Thursday, September 22, 2022

245. తెలుసుకో…. ఇంకా ఎంత కాలం…. ఇలా

 

తెలుసుకో…. ఇంకా ఎంత కాలం…. ఇలా



• ఒక మనిషికి ఒక జన్మలో జననం, వివాహం, మరణం, ఈ మూడింటి తోనే జీవిత చక్రం వివిధ దశలుగా నడుస్తుంది. ఆత్మ గర్భం లోకి ప్రవేశించిన తరువాత 3 వ నెల వరకు తన పూర్వ జన్మ జ్ఞాపకాలతో ఉంటుంది. ఆ తరువాత కొంతమంది కి పూర్తిగా, మరికొందరికి 90 శాతం గత జన్మ జ్ఞాపకాలు తొలగిపోతాయి. కానీ ఏదైనా,  ఒక ఆత్మ జననం తీసుకునే ముందే  అంతా నిర్ణయించుకొని శరీరం ఎంచుకొని,  గర్భం లో ఉన్న పిండంలోకి ప్రవేశిస్తుంది. ఇది అంతా గత జన్మలలో చేసిన కర్మలను అనుసరించి జరుగుతుంది.


• ఇక ఆత్మ ఒకసారి  జననం తీసుకుని గర్భం విడిచి శరీరం తో భౌతిక ప్రపంచంలో అడుగుపెట్టిన తర్వాత మనిషి జీవితం మొదలవుతుంది. మనిషి తాను ఒక ఆత్మ అని మర్చిపోయి , తాను ఒక శరీరం, అదే సర్వం అనుకొని జీవించడం తో నే జీవన చక్రం ప్రారంభమవుతుంది. ఇది మాయ యెక్క ప్రభావం. ఈ భౌతిక ప్రపంచంలో మనిషి శరీరానికి కావలసిన కోరికలు, ధనం, మోహం, సుఖాలు, కామం ఒకటేమిటి అన్నీ కలి మాయ ప్రభావం తోనే జీవితం మొదలవుతుంది. ఎందుకంటే మనిషికి కనిపించేది స్థూల స్థితి (శరీరం ఆకారం). కానీ దాని వెనుక తన స్థితి గతులను సర్వం నడిపిస్తున్న సూక్ష్మ స్థితి (ఆత్మ) కంటికి కనిపించదు…. ఎందుకంటే భృకుటీ స్థానం లో ఉన్న మూడవ నేత్రం (పినియల్ గ్రాండ్ మెదడు కి అనుసంధానించి ఉంటుంది) తల్లలి గర్భంంలో ఉన్న  మూడవ నెలలో నే మూసుకు పోతుంది.


• ఇక అసలు విషయానికి వస్తే…..

• మనిషి పుట్టుక నుంచి ఆనందం గా ఉండాలని, అనుకున్నది సాధించాలని, ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని, విపరీతమైన ధనం సంపాదించాలని, భోగభాగ్యాలు అనుభవించాలని, కోరికలు సఫలం కావాలని శతవిధాలా ప్రయత్నం చేస్తుంటాడు. ఇదే ఏ మనిషి అయినా ఆలోచించేది.


• అందుకు జీవితం లో అనేక జీవన దారులు ఎన్నుకుంటారు. మంచి చదువు, ఉద్యోగం, వ్యాపారం అని ధర్మబద్ధంగా కొందరు చేస్తే మరికొందరు దొంగతనాలు, మోసం , అక్రమాలు వంటివి చేస్తుంటారు. అంటే ఇక్కడ కర్మ , సకర్మ వికర్మ అని రెండు గా విభజించబడుతుంది.


• ఇదంతా ఎందుకు అంటే తన కంటితో చూస్తున్న మనసు కి అనిపించిన సంతోషాలను సాధించు కోవడం అని లేదా జన్మించాము బ్రతకాలి , అవసరం కాబట్టి ఇలా చెయ్యాలి అని అనిపిస్తుంది.


• పుట్టుక నుంచి ఒక యుక్త వయసు వచ్చేంతవరకు కూడా తాను జన్మతీసుకున్న తల్లి తండ్రులు, కుటుంబ లోని వ్యక్తులు, బంధువులు, రక్తసంబంధాలు, గురువులు, వంటి వారి ప్రమేయం తో నడుస్తుంది…ఇదంతా ఒక దశ. ఈ దశలో తన చుట్టూ ఎంతమంది ఉన్నా ఒక స్వతంత్ర ఆలోచన విధానాలతో తన మనసు లోని ఆలోచనలకు బలమైన పునాది వేసుకుని తనదైన భవిష్యత్తు ని నిర్మించుకోవాలి అని కలలు కంటాడు. ఆ క్రమంలో నే మంచి ఉద్యోగం, సంపాదన, అందమైన ఇల్లు, అందమైన భార్య, గుణవంతుడైన భర్త, ఇలాంటి కనీస కోరికలు సహజం. ఇదంతా ఎందుకు అంటే సంతోషం, ఆనందం కోసం. కానీ  చాలా మంది కి ఇదంతా తెలియకుండానే గడిచిపోతుంది.

• ఇక రెండవ దశ…. ఇది ఒక రకంగా జీవిత చక్రం లో చాలా ముఖ్యమైనది. అదే వివాహం. మనిషి అప్పటి వరకూ ఉన్న ఒక దశను వదిలి రెండవ దశ లో అడుగు పెడతాడు. వివాహం అయిన తరువాత ప్రతీ ఒక్కరి జీవితంలో ఊహించలేని విపరీతమైన మార్పులు సంభవిస్తాయి. అవి ఉత్తమము లేక అల్పము కావచ్చు. ఇక్కడ ఒక మనిషి కి మరో మనిషి జత అయినపుడు జీవన విధానం లో , ఆలోచనలలో, మానసిక శక్తి లో పెను మార్పులు సంభవిస్తాయి. ఎందుకంటే ఒకరి ప్రభావం మరొకరి పై ఉంటుంది. మనిషి కి తన జీవిత కాల చక్రం లో ఎక్కువ సంవత్సరాలు ఈ దశలోనే జరుగుతుంది. అందుకే దీనిని సంసార సాగరం అంటారు. ఇందులో కూడా ప్రతీ మనిషి సంతోషం, ఆనందం కోసమే పరితపిస్తూ ఉంటాడు.


• ఇప్పుడు రెండు దశలు అంటే జననం, వివాహం ఈ రెండింటి లో మనిషి అన్ని వేళలా, అన్ని విషయాల తాను అనుకున్న ప్రతీది సంపాదించుకొని సంతోషంగా ఉన్నాడా? ….లేక రాజీపడి పోయాడా?...లేక తాను అనుకున్నది ఏదీ సాధించలేక దుఃఖం తో ఉన్నాడా? ….


• ఈ మూడు ప్రశ్నలు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే ఒకటి మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. అది ఏంటంటే మనిషి ఎంత సంపాదించినా సంపాదించక పోయినా, ఎన్ని కోరికలు తీర్చుకున్నా, తీర్చుకోక పోయినా, ఎన్ని భోగం భాగ్యాలు అనుభవించినా అనుభవించ లేక పోయినా……మనశాంతి, ప్రశాంతత మాత్రం దొరకక నిరంతరం ఏదొక సమయం లో ఎంతో కొంత దుఃఖం అనుభవిస్తూనే ఉంటాడు. ఇది నిజమా కాదా అని కళ్లు మూసుకుని మనసు ను అడిగితే సమాధానం చెపుతుంది. కొందరు విజ్ఞత తో ఈ స్థితి ని జయిస్తారు. మరికొందరు దుఃఖిస్తారు.


• అంటే మనిషి తాను జన్మించినా, వివాహం చేసుకున్నా , సంపాదించినా నిరంతరం జీవన పోరాటం చేస్తున్నా , భవనాలు కట్టుకున్నా , శరీరం పై మమకారం పెంచుకున్నా, కుటుంబం, బాధ్యతలు, ఇలాంటివి అన్నీ కూడా ఒక డ్రామా, ఇది ఏదీ శాశ్వతం కాదు అని మరణం సంభవించే వరకు తెలుసు కోలేడు. ఎందుకంటే మాయ తెలియనివ్వదు.


• అదే విధంగా ముఖ్యమైనది మూడవ దశ మరణం. మనిషి కి మరణం గురించి ఆలోచిస్తే భయం, ఎందుకంటే శరీరం పై మమకారం అటువంటిది. మరణం తధ్యం అని తెలుసు కానీ దానిని అంగీకరించలేడు. మరణం ప్రతీ ఒక్కరికీ సహజం , తప్పదు అనుకున్నప్పుడు మనసు లో ఎందుకు భయపడాలి. ఈ నిజాన్ని మనసు ఎందుకు అంగీకరించక పోవాలి. దీనినే వ్యామోహం, అజ్ఞానం అంటారు….

• జన్మించిన తరువాత మంచి జీవితం కావాలని ప్రయత్నం చేస్తుంటారు, కష్టపడతారు…. మంచి వివాహం , భోగాలు, సుఖాలు కావాలని పరితపిస్తూ ఉంటారు….

అంటే తనకు కావలసిన అశాశ్వతమైన ప్రతీ దాని కోసం ముందుగా ప్రణాళికలు వేసుకొని కూడా పెట్టుకుంటున్నాడు. మరి మంచి ప్రశాంతమైన , గౌరవమైన, సంతోషకరమైన , శాంతివదనం తో కూడిన మరణం గురించి మనిషి ఏం చేస్తున్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు.


• చివరి దశలలో ఎంతో మందిని మన కుటుంబంలో, దగ్గర వారిలో తరచూ చూస్తుంటాం దుర్భరమైన , బాథలతో కూడిన మరణాలు. వాళ్లు అంటుంటారు “ శత్రువు కి కూడా ఈ స్థితి రాకూడదు అని” . మరి ఇది నిజం అని కళ్లముందు చూసినా తెలిసినా ఎందుకు మనం మేలు కోం.


• మరణం గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేస్తేనే జననం, జీవితం, జీవనం యెక్క విలువ పరమార్థం, ఉన్నతి తెలుస్తుంది. ఎందుకంటే శరీరం శాశ్వతం కాదు. ఆత్మ వినాశి, నాశనం లేనిది. ఆత్మ పరిశుభ్రం అయి , తన శక్తి ని పూర్తిగా పుంజుకున్నప్పడే తిరిగి పరమాత్మ సన్నిధి కి తిరిగి వెళుతుంది. అంతవరకు ఆత్మ శరీరాలను వెతుక్కుంటూ ఉంటూనే ఉంటుంది.


• ఆత్మ పరిశుభ్రం కావాలి, శక్తి వంతం కావాలి అంటే పరమాత్మ అయిన శివుని ధ్యానం చెయ్యాలి. తద్వారా చేసిన పాపకర్మల నుంచి విముక్తి లభిస్తుంది.

• ఒక శరీరానికి జనన మరణ చక్రం లోంచి బయట పడే సమయం వస్తేనే, తానొక ఆత్మ అని తెలుసుకుంటుంది. అదే ఆత్మజ్ఞానం.


• అలాగే గత జన్మలలో మిగిలిపోయిన కర్మలను, బుణాలను తీర్చుకుంటుంది. ఎందుకంటే ఈ భూమి మీద ఏదీ తనకు శాశ్వతం కాదు తనతో ఏమీ ఎక్కడికి తీసుకెళ్ళలేను అనేది తెలుస్తుంది.


• మంచి మరణం రావాలంటే పరమాత్మ అయిన శివుని ప్రార్థించాలి. ఎవరిని మాటలతో, చేతలతో దుఃఖ పెట్టకూడదు. శాంతవంతమైన ఒక మంచి మరణం తిరిగి అత్యుత్తమమైన జన్మ ఇస్తుంది అనడం లో ఏ మాత్రం సందేహం లేదు. ఎందుకంటే చివరి దశలలో క్షోభ, దుఃఖం తో మరణిస్తే తిరిగి వాటి తోనే జననం తీసుకోవాల్సి వస్తుంది. ఇది పరమాత్మ చెప్పిన సత్యం.


• అన్నింటి ని ప్రేమించినట్లే మరణాన్ని కూడా ప్రేమించండి. నిజాన్ని అంగీకరించండి.


• ఇదంతా అర్దం కావాలి అంటే కాసేపు నేను బ్రతికి లేను చనిపోయి ఉన్నాను అని అనుకుంటే…. ఇందులో నిజం అర్దం అవుతుంది.


• అహంకారం విడిచినపుడే నీ ఆత్మ నీకు దర్శనం ఇస్తుంది…. అదే పరమాత్మ వైపు దారి చూపిస్తుంది….. ఎందుకంటే సత్యయుగం లో ఒకప్పుడు ఈ ఆత్మలన్ని పరమాత్మ సన్నిధి లో శాంతియుతంగా ఉండేవి. యుగ యుగాలు మారే కొద్దీ ఆత్మకు వికారాలు అంటి , పరమాత్మ సన్నిధిని విడిచి భూలోకం వచ్చాయి. ఆత్మ యొక్క స్వస్ధలం పరమాత్మ సన్నిధి.


• ఈ మూడవ దశ అయిన మరణమే ఆఖరి దశ…. ఇదే తిరిగి నిర్ణయిస్తుంది , నీ సుఖదుఃఖాలను మరియు మరొక జన్మను…..


• గమనిక : ఇది బాధ్యతలను విస్మరించిమని కాదు…. బంధాలలో , జీవిత గమనం లో ప్రతీ అడుగు ఆనందించండి కానీ దేని వలన దుఃఖం తీసుకోకండి, దుఃఖం ఇవ్వకండి. అన్నింటి తో కలిసి మమైకమై ఉండాలి ఎలా అంటే తామరాకు పై నీటి బిందువులా…. ఏది ఉన్నా సంతోషమే లేక పోయినా సంతోషమే. అదే పరమానందం.


యడ్ల శ్రీనివాసరావు 22 sep 2022 12:30 PM.


No comments:

Post a Comment

568. బాల్యం తీపి

  బాల్యం తీపి  • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు ‌  బాల్యం    తీపి   పసి బాల్యం   తీపి. • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు   ప్రాయం  ...