Friday, October 29, 2021

97. మరణ శాసనం _ జననం జీవనం

 మరణ శాసనం _ జననం జీవనం


• మానవ జన్మ ఎత్తిన ప్రతి మనిషి కోరుకునేది ఒక్కటే సుఖం, సంతోషం, ఆనందం. వీటిని సంపాదించుకోవడానికి పరిగెత్తే ఆరాటం లో పడేది, కష్టం, బాధ, దుఃఖం. అంటే వీటిలో ఏ ఒక్కటి కావాలన్నా తప్పనిసరిగా రెండవది అనుభవించాలి. కానీ మానవుని మనసు అది అంగీకరించదు .

• మనిషి అంత అమాయక జీవి ఈ సృష్టిలో ఉండదేమో అనిపిస్తుంది. ఎందుకంటే పుట్టిన దగ్గరనుంచి తనకు అవసరమయినది, కావలసిన దానికంటే అనవసరమయిన దాని కోసమే అతిగా పరితపిస్తూ ఉంటాడు.

• ఇది మనం ఏవిధంగా అనుకోవచ్చు అంటే , మనిషి తన జీవితంలో చివరి వరకు ఏ దశలో ను కూడా తన సంతృప్తి ని మనస్పూర్తిగా వ్యక్తపరచడు, అంగీకరించడు. ఒకవేళ పొరపాటున సంతృప్తి ని వ్యక్తపరిస్తే, తన పురోగతి ఆగిపోతుందేమో అని భయం. అంటే ఏ దశలో ను కూడా సహజం సిద్ధం గా అనుభవించాల్సిన, ప్రకృతి ప్రసాదించిన వనరులను గాని, జీవన విధానం తో కూడిన అనుభూతులను గాని ఆస్వాదించలేక ఏది సంతృప్తో, ఏది అసంతృప్తో తేడా గ్రహించలేక పుణ్యకాలం అంతా గడిచిపోతుంది.

• మనిషి జీవితానికి మంచి మందు ఏమిటంటే రాజీ (compromise) పడిపోవడం. ఇక్కడ రాజీ పడడం అంటే పోరాట పటిమను వదులు కోమని కాదు ఉద్దేశం. రాజీ అనేది ఓటమి కి, గెలుపు కి మధ్యలో సమాంతరంగా ఉన్న బిందు స్థానం. ఈ బిందు స్థానం లో మనసు ను నిలిపితే ఓర్పు , సహనం తో నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకారం జీవించడానికి, లేదా ఏదైనా కార్యాచరణ చేయడం ఎలాగో తెలుస్తుంది.

• ఎందుకంటే ఆధునిక కాలంలో పరుగులు పెడుతున్న జీవన విధానం తో , అసలు ఏది ఎందుకు చేస్తున్నామో, ఏది అవసరమో , ఏది అనవసరమో కూడా తెలియని విచిత్రమైన అయెమయ స్థితి లో ఉంటున్నాం. దీనికి మూల కారణం ఒకటి మన ఆలోచనా రాహిత్యం అంటే మన మానసిక శక్తి యొక్క సామర్థ్యాన్ని మనం గ్రహించలేక పోవడం. మరొకటి మన చుట్టూ ఉన్న సమాజం, మనుషుల ప్రభావం మనల్ని శాసించడం. అవునన్నా, కాదన్నా ఇటువంటి స్థితి లో నే నేటి ఆధునిక మనిషి జీవితం గడుపుతున్నాడు.

• అసలు ఈ సృష్టిలో ఏ జీవికి లేని ఈ విపరీతమైన సమస్య మనిషి కి ఎందుకు అంటే, కాలం కంటే కూడా ముందు గా పరిగెత్తాల నే మనిషి అత్యాశే కారణం. ఆఖరికి ఈ అత్యాశ విలువైన జీవన కాలాన్ని తగ్గిస్తుంది. వృద్ధి అనేది సృష్టిలో ప్రకృతి ప్రసాదించిన సహజ సిద్ధమైన వరం. కాని మనిషి అభివృద్ధి అనే ముసుగులో సరియైన పోషక ఆహారం తినలేక, సాంకేతిక అనే ముసుగులో వినాశనం తెచ్చుకొని, వ్యాపార పోటీ అనే విపరీతమైన తత్వం తో ఔషధాలు, హాస్పిటల్స్, విద్యాలయాలు ఒకటేమిటి అన్నీ కలిసి కలిసి కలిసి మనిషిని సమస్యల వలయంలో కూర్చో పెడుతున్నాయి. అశాంతి -దుఃఖం, నిరాశ-నిస్పృహ, రోగాలు-ఒత్తిడి తో చివరికి తన ఉనికిని కోల్పోయి, సంతోషంగా, ఆనందం గా నలుగురితో ప్రేమ గా బ్రతకలేక ఢీ లా పడిపోతున్నాడు.

• ఇదివరకు కాలం లో ఒక కధ చదివితే అందులోని నీతి మనసు లో నిక్షిప్తమై , ప్రతీ ఒక్కరూ ఆచరణలో పెట్టే వారు. ఇది బాల్యదశ నుంచే గృహంలో, విద్యాలయాల్లో తప్పనిసరిగా ఉండేది. ఇది సమాజానికి, మనిషి శ్రేయస్సుకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. కానీ నేడు ఆ పరిస్థితి ఉందా అంటే….. లేదు అనేదే సమాధానం. మరి ఇది కాదా మనిషి తన మరణానికి కావలసిన శాసనాన్ని తనే రాసుకుంటున్నాడు అనడానికి.

• నేటి ఆధునిక మనిషి మానసిక దృఢత్వం కోల్పోయి మేడిపండు లా జీవిస్తుంటే, భవిష్యత్త్ తరాలకు ఏమి చెప్పగలడు.


యడ్ల శ్రీనివాసరావు 29 Oct 21 10:00 pm 8985786810


No comments:

Post a Comment

659 . శివం

  శివం • శివమే   సుందరము    శివమే    సత్యము . • శివమనిన   నా లో   చలనం ‌  చేరును   శివుని    చెంత కు. • ఆ  చలనమే   నా     ఆత్మ   అచ...