాజారాం ని పంపించే ఏర్పాట్లు చేయించారు.

ఒకరోజు రాజారాం తన మిత్రుడు ఇంటికి సిరిసిల్ల వెళ్ళాడు. ప్రిన్సిపాల్ గారి ఇంటికి రావడం రాజారాం కి కొంత తేలికగా ఉంది. వారిద్దరూ చిన్న నాటి మిత్రులు. కలిసి ఎన్నో జ్ఞాపకాలు పంచుకునే వారు. ఆ బాల్య జ్ఞాపకాలు వారికి మంచి శక్తి, ఆనందం ఇస్తున్నాయి.

ఒక రోజు రాత్రి పడుకునే సమయంలో రాజారాం తన మిత్రుడు తో ….తన వయసు మరచి పోయి మనసు తెరిచి మాట్లాడుతున్నాడు.

రాజారాం : ఒరేయ్…పావని నా అదృష్టం రా…తనను నేను బంధువుల పెళ్ళిలో చూసి ఇష్ణపడి, పెద్దలతో చెప్పి పెళ్లి చేసుకున్నాను. తన అందం కంటే మనసు మంచిది రా. నన్ను చాలా విషయాల్లో గైడ్ చేసేది. నాకు ఆఫీస్ లో కానీ ఎక్కడ ఎప్పుడు టెన్షన్ ఉన్నా తనను చూస్తే చిన్న పిల్లాడిలా అయిపోయే వాడిని…ఒక తల్లి ప్రేమ చూపించేది రా…ఏ రోజు  ఏ విషయం లోనూ  కోపం తెచ్చుకునేది కాదు…తను నాకు ధైర్యం, సర్వస్వం రా...తను లేకపోతే ఈ జీవితం ఇంతవరకూ వచ్చేది కాదు.

రాజారాం చెపుతుంటే  ప్రిన్సిపాల్ గారు నిస్తేజంగా వింటున్నారు

రాజారాం : అంతెందుకు రా….. నువ్వు రాము ని పంపించినపుడు …పావని ఏమైనా అభ్యంతరం పెడుతుందేమో అని సంశయించాను. ఎందుకంటే ఎదిగిన ఆడపిల్ల ఇంటిలో ఉంది కదా,  తల్లి గా ఏమైనా అంటుందేమో అనుకున్నాను. కానీ తనకు నామీద, నీమీద…నువ్వు పంపిన రాము మీద మంచి నమ్మకం పెట్టుకుని చూసింది….. అంతెందుకు రా , రాము ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యాక, విమల రాము ల  ప్రేమ విషయం తెలిసి కూడా ఒక్కమాట నాతో ఏరోజు, ఏమీ అనకుండా రాము మీద నమ్మకం ఉంచి , సొంత బిడ్డలా చూసింది ….ఆ ఫలితమే కదరా ఈ రోజు రాము అత్యుత్తమ స్థితి కి ఒక కారణం అయింది. అసలు ఎవరు ఉంటారు రా…ఇలా…

ప్రిన్సిపాల్ గారు తెలియకుండా నే రాజారాం మాటలు విని కళ్లలో నీళ్లు పెట్టుకున్నాడు…పావని గురించి.

ప్రిన్సిపాల్ గారు : అవును రా…నువ్వు చెప్పింది. అక్షరాల నిజం. దేవుడు దేవతా స్త్రీ లను ఎందుకు సృష్టించాడొ పావని ని చూస్తే నే అర్దం అవుతుంది…

రాజారాం : నా కేమి అనిపిస్తుందో తెలుసా…రా…

ప్రిన్సిపాల్ గారు : బాధపడకు రా…చెప్పు…

రాజారాం : నన్ను పావని పిలుస్తున్నట్లు అనిపిస్తుంది రా…. నేను పావని దగ్గరకు వెళ్ళి పోతాను రా ….. తాను లేకుండా నేను ఉండలేను.

ప్రిన్సిపాల్ గారు : రాజారాం ఊరుకో రా…చిన్న పిల్లాడిలా…ఈ మంచి నీళ్ళు తాగి, ప్రశాంతంగా నిద్ర పో…రేపు మాట్లాడు కుందాము.

రాజారాం : సరే…

ప్రిన్సిపాల్ గారు : రాజారాం మాటలు విని ఆలోచిస్తూ, ప్రేమ అనేది కోరుకున్న మనిషి దగ్గర లేకపోతే ఎంత పిచ్చి వాడిని చేసెస్తుందో తనకు అర్దం అవుతుంది. దానికి వయసు తో సంబంధం లేదని అనుకున్నాడు. మనసు లో రాము, విమల గుర్తు వచ్చి నెమ్మదిగా నిద్రలో కి జారుకున్నాడు.

మరుసటి రోజు ఉదయం

ప్రిన్సిపాల్ గారు లేచారు….తన మిత్రుడు రాజారాం ఇంకా పడుకొని ఉన్నాడు.

సరే లే మంచి నిద్ర లో ఉన్నాడు.. కాసేపు ఆగి లేపుదాం అనుకొని ఫ్రెష్ అయి …మరలా వచ్చి

చూసి లేపుతుంటే ….తన చిరకాల మిత్రుడు శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయాడు .

భోరున విలపిస్తూ రాము శైలజ లకి ఫోన్ చేసాడు.


మిగిలినది ఎపిసోడ్ -15 లో

యడ్ల శ్రీనివాసరావు  2 Sep 2022.




No comments:

Post a Comment

488. నా ప్రపంచం

నా ప్రపంచం • నా దొక   ప్రపంచం   అది   సోయగాల   సౌందర్యం. • నా  మనసెరిగిన   ప్రపంచం   మధువొలికిన     అనందం. • అందాల   ఆరబోతలు   ఆదమరచి   ...