Monday, June 1, 2020

11. తొలి విఫల మలి సఫల ప్రేమికుడు

తొలి విఫల... మలి సఫల...భగ్న ప్రేమికుడు

(మూలం: యౌవనం లో ప్రేమించిన అమ్మాయి తో తన పెళ్లి జరగక విఫలమై,.  ఇష్టం లేకపోయినా తప్పక మరొకరిని పెళ్ళి చేసుకుని.  వేదన  తనలో తాను అనుభవిస్తు తన ప్రేమను మనసులో సఫలం చేసుకొంటున్న భగ్న ప్రేమికుడు.)



పిలిచితివో......వలచితివో.......మైమరపించితివో   ప్రేయసి.


సంతోషం అంటే నవ్వే అని తెలుసు..... నీ పరిచయం తో అది నువ్వే అని తెలిసింది.

కట్టేసిన కట్టుబాట్లతో కట్టెగా ఉన్న నాలో ప్రేమా ....ఏమి ఈ చలనం ...ఎందుకీ సంచలనం.

అమ్మ తో ఉన్న పసితనాన్ని ఆస్వాదించలేదు...... కానీ నీతో ఉన్న క్షణాల నుండి నేనింకా పసితనం లోనే ఉన్నాను.

పసి పిల్లాడికి రెండే తెలుసు... ఏడవడం, నవ్వడం.... కానీ అది ఎందుకో  కారణం వాడికి తెలియదు...... ప్రస్తుతం నా స్థితి లాగ.

జీవితం అంటే ఆట....  ఆ ఆటలో ఎందరినో గెలిపిస్తున్న ఛాంపియన్ని.....కానీ నిను పొందలేక ఓడిన ఆటగాడిని.


జీవితం అంటే నటన..... ఎందరినో మెప్పిస్తున్న మహానటుణ్ని......కానీ నిన్ను పొందలేక విఫలమైన నటుడిని.

మనసంటే ఒక్కటే......జీవితం అంటే ఒక్కటే...అంటారు..... మరి  నాకెందుకో అవి రెండేసి గా కనిపిస్తున్నాయి .


తనువుకు  కట్టుబాట్లేమో గానీ...... మనసుకు కాదు కదా.


మాటలు మాట్లాడలేను గానీ........మదిలో నాదైన జీవితం నీతో పంచుకోలేనా.


నా ఈ ఆలోచన నేరమా...... నాకు నేను వేసుకున్న శిక్ష లో ఆనందించడం కూడా నేరమేనా.


నా సంతోషం నువ్వని తెలుసు.......కానీ నా బాధకి కారణం నువ్వని చెప్పలేక కూడాపోతున్నా .


వదులుకున్నాను...... వదిలేసుకున్నాను...... నిను పొందే భాగ్యం లేక నీతో నన్ను నేనే వదిలేసుకున్నాను.


నీ వలపుల.... మలుపుల....తలపులు.... పౌర్ణమి వెన్నెలని.... అమావాస్య  నిశని మిగిల్చాయి.

కుటుంబం, వ్రృత్తి, సమాజం పట్ల భాథ్యతను విస్మరించలేదు….. కానీ నా పట్ల నా భాథ్యతను, సంతోషాన్ని గుర్తించలేని అంధుణ్ని.


ఒక్కటి మాత్రం నిజం..... నను నమ్ముకున్న కుటుంబానికి నేను హీరోని.....కానీ నాకు నేను జీరోని .


పరిపక్వత లేని వయసు లో నిను ప్రేమించాను…. కానీ నీ ప్రేమతో నే పరిపక్వత పొందాను.

నీ ప్రేమ తోనే తెలిసింది…. శరీరం వేరు,  మనసు వేరని……అందుకేనేమో శరీరం వద్దన్నా…. మనసు నిను కావాలంటుంది.


ఈ శరీరం ఎక్కడ విహరించినా…. మనసు మాత్రం వదిలిన చోటే పదిలంగా ఉంది.

ఎవరికి సాధ్యం........నా మనసుని  నిలువరించడం ఎలా సాధ్యం .


ఎంతకాలమైనా..... ఎంత మందితో ఉన్నా..... ఎన్ని రోజులు బ్రతికినా..... నీ జ్ఞాపకాలే నా ఊపిరి.


ఈ ఆరు పదుల వయసు దాటినా నిను చూడాలని, మాట్లాడాలని ఉంటుంది….నీ తలంపు తో నావయసు రెండు పదులవుతుంది. బహుశా అదే ప్రేమకున్న బలమేమో.

సంతోషము దుఃఖము రెండూ సమానమే,పాలలో నీళ్ళలా గా కలిసి ఉంటాయనే  జీవిత సత్యాన్ని తెలియజేసిన నీ నా ప్రేమ ఎప్పటికీ సఫలమే....

నేను కట్టుబాట్లకు కట్టుబడి...... కట్టబడి...... కట్టెగా ఉన్నాను…చివరికి కట్టెల మీద  కడ చేరేలోపు…  కడసారైన నిను భౌతికంగా చూడగలనో…లేదో…


      
యడ్ల శ్రీనివాసరావు




No comments:

Post a Comment

నా శివుడు - రామకృష్ణ తులసి.

నా శివుడు By రామకృష్ణ తులసి. • శివుడెన్నడు     నాలోనే    ఉన్నాడు.   శివుడెప్పుడు    నాతోనే    ఉన్నాడు. • శివుడు   లేని    నేను    లేను.   శ...