అంధులు అదృష్టవంతులా ?
• అంధులు అదృష్టవంతులా ? ఆశ్చర్యం గా అనిపిస్తుంది కదా , ఇంకొక అడుగు ముందుకు వేస్తే మతి సరిగా లేని వాడికే ఇలా అనిపిస్తుందేమో కదా ! . . . అవును , నిజమే అంధులు అదృష్టవంతులు .
వారు ఈ భౌతిక లోకాన్ని చూడలేరు . చూడలేనప్పుడు ఈ లోకానికి సంబంధించిన అంశాలను , ఏదో సాధనాల రూపంలో వినినా వాటిని మనసు కి ఆకళింపు చేసుకోరు . సరికదా ఇక ప్రాపంచిక విషయాల గురించి ఎవరితోనూ చర్చించరు ముఖ్యం గా వ్యర్థాల గురించి మాట్లాడ లేరు .
ఒక్క మాటలో చెప్పాలంటే, వారు ఈ ప్రాపంచిక దృశ్యాలను చూడలేరు కాబట్టి లౌకికం లో జరిగే విషయాల పట్ల కళ్లు ఉన్న వారి వలే సంబంధాన్ని కలిగి ఉండరు . కానీ వారి సూక్ష్మమైన మనో దృష్టి మరోలా ఉంటుంది .
• వాస్తవానికి నేడు ఈ లౌకిక ప్రపంచంలో, జరుగుతున్నది ఏమిటి ? అంటే . . . మనిషి , తాను ఆచరించ వలసిన ధర్మాన్ని సత్యమైన రీతిలో ఆచరించక పోవడం వలన పాప ఖాతా జమ చేసు కోవడం , ఆ పాపం వలన దుఃఖం అనుభవించ వలసి వచ్చినపుడు భగవంతుని చెంతకు చేరి , ప్రార్థించడం . సూక్ష్మ స్థితి లో ఇదే నేటి మానవాళి అనుభవిస్తున్న యదార్ధం . విచారకర విషయం ఏమిటంటే , అజ్ఞానం వలన చేస్తున్న కర్మలు పాపమో పుణ్యమో అనే విషయం కూడా గ్రహించలేని స్థితి లో ఎన్నో పాప కర్మలు చేయడం . సమస్త దుఃఖాలకు మూలం ఇదే .
• నేటి సమాజం పూర్తి భ్రష్టు మయం . అవినీతి , అసత్యపు జీవనం , కల్తీ ఆహారం, అడుగడుగునా స్వార్దం , ఒకరిని వంచించి మరొకరు బ్రతకడం, కామం తో విచ్చలవిడితనం , హింస . . . ఆఖరికి ఇవన్నీ సహజం అని సంతోషం గా సరిపెట్టుకునే స్థితి లో నేటి సగటు మనిషి మనసు యొక్క దుస్థితి .
అవసరానికి మించిన జీవన విధాన శైలిని అనుకరిస్తూ అనుభవించడానికి అలవాటు పడిన విలాసాలే , నేడు మానవుని మూలాలు పెకలించుకు పోవడానికి కారణం . దురదృష్టం ఏమిటంటే ఇదే అభివృద్ధి అనుకోవడం. ఈ ప్రయాణం లో అధిక సంపాదన కోసం యువత ఎదుర్కొనే ఒత్తిడి , ఆకస్మిక మరణాలు (గుండెపోటు) , పిల్లలు కలగక పోవడం వంటివి కొన్ని మచ్చు తునకలు మాత్రమే.
• ఇది ముందుగా నే గ్రహించిన జ్ఞానులు మానవుని మనసు , బుద్ధి స్థిరత్వం కోసం మూడు కోతి బొమ్మలు తయారు చేసి చూపించారు , . . . చెడు చూడక, చెడు వినకు, చెడు మాట్లాడకు . కానీ ఇవి ఆచరణకు నోచుకోలేని స్థితిలో మనిషి ఉన్నాడు .
నేడు మనిషి ఆలోచనలలో ఉన్న స్థితి కి , తన కర్మేంద్రియాలతో (కళ్లు , చెవులు , నోరు ముక్కు , శరీరం ) చేసే పనులకు సంబంధం లేని దిశ లో జీవనం సాగిస్తున్నాడు అనేది పరమ సత్యం . దీనినే కర్మేంద్రియాల పై నియంత్రణ కోల్పోవడం అంటారు. Loosing control on five senses .
• ఉదయం లేచిన నుంచి . . . విద్యాలయాలు, ఆసుపత్రులు , ఆఫీసు కార్యాలయాలు , మార్కెట్లు , ఆఖరికి దేవాలయాలు ఎటు చూసినా వ్యాపారం వ్యాపారం వ్యాపారం . . . ఈ వ్యాపారం ముసుగులో జరిగేది దోపిడీ , మోసం , అవినీతి, కల్తీ , లంచగొండితనం , రాజకీయ కుట్రలు, ఇదంతా బహిరంగంగా అందరికీ తెలిసినా సరే , అంతా సహజం సర్వ సాధారణం అనుకునే అష్టదిగ్బంధన స్థితి కి సగటు మనిషి దిగజారి పోయాడు .
మనిషి ఇదంతా తన చుట్టూ ఉన్న సమాజం లో జరుగుతుంది అనే భ్రమ లో ఉన్నాడు . కానీ అదంతా చేస్తున్నది నేనే, అందుకు కారణం నేను , నేను కూడా ఒక భాగస్వామిని అని తెలుసుకో లేక ఉంటున్నాడు .
• మనిషిని తన కర్మేద్రియాలే మోసం చేస్తున్నాయి . ఇందులో ప్రధానం గా కళ్లు . కళ్లు మోసం చేసినంతగా ఏ ఇతర కర్మేంద్రియాలు మోసం చేయవు . దేని పట్ల అయినా మొదట ఆకర్షణకు వశం అయ్యేది , దాసోహం అయ్యేది కళ్ళతోనే . మాయా ప్రపంచం లో మార్కెట్లలో లభించే హద్దు అదుపు లేని రకరకాల తినుబండారాలు , విలాస వస్తువుల పట్ల ఆకర్షణలకు బానిస మయం మానవ జీవితం .
• అంతకు మించి , బంధాలను అతిక్రమించి భయం లేకుండా విచ్చలవిడితనం తో స్త్రీ పురుషుల కామ వికార సాంగత్యాలు , ఈ ముసుగుకు రకరకాల ఆధునిక నాగరికత పేర్లు , అవి వికటించిన తరువాత ఉత్పన్నమయ్యే నేరాలు ఘోరాలు , హత్యలు , ఆత్మహత్యలు … ఇలాంటి వాటన్నింటికి ప్రధాన కారణం కళ్లు . . . కళ్ల యొక్క ఆకర్షణలతో నే సమస్తం ఆరంభం అవుతాయి . వయసు తో ప్రమేయం లేని ఈ చాపల్యం అంతటా విస్తరించుకు పోయింది. దౌర్భాగ్యం ఏమిటంటే ఇదంతా చాలా సహజం అని సరిపెట్టుకోవడం , ఎందుకంటే నేడు మనిషి కి తన కళ్ళ పై , అంతకు మించి మనసు పై నియంత్రణ లేక పోవడం .
• భగవంతుడు మనిషి కి కళ్లు ఇచ్చింది అందమైన ప్రకృతిని , పచ్చదనాన్ని, జలపాతాలు , పక్షులు , అన్నింటినీ ఆస్వాదిస్తూ వాటితో మానవుని జీవితాన్ని మమేకం చేసుకుంటూ సంతోషంగా ఆరోగ్యంగా ప్రకృతి సిద్ధంగా ధర్మం ఆచరిస్తూ బ్రతకమని . కానీ నేడు ఆ కళ్ళు మాయకు లోనై అదుపు తప్పి నియంత్రణ లేక , చూడకూడనివి చూస్తూ దాసోహం అవుతూ , చేయకూడనివి చేస్తూ మనిషి దుఃఖానికి, పతనానికి కారణం అవుతున్నాయి. ఇదంతా మితి మీరిన స్వేఛ్ఛ ను మనిషి పొందడమే కారణం .
• ఇదంతా , కాస్త అటుఇటుగా నేడు ప్రపంచంలో కళ్లు ఉన్న మానవుల పరిస్థితి.
🌹 🌹 🌹 🌹 🌹
• ఇక అంధుల గురించి చెప్పాలంటే వారు నిజం గానే అదృష్టవంతులు. ఆకర్షణలకు లోను కాలేరు . తద్వారా పాపాలను చేసే , చూసే అవకాశం లేదు . సరికదా . . . వారి మనో దృష్టి ప్రత్యక్షం గా చూడగలిగేది , సూక్ష్మ లోకం . దానినే దైవీ లోకం లేదా Third Dimension world అనవచ్చు.
అంధులు ఆత్మ విశ్వాసం తో జీవిస్తారు . వారు తమ ఆత్మ ను గుర్తిస్తారు . వారికి కనిపించేది కూడా కేవలం ఆత్మ మాత్రమే . వారికి తమ దేహం తో పాటు , ఇతరుల దేహ రూపం ఎలా ఉంటుందో కనీసం తెలియదు . వారు తమను మరియు ఇతరులను ఆత్మ స్థితమై చూస్తారు. వారి ఆత్మ శక్తి అపారం .
• గమనిస్తే , అంధులు ఒక విశేషమైన అసాధారణ దివ్య శక్తి కలిగి ఉంటారు . అందుకే వారు తమ మనో నేత్రం ఉపయోగించి , ఈ భౌతిక ప్రపంచంలో నడుస్తారు తిరుగుతారు ప్రయాణాలు చేస్తారు , బ్రెయిలీ లిపి లో చదువుకుంటూ ఉద్యోగాలు చేస్తారు , పాటలు పాడుతారు , సాహిత్యం రచిస్తారు , రంగులు ఏమిటో తెలియక పోయినా చిత్రాలు గీస్తారు . వీరు చేసే ప్రతి కర్మ శ్రేష్టం గా , దైవీకంగా ఉంటుంది .
వారిని బాగా గమనిస్తే , ఎప్పుడూ నవ్వుతూ నే ఉంటారు , కోపం చిరాకు విసుగు వంటి లక్షణాలు వారిలో కనిపించవు . విచిత్రం ఏమిటంటే కళ్లు ఉన్న మనుషులు జీవితంలో అన్ని అనుభవిస్తూ , అసంతృప్తులతో రగిలి పోతూ ఉంటారు . కానీ అంధులు ఏనాడూ తమ జీవితం పట్ల నిరాశ ను వ్యక్తం చేయరు . ఎందుకంటే వారు అరిషడ్వర్గాలకు అతీతంగా జీవిస్తారు . వారికి కావలసింది ఈ భౌతిక ప్రపంచంలోని ఐహిక సుఖాలు కాదు , అంతకు మించి . చెప్పాలంటే వారు లోక కళ్యాణార్దం జీవిస్తారు, వారి నుంచి వెలువడే మంచి పవిత్రమైన ఆలోచనల శక్తి తరంగాలు , సృష్టి లో కొందరి ద్వారా జరిగే అకృత్యాలకు కారణమైన నెగెటివ్ తరంగాలను తటస్థీకరణ (neutralize) చేస్తాయి అనడం లో ఏ సందేహం లేదు .
• కొందరు అంటారు , గత జన్మల పాప కర్మల ఫలితం గా వారు కళ్లు లేకుండా పుడతారు అని . ఇది నిజమే అయితే కనుక , వారు నిజం గానే అదృష్టవంతులు . ఎందుకంటే ఈ జన్మలో వారు పాపాలు చేయలేరు కాబట్టి . . .
మరి నేడు కళ్లు ఉన్న వారంతా చేస్తున్నవి పుణ్యా లేనా ?
నేను పుణ్యం చేసాను , చేస్తున్నాను అని అనుకునే ప్రతి మనిషి కూడా , ఎందుకని ఏదో ఒక రూపంలో దుఃఖం అనుభవిస్తున్నాడు ?
ఇక కళ్లు ఉండి పాపాలు చేసే వారు భవిష్యత్తులో అనుభవించ వలసిన శిక్ష ఏమిటి ?
ఈ ప్రశ్నలకు మనిషే , సాక్షి గా అయి తన అంతరాత్మను ప్రశ్నించుకోవాలి.
ఆలోచించండి . . .అంధుల పై జాలి చూపించాలా ? లేక వారిని గౌరవించాలా ?
అసలు జాలి అనేది కళ్లు ఉన్న మనిషి తనపై తాను చూపించుకోవాలేమో అనిపిస్తుంది . ఎందుకంటే కళ్లు ఉండడం వలన మూడవ నేత్రాన్ని మనో నేత్రాన్ని తెరవక , అజ్ఞానం లో మునిగి ఉండడమే కలియుగ మానవుని జీవన దుస్థితి .
• సత్యం వాస్తవం చాలా ఖచ్చితత్వం తో ఉంటాయి . అవి మనిషి తాను ఆచరిస్తున్నపుడు ఆనందంగా ఉంటాడు , అవి ఆచరించ లేనప్పుడు ఆచరించే వారిని నిందిస్తాడు , దూషిస్తాడు లేదా సత్యాన్ని అంగీకరించడు.
అంధులు అనేక విషయాలలో , కళ్లు ఉన్న వారికి మార్గదర్శకులు అనడం లో ఏ సందేహం లేదు . కళ్లు లేక పోయినా ప్రకృతి తో మమేకమై ఆనందం గా జీవిస్తారు . మరి ఆ ఆనందం కళ్లు ఉన్న మానవుడు జీవిత కాలం శాశ్వతంగా పొందగలుగు తున్నాడా ?
గమనించాలి 🙏 . . .
ఈ రచన మనుషులు మరియు సమాజం పట్ల విముఖత తో కాదు. అంతర్ముఖతను జాగృతం చేయాలనే సముఖత మరియు చైతన్యం కోసం .
ఓం శాంతి 🙏
ఓం నమఃశివాయ 🙏
యడ్ల శ్రీనివాసరావు 3 JUNE 2026 10:00 PM.



No comments:
Post a Comment