మూసిన కనులు మసకబారవు
• కనులు మూయడం అంటే ఒకటి నిద్ర పోవడం, రెండవది మరణించడం . ఈ రెండింటిలో జరిగే సూక్ష్మం ఒక్కటే . నిద్ర పోయినప్పుడు , మన స్పృహ నుంచి శరీరం విడుదల అయి భారం తెలియకుండా తేలికగా అవుతుంది . తిరిగి నిద్ర లేచేటప్పుటికి కొత్త శక్తి నిండుకొని శరీరం భారవంతంగా ఉంటుంది.
మరణించినపుడు కూడా ఇదే ప్రక్రియ జరుగుతుంది . ఆత్మ శరీరం నుంచి విడుదల అయి తేలికగా అవడం జరుగుతుంది . మరణం తర్వాత సరికొత్త రూపం తో దేహం లభించి జన్మించడం జరుగుతుంది.
ఈ రెండూ కూడా కనులు మూసికొని ఉన్నప్పుడు మాత్రమే జరుగుతాయి. కనులు మూస్తే మసకబారి చీకటి ఆవహిస్తుంది అనుకుంటాం . కానీ శక్తి పునరుత్తేజం పొందేది కనులు మూసి ఉన్నప్పుడే.
మూసిన కనులు ఎన్నడూ మసకబారవు , అంధత్వం తో ఉండవు .
• కనులు తెరిచి ఉన్నప్పుడు జరుగుతున్నది అంతా కూడా అలసట, ప్రయాస , అలజడి , అల్ప కాలిక మైన కృత్రిమ సంతోషం మరియు సుఖం. అందుకే చివరికి మనం అలసి పోతాం , ఇందులో మనం పొందే శక్తి ఏమీ లేదు.
కనులు మూసినపుడు లభించేది ఈ భౌతిక మాయా ప్రపంచం నుండి విశ్రాంతి, విముక్తి , భార రహిత స్థితి .
• అతి ఆలోచనలు , ఆందోళనలు కలిగి ఉన్నవారు కనులు మూసినంత మాత్రన విశ్రాంతి , నూతన శక్తి లభించదు . అది నిద్ర లేదా మరణం కావచ్చు. ఎందుకంటే వారి ఆలోచనలు శరీరానికి అతీతంగా బుద్ధి లో, ఆత్మ లో నిరంతరం అతిగా పని చేస్తూ ఉంటాయి . అవి శరీరానికి నిరంతరం శ్రమ, ఒత్తిడి కలిగిస్తూ ఉంటాయి . అటువంటి స్థితిలో వారు పునరుత్తేజం , నూతన శక్తి ఎన్నటికీ పొందలేరు. అది నిద్ర నుండి మేల్కొవడం కావచ్చు లేదా మరణం పొంది తిరిగి జన్మించడం కావచ్చు .
దీనిని జయించాలంటే ఒకటే పరిష్కారం. ధ్యానం. మనం శివుని పై మనసు లగ్నం చేసి నిత్యం ఒక నిర్ణీత సమయంలో ధ్యానం చేయడం వలన వ్యర్ధ ఆలోచనల, అలజడులు, ఆందోళనలు క్రమేపీ తగ్గి మనసు పై నియంత్రణ కలిగి విశ్వం లో శక్తి ని (cosmic energy) తీసుకుని మన వెన్నుముక లో పొందుపరచు కోవచ్చు. మనకు ఇక్కడ ఒక సందేహం కలగవచ్చు, అది కేవలం ఒక శివుని పై మాత్రమే ఎందుకు మనసు లగ్నం చేయాలి అని. అవును శివుడు మాత్రమే మానవుని కి ధ్యాన యోగం ద్వారా శక్తి ఎలా పొందవచ్చో తెలియచేశాడు. అందుకు ప్రతీకగా శంకరుడు ని ఫోటో లలో ధ్యాన స్థితిని చూపించడం జరిగింది. శివుడు ఈ విశ్వానికి జ్ఞాన ధ్యాన యోగ గురువు.
• మనం ఆహారం తీసుకోవడం ద్వారా పొందే శక్తికి పూర్తి భిన్నంగా ఈ శక్తి ఉంటుంది. దీనిని యోగశక్తి అంటారు. రెండు మూడు రోజులు ఆహారం తీసుకోకపోయినా సరే యోగశక్తి వెన్ను లో నిల్వ ఉండడం వలన మానసికంగా శారీరకంగా దైనందిన కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఎన్నో అనారోగ్యాలను , వాటికి గల కారణాలను జయించవచ్చు. నిత్యం నూతనోత్సాహం తో ఉండవచ్చు.
అందుకే , మూసిన కనులు మసకబారవు . ఆలోచన నీ శక్తి అయినపుడు కనులు తెరిచి ఆలోచించి నిర్ణయం తీసుకున్న దానికి , కనులు మూసి మనో నేత్రం తో ఆలోచించి నిర్ణయం తీసుకున్న దానికి , సఫలత పొందే విషయం లో చాలా వ్యత్యాసం ఉంటుంది.
• ఈ భౌతిక మాయా ప్రపంచం లో నీ రెండు కళ్ళు నిన్ను ఎప్పుడూ మోసం చేస్తూనే ఉంటాయి . అందుకే ఏం చేసినా, ఏం పొందినా చివరికి అశాంతి దుఃఖం వెంటాడుతూ ఉంటాయి. కలియుగంలో జన్మించిన ఏ మనిషి అతీతం ఇందుకు కాదు.
కనులు మూసినపుడు మాత్రమే , ఏకాంత స్థితిలో మన బలహీనతలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. అవి సరిచేసుకొనే అదృష్టం లభిస్తుంది.
• మనం ఒకరిని ఎక్కువగా నమ్మడం వలన రెండు రకాల ఫలితాలు ఎదురుకావచ్చు. ఒకటి మనకు జీవితాంతం తోడుండే ఓ మిత్రుడు దొరకచ్చు . ఇంకోటి జీవితాంతం గుర్తుంచుకోదగిన గుణపాఠం నేర్పేవాళ్ళు దొరకవచ్చు .
ఈ రెండింటి కి అతీతంగా కావాలంటే మన లో ఉన్న ఆత్మను గుర్తించి , ఆత్మను గమనించినపుడు , ఆత్మ పై నమ్మకం (విశ్వాసం) ఉంచి ఉన్నతి చేసుకున్నపుడు . . . ఆత్మ , పరమాత్మ అయిన శివుని తో శాశ్వతంగా అనుభవ పూర్వకంగా అనుసంధానం అవుతుంది . అపుడు మన జీవితం మనకు స్పష్టం గా కనిపించడం మాత్రమే కాకుండా ఇతరులకు కూడా మార్గదర్శకం అవుతుంది.
మనల్ని మనము (మనసు ను) పట్టుకోవడంలో కలిగేది అమితమైన ఆనందం , అదే ఇతరులను (మనసులను ) పట్టుకోవడం లో మిగిలేది భరించలేని నొప్పి, దుఃఖం .
• నీ లోని నీ ఆత్మ మరియు నీ పై లోకంలోని శివ పరమాత్మ , కేవలం మూసిన కనులకు మాత్రమే చైతన్య శక్తి స్వరూపం లో కనిపిస్తారు. అందుకే అన్నాను , మూసిన కనులు మసకబారవు .
ఓం శాంతి 🙏
ఓం నమఃశివాయ 🙏
యడ్ల శ్రీనివాసరావు 4 APR 2026 , 10:30 PM.
