Monday, June 8, 2026

754. జీవాత్మ-పుణ్యాత్మ- పాపాత్మ-ప్రేతాత్మ-దేవాత్మ

 

జీవాత్మ

పుణ్యాత్మ- పాపాత్మ-ప్రేతాత్మ-దేవాత్మ



• మనిషి జీవించి ఉన్నంత కాలం లో తన మూల స్వరూపాన్ని తెలుసుకో లేకపోవడం , ఆ మూల స్వరూపాన్ని చేరే ప్రయత్నం చేయక పోవడం లేదా తన మూల స్వరూపానికి అనుసంధానం కాలేకపోవడం వలనే ప్రేతం (దెయ్యం) అనేది ఆవిర్భావం అయింది . వాస్తవానికి ప్రేతం, ప్రేతాత్మ, దెయ్యం అనేవి సినిమాలలో , కధలలో భౌతికంగా కనిపించే రూపాలు కాదు . అవి కంటికి కనపించని నెగెటివ్ దుష్ట శక్తులు . ప్రేతం లేదా ప్రేతాత్మ లో తీరని కోరికల నిధి ఉంటుంది . ఈ సృష్టిలో దైవం ఉన్నట్లే ప్రేతం (దెయ్యం) కూడా ఉంది .


• ఏనాడైతే మనిషి నేనొక “ఆత్మ” అనే భగవత్ సత్యం ఎరిగి, తన మూల స్థితి ఆత్మ అని తెలుసుకొని , భగవంతుని కి (పరమాత్మ శివుడు) అనుసంధానం అవుతాడో , (బహుశా దీనికి అనేక జన్మలు, యుగాలు కూడా పట్టవచ్చు) ఆనాడే మనిషి , దైవీ శక్తి పొంది దేవత గా వెలుగొందగలడు . అటువంటి మనిషి యొక్క ఆత్మ, ఆ మనిషి మరణం తరువాత పుణ్యాత్మ గా, దేవాత్మ గా కొనియాడ బడుతుంది . ఇందుకు ఉదాహరణ గా నేడు ప్రతీ ఊరిలో గ్రామ దేవతలు గా కొలవబడుతున్న వారంతా కొన్ని జన్మలు, యుగాల క్రితం దైవీకమైన దివ్య శక్తులు తో లోక కళ్యాణం చేసి జీవించిన మానవులే . ఆలోచిస్తే నేడు ఆ గ్రామదేవతలకు ఉన్న పేర్లు , అప్పటి మనుషుల పేర్లే , కానీ వారు దివ్య సాధన తో దైవీ శక్తులు కలిగి ఆ ప్రాంతాలకు మేలు చేయడం వలన దేవతలు గా నేటికీ పూజలు అందుకుంటున్నారు . కానీ దురదృష్టవశాత్తు నేటి కాలం మనుషులు కలియుగ మాయకు దాసోహం అయి. తమ అవసరాల కోసం , అజ్ఞానం తో ఈ గ్రామదేవతల పూజల విధానంలో మూఢనమ్మకాలను (జంతు బలులు, మద్యపానం, జూదం) బలంగా చొప్పించారు . ఇది ఒక విచారకరమైన దౌర్భాగ్యం . దైవాన్ని నిందిస్తూ, దైవం పేరుతో మానవుడు చేసే జంతు బలుల హింస , పాపం తిరిగి జన్మ జన్మలు నరకం అనుభవిస్తాడు . ఎందుకంటే కర్మ సిద్ధాంతం ప్రకారం ఏ హింస మనిషి చేస్తాడో , అదే తిరిగి అనుభవిస్తాడు.


• ఒకవేళ మనిషి , ఒక జన్మ లో తాను జీవించి ఉన్నంత కాలం లో తన మూల స్థితి తో అనుసంధానం కాకుండా, ఆ విషయం తెలుసుకో లేక , కోరికలతో జీవిస్తూ మరణిస్తూ ఉన్నంత కాలం , ప్రేతం వలే ఆ మనిషి అంతర్గత పయనం ఉంటుంది. అందుకే కే కోరికలు భూతాలు (భూతం) అని , భూతాలు పట్టు కుంటే వదలవు అని అంటారు.

  భూతం (కోరిక) ఆవహించింది అంటే, అంత సులభంగా వదలదు. ఒక కోరిక తరువాత మరొకటి అలా పెరుగుతూ నే ఉంటాయి . ఒకానొక దశలో భూతం బలంగానే ఉండిపోతుంది , కానీ మన శరీరం పీడితం అయి బలహీనం గా అయిపోతుంది . అంటే కోరికలు బలం గానే మన ఆత్మ లో మిగిలి ఉంటాయి, కానీ శరీరం మాత్రం నిర్వీర్యం అయి మరణం పొంది దహనం అయిపోతుంది. ఆ కోరికలతో ఉన్న ఆత్మే , ప్రేతాత్మ గా తయారై తిరిగి జన్మించి ఇష్టారాజ్యంగా కోరికలు తీర్చుకునే జీవితం గడుపుతుంది.

• మరి మనిషి లోని భూతాన్ని శాశ్వతంగా వదిలించు కోవాలి అంటే , ఒకటే మార్గం అదే దైవం, దైవ స్మరణ . నేను ఒక చైతన్యవంతమైన ఆత్మ ను , శాంతి సుఖం ప్రేమ జ్ఞానం ఆనందం పవిత్రత అనేవి నా ఆత్మ యొక్క ధర్మాలు అనే విషయం నిత్యం బుద్ధి లో ఉంచుకుని , శివారాధన, శివ ధ్యానం చేయడం వలన . . . మాయా భూతమైన కామము క్రోధము మోహం వంటి వికారి కోరికలలో చిక్కు కోకుండా , మోక్ష సిద్ధి కి అవసరమైన కోరికలతో జీవితాన్ని సంతృప్తి కరంగా తీరం దాటించు కోవచ్చు. ఏనాడైతే భూత కోరికలకు అతీతమై దివ్యత్వం వైపు అడుగులు పడతాయో , అప్పుడు మనిషి ఆత్మ తన లోని మలినాలను శుద్ది చేసుకొని, చైతన్యమై లోక కల్యాణానికి, సమాజ సేవ , నిస్వార్థమైన పరోపకార సిద్ది లభిస్తుంది . సరిగ్గా ఈ సమయంలో శత్రు , దుష్ట శక్తుల సంహారం కూడా తప్పక జరుగుతుంది . ఎందుకంటే ఆత్మ దైవత్వం , మంచి వైపు అడుగులు వేసే సమయంలో శత్రు దుష్టశక్తుల దాడి ఏదో రూపంలో తప్పక ఉంటుంది . ఎందుకంటే నువ్వు తెలిసో తెలియకో నీ లోని చెడు గుణాలు  లేదా నీ చుట్టూ ఉన్న శత్రు దుష్టశక్తుల తో నే అప్పటి వరకూ సహవాసం చేశావు కాబట్టి. వాటిని వదిలి నువ్వు దైవం తో కలుస్తాను అంటే, అవి తప్పక నీ పై తప్పక దాడి చేస్తాయి . చివరికి అవి సమూలంగా సంహరించ బడతాయి.


• శరీరం ధరించిన ప్రతి ఆత్మ జీవాత్మే  . ఆ ఆత్మ ఈ భూమి పై జీవించడానికి శరీరం ధరిస్తుంది . ఆ జీవాత్మే , చేసిన  కర్మల అనుసారం పుణ్యాత్మ , పాపాత్మ , ప్రేతాత్మ , దేవాత్మ గా కొనియాడ బడుతుంది.


• ఒక మనిషి లోకానికి ఉపయోగపడే పుణ్య కార్యాలు చేస్తూ మరణిస్తే “పుణ్యాత్ముడు” గా కీర్తించబడతాడు .

• ఒక మనిషి లోకులకు దుఃఖం కలిగిస్తూ, పాప కర్మలు చేస్తూ మరణిస్తే “పాపాత్ముడు” గా దూషించబడతాడు.

• ఒక మనిషి తీరని కోరికలతో మరణిస్తే “ప్రేతాత్మ” గా అయి తనకు తానే పీడించబడుతూ ఉంటాడు .

• ఒక మనిషి భగవంతుని సాధన చేసి, భగవత్ శక్తి ని లోక కళ్యాణార్దం సేవ గా మరల్చి జీవిస్తూ మరణిస్తే “దేవాత్మ” గా పూజలందుకుంటాడు. ఈ దేవాత్మ లే నేటి మన గ్రామ దేవతలు .


ఓం శాంతి 

ఓం నమఃశివాయ 🙏 

యడ్ల శ్రీనివాసరావు 9 June 2026 11:00 AM.

No comments:

Post a Comment

754. జీవాత్మ-పుణ్యాత్మ- పాపాత్మ-ప్రేతాత్మ-దేవాత్మ

  జీవాత్మ పుణ్యాత్మ- పాపాత్మ-ప్రేతాత్మ-దేవాత్మ • మనిషి జీవించి ఉన్నంత కాలం లో తన మూల స్వరూపాన్ని తెలుసుకో లేకపోవడం , ఆ మూల స్వరూపాన్ని చేర...