భగవంతునిపై అలకలు కోరికలు
• "భగవంతుని పై అలక" . మానవ జన్మలో మనం సృష్టించుకున్న ఒక అమాయకమైన అనుభూతి . "దైవం" అంటే ప్రత్యక్షం గా కనబడని వినబడని నిజం . ఆ నిజాన్ని , స్వీయ అనుభవం తోనే అనుభూతిని చెందగలం .
నీవు కోరనిదే నీకు అనురక్తి లేనిదే ఒక అతీతమైన శక్తి నీతోటే నడవదు . దైవలోకం అన్నది అతీంద్రియ సుఖం పొందిన మానవుని మనసు దివ్యత్వం పొందినపుడు కనిపించే లోకం , అది మనిషి లోని ఒక మానస సరోవర మందిరం . అందున దేవుడు సర్వ శక్తులతో మహిమాన్వితుడై ఉంటాడని అనుభవాలతో నిరూపణ అవుతుంది .
• గుడి , క్షేత్రం లేక జాతర ఇలా ఎక్కడ అయినా మనం కోరుకున్న మనం సృష్టించుకున్న మన మంచికోరే దేవతలు కొలువై ఉన్నారనేది మన నమ్మకం. ఆ నమ్మకం మనలని నడిపిస్తుంది అదే నమ్మిక మనలని భగవారాధనకు ప్రేరేపిస్తుంది.
నీ కర్మల ఫలితంగా లేక నీ నడవడి కారణం గా నీకు జీవితంలో కలిగే ఇబ్బందులు , నీకు ప్రకృతి ద్వారా ఎదురయ్యే సమస్యలు . ఇవన్నీ నీ మదిని చేరి నిన్ను కొత్త ఆలోచనలో పడేస్తాయి అదే దేవునిపై "అలక" .
• భగవంతుడు ఒక "దారం" అయి దండలో ఎప్పుడూ స్థిరం గా నే ఉంటాడు , కానీ దానికి కట్టిన పుష్పాలే , మనుషులు అయి వచ్చి చేరతాయి . మళ్ళీ వాడిపోయిన వెంటనే రాలిపోతాయి.
ఇక్కడ దండ శాశ్వతమా లేక దారము శాశ్వతమా అంటే ? దారమే శాశ్వతం. కానీ, పువ్వులు లేని దారముకి విలువ ఎక్కడిది ?
అంటే మనుషులు కోరని దేవుడు ఉండునా ? అలాగని దారము లేని దండ నిలుచునా ? అంటే నువ్వు మాలలో చేరనిదే నీకు విలువెక్కడిది ?. . . అనగా భగవంతుని సాన్నిధ్యం లో చేరనిదే నీ మానవ జన్మకు పరిపూర్ణత సాధించలేవు .
నీకు అనుకూలంగా ఉన్నప్పుడు దేవుడు గొప్పవాడు గాను , ప్రతికూలమైనప్పుడు మహిమ లేని వాడు కాదు. అందుకే కాలానికి కాలునికి కర్మలతో కట్టుబడి ఉండేవే మన జీవితాలు .
🌹🌹🌹🌹
• ”కోరిక” లేని చోట “కాలుడు” కొలువై ఉంటాడు. అని నిర్వాణ షట్కం లో ఆదిశంకరులు చెప్పారు . కానీ మనం ప్రతి విషయంలో అంతా “ఈశ్వరేచ్చ” అంటాము .
కోరిక లేని వాడు (భగవంతుడు) మన గురించి కోరుకునేది ఏమిటి ? కర్మలు చేయనిదే మనిషి జన్మలకు విముక్తి ముక్తి ఉండవు . అలాంటప్పుడు కర్మానుసారం కోరికలు లేనప్పుడు అంత్య సిద్ధి సాధ్యమా?
ఈ జగత్తులో కోరిక లేని మనుషులు ఉంటారా ? అదెలా సాధ్యం ? భగవంతుని ఆరాధన చేయడం లో కూడా ఒక కోరిక ఉన్నది కదా ? కేవలం భగవతారాధన కోసమే మనసుని కట్టడి చేయగల జన్మ ఉంటుందా ?
సాధారణంగా బియ్యపు గింజలు లో రాళ్ళని ఏరతాము కానీ మనుషులలో ఉత్తమోత్తములు కొందరు మహానుభావులు పుడతారు , వారు తీరు చూస్తే మనకు రాళ్ళలో బియ్యపు గింజలు ఏరిన మాదిరి అగుపిస్తుంది. వాళ్లకి కోరిక మీద కట్టడి ఉంటుంది . కట్టడి అనే మాట కూడా సబబు కాదేమో ? కట్టడి అంటే బలవంతంగా కోరికను మనసులో అణచుకోవడం , అది సరికాదు . . . అలా కాకుండా వారికి కోరిక నియంత్రణ లో ఉంటుంది అనడం సబబు . నియంత్రణ అంటే కోరిక అనేది మనసును ప్రేరేపించుదు . అదే మనకు వారిలో ప్రస్పుటిస్తూ ఉంటుంది . కంచి పరమాచార్యులు , పూజ్యులు రమణ మహర్షి , బ్రహ్మ బాబా , స్వామి పరమానంద యోగానంద మొదలగువారు అనేకులు ఈ కోవలోకి వచ్చు వారే.
“ఆత్మానాత్మ” వివేకము కలిగిన వారు మంచి చెడుల మధ్య వ్యత్యాసం గమనించి సత్కర్మలు చేయుదురు అని శంకరులు చెప్పియున్నారు. భగవంతుడు తనకు కోరికలు లేవు అన్నాడు గానీ సత్కర్మలు చేయు మానవ కోరికలను కట్టడి చేయమని చెప్పలేదు. ఎందుకంటే మనకు తెలిసిన భగవరాధనలో మంచి కోరిక కు సముచిత స్థానం ఉన్నది.
• నీ కోరిక ఇతరులకు సేవ అయినపుడు . . .
నీ కోరిక ఇతరుల సంతోషం గావించినపుడు . .
నీ కోరిక పరులకు మేలు కలిగించేది అయినపుడు.
నీ కోరికే నీకు మోక్ష సిద్ధి నిస్తుంది . ఎందుకంటే నీ కోరిక లో నువ్వు అవశేషం గా ఎన్నటికీ మిగిలి ఉండవు కాబట్టి .
కోరికలు లేని వాడే ఇతరుల సముచిత కోరికలు తీర్చగలడు. అదే శివ తత్వం . ఆ స్థితిని పొందాలంటే నీ లోని కోరికలు పరిసమాప్తి కావాలి . ఇతరుల కోరికే , నీ కోరిక కావాలి .
ఓం శాంతి
ఓం నమఃశివాయ
యడ్ల శ్రీనివాసరావు 7 June 2026 , 10:30 AM.


No comments:
Post a Comment