ఎల్లి పోతున్న దే నా నావ
• ఎల్లి పోతున్న దే నా నావ
మల్లి . . . ఎల్లి పోతున్న దే నా నావ.
• గింగురల గాలి లో ….
గింగురల గాలి లో
రింగు రింగులు తిరుగుతూ
• ఎల్లి పోతున్న దే నా నావ
మల్లి . . . ఎల్లి పోతున్న దే నా నావ.
• కారు మబ్బు కమ్మిట్లో
చెదురు మదురు సినుకుల లో
ఉరుకు పరుగు లెట్టా నే . . .
• గోదారి రేవు కే చేరా నే . . . మల్లి
మల్లీ . . . గోదారి రేవు కే చేరా నే.
కానీ . . . ఏం లాభం.
• ఎల్లి పోతున్న దే నా నావ
మల్లి . . ఎల్లి పోతున్న దే నా నావ.
• నాటు పడవ పోటుగాడు
నాటు పడవ పోటుగాడు
• నన్ను సూసి
రమ్మని సేయి ఊపినాడు . . .
• ఉరుకు దామనుకుంటే
ఆ . . . ఉరుకు దామనుకుంటే
• గోదారి గల గల లే
ఈ గోదారి గల గల లే
భయపెట్టి ఆపినాయి .
• పొద్దు కూకుల నను రేవు లో
కూసో బెట్టి నాయి .
• ఈదురు గాలులతో
సినుకుల గోలలతో
అలల ఉరుకుల తో
పున్నమి యెన్నెల తో
ఏదో . . . భయమయితిందే మల్లి
నాలో ఏదో . . . భయమయితిందే మల్లి .
• ఎల్లి పోతున్న దే నా నావ
మల్లి . . . ఎల్లి పోతున్న దే నా నావ.
• గింగురల గాలి లో ….
గింగురల గాలి లో
రింగు రింగులు తిరుగుతూ
• ఎల్లి పోతున్న దే నా నావ
మల్లి . . . ఎల్లి పోతున్న దే నా నావ.
🌹🌹🌹🌹🌹
ఈ రోజు సాయంత్రం సరస్వతి ఘూట్ (రేవు) లో వాకింగ్ చేస్తుంటే , అకస్మాత్తుగా ఈదురు గాలులు, చీకటి మబ్బులు, ఉరుములు మెరుపులతో సన్నగా చినుకులు ఆరంభమయ్యాయి. వాతావరణం అంతా , ప్రకృతి పురి విప్పిన నెమలి లా నాట్యం చేస్తుందా ! అని అనిపించింది.
అప్పుడే కొన్ని క్షణాల క్రితం రేవు లో నుంచి ఒక నావ కొంతమంది తో బయలు దేరింది . వారంతా కూలీ పనులు చేసుకునే వారు. గోదావరి మధ్యలో ఉన్న లంకల్లో (ఎత్తైన ఇసుక దిబ్బలు) , గుడిసెలు వేసుకొని తమ కుటుంబాలతో నివసిస్తారు . వారు రోజు ఉదయం నావలో ఇటు రేవు లోకి (రాజమండ్రి) వచ్చి భవన నిర్మాణ కూలీ పనులు తదితరమైనవి చేసుకొని సాయంత్రం తిరిగి వెళ్ళి పోతారు .
ఇంతలో ఒక వ్యక్తి పరుగు పరుగున ఆయాసపడుతూ నావ ఎక్కడం కోసం రేవు లోకి వచ్చాడు . కానీ అప్పటికే ఆ నావ కొంత దూరం వెళ్ళి పోయింది . పడవ నడిపే వాడు చేయి ఊపుతున్నాడు . ఈ వ్యక్తి చేసేది ఏమీ లేక రేవు లో కూర్చుని దిక్కులు చూస్తున్నాడు .
ఆ సమయంలో ఒక వైపు హోరున భయంకరమైన గాలి, మరోవైపు చీకటి పడుతూ ఉండడం , సన్నగా వర్షం , ఆ నావ గాలికి ఊగడం , అందులోని వారు తడిచి పోవడం , ఈ వ్యక్తి నావ దొరకలేదని నిరాశ గా నిలబడడం , అదంతా మనసు తో చూస్తుంటే ప్రకృతి నాకు ఏదో చెపుతుంది అనిపించింది .
వాస్తవానికి, ఆ వ్యక్తి లో భావాలు ఆలోచనలు ఏమిటో నాకు తెలియదు కానీ , తన ఇంటికి చేయలేకపోయాను అనే నిరాశ , ఎదురు చూస్తున్న తన భార్యకు తన భావం తెలియచేయాలనే ఆలోచన నా మనసు లో స్ఫురించింది. ఆ సందర్భంలో కాసేపు నేనే ఆ వ్యక్తి ని అయి ఉంటే , అని అనిపించి , నా భావాలను జానపద గీతం గా రాయడం జరిగింది . ఇది ప్రకృతి నాకు కలిగించిన అవకాశం .
. . . మనిషికి ప్రకృతి ద్వారా దొరికినంత ఆనందం ఈ సృష్టిలో ఎక్కడా దొరకదు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రకృతి లోనే , పంచభూతాలు మరియు భగవంతుని శక్తి ఉండడమే ప్రధాన కారణం . ఎందుకంటే మనిషి కూడా పంచభూతాలతోనే సృష్టించబడి ఉన్నాడు కదా . . .
ఓం శాంతి
ఓం నమఃశివాయ 🙏
యడ్ల శ్రీనివాసరావు 18 June 2026 5:30 PM.

No comments:
Post a Comment