Wednesday, June 24, 2026

761. గురువు - జ్ఞానం మనిషి కి అవసరమా?


గురువు . . . జ్ఞానం మనిషి కి అవసరమా?



  గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః 

  గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై  శ్రీ గురవే నమః 


• భగవంతుడు   సృష్టించిన   విశ్వంలో  ఖగోళం అత్యంత  అద్బుతం . నక్షత్రాలు , ఉల్కలు, తోకచుక్కలు , పాలపుంతలు , నవ గ్రహాలు వాటి తో పాటు అనేక చిన్న చిన్న గ్రహాలు వేటికవే  ఒక విలక్షణమైన మహా శక్తిని సంతరించుకుని ఉన్నాయి . ఈ శక్తి ప్రభావం ఒకదాని  నుంచి  మరొక  దానిపై  పడుతూ విశ్వం అంతా  వ్యాపించి ఉంటుంది . 

• ఇక గ్రహాల విషయానికి వస్తే భూమి ఒక గ్రహం .‌ ఈ భూమి పై పడే విశ్వం యొక్క (గురుత్వాకర్షణ) శక్తి ప్రభావం వలన భూమి తన చుట్టూ తాను తిరుగుతూనే , ఒక నిర్దిష్ట కక్ష్యలో తిరుగుతూ సూర్యుడు చంద్రుడు మరియు మిగిలిన గ్రహల చుట్టూ తిరుగుతుంది. ఇది సైన్స్ ద్వారా నేటి తరాలకు తెలిసిన వాస్తవం  . 

• భూమి విద్యుదయస్కాంత శక్తి కలిగి ఉండడం వలన  భూమి పై  నివసించే ప్రతి జీవి , నిర్జీవి , చెట్టు పుట్ట పక్షులు జంతువులు ఇవన్నీయు కూడా  విశ్వ శక్తి  ఆధారంగానే జీవిస్తాయి . 

 మనం విశ్వం లో ఒక భాగం. అంతే కానీ మనమే సమస్త విశ్వం కాదు . ఇదంతా  ఎందుకు అంటే , గ్రహాల యొక్క శక్తి ప్రభావం తప్పకుండా ఈ భూమి పై ఉన్న ప్రతి మానవుని పై ఉంటుంది . ఈ గుప్త విజ్ఞానాన్ని  జ్యోతిష శాస్త్రం లో  వేల సంవత్సరాల క్రితమే  పరాశర మహర్షి పొందుపరిచారు .


 జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించి ,  బృహస్పతి  Jupiter ఒక ప్రత్యేక గ్రహం . దీనిని  గురు గ్రహం అంటారు . నవ గ్రహాలలో గురు గ్రహాం అత్యంత ప్రాముఖ్యమైనది . అందుకే మనకు ఉన్న రోజులలో గురు వారం (లక్ష్మి వారం) ఒక విశిష్టత సంతరించుకున్నది . 


• ఒక ఆత్మ  , భూమి పైకి వచ్చి  శరీరం ధరించి  జన్మించినపుడు అది జీవాత్మ అవుతుంది . మనం జీవాత్మలం . జీవాత్మ  (మనిషి)  నివసించడానికి . . . జీవించడానికి అవసరమైన జీవన  విధాన శక్తి ని  ఇచ్చేది   గురు గ్రహం అయిన  బృహస్పతి . బృహస్పతి ని  దేవతలకే గురువు అంటారు . బృహస్పతి  జ్ఞానం మేధస్సుకు ప్రతీక . 


• ఒక మనిషి , జీవించడానికి కావలసిన అనుకూల  జ్ఞాన శక్తి, గురు గ్రహం  బృహస్పతి ద్వారా  విశ్వం నుంచి లభిస్తుంది .  జ్యోతిష్య శాస్త్రం ద్వారా మనిషి కుండలినీ  లో   బృహస్పతి ,  గురుగ్రహ బలం ఎలా ఉందో గమనించి , ఆ మనిషి జీవిత నడవడిక జ్ఞాన  సంస్కార   విధానాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. మనిషి కి  బృహస్పతి  శక్తి  బలం గా  ఉంటే , ఏ విఘ్నాన్ని  అయినా ధైర్యం గా ఎదుర్కొని , సమస్య ను  పరిష్కరించుకునే జ్ఞానం , సామర్థ్యం  వ్యక్తి కలిగి ఉంటాడు .   గురు శక్తి బలహీనంగా  ఉంటే  అజ్ఞానంతో  సమస్యలు సృష్టించుకుంటూ , పాప కర్మలు చేస్తుంటాడు . గురు శక్తి తక్కువగా  ఉన్న వారికి  జీర్ణ కోశ సమస్యలు తరచూ వేధిస్తూ అధికంగా ఉంటాయి .

మానవుడు గత జన్మల లో చేసిన పాప పుణ్య కర్మలు, సంస్కారాల ఆధారం గా నేటి జన్మలో గురు గ్రహ బలం,  జీవన స్థితి ఆధారపడి ఉంటాయి . గ్రహాలు అన్ని కూడా  ఒకో విశిష్టత కలిగి ఉంటాయి . వాటి శక్తి , బలం బలహీనతల ప్రభావం వలనే మనిషి స్థితి గతి ఉంటుంది .  ఇందు ముఖ్యమైనది గురు గ్రహం , తద్వారా పొందే  జీవన జ్ఞానం , మేధస్సు  . 


🌹🌹🌹🌹🌹


• సాధారణంగా , ఈ భౌతిక ప్రపంచంలో గురువు అంటే పాఠాలు చెప్పే టీచరు అని , కాలేజిలో లెక్చరర్ అని , పి.హెచ్.డి. లో ప్రొఫెసర్ అని భావిస్తారు . కొందరు అయితే తమకు జీవనోపాధి వృత్తిని నేర్పించిన వారిని గురువు గా భావిస్తారు. ఈ విధంగా గౌరవించడం మంచిదే . కానీ వాస్తవానికి వీరెవరూ పరిపూర్ణత నిచ్చే గురువులు గా కాలేరు. 

  గురువు అంటే  జీవితానికి  సంపూర్ణ  మార్గదర్శి . పైన ఉదాహరించిన వారు  కేవలం చదువు లోను , వృత్తి లోను , వారికి తెలిసిన ఒక పరిమితి తో కూడిన విద్య ను  మాత్రమే బోధిస్తారు . వారు హద్దు లోని గురువులే కానీ జీవితానికి సంపూర్ణ  అనంతమైన మార్గదర్శకులు కారు. 


• మనిషి  జీవిత అంతిమ దశ  వరకు కావలసిన జ్ఞానాన్ని మార్గాన్ని  దిశను పైన ఉదహరించిన వారెవరూ చూపలేరు , అది కొంతవరకు ఆధ్యాత్మిక గురువు కి  సాధ్యం . . . అంతకు మించి సంపూర్ణ జ్ఞానం ఇవ్వగలిగిన వారు ఒక్క సద్గురువు మాత్రమే  . సద్గురువు అంటే  పరమాత్మ శివుడు , గీతా జ్ఞాన రచయిత . అందుకే శివుని నుంచి జ్ఞాన సాగరుడు అంటారు .

శరీరం ధరించి  ఉన్న , ఏ మానవమాత్రుడైనా గురువుగా అయి ఉండవచ్చు కానీ, అతడు సద్గురువు కాడు , కాలేడు .  సద్గురువు జనన మరణాలకు అతీతుడు. అతడే శివుడు.


• కలియుగం పూర్తి  పతిత ప్రపంచం, కలియుగం లో మానవ జన్మ తీసుకున్న ఏ మనిషి పవిత్రుడు కాడు   . ఎందుకంటే మానవుడు జన్మ తీసుకున్న విధి విధానం లోనే   విషయ వికారాల కర్మ  దాగి ఉంది .  అందుకనే ఓ పతిత పావన రండి అని భగవంతుడిని అందరూ పిలుస్తారు. దీని అర్థం పతితులు గా ఉన్న మమ్ము పావనం గా తయారు చేయండి అని. 

పవిత్రంగా పావనం గా కావలసింది దేహం ధరించిన వారి ఆత్మ .  ఆత్మ లోని  మనసు,  బుద్ధి , ఆలోచన , కర్మలు , సంస్కారాలు . అంతే కానీ శరీరం కాదు, మానవుని గా  జన్మించిన ఏ మనిషి శరీరం కూడా పవిత్రం కాదు, కాలేదు. 

కానీ శివుడు పరమ పవిత్రుడు , జనన మరణాలు కు  అతీతుడు . శివుడు జన్మించడు , అవతరిస్తాడు . పరమ పవిత్రుడైన  శివుడే  సద్గురువు . భక్తి మార్గం లో శివుని సద్గురువు గా  దక్షిణా మూర్తి గా కీర్తిస్తారు .

ఇదంతా  మానవ రూపంలో ఉన్న గురువు కి  , దైవ రూపం లో ఉన్న  సద్గురువు కి  మధ్య ఉన్న వ్యత్యాసం తెలియ చేయుట  కోసం మాత్రమే 


🌹🌹🌹🌹🌹


• ఒక మనిషి కుండలి లో బృహస్పతి, గురు బలం తక్కువ ఉన్న వారు తప్పని సరిగా గురువారం రోజున శివాలయం సందర్శించాలి . శివుని గురువు గా తలచి శివ స్మృతి  , శివ ధ్యానం చేయాలి . దక్షిణామూర్తి స్తోత్రం ఉదయం సాయంత్రం జపిస్తే గురు బలం (శక్తి) పెరుగుతుంది. దాన ధర్మాలు , హోమాలు జపాలు వలన ధనం వృధా చేసుకోవడం  మినహా ఏమీ ఉండదు . కొందరు తమ జీవన భృతి కోసం అవి చేయమని అనాదిగా చెపుతూ ఉంటారు ,  వీలైతే ఉడికించిన కేజీ శెనగలు, పావు కేజీ బెల్లం కలిపి ఆవుకి గురువారం రోజున తినిపించండి . 

కొందరు మనుషుల కి  ఉన్న  గ్రహల  బలం, శక్తి లోపం వలన కలిగే  ఈతిబాధలు  , సమస్యలు , బలహీనతలు, అనారోగ్యాలు , అజ్ఞానం  . . .  ఈ లోకంలో  మరికొంత మంది కి జీవన ఆధారం . ఇదే కలియుగం లోని మాయా దౌర్భాగ్యం .  

ఈ గ్రహల బలం, శక్తి లోపం మన లో ఏర్పడి ఉండడానికి కారణం,  గత జన్మల లో కానీ , నేటి జన్మలో కానీ తెలిసీ తెలియక  చేసిన పాప కర్మలు.  


• బృహస్పతి గురు బలం(శక్తి) నిండుగా ఉన్న వారి జీవితం మంచి నడవడిక ద్వారా సంపూర్ణత సాధిస్తుంది. వారు నిస్వార్థం గా తమకు తోచిన రీతిలో ఇతరులకు మేలు చేసే వారుగా ఉంటారు . వృత్తి రీత్యా  కొందరు , సేవ రీత్యా కొందరు గురువులు గా  అయి  ఉంటారు .

 జ్ఞానం  సూక్ష్మ  ధనం .  కంటికి కనపించదు.

 కరెన్సీ   స్థూల ధనం .   కంటికి కనిపిస్తుంది. 

స్థూల ధనం (కరెన్సీ) కలిగి  ఉన్నంతలో  జీవుడికి పరిపక్వత   సంపూర్ణత  మోక్ష సిద్ది  కలుగదు . జ్ఞానం  ఉన్న వారికి , స్థూల ధనం ధర్మం యుక్తంగా దానంతట అదే చేరుతుంది .


ఈ జన్మలో సంపాదించిన స్థూల ధనం (కరెన్సీ) మరు జన్మకు పనికిరాదు . 

కానీ, ఈ జన్మలో సంపాదించుకున్న జ్ఞాన ధనం అనేక జన్మల వరకు  నీ  ఆత్మతో కలిసి ఉంటుంది.


• నీ లోని సత్యాన్ని కొనుక్కొని , ఆ సత్యం తో పాపపుణ్యాలను  మరియు నీవు నిర్వర్తించ వలసిన బాధ్యత  ధర్మం తెలుసుకొని ఎలా జీవించాలి  అనేదే  జ్ఞానం యొక్క పరమార్థం . అంతే కానీ, జ్ఞానం అంటే శ్లోకాలు, పద్యాలు , కీర్తనలు , ఢాంభికాలు  , ఆడంబరాలతో కూడిన గంఢపేరుండాల వేషధారణ  ప్రదర్శించడం కాదు .

 సత్యమైన  జ్ఞాని ఎన్నడూ గుర్తింపు ఆశించడు. గుర్తింపే వెతుక్కుంటూ జ్ఞాని యొక్క పాదాల చెంతకు చేరుతుంది . గుర్తింపు అనేది మాయా ఆడంబరం, అదే జ్ఞాని పతనానికి మూలం. 

 జ్ఞాని నిరాడంబర జీవనం తో తన మనసు యొక్క శిఖరాన్ని అధిరోహించగలడు . ఆ శిఖరం పైనే పరమాత్మ శివుడు కొలువై ఉంటాడు . 

 జ్ఞానం , మానవుని  జీవిత నావను  పెను తుఫానుల నుంచి అత్యంత సులభంగా తీరం దాటిస్తుంది . జ్ఞానం తెలుసుకోవడమే కాకుండా ఆచరించడం ప్రధానం, ఆ జ్ఞానాన్ని ఇతరులకి పంచడమే  ఉత్తమ పురుషార్థి  లక్షణం  . 


గురు బలం ‌ సమృద్ధిగా ఉన్నవారు (knowledge) జ్ఞానం అర్జించగలరు.  అనగా తెలుసుకోగలరు .

జ్ఞానం మానవుని లోని  బుధ (Mercury బుద్ధి , తెలివి)  గ్రహ శక్తి ని  వృద్ధి చేస్తుంది .  తద్వారా   వివేకం  (wisdom)  పెరుగుతుంది . వివేకవంతుడు   ఏ సమయం లో ఎలా ప్రవర్తించాలో  , ఎలాంటి  నిర్ణయాలు తీసుకోవాలో  గురు జ్ఞానం తో   పొందిన విషయాలను  అనుభవాలు గా   మార్చుకుంటాడు. 

జ్ఞాని  మాత్రమే  వివేకి గా  మారగలడు .  గమనించ వలసిన విషయం జ్ఞానం (knowledge) వేరు , వివేకం (wisdom) వేరు .


నేటి కాలం  మానవుడు  అజ్ఞానం తో  ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాడు . దీనికి ప్రధాన కారణం  మనసు .  మనసు స్థిరత్వం లేకపోవడం వలన  భయం  ఆందోళన  అలజడి అభధ్రత పెరిగి  మానసిక రోగిగా  జీవించడం జరుగుతుంది. దీనికి కారణం సత్యం వాస్తవం తెలుసుకో లేకపోవడం .   ఇదే  అజ్ఞాన బీజం . 

ఒక నిస్వార్థమైన ఆధ్యాత్మిక గురువుని (ధనం ఆశించని , సేవా తత్పరుడు)   ఆశ్రయించడం వలన మనిషి కి  జ్ఞాన మార్గం   , జీవన మార్గదర్శకం లభిస్తుంది . కానీ ఈ మాయా లోకం లో అటువంటి సత్యమైన గురువులు  అరుదు గా ఉంటారు .  గురువు లభించక పోతే , మంచి  ఆధ్యాత్మిక పుస్తకాల పఠనం ద్వారా కొంత  జీవన జ్ఞానాన్ని ఆర్జించ వచ్చు .

 

ప్రపంచ వ్యాప్తంగా 175 దేశాలలో బ్రహ్మ కుమారీస్ ఈశ్వరీయ విశ్వ విద్యాలయానికి సంబంధించిన సహజ రాజయోగ మెడిటేషన్ సెంటర్లు  అనేక వందలు ఉన్నాయి . పరమాత్మ శివుని యొక్క సంపూర్ణ గీతా జ్ఞానం ఈ సెంటర్లలో పూర్తి ఉచితంగా  , ఆయా  భాషలలో ప్రతీ రోజూ ఒక గంట సమయం చెపుతారు . శివుని జ్ఞానం తో పాటు ధ్యానం నేర్పిస్తారు .  సమీపం లో ఉన్న వారు , గురు బలం పెంచుకోవాలి అనుకునే వారు, సద్గురువు అయిన శివుని తో  ప్రత్యక్ష బంధం ఏర్పరచు కోవాలి అనుకునే వారు  , జీవితం లో మంచి మార్పు కోరుకునే వారు  తప్పకుండా సహజ రాజయోగ మెడిటేషన్  వినియోగించుకోవచ్చు . ఇది పూర్తిగా ఉచితం . 


ప్రతి మనిషి ఆనందంగా సంతోషంగా జీవించాలి అంటే , ముందు గా  తన గురించి తాను  తెలుసుకోవాలి. అందుకు తప్పని సరిగా  సత్యమైన నిస్వార్థమైన ఆధ్యాత్మిక గురువు అవసరం .  దేహదారి గురువు లేకుండా , సద్గురువు అయిన శివ పరమాత్మ ను చేరలేము. 

శివుని నిత్యం స్మృతి చేస్తూ ఉంటే , ఏదో నాడు తప్పక  సత్యమైన దేహదారీ  గురువు లభిస్తాడు  .


గురువులను కీర్తించక పోయినా , గౌరవించక పోయినా పర్వాలేదు కానీ పొరపాటు న  కూడా నిందించకూడదు .  అలా చేస్తే మహా పాపం తయారవుతుంది .


ఓ మనిషి . . .  ఈ  భౌతిక ప్రపంచంలో, నీవు సంతృప్తుడుగా  అయి  ,  నీ జీవిత నావ సజావుగా తీరం దాటాలి  అంటే తప్పని సరిగా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న సత్యమైన , నిస్వార్థమైన  , నిరాడంబరమైన  గురువు యొక్క  జ్ఞానం  అవసరం . లేదంటే, ఈ లోకం అంతా విస్తరించి ఉన్న మాయ వలలో చిక్కుకుని మరెన్నో జన్మలు నిరాశ నిస్పృహ ల మధ్య కొట్టాడు తూ  జీవించ వలసి వస్తుంది .


• ఉన్నాడా    ఉన్నాడా 

  నీ కంటూ   ఓ గురువున్నాడా 

  మనిషి   ఓ  మనిషి . . . 


• గురువు  అంటే  దైవం 

  గురువు  అంటే  సన్మార్గం.

• గురువు  లేని   జీవితం 

  చుక్కాని  లేని   నావ పయనం .


  ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

  ఓం శాంతి 

  ఓం నమఃశివాయ 🙏 

 యడ్ల శ్రీనివాసరావు 20 July 2026 , 10:15 PM.


No comments:

Post a Comment

761. గురువు - జ్ఞానం మనిషి కి అవసరమా?

గురువు . . . జ్ఞానం మనిషి కి అవసరమా?   గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః    గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై  శ్రీ గురవే నమః  • భగవంతు...